Chief Minister Shivraj Singh Chouhan
-
కుక్కపిల్లను కొట్టిచంపాడు
భోపాల్: అటుఇటు తిరుగుతూ తన వద్దకు వచి్చన కుక్కపిల్లను ఓ వ్యక్తి అత్యంత నిర్దయగా నేలకేసి కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన ఈ దారుణం అక్కడి సీసీటీవీలో రికార్డయింది. వీడియో వైరల్‌గా మారడంతో వేలాది మంది.. ఆ వ్యక్తి కర్యశ చర్యపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దృష్టికి తీసుకెళ్లడంతో అరెస్ట్‌కు ఆదేశాలిచ్చారు. కఠిన శిక్ష పడేలాచూస్తామని ముఖ్యమంత్రి శివరాజ్ హామీ ఇచ్చారు. శనివారం సాయంత్రం గుణ జిల్లాలోని సుభాష్ కాలనీలో జరిగిన ఈ దారుణ ఘటన తాలూకు వీడియో చూసిన వారంతా వ్యక్తిని తీవ్రంగా శిక్షించాలంటూ పోస్టులు పెట్టారు. దాదాపు 30 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి ఆరుబయట కూర్చోగా అక్కడికి రెండు బుల్లి కుక్కపిల్లలు తిండి కోసం తచ్చాడుతూ వచ్చాయి. వాటిల్లో ఒకటి ఇతడి సమీపానికి రాగానే వెంటనే ఆగ్రహంతో కుక్క పిల్లను ఎత్తిపట్టుకుని నేలకేసి బలంగా కొట్టాడు. అక్కడి నుంచి లేచి వచ్చి దానిని కుడికాలితో పలుమార్లు తొక్కిచంపాడు. ఈ హృదయవిదారక దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ‘‘ఇది నా హృదయాన్ని కలిచివేసింది. అతనికి కఠిన శిక్ష పడేలా చేస్తాం’’ అని ముఖ్యమంత్రి చౌహాన్ ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. -
వీఐపీ కల్చర్.. ట్రాఫిక్ జామ్‌లోనే...
సాక్షి, భోపాల్: ‘వీఐపీలు కాదు.. దేశానికి సాధారణ పౌరులే ముఖ్యం’ అంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోతుంది. బీజేపీ పాలిత రాష్ట్రంలో అది కూడా ముఖ్యమంత్రి కార్యక్రమం మూలంగా ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన చోటుచేసుకుంది. భోపాల్ గాంధీనగర్ ప్రాంతానికి చెందిన సాజిద్ అలీ అనే వ్యక్తి ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం విదిశా పట్టణం కగ్పూర్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో ఓ రైతు సదస్సును నిర్వహించారు. కార్యక్రమానికి రైతులను తీసుకెళ్తున్న బస్సులో సాజిద్ విధులు నిర్వహిస్తున్నాడు. ఇంతలో గుండెపోటుతో కుప్పకూలిపోగా, పోలీసుల సహకారంతో డ్రైవర్ ఓ ఆంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యాడు. ఇంతలో ముఖ్యమంత్రి భద్రతా ఏర్పాట్లలో తలమునకలైన సిబ్బంది మూలంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఆంబులెన్స్ చాలా సేపు ఆ ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయింది. పైగా ఓ ఎమ్మెల్యే కారే ఆంబులెన్స్ కు అడ్డుగా ఉండటం గమనార్హం. చుట్టూ జనం గుమిగూడగా, అంతా చూస్తుండగానే సాజిద్ ప్రాణాలు వదిలాడు. తర్వాత సమీపంలోని ఓ చిన్న ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు. ఘటన గురించి తెలుసుకున్న సీఎం చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతికి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఎవ్రీ పర్సన్ ఇంపార్టెంట్ కల్చర్ రావాలంటున్న మోదీ, తన పార్టీ నేతలకు మాత్రం హిత బోధ చేయలేకపోతున్నారా? అంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. టైమ్స్ నౌ వారి సౌజన్యంతో... Bus conductor dies in MP after collapsing while on duty, in a traffic jam caused due to CM Shivraj Singh Chouhan's visit to Kagpur pic.twitter.com/50V89RzYy9 — TIMES NOW (@TimesNow) 31 August 2017 -
పెన్షన్ 700శాతం పెంచేశారు
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాను ఇప్పటికిప్పుడు పదవి నుంచి దిగిపోయినా భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చే పెన్షన్‌ను అమాంతం పెంచేంశారు. ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ ను దాదాపు 700శాతానికి పెంచేశారు. ఈ రాష్ట్రంలో మాజీ సీఎంలకు ప్రస్తుతం రూ.26 వేలు, ఇతర అలవెన్సులు వస్తున్నాయి. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయంలో అది కాస్త ఏకంగా ఒక లక్షా 70వేల రూపాయలు కానుంది. అలవెన్సులు అదనం. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వారికి ఇస్తున్న నెల జీతం రూ.2లక్షలు. అంటే మాజీ సీఎంల పెన్షన్ కు ప్రస్తుత సీఎంకు నెలకు ఇచ్చే వేతనానికి రూ.30 వేలే తేడా అన్నమాట. 'ఈ నిర్ణయంతో మాజీ సీఎంలు దిగ్విజయ్ సింగ్, ఉమాభారతి, కైలాశ్ జోషి, సుందర్ లాల్ ఫత్వా.. నాకు, ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ కు కూడా లబ్ధి చేకూరనుంది' అని మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం హోంమంత్రి బాబూలాల్ గౌర్ అన్నారు. ఇది కేవలం ఒక పార్టీకి చెందిన వ్యక్తులకోసమో కాదని, ప్రతిఒక్కరికీ చెందుతుందని చెప్పారు. అయితే, మాజీ సీఎంలు కేంద్రంలోగానీ, రాష్ట్రంలోగానీ ఏదైన హోదాలో ఉంటే మాత్రం ఇది వర్తించదని చెప్పారు. -
పడవలో విహరిస్తూ సీఎం కేబినెట్ భేటీ
ఖాండ్వ: ఉల్లాసంగా ఉత్సాహంగా విహరించేందుకు అందరూ బోట్ జర్నీకి వెళ్తుంటారు. కానీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం రాష్ట్ర వ్యవహారాలు చర్చించడానికి పడవ ప్రయాణాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఈ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతోపాటు మంగళవారం నర్మదా నదిలో విహారిస్తూ.. పనిలోపనిగా కేబినెట్ భేటీ నిర్వహించారు. నర్మదా నది పరివాహక ప్రాంతంలోని హనుమంతీయ ద్వీపంలో వీరి పడవప్రయాణం సాగింది. 30 మంది కూర్చొనే సౌకర్యమున్న బోట్లో ముఖ్యమంత్రి చౌహాన్ తన మంత్రులతో సమావేశం నిర్వహించారు. పర్యాటక రంగం అభివృద్ధిపై మంత్రులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ నెల 12న హనుమంతీయ ద్వీపంలో ‘వాటర్ ఫెస్టివల్’ను సీఎం చౌహాన్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు చౌహాన్ ఈ వినూత్న కేబినెట్ భేటీకి సంకల్పించారు. గతంలో సింగపూర్‌ను సందర్శించినప్పుడు సీఎం చౌహాన్‌కు ఈ వినూత్న ఆలోచన వచ్చిందట. మరోవైపు ఈ పడవ భేటీపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. విహారాలతో ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని విమర్శించింది.