‘భయో’మెట్రిక్‌..! | Biometric System In BC Girls Hostels Khammam | Sakshi
Sakshi News home page

‘భయో’మెట్రిక్‌..!

Published Thu, Jan 17 2019 7:21 AM | Last Updated on Thu, Jan 17 2019 7:21 AM

Biometric System  In BC Girls Hostels Khammam - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: వసతి గృహాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం పూనుకుంది. విద్యార్థుల హాజరు శాతాన్ని ఎక్కువగా చూపి.. నిత్యావసర వస్తువుల వినియోగంలో అక్రమాలకు పాల్పడే విధానానికి కళ్లెం వేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అన్ని ప్రభుత్వ వసతి గృహాల్లో ఆధార్‌ అనుసంధానంతో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న జిల్లాలోని 33 వసతి గృహాల్లో ఈ తరహా విధానం ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచి ప్రారంభమైంది. వసతి గృహాల్లో ఉన్న బయోమెట్రిక్‌ హాజరు శాతాన్ని హైదరాబాద్‌లోని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో గల కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది.

దీంతో రోజువారీగా వసతి గృహాలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించి మాత్రమే బియ్యం, కూరగాయలు, పప్పు దినుసుల సామగ్రిని వారి సంఖ్యకు అనుగుణంగా లెక్కించి వినియోగిస్తున్నారు. దీంతో ఆయా ప్రభుత్వ వసతి గృహాల్లో దుబారాకు కళ్లెం పడింది. జూలై నుంచి ఇప్పటివరకు బయోమెట్రిక్‌ విధానం ద్వారా బీసీ సంక్షేమ వసతి గృహాల్లో దాదాపు 22 శాతం వ్యయాన్ని నియంత్రించగలిగారు. ఈ రకంగా జిల్లాలోని వసతి గృహాల నుంచి నెలకు రూ.2లక్షల వరకు ఆదా అయినట్లు అధికారులు చెబుతున్నారు.
 
ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల్లో అమలు యోచన.. 
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లోనూ ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరో రెండు నెలల్లో విద్యా సంవత్సరం ముగుస్తుండడంతో వచ్చే జూలై నుంచి ఎస్సీ, ఎస్టీ  ప్రభుత్వ వసతి గృహాల్లో దీనిని అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వసతి గృహాల్లో వేలిముద్రల ద్వారా విద్యార్థుల హాజరు శాతాన్ని కొన్ని రోజులు తీసుకున్నా.. అది పూర్తిస్థాయి ఫలితాలు ఇవ్వకపోవడంతో బయోమెట్రిక్‌ విధానమే మేలని భావిస్తున్న అధికారులు అన్ని వసతి గృహాల్లో యంత్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించారు. జిల్లాలోని వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ విధానం అమలులోకి వస్తే హాజరు పట్టిక ద్వారా హాజరు తీసుకునే విధానానికి స్వస్తి పలికే అవకాశం ఉంది.  

ప్రభుత్వ వసతి గృహాల్లో ఎంత మంది విద్యార్థులు రోజువారీగా హాజరవుతున్నారు.. వారిలో ఎందరు పాఠశాలలకు వెళ్తున్నారనే కచ్చితమైన సమాచారం అధికారులకు అందుబాటులో ఉండడం లేదు. అయితే బయోమెట్రిక్‌ విధానం అమలు చేస్తే వసతి గృహాల్లో పంచ్‌ కొట్టిన విద్యార్థి పాఠశాలకు వెళ్లాడో లేదో తెలుసుకునే అవకాశం సైతం వసతి గృహ పర్యవేక్షకులకు లభించనుంది. దీంతో విద్యార్థుల చదువుపై సైతం సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. పలు వసతి గృహాల్లో విద్యార్థుల వాస్తవ సంఖ్య కన్నా.. అధికంగా విద్యార్థుల హాజరు శాతాన్ని చూపించినట్లుగా గతంలో పలు ఆరోపణలు సైతం వచ్చిన నేపథ్యంలో విద్యార్థులకు ఇచ్చే రోజువారీ మెనూలో భాగంగా ఇచ్చే బలవర్ధకమైన ఆహారం దుర్వినియోగం కాకుండా ఈ బయోమెట్రిక్‌ విధానం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని 33 వసతి గృహాలకుగాను.. 23 ప్రీ మెట్రిక్, 10 పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ విధానం అమలవుతోంది. ఈ యంత్రాల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిన వెంటనే వసతి గృహ అధికారులు స్పందించి సంబంధిత సంస్థకు సమాచారం అందిస్తే.. వెంటనే వారు ఆ సమస్యను పరిష్కరిస్తున్నారు. జిల్లాలో ఎస్టీ వసతి గృహాలు 30 ఉండగా.. 6,563 మంది విద్యార్థులు, ఎస్సీ వసతి గృహాలు 50 ఉండగా.. 5,580 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ విధానం అమలైతే ప్రభుత్వ వసతి గృహాల్లో పారదర్శకత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.  

ఫలితాలు భేష్‌.. 
జిల్లాలోని 33 బీసీ సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్‌ విధానం ఇప్పటికే అమలవుతోంది. దాని ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. విద్యార్థులకు సంబంధించి పర్యవేక్షణ సైతం వసతి గృహ అధికారులకు కొంత సులభమైంది. అలాగే గత ఏడాదితో పోలిస్తే 22 శాతం ఖర్చును ఆదా చేయగలిగే అవకాశం బయోమెట్రిక్‌ విధానం ద్వారా కలిగింది.  – హృషికేష్‌రెడ్డి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement