సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా పట్టాలు తప్పడం వల్ల 346 రైలు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో దాదాపు 650 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఐదు రోజుల్లోనే పట్టాలు తప్పడం వల్ల రెండు రైలు ప్రమాదాలు జరగడంతో తాను పదవికి రాజీనామా చేస్తానని అప్పుడు రైల్వే మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభు ప్రకటించారు.
అప్పటికీ ఆయనకు సర్దిచెప్పిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ తర్వాత ఆ శాఖ నుంచి ఆయన్ని తప్పించారు. అప్పుడు కేంద్ర రైల్వే బోర్డుకు చైర్మన్‌గా ఉన్న ఏకే మిట్టల్ మాత్రం తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో కొత్తగా రైల్వే బోర్డు చైర్మన్‌గా ఆగస్టు 25వ తేదీన బాధ్యతలు స్వీకరించిన అశ్వణి లొహాని రైలు పట్టాలు తప్పడం వల్లనే దేశంలో ఎక్కువగా రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయన్న అంశంపై లోతుగా అధ్యయనం చేయడంతో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
రైలు పట్టాలు ఎక్కడ తెగిపోయాయో, ఎక్కడ పగుళ్లు పట్టాయో తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని మరమ్మతు చేయడానికి వాటిపై నిరంతర నిఘా అవసరం. అలా నిఘాను కొనసాగించి మరమ్మతులు చేసే రైల్వే సిబ్బందిని గ్యాంగ్‌మెన్ అని, ట్రాక్ మెన్ అని, రైల్వే డీ క్యాడర్ ఉద్యోగులని పిలుస్తారు. భారత రైల్వేలో దాదాపు ఇలాంటి ఉద్యోగులు రెండు లక్షల మంది పనిచేస్తున్నారు. రైల్వే గేట్లులేని క్రాసింగ్‌ల వద్ద ఉండే సిబ్బంది కూడా ఈ కోవకే వస్తారు. ప్రస్తుత అంచనాల ప్రకారం పదివేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
అయినా రైలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఈ గ్యాంగ్ మేన్ లేదా ట్రాక్‌మెన్ ట్రాకులపై కాకుండా రైల్వే బోర్డు సభ్యుడు, రైల్వే జనరల్ మేనేజర్, డివిజనల్ రైల్వే మేనేజర్ స్థాయి వీఐపీల ఇళ్ల వద్ద పని చేస్తున్నారు. ఇళ్లలో కుటుంబ సభ్యుల బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇళ్లు శుభ్రం చేయడం, మార్కెట్‌కు వెళ్లి కూరగాయలు, సరకులు తెచ్చి ఇవ్వడం, వారి పిల్లలను స్కూళ్లలో వదిలి పెట్టి రావడం, మళ్లీ వారిని తీసుకరావడం. ఆ తర్వాత అవసరమైతే వారిని ట్యూషన్లకు కూడా తీసుకెళ్లడం లాంటి పనులు వీళ్లు చేస్తున్నారు. ఒక్కొక్కరి వీఐపీ ఇంట్లో ఒక్కొక్కరు కాకుండా ఆరుగురి నుంచి పది మంది గ్యాంగ్‌మెన్‌లు పనిచేస్తున్నారంటే ఆశ్చర్యం వేస్తోంది.
ప్రోటోకాల్ లేదా వీఐపీ సంస్కృతి పేరిట ఈ విష సంస్కతిని రైల్వే అధికారులు అనుభవిస్తూ వచ్చారు. దీనిపై కొత్తగా రైల్వే బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అశ్వణి లొహాని కేంద్ర మంత్రిత్వ శాఖకు ఓ నివేదికను అందజేసి ఆ శాఖ అనుమతి మేరకు రైల్వే ఉద్యోగాలందరికి ఈ వీఐపీ సంస్కృతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారుల నుంచి ఎలాంటి బహుమతులు తీసుకోరాదంటూ కింది తరగతి, ముఖ్యంగా డీ కేటగిరీ ఉద్యోగులకు సూచనలు చేశారు.
వివిధ స్థాయి ఉద్యోగులను తానే స్వయంగా కలుసుకుంటూ వారి మధ్య విధుల నిర్వహణలో సంయమనం ఉండేందుకు కృషి చేస్తున్నారు. ఆయన నివేదికను పరిగణలోకి తీసుకున్న రైల్వే శాఖ అధికారులు కూడా శనివారం కూడా విధులకు హాజరుకావాల్సిందిగా రైల్వే ఉన్నతాధికారులను ఆదేశించారు. వారింత వరకు వారానికి రెండు రోజుల సెలవులను అనుభవిస్తున్నారు.
గ్యాంగ్‌మెన్‌లు రోజుకు 12 గంటల షిప్టు పనిచేయాల్సి రావడం, రెండు, మూడు కిలోమీటర్లు పట్టాలు మరమ్మతుచేసే పనిముట్లు మోసుకెళ్లాల్సి రావడం, ప్రమాదాల్లో ఏడాదికి 200 మంది గ్యాంగ్‌మెన్‌లు మరణిస్తుండడం తదితర కారణాల వల్ల వారు తమ విధులను విస్మరించి అధికారుల ఇళ్లలో పనిచేయడానికే అలవాటుపడ్డారు. ఇష్టపడ్డారు.
ఇక నుంచైనా ఈ పరిస్థితిని మార్చేందుకు ఇతర కార్మికుల్లాగానే వారి షిప్టులను కూడా 8 గంటలకు కుదించాలి. పాశ్చాత్య దేశాల్లోలాగే తేలికైనా, ఆధునిక పనిముట్లను వారికి అందజేయాలి. వారు నడచిపోవాల్సిన అవసరం లేకుండా, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా, ప్రస్తుత రైలు పట్టాల పక్కన వారి వాహనాల కోసం ప్రత్యేకంగా చిన్న ట్రాక్‌లను నిర్మించాలి.