స్మార్ట్‌ఫోను చూపుతున్న అంగన్‌వాడీ కార్యకర్త
పెదవాల్తేరు(విశాఖతూర్పు): ఉద్యోగుల్లో సమయ పాలన కోసం అంటూ సర్కారు ఆర్భాటంగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ హాజరు విధానం భయోమెట్రిక్‌గా మారింది. తోచిందే తడువుగా నిర్ణయాలు ప్రకటించడంతో పలుశాఖ ఉద్యోగులకు తలనొప్పిగా మారుతోంది. సిగ్నల్స్ సరిగా లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులే హాజరు నమోదుకు ఇక్కట్లు పడుతుంటే... తాజాగా అంగన్‌వాడీలు కూడా బయోమెట్రిక్ వేయాలని ఉత్తర్వులు జారీ చేయడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
అంగన్‌వాడీలకు అవస్థలు
టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్‌వాడీ సిబ్బందికి కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే బండెడు చాకిరీ చేయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు బయోమెట్రిక్ హాజరు రూపంలో కొత్త కష్టాలు తీసుకొచ్చింది. అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో గల జీవీఎంసీ పాఠశాలలకు వెళ్లి కార్యకర్తలు, ఆయాలు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అంగన్‌వాడీ టీచర్లు పల్స్‌పోలియో, స్మార్ట్‌ఫోన్లలో వివరాల నమోదు, ప్రీ–స్కూలు నిర్వహణ, పౌష్టికాహారం పంపిణీ, మధ్యాహ్నభోజన పథకాలతో తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. అంగన్‌వాడీ టీచర్లలో చాలామంది బీఎల్‌ఓలుగా ఓటర్లనమోదు డ్యూటీలు సైతం నిర్వహిస్తున్నారు.
బయోమెట్రిక్‌తో అవస్థలు
ఇప్పటికే జీవీఎంసీ పాఠశాలల్లో బయోమెట్రిక్‌మిషన్లు సిగ్నల్స్ లేక హాజరు నమోదు విషయంలో ఉపాధ్యాయులే అష్టకష్టాలు పడుతున్నారు. చాలదన్నట్టు అంగన్‌వాడీ సిబ్బంది కూడా వీరి వెనుక క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడ ఎప్పుడు హాజరు వేస్తారు, ఎప్పుడు అంగన్‌వాడీ కేంద్రాలకు చేరుకుంటారో అధికారులే సెలవివ్వాలి.
స్మార్ట్‌ఫోన్లు ఉన్నా
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది నుంచి స్మార్ట్‌ఫోన్లు వినియోగంలోకి తెచ్చారు. దీనితో టీచర్లంతా పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనాలు, బాలింతలు, గర్భిణులు, పౌష్టికాహారం పంపిణీ వంటి సమస్త వివరాలన్నీ ఏ రోజుకారోజు స్మార్ట్‌ఫోన్లలో నమోదు చేస్తున్నారు.
ఈ వివరాలన్నీ ఉన్నతాధికారులకు సైతం ఆన్‌లైన్‌లో అందుబాటులో వుంటాయి. ఈ నేపథ్యంలో టీచర్ల హాజరు కూడా స్మార్ట్‌ఫోన్లలో నమోదు చేసే అవకాశం కల్పిస్తే సరిపోతుంది కదా అని పలువురు సూచిస్తున్నారు. నగరంలోని రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 232 అంగన్‌వాడీ కేంద్రాలు వున్నాయి. భీమిలి, పెందుర్తి ప్రాజెక్టుల పరిధిలో కూడా అంగన్‌వాడీ కేంద్రాలు వున్నాయి.
ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నాం
అంగన్‌వాడీ సిబ్బంది సైతం బయోమెట్రిక్ విధానం ద్వారానే హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం సిబ్బంది అంతా సమీపంలో గల పాఠశాలల్లో హాజరు నమోదు చేసుకుని కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే కిలో మీటర్‌పరిధిలో పాఠశాలలు లేకుంటే మాత్రం సిబ్బందికి బయోమెట్రిక్ హాజరు నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.
– జి.ఉషారాణి, సీడీపీఓ, ఐసీడీఎస్–అర్బన్–2,విశాఖపట్నం.
Comments
Please login to add a commentAdd a comment