
సాక్షి, అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. అలాగే, చంద్రబాబు రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం లేదని ఘాటు విమర్శలు చేశారు. సభలో ఒకమాట.. బయట ఒకమాట చెబుతున్నారు. రైతులకు మంచి జరగాలన్నదే వైఎస్సార్‌సీపీ డిమాండ్ అని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవపై మండలిలో చర్చ జరిగింది. ఈ సందర్బంగా శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం, బొత్స మాట్లాడుతూ..‘వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు సరైనవి కాదు. ప్రతీ అంశానికి ఆవు కథ చెప్పడం అలవాటైపోయింది. అన్నదాత సుఖీభవ ఎంతమందికి ఇస్తున్నారో చెప్పమని మేం అడిగాం. రైతుల సమస్యలపై చర్చించమని బీఏసీ మీటింగ్‌లో మేం కోరాం. రైతుల పట్ల మాకు అంకితభావం ఉంది.
గత ఐదేళ్లలో రైతులకు మేం చేసిన మేలును నీతి ఆయోగ్ మెచ్చుకుంది. మిగిలిన రాష్ట్రాలు కూడా ఏపీ వ్యవసాయ విధానాలు పాటించాలని సూచించింది. రైతుకు, వ్యవసాయానికి ఉపయోగపడే ప్రతీ అంశాన్ని రైతు భరోసా కేంద్రంలో మేం అందుబాటులో ఉంచాం. కావాలంటే రికార్డులు చూసుకోండి. రైతుభరోసా కేంద్రాలకు ఈ ప్రభుత్వం తాళాలేసింది. గత ఐదేళ్లలో రైతులకు మేం ఏమీ చేయలేదని రివ్యూ చేసి నిరూపించండి.
మేం మొత్తం 53 లక్షల మందికి రైతుభరోసా అందించాం. అంత మందికీ మీరు ఇస్తామన్నారు.. ఆ మాటకు కట్టుబడి ఉండండి. బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోయినా రైతులకు సాయం చేయండి.. మేం కోరుకునేది కూడా అదే. రైతులకు మంచి జరగాలన్నదే మా డిమాండ్. రైతుకు ఇన్స్యూరెన్స్ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఇవ్వండి. 2014-19లో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఎందుకు చేయలేదు?. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. రైతులకు న్యాయం చేస్తారని నమ్మకం లేదు. సభలో ఒకమాట.. బయట ఒకమాట చెబుతున్నారు. అధికార పార్టీ సభ్యుల వైఖరిని నిరసిస్తూ ఈ ప్రశ్నకు సభనుంచి వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment