పెన్షన్ 700శాతం పెంచేశారు
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాను ఇప్పటికిప్పుడు పదవి నుంచి దిగిపోయినా భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకున్నారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చే పెన్షన్ను అమాంతం పెంచేంశారు. ఇప్పుడు ఇస్తున్న పెన్షన్ ను దాదాపు 700శాతానికి పెంచేశారు. ఈ రాష్ట్రంలో మాజీ సీఎంలకు ప్రస్తుతం రూ.26 వేలు, ఇతర అలవెన్సులు వస్తున్నాయి. అయితే, తాజాగా తీసుకున్న నిర్ణయంలో అది కాస్త ఏకంగా ఒక లక్షా 70వేల రూపాయలు కానుంది.
అలవెన్సులు అదనం. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వారికి ఇస్తున్న నెల జీతం రూ.2లక్షలు. అంటే మాజీ సీఎంల పెన్షన్ కు ప్రస్తుత సీఎంకు నెలకు ఇచ్చే వేతనానికి రూ.30 వేలే తేడా అన్నమాట. 'ఈ నిర్ణయంతో మాజీ సీఎంలు దిగ్విజయ్ సింగ్, ఉమాభారతి, కైలాశ్ జోషి, సుందర్ లాల్ ఫత్వా.. నాకు, ప్రస్తుత సీఎం శివరాజ్ సింగ్ కు కూడా లబ్ధి చేకూరనుంది' అని మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం హోంమంత్రి బాబూలాల్ గౌర్ అన్నారు. ఇది కేవలం ఒక పార్టీకి చెందిన వ్యక్తులకోసమో కాదని, ప్రతిఒక్కరికీ చెందుతుందని చెప్పారు. అయితే, మాజీ సీఎంలు కేంద్రంలోగానీ, రాష్ట్రంలోగానీ ఏదైన హోదాలో ఉంటే మాత్రం ఇది వర్తించదని చెప్పారు.