
సాక్షి, అమరావతి : శాసనసభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ స్థానాన్ని ప్రతిపక్ష పార్టీ నేతలు లెక్కచేయడం లేదని అన్నారు. చంద్రబాబు, ఇతర టీడీపీ సభ్యులు సభలో అనుచితంగా వ్యవరిస్తున్నారని స్పీకర్ వ్యాఖ్యానించారు. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అంశంపై చర్చ సందర్భంగా టీడీపీ నాయకుల తీరును వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తప్పుబట్టారు. నలభై ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు సభా మర్యాదలు తెలియవని, స్పీకర్‌పై అమర్యాదగా మాట్లాడటం ఏంటని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు.
స్పీకర్ స్థానాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు అగౌరవ పరిచారని, స్పీకర్‌ను పట్టుకొని మర్యాద ఉండదని అంటారా అని నిలదీశారు. స్పీకర్‌పై చంద్రబాబు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్ల అనుభవం ఉండి..14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు సభా మర్యాదలు తెలియవా? అని ప్రశ్నించారు. బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సభ నుంచి సస్పెండ్ చేయాలి : ఎమ్మెల్యే జోగి రమేష్
బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శాసనసభలో జోగి రమేష్ మాట్లాడుతూ.. ‘ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పీకర్‌ను బెదిరిస్తూ కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు కించపరిచినట్లే. స్పీకర్‌పైనే బెదిరింపులకు దిగుతున్నారు. బలహీన వర్గాలను కించపరిచిన చంద్రబాబును సస్పెండ్ చేయాలి. స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడితే మీకు వచ్చే నష్టం ఏంటి?’ అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..
చట్టసభలో ఈ రోజు చంద్రబాబు అంబేద్కర్ రచించిన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ..‘ఈ రోజు ఏపీ అసెంబ్లీలో విలువలు, విశ్వసనీయతకు చంద్రబాబు పాతర వేశారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ స్పీకర్ స్థానాన్ని అగౌరవపరుస్తున్నారు. పేదవారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తుంటే ప్రతిపక్ష సభ్యులు అడ్డుపడుతున్నారు. దళితులు, బహుజనులు బతకడానికి చంద్రబాబు హయాంలో కిష్టపరిస్థితులు ఉండేవి. చంద్రబాబు ఇలాంటి సభలో ఉండకూడదు’అని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment