సాక్షి ప్రతినిధి, ఏలూరు :కాసులొచ్చే పనులు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్న టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధుల కన్ను గోదావరి పుష్కర పనులపై పడింది. అధికారం అండతో పనులను దక్కించుకుంటున్న తమ్ముళ్లు దొరికినంత దోచేస్తున్నారు. పుష్కర పనులకు సంబంధించి 90 శాతం కాంట్రాక్టులు టీడీపీ నేతల అనుచరులు, ప్రజాప్రతి నిధుల బంధువులే దక్కించుకున్నారన్నది బహిరంగ రహస్యం. జిల్లాలోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చేపట్టిన పనులతోపాటు విలీన మం డలాలైన కుకునూరు, వేలేరుపాడుల్లో పుష్కర ఘాట్లు, సీసీ రోడ్ల పనులను అంచనా వ్యయం కంటే ఎక్కువ మొత్తాలకు దక్కించుకుని నిధుల దోపిడీకి తెరతీశారు. కుకునూరుతోపాటు ఆ మండలంలోని కౌండిన్యముక్తి, దామరచర్ల, పెదరావిగూడెం, వేలేరుపాడు మండలంలోని రుద్రం కోట, తాట్కూరుగొమ్ము, కోయిద గ్రామాల్లోని గోదావరి రేవుల్లో రూ.1.75 కోట్లతో నిర్మించే పుష్కర ఘాట్ల టెండర్లను తెలంగాణలోని అశ్వారావుపేట మండలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తొలుత దక్కించుకున్నారు.
20 ఏళ్లుగా ఆ మండలంలో రూ.లక్ష నుంచి రూ.కోటి వరకు విలువైన కాంట్రాక్ట్ పనులు చేస్తున్న దళారుల కన్ను ఆ పనులపై పడింది. అంతే ఏలూరుకు చెందిన ఓ టీడీపీ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన నెరపిన రాజకీయం.. వేలేరుపాడుకు చెందిన ఓ కాంట్రాక్టర్ మధ్యవర్తిత్వంతో దళారులు ఆ పనులను సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయబావుటా ఎగురవేసిన దామరచర్ల పంచాయతీలో ఆలయం లేని దృష్ట్యా, గోదావరి రేవుకు మెట్లు అవసరం లేదంటూ దళారులు ఆ పనులను రద్దు చేయించారు. కానీ అసలు ఆలయమే లేని కుకునూరులో మాత్రం రూ.25 లక్షలతో శరవేగంగా పుష్కర ఘాట్లను నిర్మించేస్తున్నారు.
ఇందుకు ఏలూరులోని ఓ టీడీపీ సీనియర్ నేతకు చెందిన కాంట్రాక్టర్లు ఆ పనులు దక్కించుకోవడం ఒక కారణమైతే.. దళారులు ఆ కాంట్రాక్టు పనుల్లో భాగస్వాములు కావడం మరో కారణం. కుకునూరు, కౌండిన్యముక్తి, రుద్రం కోట, తాట్కూరుగొమ్ము, కొయిద గ్రామాల్లో పుష్కర ఘాట్లను అంచనా వ్యయం కంటే 3.1 శాతం తక్కువ నిధులతో చేపట్టేందుకు సాధారణ కాంట్రాక్టర్లు టెండర్లు వేసి పనులు చేపట్టేందుకు ముందుకురాగా, పెదరావిగూడెంలో రూ.25 లక్షల విలువైన పుష్క ర ఘాట్ల నిర్మాణ పనులను 4 శాతం ఎక్కువ ధరను కోట్ చేసి టీడీపీ నేతకు చెందిన దళారి దక్కించుకోవడం గమనార్హం. అక్కడ కాంట్రాక్టు పనులను చేస్తున్న దళారి ఏలూరు టీడీపీ నేతకు అత్యంత సన్నిహితుడనే ప్రచారం సాగుతోంది.
30 శాతం ‘లెస్’కు సీసీ రోడ్లు
కీలకమైన పుష్కర ఘాట్ల నిర్మాణాలను దక్కించుకున్న టీడీపీ నాయకులు, తమకు దక్కని సీసీ రోడ్ల పనులపై మాత్రం నిధులు వృథా అంటూ గోబెల్స్ ప్రచారానికి తెరలేపారు. కుకునూరు మండలంలో రూ.47 లక్ష లు, కౌండిన్యముక్తిలో రూ.22 లక్షలు, పెదరావిగూడెంలో రూ.50 లక్షలు, కొయిదలో రూ.20 లక్షలు, తాట్కూరుగొమ్ములో రూ.7 లక్షలు వెచ్చించి నిర్మించనున్న సీసీ రోడ్ల కాంట్ట్రాక్టు పనులను భద్రాచలానికి చెందిన ఓ కాంట్రాక్టర్ 29 నుంచి 30 శాతం తక్కువ ధర కోట్‌చేసి దక్కించుకున్నారు. అలా తక్కువ ధరకు పనులు దక్కించుకోలేకపోయిన టీడీపీ నేతలు సదరు కాంట్రాక్టు వ్యవహారాన్ని వివాదాస్పదం చేయడం మొదలుపెట్టారు. 30 శాతం తక్కువ నిధులతో పనులు చేపడితే ఏం మిగులుతాయి.. అధికారులు ఎలా టెండర్లు ఖాయం చేశారు.. మార్కెట్ ధరలకన్నా అంచనా ధరలు అధికంగా వేశారా అంటూ చర్చకు తెరలేపారు. కానీ.. అంచనా వ్యయంపై 4 శాతం ఎక్కువ ధర కోట్ చేసి టీడీపీ నాయకులు చేపట్టిన పనులపై మాత్రం ఎవరూ ఎక్కడా నోరు మెదపడం లేదు.
దొరికినంత దోచెయ్
Published Tue, May 12 2015 2:16 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement