
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యువిటీ అమలు చేయాలి
రాష్ట్రపతికి లేఖలు రాసిన అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు
కార్వేటినగరం: అంగన్‌వాడీ కార్యకర్తలను సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం క్రమబద్దీకరించాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బుధవారం చిత్తూరు జిల్లా కార్వేటినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అంగన్‌వాడీ సిబ్బంది సిఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి లేఖలు రాశారు.
ఈ సందర్భంగా ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్ అలాగే హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) గౌరవ అధ్యక్షుడు వాడ గంగరాజు, ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు విజయ, మమత మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడిలను నిర్లక్ష్యం చేస్తున్నారని కోర్టు తీర్పు ప్రకారం ఐసీడీఎస్‌ను సంస్థాగతం చేయాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు అవుతున్న ఇప్పటివరకు సంస్థాగతం చేయకపోవడం దారుణమన్నారు.
శిశు, మరణాలు రేటు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్‌వాడీల సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరాల కొద్ది పని చేస్తున్న అంగన్‌వాడీలపై పనిభారం పెంచడంతో రకరకాల పద్ధతుల్లో మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు ఆధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అంగన్‌వాడీల వద్ద డబ్బులు వసూలు చేసే కార్యక్రమం తీవ్రమైందన్నారు.
చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా పోషణ వాటిక సెంటర్లను నిర్వహించడం అధికారులకు కాసుల పంటగా మారిందన్నారు. దీంతో అంగన్‌వాడీలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఆరోపించారు. అధికారుల ఒత్తిడి మానక పోతే నిరంతరం పోరాటం చేస్తామని హెచ్చరించారు.
ప్రాజెక్టులో ఒకరిద్దరు నాయకులుగా చెలామణి అవుతూ అధికారులకు తొత్తులుగా ఉంటూ అంగన్‌వాడీలను బెదిరించే పనులు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాయకులు రెడ్డెమ్మ (శ్రీరంగరాజపురం) పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment