సాక్షి ప్రతినిధి, ఏలూరు:జిల్లా వ్యాప్తంగా 1,126 పుష్కర పనులకు గాను రూ.509.88 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో రూ.కోటి పైగా అంచనా వ్యయంతో చేపట్టే పనులన్నీ దాదాపుగా టీడీపీ నేతలే దక్కించుకున్నారు. కొవ్వూరులో పుష్కరనగర్ నిర్మాణం పేరిట టీడీపీ నేతలు భారీ దోపిడీకి తెరలేపారు. పుష్కర నగర్ కాంట్రాక్టుతోపాటు ఆ ప్రాంతం నుంచి ఈజీకే రోడ్డు వరకు సుమారు రూ.4.70 కోట్లతో నిర్మించే మూడు కిలోమీటర్ల బైపాస్ రోడ్డును బినామీల పేరుతో కొవ్వూరు మునిసిపాలిటీకి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి కాంట్రాక్టు చేస్తున్నారు. పుష్కరాల పేరుతో బైపాస్ రోడ్డు వెళే ్లప్రాంతంలో సదరు టీడీపీ నేత, ఆయన బంధువులకు సుమారు 100 ఎకరాల భూమి ఉంటుందని అంచనా. దీంతో పుష్కరాల నిధులను ఇక్కడ రోడ్ల అభివృద్ధికి వినియోగించి భూముల ధరలు అమాంతం పెరిగేలా ప్లాన్ చేశారు. వాస్తవానికి పంట పొలాలను రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా విడదీయాలంటే ముందస్తుగా సంబంధిత శాఖల అనుమతులు పొంది, రోడ్లు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి. పుష్కర్ నగర్ పేరిట ప్రభుత్వ నిధులతో భూములను అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ అమ్మకాలకు అనువుగా రోడ్ల నిర్మాణం చేపట్టారు. ఇక కొవ్వూరులోనే రూ.25 కోట్లతో చేపట్టిన సుందరీకరణ పనులను సైతం టీడీపీ నేతలే దక్కించుకున్నారు.
మంత్రి దేవినేని పేరు చెప్పి బెదిరింపులు : ఆచంట నియోజకవర్గంలో పుష్కరఘాట్ల నిర్మాణాన్ని అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. కోడేరులో ఘాట్ల పనుల్లో నాణ్యతను గాలికి వదిలేశారని స్థానిక జెడ్పీటీసీ బండి రామారావు ప్రశ్నిస్తే సదరు కాంట్రాక్టర్లు ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమమాహేశ్వరరావు పేరు చెప్పి ఆయన్ని బెదిరించేశారు. ఇదే విషయాన్ని జెడ్పీటీసీతోపాటు స్థానికులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా కోడేరు కాంట్రాక్టర్‌కు బిల్లుల చెల్లింపులు నిలుపుదల చేయాలని ఆయన ఆదేశించారు. నిడదవోలులో రూ.4కోట్ల 35లక్షలతో చేపట్టిన పుష్కర రోడ్ల నిర్మాణ పనులన్నీ ఓ ఎమ్మెల్యే అనుచరుల కనుసన్నల్లో టీడీపీకి చెందిన కాంట్రాక్టర్లే చేపట్టారు. ఇక నిడదవోలు మండలం పెండ్యాల గ్రామంలో పుష్కర ఘాట్ నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నాయంటూ, భారీ అవినీతి జరిగిందంటూ వందలాదిమంది గ్రామస్తులు రోడ్డెక్కి ధర్నా చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోలవరంలో ఒక పార్కింగ్ కాంట్రాక్ట్, రెండు ఘాట్‌ల నిర్మాణాలను టీడీపీ నాయకులే దక్కించుకుని నాసిరకంగా పనులు చేపట్టారు.
ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే..
నరసాపురం నియోజకవర్గానికి రూ.105 కోట్లు నిధులు మంజూరయ్యాయి. అత్యధికంగా మునిసిపాలిటీకి రూ.43 కోట్ల నిధులు వచ్చాయి. ఇక్కడ మునిసిపాలిటీ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి టెండర్ దశలో ఉండగానే అవినీతి ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టర్లతో ముందుగానే మాట్లాడుకుని, ఓ అంగీకారానికి వచ్చిన తర్వాతే పనులను టీడీపీకి చెందిన చైర్‌పర్సన్ పంపకాలు చేపట్టారు. చైర్‌పర్సన్ భర్త ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.105 కోట్లలో మిగిలిన రూ.62 కోట్ల పనులు స్థానిక ప్రజాప్రతినిధి కనుపన్నల్లోనే సాగాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి, చట్టసభల ప్రజాప్రతినిధి పంచుకుని పర్సంటేజీలు మాట్లాడుకున్న తర్వాతే కాంట్రాక్టర్లకు పనులు అప్పజెప్పారనేది బహిరంగ రహస్యం.
పుష్కర నిధులు కైంకర్యం
Published Mon, Jul 13 2015 12:59 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement
Advertisement