అవినీతి ఫైలు అటకెక్కించేశారు | TDP Govt Corruption In Godavari Pushkaralu | Sakshi
Sakshi News home page

అవినీతి ఫైలు అటకెక్కించేశారు

Published Thu, Aug 27 2020 4:06 AM | Last Updated on Thu, Aug 27 2020 4:06 AM

TDP Govt Corruption In Godavari Pushkaralu - Sakshi

సాక్షి, అమరావతి: గోదావరి పుష్కరాల సందర్భంగా హాలోజన్‌ బల్బుల పేరుతో జరిగిన గోల్‌మాల్‌ను గత టీడీపీ ప్రభుత్వం విచారణ దశలోనే అటకెక్కించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల అవినీతి వెలుగులోకి రాకుండా ఈ పనిచేశారని ప్రస్తుత ప్రభుత్వానికి ఇప్పుడు ఓ ఫిర్యాదు అందింది. దీంతో ఏపీ విజిలెన్స్‌ అధికారులు ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టారు. ఈ క్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయని ట్రాన్స్‌కో విజిలెన్స్‌ జేఎండీ వెంకటేశ్వరరావు 
వివరించారు. 

అప్పుడేం జరిగిందంటే?
► పుష్కరాల సమయంలో రాజమండ్రిలోని గోదావరి పుష్కర ఘాట్‌ వద్ద హాలోజన్, రంగుల విద్యుద్దీపాలు అమర్చాలని 2015లో అప్పటి ప్రభుత్వం నిర్ణయించి రూ.1,71,82,836లను మంజూరు చేసింది. నిజానికి రూ.5 లక్షలు దాటిన ప్రతీ కాంట్రాక్టుకు టెండర్‌ పిలవాలి. ఇదేమీ లేకుండా ఈ మొత్తాన్ని ఇష్టానుసారం ఖర్చుచేశారు. 
► రూ.99 లక్షలతో హాలోజన్‌ ల్యాంపులు, డెకరేషన్‌ బల్బులు అద్దెకు తెచ్చినట్లు రూ.72 లక్షలతో హాలోజన్‌ ల్యాంపులు, కేబుల్, జీఐ వైర్, ఇన్సులేషన్‌ టేపులు, పిన్స్, ఎంసీబీలు, బల్బులు, ల్యాంపులు, హోల్డర్లు కొనుగోలు చేసినట్లు లెక్కల్లో చూపించారు.  
► అలాగే, ఒక్కో ల్యాంపు రూ.824 చొప్పున 654 ల్యాంపులు కొన్నామని, వీటి విలువ దాదాపు రూ.5.4 లక్షలని, మరో 500 వాట్స్‌ హాలోజన్‌ ల్యాంపులు ఒక్కొక్కటీ రూ.588 చొప్పున.. 553 కొనుగోలు చేశామని, వీటి విలువ రూ.3.25 లక్షలని అధికారులు లెక్కలు చెప్పారు. లేబర్‌ ఛార్జీల కోసం రూ.10,32,500 ఖర్చు చేసినట్లు బిల్లులు పెట్టారు.  
► కానీ, రికార్డుల్లో చూపించిన షాపులన్నీ హాలోజన్‌ బల్బులు అద్దెకిచ్చే పరిస్థితే లేదని, బల్బుల నాణ్యతా ప్రమాణాలు కూడా ఏమాత్రం లేవని ఆరోపణలు వచ్చాయి. అసలు కొనుగోలు చేసిన హాలోజన్‌ బల్బులు ఆ తర్వాత మాయమవ్వడం, ఆ తర్వాత తుక్కుగా చూపించడం అనేక అనుమానాలకు తావిచ్చింది.  

వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ 
► ఈ నేపథ్యంలో.. ‘సాక్షి’ 21–8–2015న ఈ బాగోతంపై ‘హలోజన్‌ హాంఫట్‌’ పేరుతో అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రమేయాన్ని, అవినీతినీ ఆధారాలతో బయటపెట్టింది. దీంతో తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ సీఎండీ ముత్యాలరాజు ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. 
► మాయమైన బల్బులు, కొనుగోలులో అక్రమాలు, అద్దెకు తేవడం బూటకమని ప్రాథమిక ఆధారాలు లభించడంతో అప్పట్లోనే పదిమంది అధికారులకు సీఎండీ నోటీసులు జారీచేసి సమగ్ర విచారణకు ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. 
► కానీ, ఆ తర్వాత 2016లో ఈపీడీసీఎల్‌ సీఎండీగా వచ్చిన ఎంఎం నాయక్‌పై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో 2016 ఏప్రిల్‌లో విచారణలో ఉన్న ఈ కేసును మూసేశారు. 
► ట్రాన్స్‌కో విజిలెన్స్‌ అప్పట్లో ఈ కేసుపై విచారణ జరిపింది. ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈపీడీసీఎల్‌కు సిఫార్సు చేసింది. అయితే, ఈ ఆదేశాలు డిస్కమ్‌ సీఎండీ పక్కనపెట్టారు. ఇప్పుడా ఫైలే కన్పించకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు.

లోతుగా దర్యాప్తు చేస్తున్నాం  
అవినీతికి పాల్పడిన వారిపై చర్యలే లేకుండా ఫైలు మూసేయడం ఆశ్చర్యంగా ఉంది. ట్రాన్స్‌కో సిఫార్సుల ఫైలే ఈపీడీసీఎల్‌లో లేకపోవడం మరో విడ్డూరం. అందుకే లోతుగా దర్యాప్తు చేస్తున్నాం. త్వరలో వివరాలు తెలుస్తాయి. 
– కె. వెంకటేశ్వరరావు (ట్రాన్స్‌కో విజిలెన్స్‌ జేఎండీ) 

దోషులకు శిక్ష తప్పదు  
హాలోజన్‌ బల్బుల కొనుగోళ్లలో అనేక అనుమానాలు వస్తున్నాయి. అవినీతి జరిగిందనే తెలుస్తోంది. అందుకే తిరిగి విచారణ చేపట్టాం. దోషులను శిక్షించి తీరుతాం. 
– శ్రీకాంత్‌ నాగులాపల్లి (ట్రాన్స్‌కో సీఎండీ)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement