Ration dealer
-
రేషన్ బండి మా ఊళ్లోకొస్తే తగులబెడతాం
దర్శి: ‘ఇప్పుడున్న రేషన్ డీలర్‌ను తొలగించండి. మేం చెప్పినవారికి డీలర్షిప్ ఇవ్వండి. అప్పటి వరకు మా ఊరిలో రేషన్ ఇవ్వడానికి వీల్లేదు. మేం చెప్పినట్లు చేయకుండా గ్రామంలోకి రేషన్ బియ్యం తీసుకువస్తే ఆ బండిని తగలబెడతాం..’ అని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. రెండుసార్లు రేషన్ బియ్యం తీసుకువెళ్లిన లారీని అడ్డుకున్నారు. వారి అడ్డగోలు చర్యల వల్ల గ్రామంలోని పేదలకు ఇప్పటి వరకు రేషన్ బియ్యం అందని పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలు... ఇండ్లచెరువు గ్రామంలో బీసీ కులానికి చెందిన అద్దంకి వెంకటేశ్వర్లు 20 ఏళ్లుగా రేషన్ షాపు పరి్మనెంట్ డీలర్‌గా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డీలర్‌ను తీసివేయాలని స్థానిక నాయకులు నిర్ణయించుకున్నారు. డీలర్ ఈ విషయం తెలుసుకుని టీడీపీ నేతలను కలసి ‘20 ఏళ్లుగా రేషన్ దుకాణం నిర్వహిస్తున్నాను. ఇదే నాజీవనాధారం. నా కడుపు కొట్టి నా కుటుంబాన్ని బజారున పడేయొద్దు’ అని వేడుకున్నాడు.అయినా కనికరించని వారు డీలర్‌ను తొలగించాలని రెవెన్యూ, ఎన్ఫోర్స్మెంట్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆయన రాజీనామా చేస్తే తప్ప తీసివేయడానికి తమకు అధికారం లేదని అధికారులు చెప్పారు. దీంతో తమ గ్రామంలోకి రేషన్ బియ్యం ఎలా తెస్తారో చూస్తామని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీచేశారు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన దొనకొండలోని పౌరసరఫరాల శాఖ గోదాము నుంచి 12 టన్నుల రేషన్ బియ్యాన్ని లారీలో ఇండ్లచెరువుకు పంపగా, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. తమను కాదని గ్రామంలోకి రేషన్ బియ్యం లారీ వస్తే తగులబెడతామని హెచ్చరించారు. దీంతో సిబ్బంది లారీని తీసుకుని వెనక్కి వెళ్లిపోయారు.పోలీసులనూ లెక్క చేయలేదు పోలీస్ బందోబస్తుతో శనివారం ఉదయం 11 గంటలకు మరోసారి రేషన్ బియ్యంతో లారీ ఇండ్లచెరువుకు బయలు దేరగా... టీడీపీ నాయకులు వచ్చి ఊరి బయటే అడ్డుకున్నారు. గ్రామంలోకి వస్తే తగులబెడతామని, వెనక్కి వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. పోలీసులు సాయంత్రం వరకు బతిమిలాడినా టీడీపీ నాయకులు వినకపోవడంతో లారీని వెనక్కి పంపారు. టీడీపీ నాయకులు ఇంత బరితెగించి దౌర్జన్యం చేస్తున్నా పోలీసులు బతిమిలాడుకోవడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పోలీసు వ్యవస్థ ఇంత నిరీ్వర్యమైపోతే సామాన్యులకు ఏం న్యాయం చేస్తారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
మా బావ ఎమ్మెల్యే.. అంతా నా ఇష్టం
‘అందరూ వినండి. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు నాకు బావ వరుస అవుతాడు. నేను చెబితే ఆయన చెప్పినట్లే’ ఇదీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మండలంలో ఓ వ్యక్తి ధోరణి. వలేటివారిపాళెం మండలానికి చెందిన ఈయన ప్రస్తుతం ఉలవపాడు మండలంలో పెత్తనం చేస్తున్నాడు. సీనియర్ నాయకులు సైతం తన వద్దకు రావాల్సిందే అంటున్నాడు. ప్రస్తుతం మండలంలో సర్వాధికారం నాదేనని చెబుతున్నాడు. ఉలవపాడు: ‘నేను చెప్పిన వారే రేషన్ డీలర్. నాకు నచ్చిన వారే ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉంటారు. నేను చూపించిన వారే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (వీఓఏ)గా పనిచేస్తారు. నేను చెప్పినట్లే అధికారులంతా నడుచుకోవాలి.’ ఇదీ పొడపాటి సుధాకర్ అనే వ్యక్తి ఉలవపాడు మండలంలో చేస్తున్న పని. వలేటివారిపాళెం మండలానికి చెందిన ఈయన కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు సమీప బంధువు, బావమరిది వరుస అవుతాడు. ఎన్నికల సమయంలో సుధాకర్ ఇంటూరి కోసం ఉలవపాడు మండలంలో పనిచేశాడు. దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతిఫలంగా ఇక్కడ ఇష్టమొచ్చినట్లు చేసుకోమని సుధాకర్‌కు నాగేశ్వరరావు బాధ్యతలు అప్పజెప్పినట్లుప్రచారం జరుగుతోంది. అధికారులు ఏ పనిచేయాలన్నా, ప్రజలకు ఏ పని కావాలన్నా ఆయన్ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.తొలగింపులు.. నియామకాలుమండలంలో ప్రస్తుతం ఉన్న డీలర్లు, వీఓఏలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మధ్యాహ్న భోజన పథకం ఏజెన్సీలను మార్చడానికి ఏకంగా పార్టీ కార్యాలయంలోనే సోమవారం సుధాకర్ సమావేశం ఏర్పాటు చేశాడు. ఎమ్మెల్యే అండతోనే ఇలా చేసినట్లు కొందరు నేతలు భావిస్తున్నారు. ఈ సమావేశంలో రేషన్ డీలర్షిప్, భోజన ఏజెన్సీలు తమకే కావాలంటూ కార్యకర్తలు పట్టుబట్టారు. ఇప్పుడున్న వారిని తొలగించి కొత్తవారిని నియమించాలని తహసీల్దార్ కార్యాలయానికి పేర్లు పంపించినట్లు సమాచారం. ఈ విషయాలు సీనియర్ నాయకులకు మింగుడు పడడంలేదు. సుధాకర్ వ్యవహారశైలి నచ్చక సమావేశానికి డుమ్మా కొట్టారు. గతంలో పోతుల రామారావు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కూడా ఇలానే పలువురు అధికారం చెలాయించారు.ఆగ్రహంగా సీనియర్ నేతలుఎమ్మెల్యే ఆదేశాలతో వేరే మండలానికి చెందిన సుధాకర్ ఉలవపాడు మండలంలో పెత్తనం చెలాయించడాన్ని స్థానిక టీడీపీ సీనియర్ నేతలు అంగీకరించడం లేదు. ఈ వ్యవహారంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి తాము ఎంతో శ్రమించామని, ఇప్పుడు మమ్మల్ని కాదని సుధాకర్‌కు బాధ్యతలు ఇవ్వడాన్ని వారు సహించలేకపోతున్నారు. తమ మాట చెల్లుబాటు కావడం లేదని, ఎమ్మెల్యే మండలాన్ని అతనికి రాసిచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ చేస్తున్న పనులపై ద్వితీయ శ్రేణి నాయకులంతా అసంతృప్తిగా ఉన్నా ఇంటూరి మాత్రం చూసీచూడనట్లు ఉన్నట్లు విమర్శలున్నాయి. అతను ఏం చేసినా ఫర్వాలేదన్నట్లుగా ఎమ్మెల్యే వ్యవహారశైలి ఉందని పార్టీలో చర్చ నడుస్తోంది. -
రేషన్ షాపునకు ముక్కిన బియ్యం సరఫరా
అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం మండలం చిల్వెర గ్రామంలోని రేషన్ షాపునకు రెండు నెలల క్రితం ముక్కిన బియ్యం సరఫరా చేశారు. వాటిని తీసుకొని ఏం చేసుకోవాలని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలర్ నర్సింహులు విషయాన్ని అధికారులకు తెలపడంతో బియ్యాన్ని గోదాంకు తిరిగి పంపించాలని సూచించారు. ఎఫ్‌సీఐ గోదాం ఇన్చార్జిని సంప్రదిస్తే రేపు మాపు అంటూ రెండు నెలలు కాలయాపన చేశాడు. మంగళవారం డీలర్ స్వయంగా 10 క్వింటాళ్ల ముక్కిన బియ్యం బస్తాలు పెద్దశంకరంపేట ఎఫ్‌సీఐ గోదాంకు తీసుకెళ్లాడు. ఈ బియ్యానికి తనకు సంబంధం లేదని, మీరే ఏమైనా చేసుకోవాలని గోదాం ఇన్చార్జి తేల్చి చెప్పాడు. దీంతో ముక్కిన బియ్యాన్ని డీలర్ అక్కడే పడేసి వచ్చాడు. అధ్వాన్న బియ్యం సరఫరా చేస్తూ గోదాం ఇన్చార్జిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. -
రేషన్ డీలర్ కోసం గాలింపు
పెనమలూరు: విధి నిర్వహణలో ఉన్న డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) గుమ్మడి విజయ్‌కుమార్‌పై ఈనెల 17న దాడికి కారకుడైన రేషన్ డీలర్ లుక్కా అరుణ్‌బాబు కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత డీలర్ తన కుటుంబ సభ్యులతో పారిపోయిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తర్వాత అరుణ్‌బాబు గురించి ఆరా తీస్తే అతను పక్కా టీడీపీ వ్యక్తిగా స్పష్టమైంది. అంతేకాక.. స్థానికంగా టీడీపీ నాయకుడిగా చలామణి అవుతున్నాడు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి పేదలకు రేషన్ పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ అరుణ్‌బాబు పచ్చచొక్కా వేసుకుని రేషన్ అక్రమాలకు తెరలేపాడు. ఇతనికి టీడీపీ అగ్రనేతలతో కూడా సత్సంధాలున్నాయని చెబుతున్నారు. టీడీపీ హయాంలోనే నియామకం నిజానికి.. లుక్కా అరుణ్‌బాబును టీడీపీ హయాంలో నిబంధనలు అతిక్రమించి మరీ కృష్ణాజిల్లా పెనమలూరు డీలర్‌గా నియమించారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు నాటి టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌తో ఫొటోలు కూడా దిగాడు. పార్టీ జెండాను భుజంపై వేసుకుని టీడీపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడని తెలిసింది. ఈ నేపథ్యంలో.. పార్టీ అండ చూసుకుని రేషన్‌ను పక్కదారి పట్టిస్తున్నాడు. విషయం తెలుసుకున్న డిప్యూటీ తహసీల్దార్ గుమ్మడి విజయ్‌కుమార్ తనిఖీ చేయగా 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార మాయం చేశాడని తేలింది. డీలర్ లుక్కా అరుణ్‌బాబు గుట్టురట్టు కావడంతో అతనిని కాపాడేందుకు బోడె ప్రసాద్, అతని అనుచరులు అధికారులపై దాడిచేశారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అదృశ్యమైన డీలర్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దాడిలో 9 మందికి రిమాండ్ ఇక డిప్యూటీ తహసీల్దార్‌పై దాడి కేసులో తొమ్మిది మందికి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు వంగూరు పవన్, చిగురుపాటి శ్రీనివాసరావు, దొంతగాని పుల్లేశ్వరరావు, కొల్లిపర ప్రమోద్, కిలారు ప్రవీణ్, బోడె మనోజ్, కాపరౌతు వాసు, కిలారు కిరణ్‌కుమార్, వెలివెల సతీష్‌లను పెనమలూరు పోలీసులు అరెస్టుచేసి నిందితులను గురువారం విజయవాడ రైల్వే కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచినట్లు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. -
‘కార్డుదారులకు సజావుగా బియ్యం పంపిణీ’
గుడివాడ: ఆంధ్రప్రదేశ్‌లో 36,31,216 కార్డుదారులకు రేషన్ డీలర్ల ద్వారా పీఎంజీకేవై కింద ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేసినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు. గురువారం గుడివాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం 1,48,56,590 బియ్యం కార్డులు ఉన్నాయని, ఈ కార్డుల్లోని ఒక్కో కుటుంబ సభ్యుడికి 5 కేజీలు చొప్పున బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ సక్రమంగా సాగుతోందన్నారు. కర్నూలు జిల్లాలో 29.16%, ప్రకాశం జిల్లాలో 24.08%, వైఎస్సార్ కడప జిల్లాలో 25.71%, అనంతపురం జిల్లాలో 27.60%, పశ్చిమ గోదావరి జిల్లాలో 24.60%, చిత్తూరు జిల్లాలో 27.92%, గుంటూరు జిల్లాలో 25.50%, విజయనగరం జిల్లాలో 24.15%, శ్రీకాకుళం జిల్లాలో 17.76%, నెల్లూరు జిల్లాలో 17.46% పంపిణీ ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. -
కార్డుదారులపై డీలర్ భర్త దాడి
తాడేపల్లిరూరల్ (మంగళగిరి): రేషన్ షాపులో బియ్యం సక్రమంగా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించిన కార్డుదారులపై రేషన్ డీలర్ భర్త, టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో రేషన్‌షాపు డీలర్ సంకురు హైమావతి పేరిట ఆమె భర్త, టీడీపీ నేత సంకురు వేణు రేషన్ షాపు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రేషన్ కొలతలో తేడా రావడంతో చిన్నసుబ్బయ్య అనే లబ్ధిదారుడు ప్రశ్నించగా, వేణు అతడిపై దాడికి పాల్పడ్డాడు. అదే గ్రామానికి చెందిన దుగ్గిరాల జయపతిరావు, నీలం సురేష్ ఇదెక్కడి అన్యాయమంటూ ప్రశ్నించగా.. వారిపైన కాటా రాళ్లతో దాడి చేశాడు. దాడిలో జయపతిరావుకు తల పగిలి రెండు కుట్లు పడగా, సురేష్‌కు ఐదు కుట్లు పడ్డాయి. ఘర్షణలో వేణుకు కూడా కంటిపై గాయమైంది. బాధితులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. -
గంటలో 45 కార్డుల సరుకులు కొట్టేశాడు!
కుషాయిగూడ: ఓ రేషన్ షాపునకు చెందిన సుమారు 45 రేషన్ కార్డుల సరుకులను మరో రేషన్ డీలర్ ఒకే రోజు గంట వ్యవధిలో కొట్టేసి హైటెక్ మోసానికి పాల్పడ్డాడు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఓ బాధితుడు వాయిస్ క్లిప్పింగ్‌ను వాట్సాప్‌లో షేర్ చేయడంతో ఈ విషయం వైరల్ అయింది. చిన్న చర్లపల్లికి చెందిన 3302105 నంబర్ రేషన్ షాపు డీలర్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం.....ఇతని షాపునకు చెందిన 45 రేషన్ కా ర్డుల నుంచి ఈ నెల 20న ఒకే రోజు గంట వ్యవధిలో మరో డీలర్ స రుకులన్నీ కొట్టేశాడు. శంకర్ ఈ విషయాన్ని పసిగట్టలేదు. పోర్టల్ సిస్టమ్‌లో ఎవ్వరు ఎక్కడైనా సరుకులు తీసుకోవచ్చనే భావనలో ఉన్నా డు. అయితే ఈ నెల 22 ఎస్ఓటీ పోలీసులమంటూ వచ్చిన కొందరు నీ రేషన్ షాపునకు చెందిన 45 కార్డుల నుంచి ఇబ్రహీంపట్నానికి చెందిన ఓ రేషన్ డీలర్ సరుకులు కాజేశాడని, అసలు ఏం జరుగుతుందంటూ నిలదీశారు. దీంతో కంగుతిన్న శంకర్ తనకు ఎలాంటి సంబంధం లేదని, సరుకులు కొట్టేసిన విషయం కూడా మీ ద్వారానే తెలిసిందని చెప్పాడు. ఈ విషయంపై డీఎస్ఓ స్పందిస్తూ.. జరిగిన ఘట న తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరుపుతున్నామని తెలిపారు. -
టీడీపీ నేత నకి‘లీలలు’
ఒకవైపు టీడీపీ నేత. మరోవైపు రేషన్ డిపో డీలర్. అక్కడ ఆయన చెప్పిందే వేదం. చేసిందే న్యాయం. ఏ అధికారైనా తల ఊపాల్సిందే. ఆయన దందా అంతా ఇంతా కాదు. ప్రభుత్వ భూములకు తమ కుటుంబీకుల పేరిట పట్టాలు సృష్టించారు. వాటిపైనే రుణాలు పొందారు. రుణమాఫీ, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందారు. అంతటితో ఆగకుండా వాటినే బ్యాంకుల్లో కుదువ పెట్టి లక్షలాది రూపాయలు రుణం సంపాదించారు. అవినీతి బాగోతంపై ఎవరైనా అడిగితే నానా రకాలుగా ఇబ్బందులు పెడతారు. నిలదీస్తే దౌర్జన్యం చేస్తారు. ఇప్పటికే కేసు కూడా నమోదైంది. ఇంతటి ఘన చరిత్ర గల మెళియాపుట్టి మండలం కరజాడ గ్రామ రేషన్ డీలర్ హనుమంత్రు చంద్రశేఖర్ నకిలీ లీలలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనమిది. సాక్షి, శ్రీకాకుళం : మెళియాపుట్టి మండలం కరజాడ గ్రామ టీడీపీ నేత హనుమంతు చంద్రశేఖర్ రేషన్ డిపో డీలర్‌గా కొనసాగుతున్నాడు. డీలర్‌గా పనిచేస్తున్నా... చేసేవన్నీ టీడీపీ రాజకీయాలే. మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ అండతో రాజకీయాలు నెరుపుతున్నాడు. ఆ ధైర్యంతో ప్రభుత్వ భూముల్ని వారసత్వ, డీ పట్టా భూములుగా తన పేరున, త న భార్య పేరున, తమ బంధువుల పేరున రికార్డుల్లో రాయించుకున్నాడు. రెవెన్యూ అధికారులను ప్రలోభాలకు గురి చేసి పట్టాలు సృష్టించారు. టీడీపీ ప్రభుత్వంలో రైతు రథం పథకం కింద ట్రాక్టర్లు తీసుకున్నాడు. తిత్లీ తుఫాన్ నష్టపరిహారాన్నీ దక్కించుకున్నాడు. తాజాగా రైతు భరోసా కింద ప్రభుత్వ సాయాన్ని కాజేశాడు. పెళ్లిళ్లు అయిపోయిన వారి పేరున, చనిపోయిన వారి పేరున ఉన్న రేషన్‌కార్డులను రద్దు చేయకుండా వాటిని తన వద్దే ఉంచుకుని పెద్ద ఎత్తున రేషన్ సరుకులను మింగేశాడు. భూముల నకిలీ బాగోతమిది.. మెళియాపుట్టి మండలంలోని కరజాడ రెవెన్యూ గ్రామ పరిధిలోని కొండ పోరంబోకుగా ఉన్న రెవెన్యూ భూమిపై చంద్రశేఖర్ కన్ను పడింది. సర్వే నెంబర్లు 373–41, 373–42, 373–43లో ఉన్న 3.62 ఎకరాల ప్రభుత్వ భూమిని తన భా ర్య హేమలత పేరుతో పట్టా చేయించుకున్నారు. రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేయించుకుని కంప్యూటర్ అడంగల్ పొందాడు. వాస్తవానికి ప్రభుత్వ భూమి పొందితే డీడీ పట్టా అని రాయించాలి. తననెవరు గమనిస్తారనుకున్నారేమో గాని అనువంశికం అని రికార్డుల్లో నోట్ చేయించాడు. ఆ పట్టాలను చూపించి గొప్పిలి సిండికేట్ బ్యాంకులో రూ. 75,655 రుణం తీసుకున్నాడు. తన పేరున 239/3, 240/2, 204/4, 251/5, 189/పీ, 263/1 సర్వే నెంబర్లతో 4.29ఎకరాల మేర పట్టాలు సృష్టించారు. హనుమంతు చంద్రశేఖర్, తన భార్య పేరున రుణం పొందిన సిండికేట్ బ్యాంకు రికార్డి వాటిని చూపించి రెండు దఫాలుగా రూ.82,907, రూ.98,230 మేర రుణాలు తీసుకున్నా డు. పలాస మండలం గోపివల్లబాపురం గ్రామంలో తన బంధువుల పేరిట కూడా 8.38 ఎకరాల ప్రభుత్వ భూమిని పొం దాడు. తన పేరున, తన భార్య పేరున పట్టాలు సృష్టించినప్పుడు ఏ తహశీల్దారైతే ఉన్నారో ఆయన పలాస మండలం లో పనిచేసినప్పుడు ఆయన బంధువుల పేరున డీ పట్టా భూమి కట్టబెట్టారు. దీన్నిబట్టి నాడు పనిచేసిన తహశీల్దార్ కనుసన్నల్లోనే పట్టా పాసుపుస్తకాల సృష్టి, రికార్డుల్లో నమోదు కార్యక్రమం జరిగినట్టు స్పష్టమవుతున్నది. ఈ పాసు పుస్తకాలు, రికార్డులను చూ పించి రుణమాఫీ, తిత్లీ పరిహారం, వైఎస్సార్ రైతు భరో సా–పీఎం కిసాన్‌లో కూడా లబ్ధిపొందాడు. గత ప్రభుత్వం లో రైతు రథం పథకం కింద రెండు ట్రాక్టర్లు కూడా పొం దారు. విశేషమేమిటంటే తనకు భూములు లేకపోయినప్ప టికీ భూములున్నట్టు రికార్డులను చూపించడంపై ఒకాయన ఫిర్యాదు చేసేసరికి తన పేరున ఉన్న భూములను రికార్డుల నుంచి తొలగించారు. రేషన్ అక్రమాలు రేషన్ డీలరుగా కూడా చంద్రశేఖర్ చేయని అక్రమమంటూ లేదు. రేషన్ సరుకులు తూకంలో తక్కువగా ఇవ్వడం, అధిక ధరలు వసూలు చేయడం, మరణించిన వారి పేర్లను, వివా హం జరిగి అత్తవారిళ్లకు వెళ్లిన వారి పేర్లు తొలగించకుండానే ఆయా కుటుంబ సభ్యులకు మీపేర్లు తొలగించామని నమ్మించి, ఆ రేషన్ సరుకులను తానే సంవత్సరాల పాటు స్వాహా చేశాడన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పేర్ల తో ను రేషన్ కార్డులు తయారు చేయించి వారి సరుకులు కూడా స్వాహా చేశారన్న విమర్శలు ఉన్నాయి. దాదాపు 200 రేషన్ కార్డుల సరుకులు ఈ రకంగా అనుభవించినట్టు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ఈ విషయంపై సాక్షి కలెక్టర్ జె.నివాస్ వివరణ కోరగా ఇంతవరకు తన దృష్టికి ఈ విషయం రాలేదన్నారు. దీనిపై విచారణ జరిపిస్తామని, వాస్తవమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అన్నీ అక్రమాలే.. సరుకుల పంపిణీ నుంచి ప్రభుత్వ భూములకు పట్టాలు చేయించుకోవడం వరకు, బ్యాంకుల్లో రూ.లక్షల్లో రుణా లు తీసుకోవడం, ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారాలను పొందటం.. ఇలా అన్నీ అక్రమాలే. కరజాడ రేషన్ డీలరు కొందరు అధికారుల అండతో అక్రమాలకు పాల్పడుతున్నాడు. రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేయించడం, తొలగించడం సునాయాసంగా చేస్తున్నాడంటే సిబ్బంది ఎంతగా సహకరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. – బమ్మిడి ఖగేశ్వరరావు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు, పేరు తొలగిస్తాం రేషన్ డీలరు హనుమంతు చంద్రశేఖ ర్ భార్య హేమలత పేరుతో రెవెన్యూ రికార్డుల్లో భూములు నమోదు కా లేదు. కాని కంప్యూటర్ అడంగల్ మాత్రం చూపిస్తోంది. కంప్యూటర్ అడంగల్ రాకుండా ప్రస్తుతం నిలుపుదల చేయడం జరిగింది. కంప్యూటర్ నుంచి హేమలత పేరు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈమె పేరు కంప్యూటర్ అడంగల్ వచ్చేలా ఎప్పుడు నమోదు జరిగిందో కచ్చితంగా చెప్పలేం. ప్రభుత్వం నుంచి పొందిన రుణమాఫీ, పంటల నష్ట పరిహారానికి సంబంధించి విచారణ జరిపిస్తాం. నిజమని రుజువైతే ఆర్ఆర్ యాక్టును ప్రయోగించి రికవరీ చేస్తాం. –ఎస్.దామోదరం, తహశీల్దారు, మెళియాపుట్టి -
డీలర్ల ట్రిక్కు...
కర్నూలు(సెంట్రల్) : ఇటీవల కర్నూలులోని బుధవార పేటలో 45 క్వింటాళ్ల బియ్యాన్ని మూడో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. తెలంగాణలోని అలంపూర్‌లో ఉన్న ఓ మిల్లుకు తరలిస్తున్నట్లు పట్టుబడిన హమాలీలు చెప్పారు. ♦ డోన్‌లో 80 క్వింటాళ్ల బియ్యం పట్టుబడి 20 రోజులైంది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ♦ ఆళ్లగడ్డలోని ఓ గోదాములో ఉంచిన 120 బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టుకున్నారు. ..ఇలా చెప్పుకుంటూ పోతే రోజూ జిల్లాలోని ఏదో మూలన రేషన్ బియ్యం పట్టుబడుతోంది. స్టాక్ పాయింట్ల నుంచి ఎంఎల్ఎస్(మండల లెవల్ స్టాక్)పాయింట్లకు, అక్కడి నుంచి రేషన్ షాపులకు బియ్యాన్ని సరఫరా చేసే వాహనాలను జీపీఆర్ఎస్ ద్వారాఅనుసంధానం చేసి రవాణా చేస్తారు. పౌర సరఫరా దుకాణాల్లో ఎలక్ట్రానిక్ కాటాకు ఈ–పాస్ మిషన్లతో అనుసంధానం చేసి పేదలకు బియ్యంతో సహా ఇతర సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఎక్కడా చిన్న పొరపాటు లేకుండా అక్రమాలకు తావు ఇవ్వకుండా ప్రజా పంపిణీ సరుకులను లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నా బియ్యం దొంగలు మాత్రం తమ అక్రమ వ్యాపారాన్ని ఎంచక్కాగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో ప్రతీ నెలలో సుమారు 4.5 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతోంది. డీలర్ల ట్రిక్కు... కర్నూలు జిల్లాలో 2,346 రేషన్‌దుకాణాల పరిధిలో 11,71956 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటికి ప్రతి నెలా 19,120.975 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే ఇందులో చాలా వరకు బియ్యం పక్కదారి పడుతోంది. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేరన్నా నానుడి చందంగా రేషన్ దుకాణాల డీలర్లే ఇందులో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ–పాస్ మిషన్ ద్వారా రేషన్ బియ్యాన్ని ఇస్తున్నా వక్రమార్గం ఎంచుకుంటున్నారు. మామూలుగా అయితే వినియోగదారులు బియ్యం కోసం తెచ్చిన సంచిని కూడా కాట వేసి దానిని బరువుకు సరితూగు బియ్యాన్ని వేయాలి. అయితే ఇక్కడి పరిస్థితులు చూస్తే కళ్లు బైర్లు కమ్ముకుంటాయి. మొదట ఈపాస్ మిషన్ కోసం సంచితోపాటు తూకం వేస్తారు. ఆ వెంటనే మళ్లీ రెండు, మూడు కేజీల బరువున్న బొలెలు/ గిన్నెలు/ బక్కెట్లను పెట్టిమళ్లీ తూకం వేస్తారు. ఇలా పది కేజీలకు ఒకసారి తూకం తీసుకుంటారు. అంటే ఒక్క 20 కేజీల రేషన్ కార్డుకు దాదాపు 4 కేజీల వరకు బియ్యం తూకంలో మాయం అవుతుంది. ఇలా నూరు కేజీలకు 20 కేజీల బియ్యం డీలర్ ఖాతాలో చేరుతుంది. ఒక మెట్రిక్ టన్నుకు 200 క్వింటాల ప్రకారం వినియోగదారులకు టోకరా వేస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలోని 19,121.975 మెట్రిక్ టన్నుల బియ్యానికి 3,824.2 మెట్రిక్ టన్నుల బియ్యం డీలర్ల దగ్గర మాయవుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్లలోనూ అదే తంతు... మరోవైపు మండల లెవల్ స్టాక్ పాయింట్లలోనూ బియ్యం భారీగానే మాయవుతోంది. ఇక్కడికీ వచ్చిపోయే రవాణా సరుకు లారీలను తూకం వేసి పంపుతున్నా తూకాల్లో మాత్రం తేడాలు వస్తున్నాయి. అంతేకాక ఇక్కడ లారీల లారీల సరుకు పందికొక్కుల పాలవుతున్నట్లు అధికారులు లెక్కలు చూపుతున్నారు. క్వింటానికి నాలుగైదు కేజీల తరుగు వస్తోందని డీలర్లు బహిరంగానే చెబుతుఆన్నరు. క్వింటానికి నాలుగు కేజీల ప్రకారం అనుకున్నా మెట్రిక్కు టన్నుకు 40 కేజీలు, 19121 మెట్రిక్ టన్నులకు 764.84 మెట్రిక్ టన్నుల బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. పర్యవేక్షణ కరువు... డీలర్లు, ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యం పక్కదారి పడుతున్నట్లు పౌర సరఫరాల అధికారులకు తెలిసినా చూసీచూడనట్లు ఉంటారు. తూకాల్లో మోసాలను వారు మామూలుగానే పరిగణిస్తారు. ఒక డీలర్ బియ్యాన్ని తీసుకెళ్లితే మధ్య మధ్యలో అధికారులు తనిఖీ చేసి చూడాలి. రేషన్‌కార్డులు, పంపిణీ చేసిన బియ్యానికి లెక్కలను పరిగణలోకి తీసుకొని సరిౖయెనా స్టాక్ఉందోలేదో చూడాలి. పట్టణ ప్రాంతాల్లో అయితే ఫుడ్ ఇన్స్పెక్టర్లు, గ్రామీణ ప్రాంతాల్లో వీఆర్వో, ఆర్ఐలు పర్యవేక్షించాలి. అయితే అలాంటి పర్యవేక్షణా ఎక్కడా కనిపించదు. దీంతో డీలర్లు ఇష్టానుసారంగా బియ్యాన్ని పక్కదారి పట్టించు సొమ్ము చేసుకుంటున్నారు. అలాగే ఎంఎల్ఎస్ పాయింట్లలో అయితే కొందరు అధికారులే పాత్రదారులు. రేషన్ బియ్యం పట్టివేత కర్నూలు : చౌక డిపోల ద్వారా తెల్లకార్డుదారులకు సరఫరా చేయాల్సిన సబ్సిడీ బియ్యాన్ని నల్లబజారుకు తరలిస్తుండగా రెండో పట్టణ పోలీసులు పట్టుకున్నారు. కల్లూరు మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన కురువ సుంకమ్మ, కర్నూలు మండలం నిర్జూరు గ్రామానికి చెందిన కురువ జగదీశ్ తదితరులు 30 బస్తాల రేషన్ బియ్యాన్ని బోలేరో వాహనంలో తీసుకువెళ్తుండగా గురువారం సాయంత్రం రెండో పట్టణ పోలీసులు దర్మపేట సర్కిల్ వద్ద తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. తూకాల్లో మోసం చేస్తే చర్యలు రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవు. తూకాల్లో మోసాలు చేస్తే షాపును సీజ్ చేస్తాం. ఇలాంటి సంఘటలపై ప్రజలు మాకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. అనుమానం వస్తే తనిఖీలు నిర్వహిస్తున్నాం. – పద్మశ్రీ , డీఎస్ఓ -
అన్నీ ఉత్తుత్తి హామీలే..!
సాక్షి, ఆచంట (పశ్చిమ గోదావరి): రేషన్ డీలర్లు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. హామీలు అమలు చేస్తామని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు గాలికి వదిలి వేయడంతో వారు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కమీషన్ పెంపు, నగదు ప్రోత్సాహకాలు, డిమాండ్ల పరిష్కారానికి ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో డీలర్లు ఆందోళన చెందుతున్నారు. చాలీచాలనీ కమీషన్‌తో కుటుంబాలను భారంగా నెట్టుకొస్తున్న రేషన్ డీలర్లకు ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హామీలు అమలు చేయకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. హామీలు గాలికొదిలేసిన ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 2186 రేషన్ దుకాణాలు ఉన్నాయి. ఆయా దుకాణాల ద్వారా బియ్యం, చక్కెర, కందిపప్పు, రాగులు, జొన్నలు వంటి నిత్యవసరాల పంపిణీ జరుగుతోంది. రేషన్ దుకాణాలలో ఈ పోస్ యంత్రాలు ప్రవేశపెట్టడంతో రేషన్ పంపిణీలో పారదర్శకత ఏర్పడింది. నాటి నుంచి డీలర్లు వేతనాలు అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో రేషన్ డీలర్ల జేఏసీ 11 డిమాండ్లు ప్రభుత్వం ముందు ఉంచింది. అనేక తర్జన భర్జనల అనంతరం వీటిలో ఐదు డిమాండ్లు నెరవేర్చడానికి రాష్ట్ర పౌర సరఫరాలశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అంగీకరించారు. వాటిలో రేషన్ సరుకులు ఆయా దుకాణాలకు చేర్చే క్రమంలో హమాలీల ఖర్చులు ప్రభుత్వమే భరించడానికి, డీలరు ఆకస్మికంగా చనిపోతే వారి కుటుంబాల వారికి మట్టి ఖర్చుల నిమిత్తం రూ.20 వేలు చెల్లించడానికి అంగీకరించింది. చంద్రన్న బీమాలో రూ.5 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లింపునకు, రేషన్ దుకాణాలకు విద్యుత్ సరఫరా, ఇంటి పన్నులు జనరల్ కేటగిరీలోనే ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామని హామీలు ఇచ్చింది. ఆయా హామీలను జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయానా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడంతో ఆశలు పెట్టుకున్న డీలర్లకు రోజులు గడుసున్న కొద్దీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేక జీవోలు విడుదల కాకపోవడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమలుకు నోచుకోని కమీషన్ పెంపు జీవో డీలర్ల డిమాండ్లలో వేతనం అమలు ప్రధానమైంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు అమలు సాధ్యం కాదని దీనిపై అధ్యయానికి ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక వచ్చే సరికి పుణ్యకాలం గడిచిపోతుందన్న డీలర్ల వేదనతో స్పందించిన ప్రభుత్వం ప్రస్తుతం క్వింటాలుకు ఇస్తున్న కమీషన్ రూ.70 కు అందనంగా మరో 30 రూపాయలు పెంచుతామని హామీ ఇచ్చింది. ఫిబ్రవరి రెండవ వారంలో ఈమేరకు ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. కానీ నేటి వరకూ అది అమలుకు నోచుకోలేదు. విడుదల చేసిన జీవో కూడా అస్పష్టంగా ఉందని, ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో జీవోలో పొందుపర్చకపోవడాన్ని డీలర్లు దుయ్యబడుతున్నారు. కంటి తుడుపు చర్యలో భాగంగానే జీవో జారీ చేశారని డీలర్లు వాపోతున్నారు. చెల్లుబాటు కాని చెక్కులు రేషన్ డీలర్ల పనితీరు.. పంపిణీ సంతృప్తికరంగా ఉంటే నగదు పోత్సాహకాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. 85 శాతం సరుకులు పంపిణీ చేసిన డీలరుకు రూ.2 వేలు నగదు ప్రోత్సాహకంగా ఇస్తామని ప్రకటించింది. నగదుకు జనవరిలో జిల్లా వ్యాప్తంగా 461 మంది డీలర్లు ఎంపికయ్యారు. గత నెలలో తూతూ మంత్రంగా ఓ 50 మంది డీలర్లకు చెక్కులు పంపిణీ చేసి చేతులు దులుపుకుంది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఆ ఊసే లేదు. ప్రోత్సాహక చెక్కులు పట్టుకుని బ్యాంకులకు వెళ్లిన డీలర్లకు చుక్కెదురైంది. బ్యాంకులో జమ చేసిన డీలర్ల చేతికి నేటికీ సొమ్ములు చేతికందలేదు. ఆరా తీస్తే ఖజానాలో సొమ్ములు లేవంటూ అధికారులు చెప్పుకొస్తున్నారని డీలర్లు వాపోతున్నారు. పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వం తాజాగా రేషన్ పంపిణీ శాతం 85 నుంచి 90 శాతం ఉంటే రూ.5 వేలు నగదు ప్రోత్సాహకం ఇస్తామంటూ మరో ప్రకటన చేయడాన్ని డీలర్లు ఆక్షేపిస్తున్నారు. ఇచ్చిన చెక్కులకు దిక్కులేదు మరో ఐదు వేలా అంటూ నిట్టూరుస్తున్నారు. గంపెడాశతో అమరావతి వెళ్లి ముఖ్యమంత్రిని సన్మానించిన డీలర్లకు చివరికు మొండి చేయి చూపడంపై డీలర్లు మండిపడుతున్నారు. ఈ ప్రభుత్వం డీలర్లను నమ్మక ద్రోహం చేసిందని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే రాబోయే సార్వత్రిక ఎన్నికలలో తగిన గుణపాఠం తప్పదనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలి ప్రభుత్వం డీలర్ల సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్నా హామీలు నెరవేరకపోవడంతో డీలర్లు ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం కమీషన్ పెంచుతూ జారీ చేసిన జీవో నేటికీ అమలు కాలేదు. మరో నాలుగు డిమాండ్ల పెంపునకు అంగీకరించి నేటికీ జీవో జారీ చేయలేదు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. – రాజులపాటి గంగాధరావు, రేషన్ డీలర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు -
అన్న ఇంట్లో పెళ్లి.. చక్కెర తెండి!
కర్నూలు, ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో అధికారపార్టీ నేతల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఒకరు ప్రభుత్వ స్థలాలను మింగితే.. మరొకరు సంక్షేమ పథకాలకు బేరం పెట్టి వసూలు చేసుకుంటున్నారు.. ఇంకొకరు ప్రభుత్వ ఆఫీసుల్లోని పాత ఇనుప సామానులను వదలడం లేదు. తాజాగా ఓ నాయకుడు తన కూతురుకు వివాహం నిశ్చయమైంది..పెళ్లికి అవసరమైన స్వీట్లు తయారు చేసేందుకు చక్కెర ఇవ్వాలని చౌకదుకాణ దారులను బెదిరించి ఇప్పించుకున్నారు. దీనిపై ప్రస్తుతం నియోజకవర్గంలో తీవ్ర చర్చ జరుగుతోంది. రుద్రవరం మండలంలోని ఓ టీడీపీ నాయకుడి కుమార్తె వివాహం ఈ నెల 14వ తేదీ జరగనుంది. అయితే ఈ వివాహానికి అవసరమైన చక్కెరను మండలంలోని డీలర్లనుంచి వసూలు చేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. వెనువెంటనే ఆ నాయకుడి అనుచరులు డీలర్ల దగ్గరికెళ్లి అన్న కూతురు వివాహం గ్రాండ్‌గా చేసేందుకు తల ఒక బస్తా చక్కెర ఇవ్వాలని అన్న చెప్పమన్నాడని హుకుం జారీ చేశారు. దీంతో బెంబేలెత్తిన డీలర్లు సమావేశమై అంత చక్కెర తెచ్చి ఇవ్వలేమని చెప్పగా మీ డీలర్‌షిప్‌లు ఎలా ఉంటాయో చూస్తామని బెదిరించినట్లు సమాచారం. చివరకు ఒక్కో చౌకదుకాణ డీలరు అర బస్తా చొప్పున చక్కెర ఎత్తి ఇచ్చినట్లు తెలుస్తోంది. కొనుగోలు చేసి ఇచ్చిన డీలర్లు.. తూకాల్లో మోసం చేసినా అర బస్తా చక్కెర మిగిలించి ఇవ్వలేమని భావించిన డీలర్లు ఆళ్లగడ్డకెళ్లి కొనుగోలు చేసి తెచ్చి ఇచ్చి నట్లు సమాచారం. చౌకదుకాణంలోని చక్కెర ఇస్తే డీలర్లు ఎంత మిగిల్చుకుంటున్నారో అని ప్రజలు భావిస్తారు..లేదంటే ఆ అధికారపార్టీ నాయకుడు ఎక్కడ అధికారులకు చెప్పి నిత్యం వేధిస్తారోనని బయట కొనుక్కొచ్చి ఇచ్చినట్లు మండల ంలోని కొందరు డీలర్లు వాపోయారు. -
సీఎం చెప్పినా సీన్ లేదు!
అట్టాడ ఝాన్సీరాణి... కంచిలి మండలంలోని కత్తివరం గ్రామంలో ఓ రేషన్ డీలర్ ఆమె! సమీప గ్రామమైన పెద్దశ్రీరామపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మాదిన రామారావుకు నచ్చలే! అంతే తమ పార్టీ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ద్వారా రాజకీయ ఒత్తిళ్లు తెచ్చి ఆమెకు డీలర్షిప్ దూరం చేశాడు. తిరిగి రేషన్ డిపో తీసుకునేందుకు ఆమె జేసీ కోర్టులో అనుకూలంగా ఆదేశాలు తెచ్చుకున్నా స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం చేతులెత్తేస్తున్నారు! ఇలా ఆమె ఒక్కరే కాదు ఈ నాలుగేళ్ల కాలంలో ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న డీలర్లు వందల సంఖ్యలోనే ఉన్నారు. ఫలితంగా దాదాపు 450 రేషన్ డిపోలకు డీలర్లు లేని పరిస్థితి! సాక్షి ప్రతినిధి– శ్రీకాకుళం: 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటివరకూ ఉన్న రేషన్ డిపో డీలర్లకు వేధింపులు ప్రారంభమయ్యాయి. తొలి ఏడాదిలోనే జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలో సుమారుగా 300 మంది రేషన్ డీలర్లపై సివిల్ సప్లయ్ చట్టంలోని 6ఏ సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి స్టాక్ రిజిస్ట్రర్, సరుకుల నిల్వల మధ్య తేడా ఉన్నా, తూనికల్లో తేడా వచ్చినా, నిర్ణీత ధర కన్నా ఎక్కువగా కార్డుదారుల నుంచి వసూలు చేసినా ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేస్తుంటారు. కానీ 2014 ఆగస్టు తర్వాత నుంచి దాదాపు ఏడాది కాలం పాటు ఎలాంటి లోపాలు లేకపోయినా సివిల్ సప్లయిస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు టీడీపీ నాయకుల ఒత్తిళ్లతో దాడులు నిర్వహించారు. అడ్డగోలుగా కేసులు బనాయించారు. కేసులు తేలిపోయాయి... రేషన్ డీలర్లపై బనాయించిన కేసులు దాదాపు అన్నీ రాజకీయ కక్ష సాధింపులే కావడంతో న్యాయస్థానాల్లో తేలిపోయాయి. బాధిత డీలర్లు చాలామంది హైకోర్టును ఆశ్రయించారు. తమకు అనుకూలంగా తీర్పు రావడంతో తిరిగి డీలర్‌షిప్‌ను దక్కించుకున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగానికి, ప్రధానంగా రెవెన్యూ డివిజన్ అధికారుల (ఆర్డీవోల)కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో అధికార పార్టీ నాయకులు ఎంత ఒత్తిళ్లు తెచ్చినా గడిచిన ఏడాదిగా డీలర్లపై అక్రమ కేసులు బనాయించడానికి ఆర్డీవోలు మొగ్గు చూపించట్లేదు. అయితేటీడీపీ ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీల సభ్యులు మాత్రం తమకు అనుకూలంగాలేని డీలర్లను వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే అక్కడక్కడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నారు. వేధింపులు తాళలేక డీలర్‌షిప్‌కు రాంరాం... ఇప్పుడు బియ్యం ఒక్కటే ఇస్తున్నప్పటికీ గతంలో ఆరేడు రకాల రేషన్ సరుకులు డిపోల ద్వారా అందేవి. వాస్తవానికి జిల్లాలో 2,400 డిపోలు ఉన్నాయి. అయితే వివిధ కారణాల వల్ల ప్రస్తుతం 1,950 మాత్రమే పనిచేస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు, వివాదాలు, కోర్టు కేసులు తదితర కారణాల వల్ల పలువురు డీలర్లు ఈ బాధ్యతల నుంచి విరమించుకుంటున్నారు. తర్వాత ఈ ఖాళీలను రెవెన్యూ అధికారులు భర్తీ చేయలేని పరిస్థితి. దీనికీ రాజకీయ కారణాలే అడ్డొస్తున్నాయి. ఒకవేళ ఎవ్వరికైనా డీలర్షిప్ ఇస్తే సొంతపార్టీలోనున్న ఇతర పోటీదారులు దూరమవుతారనే భయం వెంటాడుతోంది. దీంతో నోటిఫికేషన్ కూడా విడుదల చేయట్లేదు. డీలర్లపై ఎందుకీ కన్ను... జిల్లాలో మొత్తం 8,27,329 రేషన్‌కార్డులు ఉన్నాయి. వీటి ద్వారా 24.25 లక్షల మందికి ప్రయోజనం కలుగుతుంది. ఏళ్ల తరబడి రేషన్ డీలర్లుగా ఉన్నవారు స్థానికంగా ఈ కార్డుదారులను ప్రభావితం చేస్తున్నారు. కొంతమంది డీలర్లు గ్రామాల్లో రాజకీయాలను శాసిస్తున్నారు కూడా. దీంతో సహజంగానే డీలర్లను గుప్పిట్లో పెట్టుకుంటే ఎన్నికలలో ఓట్లు పడతాయనే భ్రమలో టీడీపీ నాయకులు ఉన్నారు. దీంతో డీలర్లపై ఒత్తిళ్లు పెంచారు. తమకు వ్యతిరేకంగా ఉన్నారనే ఏ చిన్న అనుమానం వచ్చినా వారిని ఏదొక సాకుతో తొలగించి, ఆ స్థానంలో తమవారిని నియమించుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు విశ్వప్రయత్నాలు చేశారు. ఇందులో జన్మభూమి కమిటీ సభ్యులు కూడా కీలక పాత్ర పోషించారు. తమ మాట వినని రేషన్ డీలర్లపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జరిగేలా ఒత్తిళ్లు తెచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఉషారాణి పోరాటం... కంచిలి మండలం కత్తివరం గ్రామానికి చెందిన అట్టాడ ఝాన్సీరాణి రెండు దశాబ్దాలుగా రేషన్ డిపో నిర్వహిస్తున్నారు. అదే మండలంలోని పెద్ద శ్రీరాంపురానికి చెందిన టీడీపీ నాయకుడు మాదిన రామారావు చేస్తున్న అక్రమాలకు ఆమె సహకరించలేదు. దీంతో కక్షగట్టిన అతను ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్‌తో ఉన్న చనువును అస్త్రంగా చేసుకున్నాడు. జిల్లాకు చెందిన మంత్రికి చెప్పించి విజిలెన్స్ దాడులు చేయించారు. డిపో సీజ్ అయ్యింది. అయితే రూ.2,500 జరిమానా చెల్లించాలని జేసీ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ డిపోను యథావిధిగా ఆమెకే అప్పగించాలని టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. కానీ ఎమ్మెల్యే అశోక్ అభ్యంతరం చెప్పడంతో ఆ రేషన్ డిపో నిర్వహణ బాధ్యత ఆమెకు అప్పగించడానికి వెనుకంజ వేశారు. జేసీ ఉత్తర్వులు కూడా ఇక్కడ పనిచేయలేదు. ఇదే విషయమై సదరు ఉషారాణి బంధువులు ఎమ్మెల్యేను వేడుకుంటే... ‘అక్కడ టీడీపీ ఓట్లు ఎక్కువ ఉన్నాయ్. జేసీ కాదు కదా సీఎం చెప్పినా మీకు రేషన్ డిపో రాదు. నేను మా కార్యకర్త మాదిన రామారావుకి మాత్రమే సహకరిస్తా. మా ప్రభుత్వంలో మా వాళ్లే డిపో నిర్వహించాలి’ అని ఘాటుగా హెచ్చరించడంతో వారు వెనుదిరిగారు. ఈ నేపథ్యంలో తాము కూడా హైకోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం కనిపించట్లేదని ఉషారాణి వాపోతున్నారు. -
రేషన్ డీలర్ల కమీషన్ పెంపు
సాక్షి, హైదరాబాద్ : రేషన్ డీలర్లకు కమీషన్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.20గా ఉన్న కమీషన్ రూ.70కి పెంచుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం వెల్లడించారు. వచ్చే నెల 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందన్నారు. దీంతో పాటుగా రాష్ట్రంలో 2015 అక్టోబర్ 1 నుంచి అమలవుతున్న జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1.91 కోట్ల రేషన్ కార్డులకు ఐదు కేజీల బియ్యం చొప్పున ఇస్తున్నారు. అయితే అప్పట్నుంచి డీలర్లకు కమీషన్ కింద క్వింటాల్‌కు రూ.70 ఇవ్వాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు సుమారు రూ.500 కోట్లవరకూ ఉన్న బకాయిలను డీలర్లకు చెల్లించనున్నట్లు చెప్పారు. రేషన్ డీలర్ల సమస్యల అధ్యయనంపై మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, జోగు రామన్నలతో సీఎం కేసీఆర్ ఇటీవల ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం అనంతరం ఈటల మాట్లాడుతూ..డీలర్ల కమీషన్ పెంపుపై ఇప్పటికీ నాలుగు సమావేశాలు నిర్వహించామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కూడా కొనసాగుతుందన్నారు. డీలర్లు లేని రేషన్ షాపులకు డీలర్లను భర్తీ చేస్తామని, కొత్త గ్రామపంచాయతీలన్నింటికీ రేషన్ షాపులు ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. జీపీఎస్ సిస్టమ్ ద్వారా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌కి అనుసంధానం చేసి లీకేజీలు అరికట్టగలిగామన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా అక్రమాలకు ముకుతాడు వేశామన్నారు. ఈ–పాస్ మిషన్లు వచ్చిన తర్వాత కొంతమందికి రేషన్ అందడంలేదని విజ్ఞప్తులు రావడంతో వేలిముద్రలతో పాటు, కంటి ఐరిష్ ద్వారా లేదంటే మాన్యువల్‌గా బియ్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. డీలర్ల సంఘం హర్షం ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం హర్షం వ్యక్తం చేసింది. సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో డీలర్లు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి పనిచేసిన మంత్రి ఈటలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం డీలర్లు ఎర్రమంజిల్‌లోని పౌర సరఫరాల శాఖ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. -
అనుమానాస్పద స్థితిలో రేషన్ డీలర్ మృతి
పశ్చిమగోదావరి, దెందులూరు: గ్రామానికి చెందిన రేషన్ డీలర్ గుణ్ణం లక్ష్మి (21) చల్లచింతలపూడి వద్ద పోలవరం కుడికాలువలో శుక్రవారం శవమై తేలింది. వివరాల ప్రకారం దెందులూరు గ్రామానికి చెందిన గుణ్ణం రాధాకృష్ణ, కుమారి దంపతుల కుమార్తె లక్ష్మి రేషన్ దుకాణం నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం వీరు నివసిస్తున్న వీధికి చెందిన రెడ్డి అలేఖ్యను ఆశ్రం వైద్యశాలలో చూపించేందుకు లక్ష్మి తీసుకువెళ్లింది. ఆస్పత్రి పరీక్షల అనంతరం ఆలస్యం అవుతుందని అలేఖ్యకు చెప్పి లక్ష్మి సుమారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బయటకు వచ్చేసింది. అనంతరం అలేఖ్య తన తండ్రికి ఫోన్ చేసి లక్ష్మి వెళ్లిపోతోంది మీరు రండి అని చెప్పింది. కొంత సమయానికి చల్లచింతలపూడి వద్ద పోలవరం కుడి కాలువలో కొట్టుకువస్తున్న గుర్తుతెలియని మృతదేహాన్ని చూసిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు వచ్చి కాలువలో కొట్టుకువస్తున్న మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహం దెందులూరు గ్రామానికి చెందిన రేషన్ షాపు డీలర్ గుణ్ణం లక్ష్మిగా గుర్తించారు. మృతదేహాన్ని దెందులూరులో కుటుంబ సభ్యులకు చూపించి ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న భీమడోలు సీఐ బి.నాగేశ్వర్ నాయక్, దెందులూరు ఏఎస్సై పి.కుమారస్వామి దెందులూరులో మృతురాలి తల్లి, సోదరుడు, నానమ్మలను కలసి సంఘనట వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ రూమ్ వద్ద లక్ష్మీ మృతదేహాన్ని పరిశీలించారు. 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. -
రేషన్ డీలర్ల సమ్మె తప్పదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంతో రేషన్ డీలర్ల చర్చలు విఫలమయ్యాయి. సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ హామీకి డీలర్లు అంగీకరించలేదు. ముందు చెప్పినట్లు సమ్మెను యథావిధిగా కొనసాగిస్తామని, సరుకులకు డీడీలు కట్టబోమని డీలర్లు స్పష్టం చేశారు. గౌరవ వేతనం, కమీషన్ల పెంపు, పాత బకాయిల విడుదల తదితర సమస్యల పరిష్కారానికి జూలై 1 నుంచి సమ్మె చేస్తామని రేషన్ డీలర్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సమ్మె విషయమై డీలర్ల సంఘం ప్రతినిధులతో పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ ఆదివారం చర్చలు జరిపారు. రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజుతోపాటు సంఘం ప్రతినిధులు బత్తుల రమేశ్, నాగరాజు, సంజీవరెడ్డి, కొండల్‌రెడ్డి, అన్వర్ పాషా, ప్రసాద్‌గౌడ్, సురేందర్ తదితరులు చర్చలకు హాజరయ్యారు. కేరళ, తమిళనాడు మాదిరి డీలర్లకు వేతనాలివ్వాలని, పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా సంఘం నేతలు కమిషనర్‌ను కోరారు. అకున్ సబర్వాల్ స్పందిస్తూ.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ నివేదిక ఆధారంగా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమ్మె వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడతారని, సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. రేషన్ దుకాణాల నిర్వహణతో వచ్చే ఆదాయం, లాభంపై నివేదిక రూపొందించి సీఎం కేసీఆర్, పౌర సరఫరాల మంత్రి ఈటల రాజేందర్‌కు సమర్పిస్తామని.. మూడు రోజుల తరువాత మళ్లీ చర్చలకు పిలుస్తామని వివరించారు. కానీ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని డీలర్ల సంఘం ప్రతినిధులు స్పష్టం చేయడంతో.. మహిళా సంఘాలతో రేషన్ పంపిణీకీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. పంపిణీకి సిద్ధం: అకున్ సబర్వాల్ డీలర్ల సమ్మె చట్ట విరుద్ధమని పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ అన్నారు. తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ కంట్రోలర్ ఆర్డర్–2016, నిత్యావసర సరుకుల చట్టం–1955 ప్రకారం సరుకుల పంపిణీకి ఆటంకం కలిగిస్తే ఏ డీలర్‌నైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని సమ్మె విషయాన్ని పునరాలోచించుకోవాలని కోరారు. డీలర్లు సమ్మెకు వెళ్లినా ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు పౌరసరఫరాల శాఖ సంసిద్ధంగా ఉందన్నారు. పేదలకు సరుకులు అందించే కనీస బాధ్యత పౌరసరఫరాల శాఖపై ఉందని.. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించే సామర్థ్యం కూడా తమ వద్ద ఉందని చెప్పారు. -
అరాచకం: మహిళపై టీడీపీ రేషన్ డీలర్ దాడి
సాక్షి, కర్నూలు(ఆదోని టౌన్): పేదల బియ్యాన్ని స్వాహా చేయటంపై అధికారులకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో అధికార పార్టీకి చెందిన రేషన్ డీలర్, అతడి సోదరులు ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్‌లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. అక్రమాలపై ఫిర్యాదు చేశారనే కక్షతోనే టీడీపీకి చెందిన అంజినయ్య గ్రామంలో రేషన్ డీలర్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. కార్డుదారులకు రేషన్ సక్రమంగా ఇవ్వకుండా బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు అతడిపై ఆరోపణలున్నాయి. డీలర్ అక్రమాలపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు స్థానిక తహశీల్దార్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వీఆర్వో రామాంజనేయులు ఆదివారం గ్రామంలో విచారణ జరపగా రేషన్ డీలర్ బియ్యం ఇవ్వటం లేదని వంద మందికిపైగా కార్డుదారులు తెలిపారు. ఇదే నివేదికను వీఆర్వో తహసీల్దార్‌కు సమర్పించారు. ఏపీ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసె క్రిష్ణమ్మ కూడా సోమవారం గ్రామాన్ని సందర్శించి డీలర్ అక్రమాలు, తూకాల్లో మోసాలపై ఆరా తీశారు. దీన్ని జీర్ణించుకోలేని డీలర్ అంజనయ్య, అతడి సోదరులు నాగరాజు, కేశవ్, ఈరన్న గ్రామస్తులతో గొడవకు దిగారు. తమపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ గొల్ల లక్ష్మి అనే మహిళను దుర్భాషలాడారు. ఆమెపై భౌతిక దాడికి దిగి కొట్టటంతో జాకెట్ చిరిగిపోయింది. ట్రాక్టర్‌తో ఢీ కొట్టి చంపుతామంటూ బెదిరించారు. దాడితో అస్వస్థతకు గురైన బాధితురాలిని కుటుంబ సభ్యులు ఆదోని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. నడుము భాగం దెబ్బ తిన్నట్లు వైద్యులు చెప్పారని పోలీసులు, మీడియా వద్ద బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వేడుకుంది. లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఈ–పాస్ కష్టాలు ఇంతింత కాదయా..
రామాయంపేట(మెదక్): రేషన్ దుకాణాల్లో అమర్చిన ఈ–పాస్ మిషన్లతో లబ్ధిదారులు నానా కష్టాలు పడుతున్నారు. ఓ వైపు వేలి ముద్రలు గుర్తించక ఇబ్బందులు పడుతుంటే, మరో వైపు సిగ్నల్ కష్టాలూ వెంటాడుతున్నాయి. మండల పరిధిలోని దంతేపల్లి గ్రామంలో సిగ్నల్ రాకపోవడంతో ఆ రేషన్ డీలర్ ఈ–పాస్ మిషన్‌ను పొలాల వద్దకు తీసుకెళ్లి లబ్ధిదారులతో వేలి ముద్రలు వేయిస్తున్నాడు. దీంతో లబ్ధిదారులు రేషన్‌షాపుకు బదులుగా పొలాల వద్దకూ వెళ్లక తప్పని దుస్థితి నెలకొంది. -
డీలర్ల పరీక్ష ప్రశ్నాపత్రం లీక్?
కడప సెవెన్‌రోడ్స్: కడప రెవెన్యూ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ చౌకదుకాణాల భర్తీ కోసం శుక్రవారం కడపలో నిర్వహించిన రాత పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయిం దంటున్న అంశం తీవ్ర కలకలం రేపుతోంది. రేషన్ షాపులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కట్టబెట్టడం కోసం అధికారులే ఈ నిర్వాకానికి పాల్పడ్డారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ఎఫ్ పీ షాపుల భర్తీని అడ్డుకునేందుకు కొందరు చేస్తున్న పన్నాగమే తప్ప.. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని అధికారులు అంటున్నారు. గతంలో రాత పరీక్షకు 60, ఇంటర్వ్యూకు 40 మార్కులు ఉండేవి. రాత పరీక్షలో అంతంత మాత్రం మార్కులు వచ్చినా ఇంట ర్వ్యూలో అధిక మార్కులు వేసి తమకు కావా ల్సిన వ్యక్తులకు ఎఫ్ పీ షాపులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ సారి రాత పరీక్షలకు 80, ఇంటర్వ్యూకు 20 మార్కులు కేటాయించారు. ఇందువల్ల నిజమైన ప్రతిభావంతులకే ఎఫ్పీ షాపులు వస్తాయని భావించారు. కాగా ఈసారి ఏకంగా ప్రశ్నాపత్రాన్నే లీక్ చేసి అస్మదీయులకు షాపులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. కడప రెవెన్యూ డివిజన్లో 275 ఎఫ్పీ షాపుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కాగా 49 షాపులకు దరఖాస్తులే రాలేదు. ఇక రాత పరీక్ష కోసం 864 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 725 మంది హాజరయ్యారు. రాత పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు జీఓ ఎంఎస్ నంబర్: 4 ప్రకారం 1:5 నిష్పత్తిలో సోమవారం ఆర్డీఓ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రశ్నాపత్రం లీకైంýదంటూ ఆరోపణలు రావడం కలకలం రేపుతోంది. పరీక్షలను రద్దు చేయాలి: టీడీపీ నేతల డిమాండ్ చౌక దుకాణాల భర్తీకోసం శుక్రవారం నిర్వహించిన రాత పరీక్షలను రద్దు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు వీణా అజయ్‌కుమార్, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ విశ్వనాథరెడ్డి డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం స్థానిక బాలాజీ కాంప్లెక్స్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాత పరీక్షలకు ముందుగానే పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. అందులో భాగంగా శుక్రవారం జరిగిన పరీక్షల్లో అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలోనే జవాబులను టైప్ చేసి పంపించడం జరిగిందన్నారు. పరీక్ష ప్రారంభమైన అరగంటకే ప్రశ్నాపత్రం బయటికి రావడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. ఈ పరీక్షలను రద్దు చేసి అదే అభ్యర్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ప్రశ్నాపత్రం లీకేజీకి కారకులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జనార్దన్, బ్రహ్మ, శ్రీను పాల్గొన్నారు. ప్రశ్నాపత్రం కాదు.. కీ: ఆర్డీఓ ఈ అంశంపై ఆర్డీఓ దేవేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. అది ప్రశ్నాపత్రం కాదని.. కీ అని తెలిపారు. కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న ఎఫ్పీ షాపుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రతిసారి కొందరు వ్యక్తులు ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన చెప్పారు. ఈసారి కూడా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని పేర్కొన్నారు. అయితే తాము కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంతో.. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు వెలువరించిందన్నారు. దీంతో షాపుల భర్తీ ప్రక్రియకు లైన్ క్లియర్ కావడంతో కొందరు జీర్ణించుకోలేక పోయారన్నారు. ప్రశ్నాపత్రాన్ని పౌరసరఫరాల అధికారులు రూపొందించి తొమ్మిది సీల్డ్ కవర్లలో పరీక్షకు అరగంట ముందు తమకు పంపారని తెలిపారు. అందరి సమక్షంలో తొమ్మిది సీల్డ్ కవర్లను తెరిచి ప్రశ్నాపత్రాలను అభ్యర్థులకు పంపిణీ చేశామన్నారు. అన్నీ పారదర్శకంగా ఉండేందుకు వీడియో కూడా తీయించామన్నారు. ఈ విషయంలో అవకతవకలు జరిగే అవకాశమే లేదని స్పష్టం చేశారు. అర్హులైన అభ్యర్థులకు సోమవారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. -
రేషన్.. పరేషాన్..
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రేషన్ దుకాణాలకు అందజేసిన ఈపాస్ మిషన్లలో లబ్ధిదారులు వేలిముద్ర వేస్తేనే సరుకులను అందజేస్తారు. అయితే సర్వర్ సమస్యతో ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటంతో సరుకుల పంపిణీ 40 శాతం నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దుకాణాల ఎదుట లబ్ధిదారులు పడిగాపులు కాస్తూ అవస్థలు పడుతుండగా, అటు డీలర్లు మొరాయిస్తున్న మిషన్లతో గడువులోగా సరుకులు పంపిణీ చేయక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో సరుకుల పంపిణీలో ఆలస్యం జరుగుతోంది. ఆగస్టులో ఈ పాస్ యంత్రాలు అందజేసిన ఒయాసిస్ కంపెనీ సెప్టెంబర్ నుంచి నూతన విధానంలో సరుకులు పంపిణీ చేసేలా సాంకేతిక జోడించింది. ఆ సమయంలో తదనుగుణంగా సంబంధిత యంత్రాలు అందజేయగా సరుకుల పంపిణీ సాగింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సర్వర్‌ను మార్పు చేయడంతో ఈపాస్ యంత్రాలు దాదాపు స్థంబించిపోయాయని డీలర్లు వాపోతున్నారు. సరుకుల కోసం వెళ్లిన లబ్ధిదారులు పడిగాపులు గాసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి 7వ తేదీ దాటినప్పటికీ సరుకుల పంపిణీ ప్రారంభించని దుకాణాలు ఉమ్మడి జిల్లాలో 600కు పైగానే ఉన్నాయని సమాచారం. సాంకేతిక సమస్యతో పరికరాలను పట్టుకుని పౌరసరఫరాల శాఖ కార్యాలయానికి వస్తున్నారు. ఈ–పాస్ యంత్రాల వెనుక ఉద్దేశం.. పేదల పొట్ట నింపేందుకు ప్రభుత్వం నెలనెలా పౌరసరఫరాల దుకాణాల ద్వారా రూపాయికే కిలో బియ్యాన్ని, ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తోంది. బియ్యం పంపిణీ ఎంతగా పెరిగిందో, అదే స్థాయిలో రేషన్ బియ్యంలో అక్రమాలకు తావు ఏర్పడింది. బియ్యం రేషన్ దుకాణాలకు పూర్తిగా చేరకుండానే, మిల్లర్లకు, వ్యాపారుల దరికి చేరుతున్నాయి. ఇలా ప్రతి నెలా లారీల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అక్రమాలను అడ్డుకోలేక పోయింది. చివరకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్, ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌లు నియంత్రణపై దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో ఈ– రేషన్ ప్రక్రియకు ఈ ఏడాది మార్చి నెల నుంచి శ్రీకారం చుట్టింది. రేషన్ దుకాణాలలో వేలిముద్రల (ఈ–పాస్) యంత్రాలను ఏర్పాటు చేశారు. తద్వారా రేషన్ సరుకుల్లో అక్రమాలను అరికట్టగలిగారు. ఈ ప్రక్రియ విజయవంతం కావడంతో జిల్లాలకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన కసరత్తును అన్ని జిల్లాల్లో ప్రారంభించింది. ఇబ్బందికరంగా సరుకులకు పంపిణీకి గడువు... ప్రభుత్వం రేషన్‌సరుకులను ప్రతి నెల ఒకటి నుంచి 15 వరకే పంపిణీ చేయాలని మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే 7వ తేదీ దాటినప్పటికీ ఈ పాస్ యంత్రాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడంతో గడువులోగా పంపిణీ జరగడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ డీలర్ సరుకులను పంపిణీ చేయాల్సి ఉండగా సర్వర్ సమస్యతో ఒక్కో డీలరు రోజుకు 50 మందికి మించి సరుకులు పంపిణీ చేయలేకపోతున్నారు. ఈ పాస్ యంత్రంలో వేలిముద్ర వేసిన అనంతరం డిస్ప్లేలో పేరు రావడం తదుపరి తూకం వేయడం ప్రక్రియతో దాదాపు 10 నుంచి 20 నిమిషాలు పడుతున్న సంధర్డాలుంటున్నాయి. ఈ పాస్ యంత్రానికి.. తూకం యంత్రానికి అనుసంధానం కాకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఉమ్మడి జిల్లాలో 40 శాతానికి పైగా దుకాణాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో సరుకులను సకాలంలో.. గడువులోగా పంపిణీ చేయడం సందిగ్ధంగా మారింది. యంత్రాల సాంకేతిక సమస్యలను కంపెనీ ప్రతినిధులు పట్టించుకోవడం లేదని డీలర్లు వాదిస్తున్నారు. వేలిముద్రలు పడక తిప్పలు...15వ తేదీ వరకే పంపిణీతో ఇబ్బంది రేషన్‌దుకాణాల వద్దకు కార్డుదారులే స్వయంగా వచ్చినా బయోమెట్రిక్ యంత్రంపై వారి వేలిముద్రలు పడనికారణంగా డీలర్లు సరుకులను ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. వేలిపై ఉన్న గీతలు యంత్రంపై పడని కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడుతోందని అధికారులంటున్నారు. అయితే చాలా కొద్దిమందికే ఇలాంటి పరిస్థితి ఉంటుందని, అలాంటి వారికి సరుకులను ఇచ్చేందుకు (కార్డుదారుల్లో 1శాతం మించకుండా) డీలర్లకు అనుమతిచ్చామని తెలిపారు. ఈ పాస్ విధానంతో సబ్సిడీ సరుకులను తీసుకెళ్లేందుకు వద్దులు, ఒంటరిగా ఉన్నవారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో కార్డుదారులు లేకున్నా వారి బంధు, మిత్రులు వచ్చి సరుకులు తీసుకెళ్లే అవకాశముండేది. ఇపుడు ఆ అవకాశం లేకపోవడంతో డీలర్ల వద్ద సరుకులు ఎక్కువ మొత్తంలో మిగులుతున్నాయి. కాగా ప్రతి నెల 15వతేది లోగానే లబ్ధిదారులు రేషన్ దుకాణాలనుంచి సరుకులను పొందాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈపాస్ మిషన్లు అపుడపుడు పనిచేయకపోవడంతో సమయమంతా వధా అవుతోందని, తమకు వీలున్నపుడు వచ్చే అవకాశం లేకుండా పోతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. గతంలో మాదిరిగానే నెల చివరి వారం వరకు పంపిణీ చేసేలా చూడాలన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పంపిణీ అంతకంతే.. 10 రోజుల్లో 50 శాతమే ఉమ్మడి జిల్లాల్లో ని రేషన్ దుకాణాలలో ఈ పాస్ విధానంలో సాంకేతిక అంతరాయాలు అవరోధంగా మారాయి.. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో 16 మండల లెవెల్ స్టాక్ పాయింట్ల (ఎంఎల్ఎస్) నుంచి 1,880 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెల 16,644 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. పంచదారను అంత్యోదయ, అన్నపూర్ణ కార్డుదారులకు అందజేస్తున్నారు.. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో 9,41,948 కార్డులు 27,73,996 యూనిట్లపై 16,643.976 బియ్యంకు పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటికీ 50 శాతం కూడా పంపిణీ చేయలేదని తెలుస్తోంది. అయితే సర్వర్ మార్పుతో గత కొద్ది రోజులుగా ఈపాస్ మిషన్లు మొరాయిస్తుండటమే ఇందుకు కారణంగా అధికారులు చెప్తుండగా... లబ్దిదారులకు తిప్పలు తప్పడం లేదు.. ఈ విషయంలో అధికారుల ముందస్తు ప్రణాళికలోపం స్పష్టమవుతోంది. కిరోసిన్ పంపిణీలోను ఇదే రకమైన సమస్య ఉత్పన్నమవడం చర్చనీయాంశంగా మారింది. సరుకుల పంపిణీకు ముందే సర్వర్ మార్పును, సాంకేతిక సమస్యలను అధిగమిస్తే డీలర్లకు.. ఇటు లబ్దిదారులకు తిప్పలుండేవి కావని స్పష్టమవుతోంది. ఇప్పటివరకు బియ్యం తీసుకోలే.. గీ ఏలి ముద్రలు ఎప్పుడు సురువు అయినయో గప్పడి నుంచి నా చేతి వేలిముద్రలు వస్తలేవు అంటున్నారు. నా భర్త వేలిముద్రలు కూడ మిషన్ తీసుకుంట లేదు. బియ్యం పంచినప్పుడల్ల పోయినా ఎన్నిసార్లు వేలిముద్రలు పెట్టిన రాలేదు. ఇప్పటి వరకు బియ్యం తీసుకోలేదు. మరునాడు పోతే గడువు ముగిసిందని ఇస్తలేరు. బియ్యం కాడికి పోతే బాగా తిప్పలు అవుతుంది. గిట్లయితే ఎట్ల. బియ్యం వచ్చేలా చూడాలి సారు. –మసర్తి నర్సవ్వ, బుగ్గారం -
రేషన్‌కు నెట్వర్క్ తిప్పలు
చౌటుప్పల్ : రేషన్ దుకాణాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నూతనంగా ప్రవేశపెట్టిన ఈ–పాస్ యంత్రాలు లబ్ధిదారులకు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. నెట్వర్క్ ఆధారంగా నడిచే ఈ–పాస్ యంత్రాలు సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో మొరాయిస్తున్నాయి. దీంతో లబ్ధిదారులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుంది. అయినా ఒక్కోసారి ఫలితం లేకపోవడంతో వెనుదిరుగుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువగా మారుమూల ప్రాంతాల్లో చోటు చేసుకుంటుంది. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలంలోని జైకేసారంలో ఆదివారం రేషన్‌డీలర్, లబ్ధిదారులు ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయ భవనంపైకి ఎక్కారు. డీలర్ తూర్పింటి భూపాల్ ఇంట్లో సరిగ్గా నెట్వర్క్ రావడం లేదు. దీంతో ఆయన భార్య భాగ్య ఈ–పాస్ యంత్రాన్ని తీసుకుని గ్రామ పంచాయతీ భవనంపైకి వెళ్లింది. లబ్ధిదారులు సైతం ఆమె వెంట వెళ్లారు. అక్కడ యంత్రానికి సిగ్నల్స్ అందడంతో వారికి టోకెన్ జారీ చేశారు. టోకెన్ల ఆధారంగా డీలర్ ఇంట్లో సరుకులు తీసుకెళ్లారు. వేలిముద్రలు వేసేందుకు వృద్ధులు గ్రామ పంచాయతీ భవనంపైకి ఎక్కి కిందికి దిగేం దుకు అవస్థలు పడ్డారు. సరైన సిగ్నల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులను తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపా«ధ్యక్షుడు పల్లె మధుకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రేషన్ డీలర్ల సమ్మె విరమణ
నల్లగొండ : రేషన్ డీలర్లు సమ్మెను విరమించారు. తమ డిమాండ్ల సాధనకు నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న డీలర్లు ప్రభుత్వం వైపు నుంచి హామీరావడంతో శుక్రవారం సమ్మె విరమించినట్లు జిల్లా డీలర్ల సంఘం అధ్యక్షుడు వైద్యుల సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నల్లగొండలో సివిల్ సప్లై గోదాం వద్ద నాలుగో రోజు సమ్మె కొనసాగించిన డీలర్లు ప్రస్తుతానికి సమ్మె వాయిదా వేస్తున్నట్లు సాయంత్రం ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ఈ నెల 10 నుంచి 14 తేదీ మధ్యలో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం నుంచి పిలుపు వచ్చిందని వివరించారు. ప్రభుత్వం ప్రకటన మేరకు 14 తేదీలోగా సమస్యల పైన ఎలాంటి హా మీగానీ చర్చలు జరిగని పక్షంలో మళ్లీ సమ్మెలోకి దిగుతామని స్పష్టం చేశారు. ‘మిర్యాల’లో భారీ ర్యాలీ మిర్యాలగూడ : డిమాండ్ల పరి ష్కారం కోసం రేషన్ డీలర్ల సం క్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేషన్ డీలర్లను ప్ర భుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని, ఆచరణలో అమలు చేయడం లేదన్నారు.ర్యాలీలో రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు అజీజ్, గజ్జి మధుసుదన్, పగిళ్ల వెంకటేశ్వర్లు, ఉబ్బపల్లి కాశయ్య, ఉబ్బపల్లి వెంకటేశ్, దైద మనోహర్, బడుగుల లింగయ్యయాదవ్, సుధాకర్‌రెడ్డి, గందె నాగేశ్వర్రావు, నూకపంగ సోమ య్య, విజయలక్ష్మి, మణెమ్మ పాల్గొన్నారు. -
గేదె ఢీకొని ‘ఎయిర్‌ఫోర్స్’ కుమారుడి దుర్మరణం
కోదాడరూరల్ : గేదె ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన అనంతగిరి మండల పరిధి మొగలాయికోటలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ఎయిర్‌ఫోర్స్ వెంకటర్‌రెడ్డి కుమారుడు, స్థానిక రేషన్‌డీలర్ సింగారెడ్డి జితేందర్‌రెడ్డి(41) రాత్రి బుల్లెట్‌పై కోదాడకు వస్తుండగా గ్రామశివారులో గేదెను ఢీకొట్టడంతో కింద పడిపోయాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఆటోలు కోదాడకు తరలిస్తుండగా మార్గమధ్యలోని ఖానాపురం వద్ద మృతిచెందాడు. మృతదేహాన్ని బుధవారం కోదాడ ప్రభు త్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించినట్లు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్‌రెడ్డి కుటుంబంలో విషాదం ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన వెంకట్‌రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఈ యన కు ఇద్దరు కుమారులు,కుమార్తె. 25ఏళ్ల క్రితం ఓ కుమారు డు కేన్సర్‌తో, ప్రస్తుతం రోడ్డు ప్రమాదంలో మరో కు మారుడు మృతిచెందడంతో విషాదం అలుముకుంది. -
కత్తిగట్టారు!
కర్నూలులో దారుణ హత్య - ప్రాణం తీసిన ఈ-పాస్ కుంభకోణం - మృతుడు ప్రజాపంపిణీ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు - విజిలెన్స్‌కు సమాచారం ఇచ్చాడని కక్ష - కిరాయి హంతకుల ప్రమేయంపై పోలీసుల అనుమానం కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రజాపంపిణీ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్‌గౌడ్ హత్యతో కర్నూలు నగరం ఉలిక్కిపడింది. ఈ పాస్ కుంభకోణంపై విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారనే కక్షతో బాధిత డీలర్లు కిరాయి హంతకులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు శివారులోని జొహరాపురానికి చెందిన వెంకటేష్ గౌడ్ రేషన్‌షాపు డీలర్‌గా పనిచేస్తున్నారు. ఈయనకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య లక్ష్మీదేవికి ఒక కుమారుడు, కూతురు. వీరు నగరంలోని బిర్లాగడ్డలో నివాసం ఉంటున్నారు. రెండో భార్య పేరు కూడా లక్ష్మీదేవినే. ఈమెకు ఇద్దరు కుమారులు, ఒక కుతూరు సంతానం. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి వెంకటేష్‌గౌడ్ సమీప బంధువు. నగరంలోని అన్ని పార్టీల నాయకులతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి. డీలర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన వెంకటేష్‌గౌడ్ అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షునిగా పనిచేస్తున్నారు. ప్రాణం మీదకు తెచ్చిన ఈ–పాస్ కుంభకోణం నాలుగైదు నెలల క్రితం జిల్లాలో ఈ–పాస్ కుంభకోణం ఓ కుదుపు కుదిపింది. ఈ కుంభకోణంలో 161 మంది డీలర్లు బైపాస్ చేసి ప్రజల సరుకులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. బైపాస్ చేసిన సమాచారాన్ని వెంకటేష్‌గౌడ్ విజిలెన్స్ అధికారులకు అందజేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఈ కుంభకోణంలో 161 మంది డీలర్లు సస్పెండ్ అయ్యారు. ఇందులో కర్నూలు నగరంలోనే 100 మంది ఉన్నారు. దీంతో వీరందరినీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు సస్పెండైనా డీలర్లు ఆయనపై కక్ష పెంచుకొని హత్య చేయించినట్లు తెలుస్తోంది. కిరాయి హంతకుల పనేనా? మద్దూరు నగర్‌లోని జానీ సైబర్ల్యాండ్లో ఉన్న వెంకటేష్‌గౌడ్‌ను ఆటోలో నుంచి దిగిన ఐదుగురు దుండగులు సెకన్ల వ్యవధిలో హత్య చేశారు. వేటకోడవళ్లతో తలపై ఒక్క దెబ్బతో ప్రాణం తీశారంటే కచ్చితంగా కిరాయి హంతకుల పనేనని పోలీసులు భావిస్తున్నారు. వెంకటేష్ తలపై నిలువుగా నరకడంతో వెనుక వైపు నుంచి ముందు భాగం వరకు చీలిపోయింది. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. అడ్డు వచ్చిన సైబర్ల్యాండ్ నిర్వాహకుడు రఘు, మరోవ్యక్తి చంద్రేశేఖరరెడ్డిలపైనా దుండగులు దాడి చేశారు. దీంతో ఆ కాలనీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు చంద్రశేఖరరెడ్డిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓఎస్డీ రవిప్రకాష్, డీఎస్పీ రమణకుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎనిమిది మంది డీలర్లపై హత్య కేసు నమోదు వెంకటేశ్‌గౌడ్ హత్య కేసులో భార్య సుమలత(లక్ష్మీదేవి) ఫిర్యాదు మేరకు నగరంలోని 8 మంది డీలర్లపై కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన్‌రావు తెలిపారు. అనుమంతయ్య, పక్కీరప్ప, గనిబాషా, ఎరుకలి శీను, నూర్‌బాషా, వడ్డేగేరి రమేష్, లక్ష్మన్న, ప్రమీలమ్మ తదితరులు కిరాయి హంతకులతో కలిసి తన భర్తను హత్య చేయించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. -
రేషన్ డీలర్ల పోరుబాట
• ప్రభుత్వం తమ సమస్యలు తీర్చాలని డిమాండ్ • 10న ఇందిరా పార్కు వద్ద నిరసన సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కల సాకారం అయినప్పటికీ తమ సమస్యలు మాత్రం తీరడం లేదంటూ ప్రభుత్వ చౌక ధరల దుకాణ డీలర్లు ఆందోళన బాట పట్టనున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేలా చేయడం కోసం ఈ నెల 10న హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అయినా సర్కారు స్పందించకుంటే ఆమరణ దీక్షకు దిగనున్నారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ గతేడాది ఆగస్టులో ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తుల రమేశ్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై మంత్రికి 15 సార్లు విజ్ఞప్తి చేశామని, కమిషనర్‌ను కలిసినా, ప్రభుత్వం తమ సమస్యలను పక్కన పెట్టేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి తమ నిరసన తెలిపేందుకు 10వ తేదీన ఒక రోజు దీక్ష చేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 23 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని రమేశ్‌బాబు చెప్పారు. ఇవీ ప్రధాన డిమాండ్లు... ⇔ రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. లేకుంటే కనీసం రూ.20వేల –రూ.30వేల గౌరవ వేతనమన్నా ఇవ్వాలి. ⇔ ఆరోగ్య కార్డులు, ఇళ్లు లేని వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలి. ⇔ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రయోగాత్మకంగా ఈ–పాస్ విధానం అమలు చేస్తున్న 1,545 రేషన్ డీలర్లకు తొమ్మిది నెలలుగా ఇవ్వాల్సిన కమీషన్‌ను చెల్లించాలి. ఒక్కో డీలర్‌కు కనీసం రూ. లక్ష దాకా కమీషన్ ఇవ్వాల్సి ఉంది. ⇔ ప్రతి నెలా రేషన్ సరుకులు తీసుకో వడానికి చెల్లించాల్సిన డీడీల కోసం వడ్డీలేని రుణాలు ఇవ్వాలి. -
కులం పేరుతో దూషించారంటూ డీలర్‌పై ఫిర్యాదు
శెట్టూరు : తమ గ్రామంలోని ప్రభుత్వ చౌక ధాన్యపు డిపో డీలర్ కురబ రాజు తనను కులం పేరుతో దూషించి, చెయ్యి చేసుకున్నట్లు శెట్టూరు మండలం లింగదీర్లపల్లికి చెందిన ఎరుకుల ఇందిరమ్మ ఆరోపించారు. శుక్రవారం మధ్యాహ్నం స్టోర్‌కు వెళ్లగా కిందపడ్డ బియ్యాన్ని తీసుకెళ్లాల్సిందిగా డీలర్ ఆదేశించాడన్నారు. అందుకు తాను అభ్యంతరం తెలపడంతో మాటామాటా పెరిగిందన్నారు. డీలర్ కులం పేరుతో దూషించగా, ఆయన భార్య త్రివేణి, అతని సోదరుడు మర్రిస్వామి తన చెంపపై కొట్టారని కన్నీటిపర్యంతమయ్యారు. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని కోరుతూ భర్త నీలాంజితో కలసి డిప్యూటీ తహశీల్దార్ శ్రీనాథ్‌రెడ్డి సహా పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తహశీల్దార్ వాణిశ్రీ దృష్టికి ఫోన్లో తీసుకెళ్లగా.. ఆర్ఐని గ్రామానికి పంపి విచారణ జరిపించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఈ డీలరు మాకొద్దు...
పోతురాజుపేట (సంతకవిటి) : మండాకురిటి పంచాయతీ పోతురాజుపేట గ్రామంలో రేషన్ డిపో డీలరు విషయమై శనివారం వివాదం నెలకొంది. గ్రామంలో కిరాణ షాపు వద్ద రేషన్ సరుకులను డీలరు విక్రయిస్తుండగా గ్రామానికి చెందిన కొందరు కార్డు లబ్ధిదారులు అడ్డుతగిలారు. కార్డు లేని వ్యక్తికి రేషన్ డిపో బాధ్యతలు అప్పగించి డిపో నడమేంటని నిలదీశారు. ఈ క్రమంలో సరుకులు విక్రయించిన వ్యక్తికి, గ్రామస్తులకు వివాదం రేగింది. ఈ విషయంలో గ్రామస్తులంతా ఒక్కటవ్వడంతో రేషన్ సరుకులు విక్రయించిన వ్యక్తి మిన్నకుండిపోయాడు. విషయం తెలుసుకున్న సంతకవిటి రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకుని రేషన్ సరుకుల విక్రయాన్ని తాత్కాలికంగా నిలిపి వేయించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో తొలగించిన రేషన్ డీలరు స్థానంలో కొత్తగా అంబళ్ల ఈశ్వరమ్మ అనే మహిళను నియమించారని, ఈమెకు గ్రామంలో రేషన్ కార్డు కూడా లేదని ఎలా విక్రయిస్తుందని ప్రశ్నించారు. రేషన్ సరుకులను కిరాణ షాపు వద్ద విక్రయించడం అనుమానాలకు తావిస్తుందన్నారు. అధికార పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు ఇలా దొడ్డిదారి వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. -
నీవులేక నేనులేను..
► భార్య మృతిచెందిన మరుసటి రోజే భర్త మృతి ► నర్సాయిపల్లిలో ఘటన మాడ్గుల : అనారోగ్యంతో భార్య మృతి చెందడంతో భర్త తట్టుకోలేకపోయాడు. ఆమె లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. లోలోపలే కుమిలిపోయి తీవ్రఅస్వస్థతతో భార్యచనిపోయిన మరుసటి రోజే ప్రాణాలు వదిలాడు. ఈసంఘటన మండలంలోని నర్సాయిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రేషన్‌డీలర్ ముద్దం జయమ్మ ఇటీవల అనారోగ్యానికి గురయ్యింది. ఎంతకూ నయంకాక బుధవారం మృతిచెందింది. అదేరోజు కుటుంబసభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. భార్య చనిపోవడంతో భర్త వెంకటయ్యగౌడ్ లోలోపలే కుమిలిపోయాడు. తనను వదిలివెళ్లిందనే వేదనతో అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు గురువారం అతన్ని ఆమనగల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వీరికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తల్లిదండ్రులు మృతి చెందడంతో వారంతా గుండెలు బాదుకున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. విషయం తెలియడంతోబాధిత కుటుంబ సభ్యులను జెడ్పీటీసీ సభ్యులు రవితేజ, ఎంపీపీ జైపాల్‌నాయక్, ఆమనగల్లు మాజీ మార్కెట్ ఛెర్మైన్ భట్టు కిషన్‌రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, డీటీ రాంచంద్రయ్య పరామర్శించారు. కుమారుడు కార్తీక్‌కు రెవెన్యూ ఉద్యోగుల సంఘం హెల్ప్‌లైన్ తరపున రూ.10వేలు సాయాన్ని తహసీల్దార్ అందజేశారు. -
సాక్షి విలేకరిపై దాడికి నిరసనగా వైఎస్సార్సీపీ రాస్తారోకో
అనంతపురం జిల్లా ఓబుళదేవరచెరువు సాక్షి విలేకరి చంద్రశేఖర్‌రెడ్డిపై దాడికి పాల్పడిన రేషన్ డీలర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నేతలు ఆదివారం మండల కేంఆదంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోయింది. విలేకరిపై దాడిచేసిన దుండగులపై చర్య తీసుకునేవరకూ ఆందోళన ఆగదని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. -
విలేకరిపై దాడికి నిరసనగా రాస్తారోకో
ఓడీచెరువు (అనంతపురం జిల్లా) : ఓడీ చెరువు 'సాక్షి' విలేకరి చంద్రశేఖర్ రెడ్డిపై దాడికి నిరసనగా సీపీఐ, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఓడీ చెరువులో శనివారం రాస్తారోకోకు దిగారు. దాడికి పాల్పడిన రేషన్ డీలర్ యజమానిని వెంటనే అరెస్ట్ చేయాలని, డీలర్షిప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఓడీచెరువు మండలంలోని మహమ్మదాబాద్ క్రాసింగ్ వద్ద నున్న చౌక ధరల దుకాణం డీలర్ మానస తమకు సరుకులు సక్రమంగా ఇవ్వడంలేదని కార్డుదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై గురువారం డిప్యూటీ తహశీల్దార్ మహబూబ్‌పీరా గ్రామానికి వెళ్లి విచారణ జరిపారు. ఈ అంశాన్ని ‘సాక్షి’తో పాటు అన్ని పత్రికలూ ప్రచురించాయి. అయితే సాక్షిలో ఫోటోతో పాటు ప్రచురించారంటూ డీలర్ భర్త రాజశేఖరా చారి, అతడి అత్తమామలు మునిస్వామి, వెంకటలక్ష్మి శుక్రవారం సాక్షి విలేకరిపై దాడి చేసి దుర్భాషలాడారు. స్థానికులు కల్పించుకుని విలేకరిని కాపాడారు. దాడికి పాల్పడ్డ వారిపై బాధితుడు ఓడీ చెరువు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
రేషన్ కోసం గ్రామస్తుల ధర్నా
మూడు నెలలుగా రేషన్ సరుకులు ఇవ్వడం లేదంటూ.. దర్శి మండలం ఎర్రబోనపల్లె గ్రామస్తులు మంగళవారం ఆందోళనకు దిగారు. గ్రామస్తుల ఆందోళనతో ఆర్ఐ సత్యమూర్తి గ్రామానికి చేరుకుని రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు. డీలర్ చింతా వెంకటరమణారెడ్డి పరారయ్యాడు. ఇంతకు ముందున్న డీలర్ అక్రమాలకు పాల్పడుతున్నాడని టీడీపీ నేతలు అక్రమ కేసులు పెట్టి తొలగించారు. అతని స్థానంలో వచ్చిన టీడీపీ కార్యకర్త రమణారెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. -
డీలరే బాస్!
రేషన్ డీలరే బాస్... అతనితో ‘డీల్’ కుదిరితేనే ఆహార భద్రత కార్డు... అతను కన్ను గీటితే కార్డు రెక్కలు కట్టుకొని వచ్చి మన ఇంటి ముంగిట వాలిపోతుంది... లేదంటే కాళ్లరిగేలా తిరిగినా కార్డు దొరకదు.... ఆహార భద్రత కార్డుల జారీలో ప్రస్తుతం జిల్లాలో సాగుతోన్న తంతు ఇదే. అధికారుల ఇష్టారాజ్యంతో కూలీనాలి చేసుకునే నిరుపేదల జీవితం ఆహార భద్రత కార్డుల వేటలో కునారిల్లిపోతోంది. డీలర్‌తో ప్రమేయం లేకుండా ఎంతకాలం తిరిగినా ఆహార భద్రత కార్డు అందటం లేదని సగటు జీవులు ఆందోళన చెందుతున్నారు. డీల్ కుదిరితేనే రేషన్ కార్డు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రేషన్ దుకాణాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ ప్రక్రియను వేగవంతం చేశాయి. దీనికితోడు రాష్ట్ర ప్రభుత్వం పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా ఆహార భద్రత కార్డులు జారీ చేస్తోంది. దానితో రేషన్ దుకాణాల ద్వారా బియ్యం తీసుకుని జీవితాన్ని గడిపే పేదలు ఈ మార్పులకు అనుగుణంగా తమ వివరాలు పొందుపరిచేందుకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఆహార భద్రత కార్డు కోసం దరఖాస్తు నింపి, వీఆర్‌ఓతో విచారణ జరిపించుకుని, మాడే కడుపుతో తహశీల్ కార్యాలయానికి వెళ్లి, గంటల తరబడి వరుసలో నిల్చున్నా పని మాత్రం కావడం లేదు. కానీ రేషన్ డీలర్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వెంటనే కొత్త కార్డులు మంజూరవుతున్నాయి. డీలర్‌ను కాదని ఎన్నిరోజులు కార్యాలయాల చుట్టూ తిరిగినా కొత్త కార్డులు వచ్చే సమస్యే లేదు. ముఖ్యంగా పేదలు అటు పనులకు వెళ్లలేక ఇటు ఆఫీసుల్లో పని కాక నానా తంటాలు పడుతున్నారు. అక్కడ జిత్తులమారి ఎత్తులు... కొత్త కార్డుల జారీ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాల్సిన అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయి సిబ్బంది సొంత ఎజెండాను అమలు చేయడంలో తీరిక లేకుండా ఉంటున్నారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు పేదరికం, కుటుంబ వార్షిక ఆదాయం అర్హతగా కాకుండా తమకు నచ్చిన, తమను మెప్పించిన రేషన్ డీలర్ పరిధిలోకి వస్తాడా? రాడా? అనే అంశం ప్రాతిపాదికన పనులు చక్కబెడుతున్నారు. లేదా సదరు దరఖాస్తుదారుడి ప్రాంతానికి చెందిన రేషన్ డీలర్‌తో ‘డీల్’ కుదిరేదాక కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేస్తున్నారు. దాంతో ఇప్పటివరకు రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు సమర్పించిన వారిలో మూడొంతుల మందికి కొత్త కార్డులు మంజూరు కాలేదు. జిల్లాలో 26,84,020 ఆహార భద్రత కార్డు యూనిట్లు ఉండగా అధికారులు ఇప్పటివరకు 23,54,286 యూనిట్లకు మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తి చేశారు. మరో 3,29,734 యూనిట్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ జాప్యానికి లోపాయికారి కారణమేమిటో తెలియక కళ్లలో వత్తులు వేసుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లకు చెప్పులరిగేలా తిరుగుతున్నారు నిరుపేదలు. బియ్యం ఇస్తలేరు... కొత్త కారటు రాలేదని బియ్యమిస్తలేరు. ఎమ్మార్వో సారు కాడికి పోయి కారటు తెచ్చుకోమని చెప్పిండ్రు. మూడు నెలల నుంచి తిరుగుతున్నా పనైతలేదు. ఆటోలకే డబ్బులు అయితన్నై. కారటు మాత్రం ఇస్తలేరు, ఎప్పుడిచ్చేది సెప్తలేదు. బియ్యం వస్తలె.. - మంజుల, జహీరాబాద్ ఆధార్ కార్డు పట్టుకొని తిరిగినా.... ఆలుమగలం కూలి పని చేసుకుంటం. మాకు పాతది తెల్లరేషన్ కార్డు ఉండే. ఇప్పుడు ఇవ్వటం లేదు. ఆధార్ కార్డుతో సహా రేషన్ కార్డు కోసం ఇప్పటికే రెండుసార్లు దర ఖాస్తు చేసినా రాలేదు. మాకు కార్డు ఇప్పించాలని పలుమార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఇప్పటిదాక ఇవ్వలేదు. - కడమంచి సుధాకర్, రామాయంపేట గతంలో ఇచ్చిండ్రు.. ఇప్పుడేమో తీసిండ్రు.. నాలుగేళ్ల సంది నాకు అంత్యోదయ కార్డు ఉంది. నేను నిరుపేదను. అంత్యోదయ కార్డు కింద వచ్చే 35 కిలోల బియ్యంతో కుటుంబమంతా బతికినం. ఇప్పుడు ఆ కార్డు తీసేసిండ్రు. ఎందుకు తీసిండ్రని అడిగితే ఎవరు చెప్తలేరు. ఎమ్మార్వో సారు ఆఫీసు చుట్టూ తిరిగినా లాభం లేదు. అంత్యోదయ కార్డు తీసేయడంతో 18 కిలోల బియ్యమే ఇస్తున్నరు. ఈ బియ్యం సరిపోతలే. - బందెల సాయిలు, జంగరాయి, చిన్నశంకరంపేట -
రేషన్ డీలర్ ఆత్మహత్య
అధికార పార్టీ ఒత్తిడికి తాళలేక.. రైలు కిందపడిన వైనం గుంతకల్లు రూరల్ : అధికార పార్టీ ఆగడాలకు తాళలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త, రేషన్ డీలర్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురువారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే... పాత గుంతకల్లు శివాలయం సమీపంలో నివాసం ఉంటున్న చాకలి రంగనాయకులు, గౌరమ్మలకు ఐదుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కాగా అందులో పెద్దవాడు మధుబాబు (32). కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్న మధుబాబు వైఎస్ఆర్సీపీలో చురుకైన కార్యకర్తగా గుర్తింపు పొందాడు. చిన్నపాటి ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇదిలా ఉంటే తెలుగుదేశం అధికారంలోకి రావడంతో రేషన్ డీలర్లకు కష్టాలు మొదలయ్యాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల రేషన్ షాపులను లాక్కొడానికి రెవెన్యూ వారితో సైతం ఒత్తిడి తీసుకువచ్చి అనేక ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో మధుబాబుపై కూడా అధికార పార్టీతో పాటు రెవెన్యూ అధికారుల వేధింపులు మొదలయ్యాయి. కారణం లేకుండానే దుకాణంపై దాడులు చేయడం, సస్పెండ్ కూడా చేశారు. దీంతో ఆయన కోర్టులో స్టే తెచ్చు కున్నాడు. ఈ పరిణా మా లన్నింటితో తీవ్ర మనస్తాపం చెందిన మధుబాబు గురువారం రాత్రి ఇంటి నుంచి బయటికి వచ్చి ఎస్‌జెపీ పాఠశాల సమీపంలోని గుంతకల్లు -గూళ్లపాళ్యం ట్రాక్‌పై రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నా డు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీ రు మున్నీరయ్యారు. వైవీఆర్ దిగ్బ్రాంతి: మధుబాబుఆత్మహత్యచేసుకున్న విషయం తెలుసుకున్న ఆ పార్టీ సమన్వయకర్త వై వెంకటరామిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకుల పరామర్శ: మధుబాబు మృతి విషయం తెలియగా నే వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సం దీప్‌రెడ్డి, మున్సిపల్ ప్రతిపక్ష నాయకు డు మహబూబ్ బాషా, పట్టణ కన్వీనర్ వైసుధాకర్, జింకల రామాంజనేయు లు మధుబాబు మృతదేహాన్ని పరిశీ లించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. డీలర్ మృతిపై ఆర్డీఓ విచారణ : డీలర్ మధుబాబు ఆత్మహత్యకు సంబంధించి హుస్సేన్ శుక్రవారం విచారణ చేప ట్టారు. గుంతకల్లులో మధుబాబు ఇం టికి వెళ్లి కుటుంబ సభ్యులను మధు ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీశారు. కుటుంబ కారణాలు, అప్పులు కూడా మధు ఆత్మహత్యకు కారణాలుగా వెల్లడించారు. -
పేదల కడుపు కొడుతున్న రేషన్ డీలర్లు!
