
ఇంద్రకీలాద్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకోనున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు.
సాక్షి, విజయవాడ: కనకదుర్గ అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం అంతరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతీదేవిని దర్శించుకున్న సీఎంకు ఆలయ వేద పండితులు వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్నిసీఎంకు దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అందజేశారు.
తొలుత ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం జగన్‌కు పూర్ణకుంభంతో వేద పండితులు, అధికారులు స్వాగతం పలికారు. ఆలయ చిన్న రాజగోపురం వద్ద సీఎం జగన్‌కు అర్చకులు పరివేష్టం చుట్టారు.
శుక్రవారం అమ్మవారి జన్మనక్షత్రం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు అనుగ్రహించారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం నాడు దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రద్దీకి అనుగుణంగా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.