అధికార పార్టీ నేత చక్రం తిప్పుతున్న తీరు ఔరా!
అది దేవాదాయశాఖ.. కానీ అక్కడ దేవుడి ప్రభావం కంటే అధికార పార్టీ ముఖ్యనేత తమ్ముడి మాయే ఎక్కువ పని చేస్తోంది. తమ కనుసన్నల్లో నడిచే అధికారులు.. కాసులు కురిపించే ఒప్పందాల కోసం బదిలీలు, పదోన్నతుల ఉత్తర్వులతో ఆడుతున్న రాజకీయ క్రీడ ఆ శాఖ వర్గాలను విస్మయపరుస్తోంది. కొత్తగా వచ్చిన ఉన్నతాధికారులను నెలలోపే సాగనంపేందుకు ‘అధికార పార్టీ నేత’ చక్రం తిప్పుతున్న తీరు ఔరా! అనిపిస్తోంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అక్రమార్జన కోసం అధికారులను అడ్డగోలుగా అందలమెక్కించేందుకు తెలుగు తమ్ముళ్లు దేవాదాయశాఖ వేదికగా ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. గోదావరి పుష్కరాలకు ముహూర్తం దగ్గర పడుతుండటంతో వారు ఈ ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. పుష్కరాలకు ఉభయగోదావరి జిల్లాల్లో రూ.కోట్ల విలువైన పనులను నామినేషన్ పద్ధతిపై దేవాదాయశాఖలో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆ పనులు కాసులు పండిస్తాయనే ముందుచూపుతో కీలక పోస్టుల కోసం కొందరు అధికారులు ‘తమ్ముళ్ల’ను ఆశ్రయించి రూ.లక్షలు ముట్టచెబుతున్నారు. దీంతో ఆయా పోస్టుల్లో బాధ్యతలు చేపట్టిన అధికారులను నెల కూడా తిరగకుండానే సాగనంపేందుకు తెగబడుతున్న తీరు దేవాదాయశాఖలో చర్చనీయాంశమైంది.
ఆ రెండు పోస్టులపైనే గురి
దేవాదాయశాఖలో రెండు ప్రధాన పోస్టులను రూ.లక్షల్లో ముడుపులు తీసుకుని ముందే అమ్మేశారు. జిల్లాకు చెందిన ఒక పాలకపక్ష ముఖ్యనేత అండదండలతో ‘తమ్ముళ్లు’ ఇందులో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ రెండు పోస్టుల్లో ఒకటి డిప్యూటీ కమిషనర్ పోస్టు. దీని పరిధి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు కాగా మరో పోస్టు రీజినల్ జాయింట్ కమిషనర్. దీని పరిధిలో ఆరు జిల్లాలున్నాయి. కాకినాడ కేంద్రంగా ఉన్న ఈ రెండు పోస్టులూ ప్రస్తుతం ఖాళీగా లేవు. డిప్యూటీ కమిషనర్‌గా డి. భ్రమరాంబ గత నెల 24న బాధ్యతలు స్వీకరించారు. రీజినల్ జాయింట్ కమిషనర్‌గా చంద్రశేఖర్ ఆజాద్ అదే నెలలో వారం రోజుల తేడాలో చేరారు. డీసీగా ఉన్న హనుమంతరావు గుంటూరు బదిలీ అయ్యాక లోవ దేవస్థానం ఈఓ గాదిరాజు సూరిబాబురాజుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి సూరిబాబురాజుది అసిస్టెంట్ కమిషనర్ కేడర్ కాగా డీసీ హోదా కలిగిన పోస్టింగ్‌కు ఎఫ్‌ఏసీ తెచ్చుకోగలిగారు.
ఎఫ్‌ఏసీగా ఉన్నపుడే డీసీ పోస్టుపై మోజు పెంచుకున్న సూరిబాబురాజు అందులోనే కొనసాగడం కోసం మెట్ట ప్రాంతానికి చెందిన ఒక ముఖ్యనేతను ఆశ్రయించి భరోసా తెచ్చుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. డీసీగా భ్రమరాంబను నియమిస్తూ కమిషనరేట్ ఇచ్చిన ఉత్తర్వులను తొక్కిపెట్టించారని, కమిషనరేట్‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆమెకు మరో ఉత్తర్వులు విడుదల చేయించడంలో ముఖ్యనేత కీలకంగా వ్యవహరించారని అప్పట్లో విమర్శలు రావడం, ఈ వ్యవహారంలో ముఖ్యనేత సోదరుడికి అరకోటిపైనే ముట్టినట్టు దేవాదాయశాఖ కోడైకూసిన విషయం తెలిసిందే. అప్పట్లో భ్రమరాంబకు ఆర్‌జెసీగా పదోన్నతి వస్తుందనే సాకుతో డీసీగా రాకుండా మోకాలడ్డారు. అయితే నిలిచిపోయిన పదోన్నతుల నేపథ్యంలో అది బెడిసికొట్టింది. ఈ క్రమంలో భ్రమరాంబకు పోస్టింగ్ ఇవ్వక తప్పలేదు.
పట్టు వదలని ‘వక్రమార్కులు’
ఇంతజరిగినా పట్టు వీడకుండా లోగడ కుదిరిన ఆర్థిక ఒప్పందాన్ని సజీవంగా ఉంచి మరోసారి డీసీ పోస్టులో అధికారిని మార్చే ప్రయత్నాలు కొలిక్కి తెచ్చారని తాజా సమాచారం. ఇందుకోసం డీసీ భ్రమరాంబకు ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఆర్‌జేసీగా పదోన్నతి కల్పించాలనుకుంటున్నారు. ‘వడ్డించే వాడు మనవాడైతే’ అన్నట్టుగా డీసీ భ్రమరాంబకు ఆర్‌జేసీగా పదోన్నతి కల్పించి అన్నవరం ఈఓ (ప్రస్తుతం ఈ పోస్టుకు ఇన్‌చార్జిగా ఈరంకి జగన్నాథం కొనసాగుతున్నారు)గా పంపాలనేది వారి ఎత్తుగడ. భ్రమరాంబకు పదోన్నతి కల్పించాలనే ఔదార్యం కంటే కావలసిన అధికారికి డీసీగా పోస్టింగ్ ఇప్పించుకోవాలన్న తపనే ఇందులో ఎక్కువని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
అలా చేయకపోతే సదరు డీసీ పోస్టు కోసం లోగడ తీసుకున్న అరకోటి సొమ్ము తిరిగి ఇవ్వాల్సివస్తుందనే బెంగే ఇందుకు కారణమని పేర్కొంటున్నాయి. ఈ తెరచాటు యత్నాలకు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక ఎంపీ కూడా భరోసా ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం సెలవులో ఉన్న దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌సెక్రటరీ శర్మ విధుల్లో చేరగానే ఈ ప్రక్రియ కొలిక్కి తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. దాదాపు ఇదే తరహాలో రీజినల్ జాయింట్ కమిషనర్ అజాద్‌ను కూడా సాగనంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ముక్కుసూటి వైఖరి పాలకపార్టీ నాయకులకు మింగుడుపడడం లేదు. రూ.కోట్లతో పుష్కరాల పనులు మొదలయ్యే తరుణంలో అజాద్ ఈ పోస్టులో ఉంటే తమ ఆటలు సాగవనే ఆందోళన అధికారపార్టీ నేతలను ఆవహించింది.
అందుకే ఆయన స్థానంలో సింహాచలం దేవస్థానం ఈఓ రామచంద్రమోహన్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆర్‌జేసీగా పనిచేసిన సోమశేఖర్ గత మార్చిలో ఉద్యోగవిరమణ చేయడంతో రామచంద్రమోహన్ 8నెలలు ఎఫ్‌ఏసీగా ఆ పోస్టులో ఉన్నారు. అదే హోదాలో ఆయనను కాకినాడ తీసుకురావాలనే ప్రయత్నాలను సొంత సామాజికవర్గ నేతల ఆశీస్సులతో ముమ్మరం చేశారు. డీసీ, ఆర్‌జేసీ స్థానాల్లో అస్మదీయులను కూర్చోబెట్టడం ద్వారా తీసుకున్న సొమ్ముకు ఢోకా లేకుండా చేసుకోవాలని నేతలు, తమ్ముళ్లు పడుతున్న తంటాలు ఎంతమేరకు ఫలిస్తాయో వేచిచూడాల్సిందే.