ఎందుకొచ్చిన వీఐపీలు బాబూ!
గోదావరి పుష్కరాల్లో వీఐపీ సంస్కృతిపై మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనిపై ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు ఓ బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు స్వయంగా నిర్వహిస్తున్న ఈ పుష్కరాల తంతు పట్ల తాను ఎంతో ఆవేదనకు గురయ్యానన్నారు. పుష్కర యాత్రికుల కష్టాలపై సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు ఏ కాస్తయినా దృష్టిపెట్టి ఉంటే.. దాదాపు 30 మంది ప్రాణాలు పోయేవి కావని శర్మ చెప్పారు. ఒక్క వీఐపీ అక్కడకు వచ్చినా కూడా భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్.. ఇలా అన్నీ అస్తవ్యస్తం అయిపోతాయని, వాళ్లు రాకపోతే అవి లక్షలాది మందికి ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. ఇలాంటి దుర్ఘటనలు జరిగినా కూడా వీఐపీలు మాత్రం రాజమండ్రికే వెల్లువలా వస్తున్నారని వాళ్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులు, పరివారం కూడా వస్తున్నారని.. దానివల్ల యాత్రికులపై భారం పడటంతో పాటు ప్రభుత్వ ఖజానా మీద కూడా బోలెడంత భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉత్తరాన తుని, దక్షిణాన ఏలూరు వరకు కూడా భారీ ఎత్తున యాత్రికుల వాహనాలు నిలిచిపోతున్నాయని, ఇలా ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదని శర్మ చెప్పారు. వీఐపీలు కూడా సామాన్య యాత్రికుల్లాగే క్యూ లైన్లలో రావాలని, అలా రాకపోతే వాళ్లను ఇక్కడకు రానివ్వకుండా చేయడం బాధ్యతాయుతమైన ప్రభుత్వం చేయాల్సిన పని అని ఆయన సూచించారు. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అలాంటి బాధ్యత తమకు ఉన్నట్లు ఏ తరుణంలోనూ కనిపించలేదని తెలిపారు. సింగపూర్ బృందం రాక వల్ల కూడా రాజమండ్రిలో పుష్కర యాత్రికులకు సమస్యలు వచ్చాయన్నారు.
గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు.. వీళ్లంతా ఇలాంటి సందర్భాల్లో ప్రజాప్రయోజనాలనే పరమావధిగా భావించాలి తప్ప తమ సొంత పుణ్యం కోసం పాకులాడకూడదని ఈఏఎస్ శర్మ సూచించారు. వాళ్లు కూడా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, వాళ్లేమీ జమీందారీ వ్యవస్థలో లేరని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వంలో వాణిజ్యశాఖ కార్యదర్శిగా పనిచేసిన శర్మ.. వివిధ సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు ఘాటుగా స్పందిస్తూ ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తుంటారు. ప్రస్తుతం ఫోరం ఫర్ బెటర్ విశాఖ అనే సంస్థకు కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు.