వీఐపీ కల్చరనేది మంచిది కాదు: పారికర్
పనాజీ: వీఐపీ సంస్కృతి అంత మంచిది కాదని గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు. దేశంలో ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. రాష్ట్రపతి, ప్రధానికి తప్ప దేశంలో వీఐపీ భద్రత కల్పించాల్సిన అవసరం పెద్దగా లేదని చెప్పారు. ఎర్రబుగ్గలను తొలగించిన అంశంపై మీడియా ప్రతినిధులు పారికర్‌ను ప్రశ్నించగా ఆ విషయం తెలియదని, ఒక వేళ కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే తన కారుకు ఉన్న ఎర్రబుగ్గను తీసి ఇప్పుడే మీకు ఇస్తానంటూ సరదాగా అన్నారు.
‘వీఐపీ కల్చర్ తగ్గించాలని నేను అనుకుంటాను. వాస్తవానికి నేనొకటి క్లియర్‌గా చెప్పాలని అనుకుంటున్నాను. వీఐపీ సంస్కృతి అంతమంచిది కాదు. కానీ, ఇదే మన దేశంలో పెరుగుతోంది. భద్రత అనేది కేవలం మానసిక భావన. ఇద్దరు, లేదా ముగ్గురు లేదా నలుగురు నుంచి భద్రతను పొందవచ్చు. రాష్ట్రపతి, ప్రధానిని మినహాయిస్తే వీఐపీ భద్రత పేరిట మనం ఎక్కువ సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో నేను చాలా స్పష్టంగా ఉన్నాను’ అని పారికర్ చెప్పారు.