సాక్షి, అమరావతి : పుష్కరాల పేరిట గత ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాలయను మంచి నీళ్లలా ఖర్చు పెట్టిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జోగి రమేశ్ విమర్శించారు. గోదావరి పుష్కరల్లో 29 మంది అమాయకపు భక్తులు చనిపోవడానికి కారణం టీడీపీ ప్రభుత్వమేనని ఆరోపించారు. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో వేలాది కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బుధవారం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తరువాత స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయంలో పుష్కరాల నిర్వహణపై జోగి రమేశ్ మాట్లాడుతూ.. పుష్కరాలకు వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించిన టీడీపీ ప్రభుత్వం.. అందుకు సరిపడ ఏర్పాట్లు చేయలేకపోయింది. పుష్కరాల సమయంలో 29 మంది భక్తులు చనిపోవడానికి కారణమేవరు?. దర్శకుడు బోయపాటి శ్రీనును అక్కడ షూటింగ్ చేయమని ఎవరు చెప్పారు?. బోయపాటిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు షూటింగ్ చేయమన్నారా లేక బోయపాటినే సినిమా షూటింగ్ చేశారా అనేది టీడీపీ సమాధానం చెప్పాలి. చంద్రబాబు ఎందుకు సామాన్య ఘాట్‌లో పుష్కర స్నానం చేయాల్సి వచ్చింది?. అంత పెద్ద ఘటన జరిగిన కూడా కనీసం ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. 29 మంది మరణానికి కారణమైన వారికి శిక్ష తప్పదు. గోదావరి పుష్కరాల ఘటనపై సభాసంఘం వేయాలి. అసలైన దోషులను గుర్తించాల్సిన అవసరం ఉంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఇబ్రహీం గాంధీ సెంటర్‌లో ఉన్న మహత్మా గాంధీ విగ్రహాన్ని తొలగించి మురికి కాలువలో వేశారు. కృష్ణా పుష్కరాల కోసం వేలాది మంది పేదల ఇళ్లను అక్రమంగా తొలగించార’ని తెలిపారు.
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే 29 మంది చనిపోయారు..
చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే గోదావరి పుష్కరాల్లో 29 మంది భక్తులు చనిపోయారని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. పర్యాటక శాఖ ద్వారా నేషనల్ జియో గ్రాఫిక్ ఛానల్‌కు రూ. 64 లక్షలతో డాక్యుమెంటరీ చిత్రీకరించే యత్నం చేశారు. బోయపాటి శీనుతో ఆ షూట్ చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చినప్పుడు కనీసం జాగ్రత్తలు తీసుకోలేదని మండిపడ్డారు. 29 మంది చనిపోవడానికి చంద్రబాబు కారణమని విమర్శించారు. పైగా భక్తుల తొక్కిసలాట వల్లే ప్రమాదం జరిగిందని గత ప్రభుత్వం సమర్ధించుకుందని గుర్తుచేశారు. ఈ ఘటనకు సోమయాజులు కమిషన్ నివేదనకు పట్టించుకోలేదన్నారు. బాధితులకు ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు గోదావరి పుష్కరాల కోసం రూ. 3 వేల కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. ఆ నిధులను పూర్తిగా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. గోదావరి పుష్కరాల ఘటనపై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు.
కేబినెట్ సబ్‌కమిటీతో విచారణ చేయిస్తాం
సభ్యుల ప్రశ్నలకు సమాధానంగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు వెళ్లిన పుష్కర ఘాట్ వద్ద కనీస జాగ్రత్తలు తీసుకోలేదని సోమయాజులు కమిటీ నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆ నివేదికను కూడా చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందని మండిపడ్డారు. మృతుల కుటుంబసభ్యులు కూడా చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. సామాన్య ప్రజల కోసం ఏర్పాటు చేసిన ఘాట్‌కు చంద్రబాబు రావడం వల్లే ప్రమాదం జరిగిందని నివేదికలో పేర్కొన్నట్టు వెల్లడించారు. కేబినెట్ సబ్‌కమిటీ ద్వారా ఈ ఘటనపై విచారణ జరిపిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment