vip culture
-
విసుగెత్తిస్తున్న వీఐపీలు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో వివిధ పదవుల్లో ఉండే నాయకులు, అధికారంలో లేకపోయినా ప్రముఖ రాజకీయ నాయకులు, సినిమా, వ్యాపారం సహా పలు రంగాల్లో అత్యంత ప్రముఖులు.. ఇలా మన దేశంలో వీఐపీ (వెరీ ఇంపార్టెంట్ పర్సన్)లకు కొదవ లేదు. వీళ్లు కాలు తీసి కాలు పెట్టినా.. అత్యంత ప్రాధాన్యం కోరుకుంటారు. ఇది కొన్ని సందర్బాల్లో శ్రుతి మించుతోంది కూడా. ఇటీవల ఝాన్సీ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు చనిపోవడం తెలిసిందే. ఆ చిన్నారుల తల్లిదండ్రులు మృతదేహాల కోసం ఎదురు చూస్తుండగా.. ఓ మంత్రి పరామర్శకు ఆసుపత్రికి వస్తున్నారని సిబ్బంది రోడ్ల వెంట సున్నంతో లైన్లు కొట్టి ఏర్పాటు చేస్తున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దేశంలో ఈ వీఐపీ సంస్కృతిపై విమర్శలు మొదలయ్యాయి. దేశంలో వీఐపీ సంస్కృతిపై లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 362 జిల్లాల్లో నిర్వహించిన సర్వేలో 45 వేల మంది అభిప్రాయాలు సేకరించింది. ఆ సర్వేలో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు.. వీఐపీ సంస్కృతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 64 శాతం మంది దేశంలో వీఐపీ సంస్కృతి తగ్గడం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రధానంగా రోడ్లపై వెళ్తున్నప్పుడు, టోల్ ప్లాజాల వద్ద నిరీక్షణ, ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మితిమీరిన జోక్యం వంటి అంశాలను వారు ఉదహరించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేయడం, బెదిరింపులకు పాల్పడడం, ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల కోసం డబ్బు వసూలు.. ఇలా ఎన్నో విషయాల్లో వీఐపీల ధోరణిని వారు సర్వేలో లేవనెత్తారు. సర్వేలో పలు అంశాలపై అడిగిన ప్రశ్నలకు వచి్చన సమాధానాలివి. -
ఆ మినిస్ట్రీ టాయిలెట్లకు బయోమెట్రిక్ మెషిన్లు!
తాను అధికారంలోకి రాగానే వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతానని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఘనంగా చెప్పుకున్నారు. ఇక నుంచి ప్రజలంతా సమానమేనని, వీఐపీ, సామాన్యుడు అనే తారతమ్యాలను తాము పాటించబోమని ఆయన చెప్పుకొచ్చిన మాట. కానీ, ఆయన కేబినెట్లోని ఓ మంత్రిత్వశాఖ వద్ద ఉన్న టాయిలెట్లకు ఏకంగా బయోమెట్రిక్ గుర్తింపు మెషిన్లను బిగించారు. కేంద్ర పరిశ్రమలు, ఉత్పత్తి శాఖ వద్ద ఉన్న టాయిలెట్ల బయట తాజాగా వీటిని ఏర్పాటు చేశారు. ఇక, వీఐపీ టాయిలెట్లను ఉపయోగించాలంటే.. కనీసం అదనపు సెక్రటరీ, అంతకన్నా పైస్థాయి అధికారులై ఉండాలి. అంతకన్నా తక్కువస్థాయి సిబ్బందికి, ఇతరులకు ఈ టాయిలెట్లలోకి ఎంట్రీ లేదని, అందుకే ఈ మరుగుదొడ్ల బయట బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటుచేశారని పాక్ మీడియా తెలిపింది. ఓవైపు ప్రధానమంత్రి వీఐపీ కల్చర్‌ను తుదముట్టిస్తానని చెప్తుంటే.. మరోవైపు అధికారుల్లోనే తారతమ్యాలు పాటిస్తూ..ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించుకోవడం, బయోమెట్రిక్ మెషిన్లు పెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏకంగా ప్రభుత్వ సిబ్బంది మధ్యే ఈ రకంగా వ్యత్యాసం చూపితే.. ఇక మామూలు ప్రజల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారు? ఎలా వీఐపీ కల్చర్‌కు చరమగీతం పాడుతారని నెటిజన్లు పాక్ ప్రధానిని ప్రశ్నిస్తున్నారు. వీఐపీ కల్చర్‌కు వ్యతిరేకంగా రాజకీయాల్లోకి వచ్చిన ఇమ్రాన్ దానిని పెంచి పోషిస్తున్నారని మండిపడుతున్నారు. -
వీఐపీ సంస్కృతిని విడనాడుదాం..!
న్యూఢిల్లీ: వీఐపీ సంస్కృతిని విడనాడే దిశగా రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. 36 ఏళ్ల నాటి ప్రొటోకాల్‌ను పక్కనబెట్టాలని తాజాగా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు చైర్మన్, ఇతర సభ్యుల పర్యటన సమయంలో జోన్ జనరల్ మేనేజర్లు వారికి స్వాగతం పలకడం, వీడ్కోలు చెప్పడం ఇప్పటి వరకూ ప్రొటోకాల్‌గా కొనసాగుతోంది. ఈ ప్రొటోకాల్ నిబంధనను తక్షణం ఉపసంహరించుకుంటున్నట్టు రైల్వే శాఖ పేర్కొంది. రైల్వే బోర్డు చైర్మన్, ఇతర సభ్యుల పర్యటనల సమయంలో జోన్ జీఎం హాజరయ్యే అధికారులు పూల బొకేలు, బహుమతులను ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకురావొద్దని రైల్వే బోర్డు చైర్మన్ అశ్వనీ లోహని స్పష్టంచేశారు. సీనియర్ అధికారులు తమ ఇళ్లల్లో పని చేయించుకుంటున్న రైల్వే శాఖ కింది స్థాయి ఉద్యోగులను తక్షణం రిలీవ్ చేయాలని ఆదేశించింది . ప్రస్తుతం రైల్వే శాఖలో సుమారు 30 వేల మంది ట్రాక్మెన్లు సీనియర్ అధికారుల ఇళ్లలో పని చేస్తున్నారు. వెంటనే వారిని విధుల్లో చేరాలని అధికారులు ఆదేశించారు. సీనియర్ అధికారులు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ల్లో ప్రయాణాలు మానుకోవాలని, తోటి ప్రయాణికులతో కలసి స్లీపర్, ఏసీ 3 టైర్లో ప్రయాణించాలి. బోర్డు సభ్యులు, జోన్లమేనేజర్లు, డివిజనల్ మేనేజర్లకు ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. -
వీఐపీ సంస్కృతికి 650 మంది బలి
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా పట్టాలు తప్పడం వల్ల 346 రైలు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 650 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఐదు రోజుల్లోనే పట్టాలు తప్పడం వల్ల రెండు రైలు ప్రమాదాలు జరగడంతో తాను పదవికి రాజీనామా చేస్తానని అప్పుడు రైల్వే మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభు ప్రకటించారు. అప్పటికీ ఆయనకు సర్దిచెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ తర్వాత ఆ శాఖ నుంచి ఆయన్ని తప్పించారు. అప్పుడు కేంద్ర రైల్వే బోర్డుకు చైర్మన్‌గా ఉన్న ఏకే మిట్టల్ మాత్రం తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో కొత్తగా రైల్వే బోర్డు చైర్మన్‌గా ఆగస్టు 25వ తేదీన బాధ్యతలు స్వీకరించిన అశ్వణి లొహాని రైలు పట్టాలు తప్పడం వల్లనే దేశంలో ఎక్కువగా రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయన్న అంశంపై లోతుగా అధ్యయనం చేయడంతో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రైలు పట్టాలు ఎక్కడ తెగిపోయాయో, ఎక్కడ పగుళ్లు పట్టాయో తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని మరమ్మతు చేయడానికి వాటిపై నిరంతర నిఘా అవసరం. అలా నిఘాను కొనసాగించి మరమ్మతులు చేసే రైల్వే సిబ్బందిని గ్యాంగ్‌మెన్ అని, ట్రాక్ మెన్ అని, రైల్వే డీ క్యాడర్ ఉద్యోగులని పిలుస్తారు. భారత రైల్వేలో దాదాపు ఇలాంటి ఉద్యోగులు రెండు లక్షల మంది పనిచేస్తున్నారు. రైల్వే గేట్లులేని క్రాసింగ్‌ల వద్ద ఉండే సిబ్బంది కూడా ఈ కోవకే వస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారం పదివేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అయినా రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ గ్యాంగ్ మేన్ లేదా ట్రాక్‌మెన్ ట్రాకులపై కాకుండా రైల్వే బోర్డు సభ్యుడు, రైల్వే జనరల్ మేనేజర్, డివిజనల్ రైల్వే మేనేజర్ స్థాయి వీఐపీల ఇళ్ల వద్ద పని చేస్తున్నారు. ఇళ్లలో కుటుంబ సభ్యుల బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇళ్లు శుభ్రం చేయడం, మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, సరకులు తెచ్చి ఇవ్వడం, వారి పిల్లలను స్కూళ్లలో వదిలి పెట్టి రావడం, మళ్లీ వారిని తీసుకరావడం. ఆ తర్వాత అవసరమైతే వారిని ట్యూషన్లకు కూడా తీసుకెళ్లడం లాంటి పనులు వీళ్లు చేస్తున్నారు. ఒక్కొక్కరి వీఐపీ ఇంట్లో ఒక్కొక్కరు కాకుండా ఆరుగురి నుంచి పది మంది గ్యాంగ్మెన్లు పనిచేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది. ప్రోటోకాల్ లేదా వీఐపీ సంస్కృతి పేరిట ఈ విష సంస్కతిని రైల్వే అధికారులు అనుభవిస్తూ వచ్చారు. దీనిపై కొత్తగా రైల్వే బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అశ్వణి లొహాని కేంద్ర మంత్రిత్వ శాఖకు ఓ నివేదికను అందజేసి ఆ శాఖ అనుమతి మేరకు రైల్వే ఉద్యోగాలందరికి ఈ వీఐపీ సంస్కృతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల నుంచి ఎలాంటి బహుమతులు తీసుకోరాదంటూ కింది తరగతి, ముఖ్యంగా డీ కేటగిరీ ఉద్యోగులకు సూచనలు చేశారు. వివిధ స్థాయి ఉద్యోగులను తానే స్వయంగా కలుసుకుంటూ వారి మధ్య విధుల నిర్వహణలో సంయమనం ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఆయన నివేదికను పరిగణలోకి తీసుకున్న రైల్వే శాఖ అధికారులు కూడా శనివారం కూడా విధులకు హాజరుకావాల్సిందిగా రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. వారింత వరకు వారానికి రెండు రోజుల సెలవులను అనుభవిస్తున్నారు. గ్యాంగ్మెన్లు రోజుకు 12 గంటల షిప్టు పనిచేయాల్సి రావడం, రెండు, మూడు కిలోమీటర్లు పట్టాలు మరమ్మతుచేసే పనిముట్లు మోసుకెళ్లాల్సి రావడం, ప్రమాదాల్లో ఏడాదికి 200 మంది గ్యాంగ్మెన్లు మరణిస్తుండడం తదితర కారణాల వల్ల వారు తమ విధులను విస్మరించి అధికారుల ఇళ్లలో పనిచేయడానికే అలవాటుపడ్డారు. ఇష్టపడ్డారు. ఇక నుంచైనా ఈ పరిస్థితిని మార్చేందుకు ఇతర కార్మికుల్లాగానే వారి షిప్టులను కూడా 8 గంటలకు కుదించాలి. పాశ్చాత్య దేశాల్లోలాగే తేలికైనా, ఆధునిక పనిముట్లను వారికి అందజేయాలి. వారు నడచిపోవాల్సిన అవసరం లేకుండా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా, ప్రస్తుత రైలు పట్టాల పక్కన వారి వాహనాల కోసం ప్రత్యేకంగా చిన్న ట్రాక్‌లను నిర్మించాలి. -
వీఐపీ కల్చర్.. ట్రాఫిక్ జామ్‌లోనే...
సాక్షి, భోపాల్: ‘వీఐపీలు కాదు.. దేశానికి సాధారణ పౌరులే ముఖ్యం’ అంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. బీజేపీ పాలిత రాష్ట్రంలో అది కూడా ముఖ్యమంత్రి కార్యక్రమం మూలంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. భోపాల్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సాజిద్ అలీ అనే వ్యక్తి ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం విదిశా పట్టణం కగ్పూర్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఓ రైతు సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి రైతులను తీసుకెళ్తున్న బస్సులో సాజిద్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇంతలో గుండెపోటుతో కుప్పకూలిపోగా, పోలీసుల సహకారంతో డ్రైవర్ ఓ ఆంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లలో తలమునకలైన సిబ్బంది మూలంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆంబులెన్స్ చాలా సేపు ఆ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. పైగా ఓ ఎమ్మెల్యే కారే ఆంబులెన్స్ కు అడ్డుగా ఉండటం గమనార్హం. చుట్టూ జనం గుమిగూడగా, అంతా చూస్తుండగానే సాజిద్ ప్రాణాలు వదిలాడు. తర్వాత సమీపంలోని ఓ చిన్న ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఘటన గురించి తెలుసుకున్న సీఎం చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతికి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్ కల్చర్ రావాలంటున్న మోదీ, తన పార్టీ నేతలకు మాత్రం హిత బోధ చేయలేకపోతున్నారా? అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. టైమ్స్ నౌ వారి సౌజన్యంతో... Bus conductor dies in MP after collapsing while on duty, in a traffic jam caused due to CM Shivraj Singh Chouhan's visit to Kagpur pic.twitter.com/50V89RzYy9 — TIMES NOW (@TimesNow) 31 August 2017 -
