పడవలో విహరిస్తూ సీఎం కేబినెట్ భేటీ
ఖాండ్వ: ఉల్లాసంగా ఉత్సాహంగా విహరించేందుకు అందరూ బోట్ జర్నీకి వెళ్తుంటారు. కానీ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం రాష్ట్ర వ్యవహారాలు చర్చించడానికి పడవ ప్రయాణాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఈ వినూత్నమైన నిర్ణయం తీసుకున్నారు. మంత్రులతోపాటు మంగళవారం నర్మదా నదిలో విహారిస్తూ.. పనిలోపనిగా కేబినెట్ భేటీ నిర్వహించారు. నర్మదా నది పరివాహక ప్రాంతంలోని హనుమంతీయ ద్వీపంలో వీరి పడవప్రయాణం సాగింది. 30 మంది కూర్చొనే సౌకర్యమున్న బోట్‌లో ముఖ్యమంత్రి చౌహాన్ తన మంత్రులతో సమావేశం నిర్వహించారు. పర్యాటక రంగం అభివృద్ధిపై మంత్రులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ నెల 12న హనుమంతీయ ద్వీపంలో ‘వాటర్ ఫెస్టివల్’ను సీఎం చౌహాన్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేందుకు చౌహాన్ ఈ వినూత్న కేబినెట్ భేటీకి సంకల్పించారు. గతంలో సింగపూర్‌ను సందర్శించినప్పుడు సీఎం చౌహాన్‌కు ఈ వినూత్న ఆలోచన వచ్చిందట. మరోవైపు ఈ పడవ భేటీపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. విహారాలతో ప్రజాధనాన్ని ప్రభుత్వం వృథా చేస్తోందని విమర్శించింది.