Bus Conductor Died
-
లారీ ఢీకొని.. ఆర్టీసీ కండక్టర్ దుర్మరణం
హైదరాబాద్: కరీంనగర్ – హైదరాబాద్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు కండక్టర్ మృతి చెందగా డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ బ్యాగరి నవీన్‌కుమార్, వెంకటాపూర్‌కు చెందిన బాలనర్సయ్య(49) మంగళవారం ప్రయాణికులతో జేబీఎస్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో శామీర్‌పేట మండలం, అచ్చాయిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులను దించేందుకు రోడ్డుపక్కన బస్సును నిలపడంతో అదే సమయంలో వేగంగా వచ్చిన బొలేరో వాహనం బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్, కండక్టర్లు కిందకు దిగి బస్సును పరిశీలిస్తుండగా అదే సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు బొలేరో వాహనాన్ని తగలడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో కండక్టర్ అక్కడికక్కడే మృతిచెందగా, బస్సు డైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
హతవిధీ!..పదేళ్ల తర్వాత విధులకు..గుండెపోటుతో
సాక్షి చెన్నై: పదేళ్ల సస్పెన్షన్ ముగిసిన నేపథ్యంలో విధులకు హాజరుకావాలని అధికారుల నుంచి అందిన ఉత్తర్వులతో ఆ కండెక్టర్ సంబరపడిపోయాడు. ఉదయాన్నే డ్యూటీకి బయలుదేరాడు ఈ క్రమంలో గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరుఆయార్పాడి గ్రామానికి చెందిన భాస్కరన్(53). తమిళనాడు ట్రాన్స్పోర్ట్ కమిషన్ పొన్నేరి డిపోలో కండెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల క్రితం ఇతను సస్పెండ్ అయ్యాడు. సస్పెన్షన్ కాలం ముగిసిన నేపథ్యంలో విధులకు హాజరు కావాలని విల్లుపురం ట్రాన్స్పోర్ట్ కమిషన్ కార్యాలయం నుంచి శుక్రవారం భాస్కరన్‌కు ఉత్తర్వులు అందాయి. దీంతో శనివారం పొన్నేరి డిపోకు బయలుదేరిన భాస్కరన్ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భాస్కరన్‌ను సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి చెన్నై వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. చదవండి: SPSR Nellore Double Murder: ఎవరు? ఎందుకు? -
వీఐపీ కల్చర్.. ట్రాఫిక్ జామ్‌లోనే...
సాక్షి, భోపాల్: ‘వీఐపీలు కాదు.. దేశానికి సాధారణ పౌరులే ముఖ్యం’ అంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. బీజేపీ పాలిత రాష్ట్రంలో అది కూడా ముఖ్యమంత్రి కార్యక్రమం మూలంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. భోపాల్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సాజిద్ అలీ అనే వ్యక్తి ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం విదిశా పట్టణం కగ్పూర్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఓ రైతు సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి రైతులను తీసుకెళ్తున్న బస్సులో సాజిద్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇంతలో గుండెపోటుతో కుప్పకూలిపోగా, పోలీసుల సహకారంతో డ్రైవర్ ఓ ఆంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లలో తలమునకలైన సిబ్బంది మూలంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆంబులెన్స్ చాలా సేపు ఆ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. పైగా ఓ ఎమ్మెల్యే కారే ఆంబులెన్స్ కు అడ్డుగా ఉండటం గమనార్హం. చుట్టూ జనం గుమిగూడగా, అంతా చూస్తుండగానే సాజిద్ ప్రాణాలు వదిలాడు. తర్వాత సమీపంలోని ఓ చిన్న ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఘటన గురించి తెలుసుకున్న సీఎం చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతికి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్ కల్చర్ రావాలంటున్న మోదీ, తన పార్టీ నేతలకు మాత్రం హిత బోధ చేయలేకపోతున్నారా? అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. టైమ్స్ నౌ వారి సౌజన్యంతో... Bus conductor dies in MP after collapsing while on duty, in a traffic jam caused due to CM Shivraj Singh Chouhan's visit to Kagpur pic.twitter.com/50V89RzYy9 — TIMES NOW (@TimesNow) 31 August 2017