‘వీఐపీలు కాదు.. పౌరులు ముఖ్యం’
న్యూఢిల్లీ: వీఐపీలకంటే సాధారణ పౌరులే ముఖ్యం అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. అందుకే వీఐపీ సంస్కృతి స్థానంలో ఈపీఐ(ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్) కల్చర్ తీసుకొస్తున్నామని తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడిన మోదీ పలు విషయాలను స్పృషించారు. సెలవుల్లో విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవాలని అన్నారు. ప్రజలు చాలా విషయాలు తన దృష్టికి తీసుకొస్తున్నారని, వారి నుంచి వచ్చిన సలహాలు స్వీకరిస్తానని అన్నారు. వీఐపీలకు చిహ్నంగా ఉన్న తమ కార్లపై ఉండే ఎరుపు బుగ్గలను తొలగించామని, అది వ్యవస్థను ఆధునీకరించడంలో భాగమని, అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరూ తమ మనసుల నుంచి వీఐపీలం అనే ఆలోచనను తొలగించే ప్రయత్నం చేయాలని కోరారు. మే 5న భారత్ సౌత్ ఏసియా వాటిలైట్‌ను ప్రారంభించబోతోందని, అది భారత్‌కు ముఖ్యమైన ముందడుగని దాని ద్వారా మొత్తం సౌత్ ఆసియాతో సహాయసహకారాలు పెంపొందించుకోవచ్చిన అన్నారు. -
ముఖ్యమంత్రికి ఎయిర్‌పోర్టులో షాక్
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఢిల్లీ విమానాశ్రయంలో చిత్రమైన అనుభవం ఎదురైంది. వీఐపీలు, వృద్ధుల కోసం ఉద్దేశించిన బ్యాటరీ కారులో ఆయన వెళ్లబోతుండగా.. ఓ ప్రయాణికుడు కోపంగా వచ్చి ఆయన ముందు సీట్లో కూర్చుని.. 'వీఐపీ సంస్కృతి వద్దు' అంటూ గట్టిగా అరిచాడు. ముంబై నుంచి విమానంలో దిగిన నితీష్ కుమార్ ఆ కారులో కూర్చోగానే అతడు వచ్చి అదే కారులో కూర్చుని అరవడం మొదలుపెట్టాడు. సెక్యూరిటీ వాళ్లు ఆ ప్రయాణికుడిని దిగాల్సిందిగా కోరినా.. అతడు వినలేదు. దాంతో ఏమీ చేయలేక అతడిని కూడా ఆ బ్యాటరీ కారులో తీసుకెళ్లారు. నితీష్ కుమార్ అంతర్జాతీయ లాంజ్ వద్ద దిగిపోగా, రెండో ప్రయాణికుడు మాత్రం ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు వెళ్లాడు. ఢిల్లీ విమానాశ్రయంలో ఎస్కలేటర్లు, వాకలేటర్లు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నా, వీఐపీలను మాత్రం గోల్ఫ్ కార్ట్ తరహా బ్యాటరీ కార్లలో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వరకు తీసుకెళ్తారు. అలాంటివి మొత్తం 30 కార్లు ఉన్నాయి. ముంబై నుంచి నితీష్ వచ్చిన ఎయిరిండియా విమానం ఏఐ 310లోనే వచ్చిన ఆ ప్రయాణికుడు.. నేరుగా వచ్చి నితీష్ ఎదురుసీట్లో కూర్చుండిపోయాడు. సాధారణంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైనా విమానాశ్రయాల్లో వీఐపీగానే చూస్తారు. వాళ్లకు వ్యక్తిగత భద్రత కల్పిస్తారు. నితీష్‌తో పాటు బ్యాటరీ కారులో కూర్చున్న వ్యక్తి ఆయనకు ఎలాంటి హాని కల్పించకపోవడం, హింసాత్మకంగా ప్రవర్తించకపోవడంతో తాము కూడా మరీ బలవంతం చేయలేదని, ముఖ్యమంత్రి సైతం ఎలాంటి అభ్యంతర వ్యక్తం చేయలేదని విమానాశ్రయాలలో భద్రతా ఏర్పాట్లు చూసే సీఐఎస్ఎఫ్ దళాలు తెలిపాయి. ఒకవైపు వీఐపీ సంస్కృతి వద్దంటూ మంత్రులు, ఇతరుల కార్లమీద ఎర్రబుగ్గలు తీసేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయిస్తే.. మరోవైపు విమానాశ్రయాలలో మాత్రం ఇలా కొంతమందిని ప్రత్యేకంగా చూడటం ఏంటన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అస్సలు నడవలేనివాళ్లు, వృద్ధులు, రోగులకైతే పర్వాలేదు గానీ అంతా బాగానే ఉన్నవారికి ప్రత్యేకంగా ఇలా గోల్ఫ్ కార్టులు కల్పించడం ఎందుకన్న వాదనలున్నాయి. -
ఎర్ర బుగ్గలకు స్వస్తి!
అక్షర తూణీరం పవర్లోకి వచ్చీ రాగానే, నేతలకు గన్మెన్లు, పైలట్లు సిద్ధమవుతాయ్. ఇవి చాలా అనవసరం, నాకొద్దు అన్నవారెవరైనా ఉంటే వారికి వందనం. ఉన్నట్టుండి ఆయనెందుకో సిగ్గుపడి, ‘ఎర్ర బుగ్గలకు‘ స్వస్తి పలికారు. మోదీ మాట వినగానే, నేనిదివరకే... కాదు నాకిదివరకే సిగ్గేసి ఎర్ర బుగ్గలు వదిలేశానని, కారులో నిలబడి మన వెంకయ్య నాయుడు చెప్పారు. జాగ్రత్తగా గమనిస్తే, నరేంద్ర మోదీ అప్పుడప్పుడు ఇలాంటి మెరుపులు మెరిపిస్తుంటారు. యూపీ విజయం తరువాత నాకేదో అనుమానంగా ఉంది. ఉన్నట్టుండి ముఖ్య నేతలంతా పాంకోళ్లు వేసుకుని.. మేండేటరీ చేయ కపోయినా, ఆదరణీయ క్రియగా భావిస్తారని సందేహంగా ఉంది. నిజమే! ఈ ఎర్ర దీపం కాన్సెప్ట్ ఎట్నించి వచ్చిందో తెలియదు. ఫైరింజన్ని చిన్నప్పుడు మావూళ్లో గంటల కారు అనేవాళ్లం. దానికి కూడా ఎర్రదీపం జ్ఞాపకం లేదు. అంబులెన్స్‌కి ఎర్ర దీపం ఎరుగుదుం. వీఐపీలకి అంటే వాళ్ల కార్లకి ప్రమాద ఘంటికలు మోగిస్తూ ఈ ఎర్ర దీపం తిరుగుడేందో, ఎట్లా వచ్చిందో మనకు తెలి యదు. గొప్పవాళ్లకి కొంచెం ఆర్భాటం ఉండాల్సిందే. లేకపోతే వాళ్లకి గుర్తింపు ఉండదు. కలెక్టర్ గారికి, రిజిస్ట్రార్ గారికి, జడ్జీ గార్లకి ముందు డవాళా బంట్రోతు నడుస్తూ తెగ సందడి చేసి భయపెడుతూ ఉంటారు. పూర్వం రాజులకి వంది మాగధుల నించి వెండి బెత్తాల వారు దాకా ముందుండి హంగు కూర్చేవారు. ఫ్యూడల్ అవశేషాలు ఇంకా బోలెడు మిగిలే ఉన్నాయి. ప్రజా నాయకులం, ప్రజాసేవకులం అని చెప్పుకోవడం, రాచమర్యాదలకు తహతహలాడడం మనవాళ్లకి అలవాటే! ‘మేం అసాంఘిక శక్తులపై నిరంతరం పోరు సాగిస్తున్నాం, మా ప్రాణానికి ముప్పుంది‘ అనే సాకుని ‘సెక్యూరిటీ‘గా మార్చి, ఆ వంకన లేనిపోని ఆర్భాటం చేస్తున్నారని కొందరు విశ్లేషకులంటారు. ఎర్ర దీపానికి సెక్యూరిటీకి సంబంధం ఉంది కాబట్టి, గొప్పవారి ప్రాణాలు అందులోనే ఉన్నాయనే వాదన వినిపిస్తోంది. ఎర్ర దీపం కారు సైరన్‌తో, ఒక మహా మనిషి కదలి వస్తున్నాడని హెచ్చరిస్తూ వేగంగా వెళ్లి పోతుంది. దీని తర్వాత స్థాయి బులుగు బుగ్గలది. క్యాబినెట్ స్థాయికి దిగువన ఉండే వీఐపీలకు నీలం దీపాలుంటాయి. పవర్లోకి వచ్చీ రాగానే, ఇంకేముంది మమ్మల్ని చంపేస్తారంటూ–గన్మెన్లు, పైలట్లు సిద్ధమవుతాయ్. ‘ఇవి చాలా అనవసరం, నాకొద్దు’ అన్నవారెవరైనా ఉంటే వారికి వందనం. ప్రజలతో మమేకమయ్యే వారికి ఈ గొప్పలన్నీ అవసరమా అనిపిస్తుంది. నేనొకసారి ప్రత్యక్షంగా చూశాను–నగరంలో వెటర్నరీ హాస్పిటల్‌కి ఒక ఎర్ర దీపం కారు, నీలం దీపం కారు వచ్చాయి. రెండు కార్లలోంచి రెండు కుక్కలు దిగాయి. ఎర్ర దీపంలో వచ్చిన కుక్క ఆలస్యంగా వచ్చినా, దాన్నే ముందు చూసి పంపించారు. నీలం కారు కుక్క తాలూకు డ్రైవర్ ముందొచ్చా గదా అని సణిగాడు. ఎర్ర దీపానికున్న ప్రయార్టీ నీకుండదు గదా అన్నాడు. కుక్కల డాక్టరు ఈ రంగు దీపాల కార్లు స్కూల్లో పిల్లల్ని దింపుతూ కనిపిస్తాయ్. అందరూ ఒకే యూని ఫాంలో ఉన్నా ఎర్ర దీపం యవ్వారం వేరుగా ఉంటుంది. తరచు డ్రైవర్ సొంత పనిమీద మందు షాపు ముందు ఆపుతాడు. ప్రసిద్ధ నటులు, తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు, గొప్ప చమత్కారి ఒకసారి నాతో అన్నారు–ఈ ఎర్ర దీపం బళ్లు వెళ్తుంటే ఖడ్గ మృగాల్ని చూసినట్టుండేదయ్యా. మా అన్నగారు ఢిల్లీ పీఠమెక్కితే ఎర్రకోటకి పచ్చరంగు పడుద్ది. కార్లకీ పచ్చదీపాలే! దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోమన్నారు. అంటే తలమీద ఎరుపో బులుగో ఉండగానే నాలుగు రాళ్లు... శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
వీఐపీ కల్చరనేది మంచిది కాదు: పారికర్
పనాజీ: వీఐపీ సంస్కృతి అంత మంచిది కాదని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. దేశంలో ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానికి తప్ప దేశంలో వీఐపీ భద్రత కల్పించాల్సిన అవసరం పెద్దగా లేదని చెప్పారు. ఎర్రబుగ్గలను తొలగించిన అంశంపై మీడియా ప్రతినిధులు పారికర్‌ను ప్రశ్నించగా ఆ విషయం తెలియదని, ఒక వేళ కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే తన కారుకు ఉన్న ఎర్రబుగ్గను తీసి ఇప్పుడే మీకు ఇస్తానంటూ సరదాగా అన్నారు. ‘వీఐపీ కల్చర్ తగ్గించాలని నేను అనుకుంటాను. వాస్తవానికి నేనొకటి క్లియర్‌గా చెప్పాలని అనుకుంటున్నాను. వీఐపీ సంస్కృతి అంతమంచిది కాదు. కానీ, ఇదే మన దేశంలో పెరుగుతోంది. భద్రత అనేది కేవలం మానసిక భావన. ఇద్దరు, లేదా ముగ్గురు లేదా నలుగురు నుంచి భద్రతను పొందవచ్చు. రాష్ట్రపతి, ప్రధానిని మినహాయిస్తే వీఐపీ భద్రత పేరిట మనం ఎక్కువ సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను’ అని పారికర్ చెప్పారు. -
ఊడుతున్న ఎర్ర బుగ్గలు
వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలన్న ఉద్దేశంతో ఎర్ర బుగ్గలను (సైరన్లను) తొలగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించడంతో క్రమంగా ఆ సైరన్లు ఊడుతున్నాయి. మే 1వ తేదీ నుంచి నోటిఫికేషన్ అమలులోకి రానుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినా, అంతకంటే ముందుగానే కొంతమంది కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ దిశగా ముందడుగు వేస్తున్నారు. అందరికంటే ముందుగా కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన కారుకు ఉన్న ఎర్రలైటు సైరన్‌ను తీయించేశారు. కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఎర్రలైటు ఉండాలని.. అలాంటప్పుడు తనకు అవసరం లేదు కాబట్టి తన కారు మీద ఉన్న సైరన్‌ను తీయించేశానని ఆయన చెప్పారు. ఆయన తర్వాత కేంద్ర మంత్రులు మహేష్ శర్మ, విజయ్ గోయల్ కూడా ఎర్రబుగ్గలను తమ తమ కార్ల నుంచి తీయించేశారు. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా కేంద్ర మంత్రుల బాటలోనే వెళ్లి.. ఆ సైరన్లను తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వాలలో నీలిరంగు సైరన్లను వాడుకోవచ్చన్న నిబంధన కూడా మారబోతోందని, కేవలం ముందుగా నిర్ణయించిన ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఆ సైరన్లు ఉండొచ్చని జైట్లీ చెప్పారు. -
ఎర్రబుగ్గలు ఔట్.. కొత్త సీఎం డేరింగ్ నిర్ణయం!
