![network problems in issuing ration - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/22/ration.jpg.webp?itok=zS1cXo2H)
చౌటుప్పల్ : రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలు లబ్ధిదారులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. నెట్‌వర్క్ ఆధారంగా నడిచే ఈ–పాస్ యంత్రాలు సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అయినా ఒక్కోసారి ఫలితం లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలంలోని జైకేసారంలో ఆదివారం రేషన్‌డీలర్, లబ్ధిదారులు ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంపైకి ఎక్కారు. డీలర్ తూర్పింటి భూపాల్ ఇంట్లో సరిగ్గా నెట్‌వర్క్ రావడం లేదు. దీంతో ఆయన భార్య భాగ్య ఈ–పాస్ యంత్రాన్ని తీసుకుని గ్రామ పంచాయతీ భవనంపైకి వెళ్లింది. లబ్ధిదారులు సైతం ఆమె వెంట వెళ్లారు. అక్కడ యంత్రానికి సిగ్నల్స్ అందడంతో వారికి టోకెన్ జారీ చేశారు. టోకెన్ల ఆధారంగా డీలర్ ఇంట్లో సరుకులు తీసుకెళ్లారు. వేలిముద్రలు వేసేందుకు వృద్ధులు గ్రామ పంచాయతీ భవనంపైకి ఎక్కి కిందికి దిగేం దుకు అవస్థలు పడ్డారు. సరైన సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపా«ధ్యక్షుడు పల్లె మధుకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment