సాధారణ భక్తుల పరిస్థితి ఏమిటంటూ ఆగ్రహం
కాటేజీలను పరిశీలించిన బీజేపీ కమిటీ
విజయవాడ : దుర్గగుడి మాస్టర్ ప్లాన్ పేరుతో అమ్మవారి మూల ధనాన్ని వృథా చేయడంతో పాటు సాధారణ భక్తులకు వసతి లేకుండా చేస్తున్నారని బీజేపీ నిజ నిర్దారణ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో మాస్టర్‌ప్లాన్ పేరుతో జరుగుతున్న పలు పనులను బుధవారం నిజ నిర్దారణ కమిటీ సభ్యులు, బీజేపీ నగర నాయకులు శివకుమార్ పట్నాయక్, నగర ప్రధాన కార్యదర్శి బబ్బూరి శ్రీరామ్, నగర ఉపాధ్యక్షులు కొరగంజి భాస్కరరావు, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ పదిలం రాజశేఖర్, 31, 39వ డివిజన్ అధ్యక్షులు మానేపల్లి మల్లేశ్వరరావు, బచ్చు రమేష్ పరిశీలించారు. ఇంద్రకీలాద్రి గెస్ట్‌హౌస్, మాడపాటి సత్రాలు, అన్నదాన సత్రం తదితర ప్రాంతాలను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇష్టానుసారంగా పనులు
దుర్గగుడికి ఏ అధికారి వచ్చినా ఆ అధికారి సొంత నిర్ణయాల మేరకే పనులు చేయిస్తున్నారని, దీని వల్ల భక్తులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని కమిటీ సభ్యులు శివకుమార్ పట్నాయక్ తెలిపారు. ఇదే పరిస్థితి మరి కొంత కాలం కొనసాగితే అమ్మవారి దర్శనంతో పాటు వసతి వీఐపీలకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఆందోళన వ్యక్తంచేశారు. సత్రాలలో ఉన్న గదులను తొలగించి వీఐపీలకు మాత్రమే గదులను నిర్మించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. పుష్కరాలకు అమ్మవారి ఆలయానికి ప్రభుత్వం ఎటువంటి నిధులను కేటాయించకుండా అమ్మవారి మూలధనం నుంచి డబ్బులు డ్రా చేసి పనులు చేయడం సరికాదన్నారు. రాష్ర్టంలో అన్ని దేవాలయాలకు కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం దుర్గగుడికి కమిటీని ఏర్పాటు చేయకపోవడం వల్లే అధికారులు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేసి సాధారణ భక్తులకు అమ్మవారి దర్శనంతో పాటు వసతి కల్పించేలా దేవాదాయ శాఖ మంత్రి దృష్టికి ఈ వ్యవహారాలను తీసుకు వెళతామని కమిటీ సభ్యులు వివరించారు.