చండీగఢ్: వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ పంజాబ్ కొత్త ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత వాహనాలపై ఎర్రబుగ్గలను ఉంచే సంస్కృతికి ఆయన చరమగీతం పాడారు. అంతేకాకుండా రెండేళ్లపాటు మంత్రులు, ఎమ్మెల్యేల విదేశీ ప్రయాణాలకు చెక్ పెట్టారు. ప్రభుత్వ ఖర్చుతో విందులు, వినోదాలు నిర్వహించడాన్ని నిషేధించారు. రాష్ట్ర ఖజానాపై దుబారా ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు సీఎం అమరీందర్ సింగ్ తన తొలి కేబినెట్ సమావేశంలో ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో ఇక ఎమర్జెన్సీ సర్వీసులైన అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, పంజాబ్, హర్యానా హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇతర న్యాయమూర్తుల వాహనాలపై మాత్రమే ఎర్రబుగ్గలు దర్శనమివ్వనున్నాయి. వీఐపీ సంస్కృతికి చమరగీతం పాడేందుకే ప్రభుత్వ వాహనాలన్నింటికీ ఎర్రబుగ్గల వినియోగాన్ని తొలగించినట్టు అధికారులు తెలిపారు. ఇతర రంగు బుగ్గలను వినియోగాన్ని కూడా పూర్తిగా ఎత్తివేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. -
వీఐపీలేనా భక్తులు ?
సాధారణ భక్తుల పరిస్థితి ఏమిటంటూ ఆగ్రహం కాటేజీలను పరిశీలించిన బీజేపీ కమిటీ విజయవాడ : దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పేరుతో అమ్మవారి మూల ధనాన్ని వృథా చేయడంతో పాటు సాధారణ భక్తులకు వసతి లేకుండా చేస్తున్నారని బీజేపీ నిజ నిర్దారణ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో మాస్టర్‌ప్లాన్ పేరుతో జరుగుతున్న పలు పనులను బుధవారం నిజ నిర్దారణ కమిటీ సభ్యులు, బీజేపీ నగర నాయకులు శివకుమార్ పట్నాయక్, నగర ప్రధాన కార్యదర్శి బబ్బూరి శ్రీరామ్, నగర ఉపాధ్యక్షులు కొరగంజి భాస్కరరావు, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ పదిలం రాజశేఖర్, 31, 39వ డివిజన్ అధ్యక్షులు మానేపల్లి మల్లేశ్వరరావు, బచ్చు రమేష్ పరిశీలించారు. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్, మాడపాటి సత్రాలు, అన్నదాన సత్రం తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇష్టానుసారంగా పనులు దుర్గగుడికి ఏ అధికారి వచ్చినా ఆ అధికారి సొంత నిర్ణయాల మేరకే పనులు చేయిస్తున్నారని, దీని వల్ల భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని కమిటీ సభ్యులు శివకుమార్ పట్నాయక్ తెలిపారు. ఇదే పరిస్థితి మరి కొంత కాలం కొనసాగితే అమ్మవారి దర్శనంతో పాటు వసతి వీఐపీలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. సత్రాలలో ఉన్న గదులను తొలగించి వీఐపీలకు మాత్రమే గదులను నిర్మించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. పుష్కరాలకు అమ్మవారి ఆలయానికి ప్రభుత్వం ఎటువంటి నిధులను కేటాయించకుండా అమ్మవారి మూలధనం నుంచి డబ్బులు డ్రా చేసి పనులు చేయడం సరికాదన్నారు. రాష్ర్టంలో అన్ని దేవాలయాలకు కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం దుర్గగుడికి కమిటీని ఏర్పాటు చేయకపోవడం వల్లే అధికారులు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేసి సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనంతో పాటు వసతి కల్పించేలా దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకు వెళతామని కమిటీ సభ్యులు వివరించారు. -
ఎందుకొచ్చిన వీఐపీలు బాబూ!
గోదావరి పుష్కరాల్లో వీఐపీ సంస్కృతిపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిపై ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు ఓ బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు స్వయంగా నిర్వహిస్తున్న ఈ పుష్కరాల తంతు పట్ల తాను ఎంతో ఆవేదనకు గురయ్యానన్నారు. పుష్కర యాత్రికుల కష్టాలపై సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఏ కాస్తయినా దృష్టిపెట్టి ఉంటే.. దాదాపు 30 మంది ప్రాణాలు పోయేవి కావని శర్మ చెప్పారు. ఒక్క వీఐపీ అక్కడకు వచ్చినా కూడా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్.. ఇలా అన్నీ అస్తవ్యస్తం అయిపోతాయని, వాళ్లు రాకపోతే అవి లక్షలాది మందికి ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినా కూడా వీఐపీలు మాత్రం రాజమండ్రికే వెల్లువలా వస్తున్నారని వాళ్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు, పరివారం కూడా వస్తున్నారని.. దానివల్ల యాత్రికులపై భారం పడటంతో పాటు ప్రభుత్వ ఖజానా మీద కూడా బోలెడంత భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాన తుని, దక్షిణాన ఏలూరు వరకు కూడా భారీ ఎత్తున యాత్రికుల వాహనాలు నిలిచిపోతున్నాయని, ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదని శర్మ చెప్పారు. వీఐపీలు కూడా సామాన్య యాత్రికుల్లాగే క్యూ లైన్లలో రావాలని, అలా రాకపోతే వాళ్లను ఇక్కడకు రానివ్వకుండా చేయడం బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేయాల్సిన పని అని ఆయన సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అలాంటి బాధ్యత తమకు ఉన్నట్లు ఏ తరుణంలోనూ కనిపించలేదని తెలిపారు. సింగపూర్ బృందం రాక వల్ల కూడా రాజమండ్రిలో పుష్కర యాత్రికులకు సమస్యలు వచ్చాయన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు.. వీళ్లంతా ఇలాంటి సందర్భాల్లో ప్రజాప్రయోజనాలనే పరమావధిగా భావించాలి తప్ప తమ సొంత పుణ్యం కోసం పాకులాడకూడదని ఈఏఎస్ శర్మ సూచించారు. వాళ్లు కూడా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, వాళ్లేమీ జమీందారీ వ్యవస్థలో లేరని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో వాణిజ్యశాఖ కార్యదర్శిగా పనిచేసిన శర్మ.. వివిధ సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు ఘాటుగా స్పందిస్తూ ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తుంటారు. ప్రస్తుతం ఫోరం ఫర్ బెటర్ విశాఖ అనే సంస్థకు కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. -
వీఐపీ కల్చర్‌లో బీజేపీ నేత
న్యూఢిల్లీ: విమాన వీఐపీ కల్చర్‌లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చిక్కుకున్నారు. ఆయన వెళ్లాల్సిన విమానం ఆలస్యం కావడంతో మరో విమానంలో పంపేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బయలుదేరేందుకు సిద్ధంగా ఉన్న ఓ కుటుంబాన్ని దించేసి మరి రిజిజు బృందాన్ని అధికారులు పంపించారు. అయితే, కేంద్ర మంత్రి రిజిజు కోసం ముగ్గురిని దించేస్తున్నప్పుడు కెమెరాతో ఓ ప్రయాణికుడు వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో ఉంచాడు. దీంతో మంత్రి తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లు వెత్తాయి. వీఐపీ కల్చర్‌పై నెటిజన్లు మండిపడ్డారు. జూన్ 24న ఆయన కశ్మీర్‌లోని లేహ్ నుంచి ఢిల్లీకి ప్రయాణించారు. -
సీఎం కోసం గంట ఆగిన విమానం
ముంబై: వీఐపీ సంస్కృతి మరోసారి సామాన్యులను ఇబ్బందులకు గురిచేసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కోసం విమానాన్ని గంటసేపు ఆపారు. మంగళవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా ఆలస్యంగా బయల్దేరింది. దీనిపై భిన్నకథనాలు వెలువడ్డాయి. అమెరికా పర్యటనకు వెళ్లేందుకు ఫడ్నవిస్ బృందం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నిర్ణీత సమయానికి చేరుకుంది. అయితే ఫడ్నవిస్ కొత్త పాస్‌పోర్టును మరిచిపోయి వచ్చినట్టు సమాచారం. ఫడ్నవిస్ సహాయకుడు ఆయన కొత్త పాస్ పోర్టు బదులు కాలంచెల్లిన పాస్‌పోర్టును పెట్టారు. దీంతో సీఎం నివాసం నుంచి కొత్త పాస్ పార్టును తెప్పించి బయల్దేరారు. కాగా సీఎం బృందంలోని అధికారి ప్రవీణ్ పరదేశి కాలం చెల్లిన పాస్‌పోర్టును తీసుకువచ్చినట్టు మరో కథనం. ఏదేమైనా పాస్‌పోర్ట్ తతంగం పూర్తయ్యేసరికి 50 నిమిషాల సమయం పట్టింది. అప్పటి వరకు ప్రయాణికులు వేచిచూడాల్సి వచ్చింది.