వీఐపీ కల్చర్.. ట్రాఫిక్ జామ్‌లోనే...
సాక్షి, భోపాల్: ‘వీఐపీలు కాదు.. దేశానికి సాధారణ పౌరులే ముఖ్యం’ అంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. బీజేపీ పాలిత రాష్ట్రంలో అది కూడా ముఖ్యమంత్రి కార్యక్రమం మూలంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది.
భోపాల్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సాజిద్ అలీ అనే వ్యక్తి ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం విదిశా పట్టణం కగ్‌పూర్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఓ రైతు సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి రైతులను తీసుకెళ్తున్న బస్సులో సాజిద్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇంతలో గుండెపోటుతో కుప్పకూలిపోగా, పోలీసుల సహకారంతో డ్రైవర్ ఓ ఆంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యాడు.
ఇంతలో ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లలో తలమునకలైన సిబ్బంది మూలంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆంబులెన్స్ చాలా సేపు ఆ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. పైగా ఓ ఎమ్మెల్యే కారే ఆంబులెన్స్ కు అడ్డుగా ఉండటం గమనార్హం. చుట్టూ జనం గుమిగూడగా, అంతా చూస్తుండగానే సాజిద్ ప్రాణాలు వదిలాడు. తర్వాత సమీపంలోని ఓ చిన్న ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఘటన గురించి తెలుసుకున్న సీఎం చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతికి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్ కల్చర్ రావాలంటున్న మోదీ, తన పార్టీ నేతలకు మాత్రం హిత బోధ చేయలేకపోతున్నారా? అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది.
టైమ్స్ నౌ వారి సౌజన్యంతో...