-
ఎన్ ఫోర్స్ మెంట్ దాడి..రేషన్ డీలర్ ఆత్మహత్య
ప్రకాశం(ఒంగోలు): ప్రకాశం జిల్లా సీమకుర్తి మండలం దేవరపాలెం గ్రామ రేషన్ డీలర్ పెండ్యాల బ్రహ్మానందం(45) ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజుల క్రితం జరిగిన ఎన్ఫోర్స్మెంట్ దాడుల్లో అక్రమ బియ్యం స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేస్తామని అనడంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం ఇంటినుంచి బయటకు వెళ్లిన బ్రహ్మానందం గురువారం ఉదయం ఒంగోలు రైల్వేస్టేషన్ సదరన్ వైపు ఒకటో నెంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద వున్న పార్కు ఎదుట ఆత్మహత్య చేసుకున్నాడు. అతని జేబులో విజయవాడకు వెళ్లడానికి అవసరమైన టికెట్ లభించింది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అతని కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యప్తు చేస్తున్నారు. -
ఏసీబీ వలలో పౌరసరఫరాల డీటీ
రేషన్ డీలర్ భర్త వద్ద రూ.8వేల లంచం తీసుకుంటూ .. గురజాల: రేషన్ డీలర్ భర్త వద్ద రూ.8 వేల లంచం తీసుకుంటూ సీఎస్‌డీటీ మాలెపాటి వీరవెంకటనారాయణమూర్తి ఏసీబీ వలలో పడిన సంఘటన గురజాలలో గురువారం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఎం.రాజారావు తెలిపిన వివరాల ప్రకారం.. రెంటచింతలకు చెందిన ఏశమ్మ గ్రామంలో షాపు నం.3 చౌకధరల దుకాణం నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టులో సోషల్ ఆడిట్ నిర్వహించగా.. సరుకు వివరాలు సరిగ్గా లేకపోవడంతో రేషన్ డీలర్‌ను సస్పెండ్‌చేసి షోకాజ్ నోటీసు అందజేశారు. ఆర్డీవోకు సమాధానం చెప్పి యధావిధిగా దుకాణాన్ని ప్రారంభించారు. అయితే, గత నెలలో గుర్తుతెలియని వ్యక్తులు డయల్ 100కు కాల్చేసి రెంటచింతల గ్రామంలో అక్రమంగా కిరోసిన్ తరలిస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఆ మేరకు పౌరసరఫరాల అధికారులు గత నెల 19న రేషన్ షాపులను తనిఖీచేశారు. రికార్డుల్లో కన్నా షాపు నం.3లో అదనంగా ఉన్న 50 కేజీల బియ్యం, 200 లీటర్ల కిరోసిన్, సుమారు ఐదు కేజీల పంచదారను పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్ (సీఎస్‌డీటీ) నారాయణమూర్తి సీజ్‌చేశారు. పౌరసరఫరాల చట్టం ప్రకారం రేషన్ డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేయాల్సివుంది. అయితే సీఎస్‌డీటీ రేషన్‌షాపు డీలర్ ఏశమ్మ భర్త ఓర్సు ప్రేమ్రాజుతో రూ.10 వేలు లంచం ఇస్తే ఎలాంటి కేసు లేకుండా చూస్తానని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని రూ.8 వేలు ఇస్తాననగా సీఎస్‌డీటీ సరేనన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రేమ్‌రాజ్ గుంటూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథక రచనలో భాగంగా రూ.8వేల (8 వెయ్యి నోట్లు) నగదును ప్రేమ్‌రాజ్ గురువారం మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న సీఎస్‌డీటీ నారాయణమూర్తికి అందించాడు. అదేసమయంలో ఏసీబీ డీఎస్పీ రాజారావు తన సిబ్బందితో దాడి చేసి సీఎస్‌డీటీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ మేరకు విచారించి కేసు నమోదుచేశారు. దాడుల్లో రేంజ్ ఎస్ఐ కె.సీతారామయ్య, నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
అధికార పార్టీ నేతల..‘ఇండోర్’ గేమ్స్
చీపురుపల్లి:అధికార పార్టీ నేతలు ప్రతి అంశాన్నీ రాజకీయంగానే చూస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న, మొన్నటి వరకు అంగన్వాడీ, ఉపాధిహామీ, రేషన్ డీలర్ అంటూ పలువురు ఉద్యోగులపై కొనసాగిన వేధింపులు నేడు షటిల్ ఇండోర్ కోర్టు వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. అధికార పార్టీ నేతల సూచనల ప్రకారం పట్టణంలో ఉన్న ఇండోర్ కోర్టుపై పలువురు వ్యక్తులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో షటిల్ కోర్టును స్వాధీనం చేసుకోవాలంటూ ఆర్డీఓ నుంచి తహశీల్దార్‌కు ఆదేశాలు అందాయి. అయితే తహశీల్దార్ పెంటయ్య అందరికీ ఉపయోగపడే షటిల్‌కోర్టును ఉంచాలా? లేదంటే ఉన్నతాధికారుల ఆదేశాలు అమలు చేయాలా? అన్న సందిగ్ధంలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కూడా ఇదే విషయమై మంత్రి కిమిడి మృణాళినిని కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇండోర్ కోర్టు ఎలా ఏర్పాటయిందంటే.... షటిల్ క్రీడాకారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తహశీల్దార్ కార్యాలయం, సబ్ రిజిస్టార్ కార్యాలయం ప్రాంగణంలోనే వ్యవసాయశాఖకు చెందిన పురాతన గొడౌన్లు ఖాళీగా ఉండేవి. ఈ గొడౌన్లో చాలా కాలం క్రితమే ప్రస్తుత వైఎస్సార్సీపీ విజయనగరం పార్లమెంటు పరిశీలకుడు బెల్లాన చంద్రశేఖర్ ఇండోర్ కోర్టుగా సిద్ధం చేయించారు. దీంతో అప్పటి నుంచి అందులోనే క్రీడాకారులు శిక్షణ పొందుతూ, జిల్లా స్థాయి టోర్నమెంట్లు, జిల్లాస్థాయి సెలక్షన్స్ నిర్వహిస్తూ పలు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా అప్పటి ఎంపీ ఝాన్సీలక్ష్మి నిధులతో ఇండోర్కోర్టును వుడెన్ కోర్టుగా అభివృద్ధి చేశారు. సమస్య ఏమిటి.....? పట్టణంలో ఉన్న ఇండోర్ షటిల్ కోర్టుకు ఒక అసోసియేషన్ ఏర్పాటయింది. ఆ అసోసియేషన్‌కు బెల్లాన చంద్రశేఖర్ తండ్రి పేరుతో బెల్లాన సింహాచలం మొమోరియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌గా నామకరణం చేశారు. అయినప్పటికీ బెల్లాన కుటుంబీకులు ఎవ్వరూ అసోసియేషన్‌లో లేరు, కోర్టుకు వస్తున్న ఇతర వ్యక్తులే అసోసియేషన్‌ను లీడ్ చేస్తున్నారు. అయితే షటిల్ క్రీడాభివృద్దికి బెల్లాన చంద్రశేఖర్ ఎనలేని సేవలు అందించడంతోనే ఆయన తండ్రి పేరు ఉంచారు. అంతెందుకు బెల్లాన అందించిన సేవలు గుర్తించే జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయనను ఎన్నుకున్నారు. అయితే ప్రస్తుతం తెలుగుదేశం అధికారంలోకి రావడంతో ఈ అంశాన్ని తట్టుకోలేని కొంతమంది ప్రభుత్వ గొడౌన్‌ను ఆక్రమించారని ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా అధికారులు సైతం ముందూవెనుకా చూడకుండా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. -
నెల్లూరు జిల్లాలో ఆర్ధరాత్రి కలకలం
-
రేషన్ డీలర్.. రైల్వేషం!
నువ్వు డిగ్రీ పూర్తి చేశావా?.. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావా?.. ఏం కష్టపడనక్కర్లేదు.. ఉద్యోగం నీ దగ్గరకే వస్తుంది. రైల్వే మంత్రి బంధువు నాకు బాగా తెలుసు. ఆరు లక్షల రూపాయలు నీవి కావనుకుంటే.. ఉద్యోగం నీ ఒళ్లో వాలుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. జీవితాంతం వేల రూపాయల జీతం.. ఆపైన దానికి మించిన ‘గీతం’.. నీ దశ తిరిగిపోతుందంటూ ఆశల ఆకాశంలో విహరింపజేశాడు. నమ్మించడానికి కాల్‌లెటర్లు, ప్రామిసరీ నోట్లు కూడా సృష్టించాడు. లక్షల్లో దండుకున్నాడు. ఆనక చుక్కలు చూపించాడు. రెండేళ్లు గడిచినా.. ఉద్యోగాలు లేవు.. ఇచ్చిన డబ్బుకు గ్యారెంటీ లేదు. మోసపోయామని గుర్తించిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఇంత ఘరానా మోసానికి పాల్పడ్డ వ్యక్తి ఒక సాధారణ రేషన్ డీలర్ కావడంతో పోలీసులు సైతం అవాక్కయ్యారు.ఎచ్చెర్ల: అతనో రేషన్ డీలరు.. పేరు బాడాన సీతారాం.. స్వగ్రామం ఎచ్చెర్ల మం డలం కమ్మపేట. రైల్వే ఉద్యోగాల పేరుతో తమను మోసం చేశాడని పలువురు ఇతనిపై మంగళవారం ఎచ్చెర్ల పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఇతనో ఘరానా మోసగాడన్న విషయం వెలుగు చూసింది. ఇదే మండలానికి చెందిన సీపాన పోలినాయుడు, కొత్తకోట నర్సింహులు, వావిలపల్లి కొండ య్య, చిట్టి అసిరినాయుడు, హనుమంతు అసిరినాయుడు తదితరులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎచ్చెర్ల ఎస్సై ఉదయకుమార్ 420, 464, 472 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరే కాకుండా ఇంకా చాలామంది రేషన్ డీలర్ చేతిలో మోసపోయారని తెలుస్తోంది. అతనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు తెలుసుకున్న మిగిలిన బాధితులు కూడా బయటపడుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు. మండలంలోని ఫరీదుపేట, ఇబ్రహింబాద్, పొన్నాడ, ధర్మవరం, వెంకన్నగారిపేట, చినరావుపల్లి తదితర గ్రామాలతోపాటు, శ్రీకాకుళం పట్టణంలోనూ ఇతని బాధితులు ఉన్నారని, ఉద్యోగాల పేరుతో వీరి నుంచి దండుకున్న మొత్తం రూ.కోటి వరకు ఉంటుందని సమాచారం. నాలుగేళ్లుగా ఇదే మోసం నాలుగేళ్ల నుంచీ సీతారాం మోసాల పరంపర కొనసాగుతోందని తెలిసింది. ఇతని మాయమాటలు నమ్మి గతంలో సర్పంచ్‌గా పని చేసిన వ్యక్తి కూడా తన కొడుక్కి ఉద్యోగం కోసం రూ.5 లక్షలు సమర్పించుకున్నారంటే.. నిందితుడు ఎంత మాయగాడో అర్థమవుతుంది. సదరు సర్పంచ్ నుంచి డబ్బు వసూలు చేయడమే కాకుండా.. అతన్నే మధ్యవర్తిగా పెట్టి మరికొందరు నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేశాడు. డిగ్రీ, పీజీ విద్యార్థులను టార్గెట్‌గా చేసుకున్న సీతారాం వారిని నమ్మించడానికి అనేక జిమ్మిక్కులు, ట్రిక్కులు ప్రయోగించేవాడు. రైల్వేమంత్రి బంధువే తనకు బాగా తెలుసని నమ్మబలికేవాడు. రైల్వేలో గ్రూప్-సి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేవాడు. మరింతగా ఆకట్టుకోవడానికి నకిలీ కాల్‌లెటర్లు, మెడికల్ సర్టిఫికెట్లు, అపాయింట్మెంట్ ఆర్డర్లు సృష్టించి తనే వారి ఇళ్లకు పోస్టు చేసేవాడు. ఇంకొందరికీ వారిచ్చిన డబ్బుకు హామీగా 50 రూపాయల స్టాంపు పేపర్లు, ప్రామిసరీ నోట్లపై తన ఆస్తులనే రాసిచ్చేశాడు. ఇలా రకరకాలుగా నమ్మించి.. స్థాయిని బట్టి ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు దండుకున్నాడు. చివరికి తన బంధువులను సైతం విడిచిపెట్టలేదు. కాగా పలువురు నిరుద్యోగులను ఉద్యోగాలు వచ్చాయంటూ హౌరా, భువనేశ్వర్, ముంబై నగరాలకు తీసుకెళ్లాడు. అక్కడ వారిని లాడ్జీల్లో ఉంచి, రేషన్ సరుకులు వచ్చాయి, అర్జంటుగా విడిపించుకోవాలి.. తిరిగి వెంటనే వచ్చేస్తానని నమ్మించి వచ్చేశాడు. తర్వాత ఫోనులో సైతం అందుబాటులోకి రాకపోవడంతో వెళ్లినవారంతా ఉసూరుమంటూ వెనక్కి తిరిగి వచ్చారు. ఎందుకలా చేశావని సీతారామ్‌ను నిలదీయగా రిక్రూట్మెంట్ రద్దయిందని, మళ్లీ ప్రయత్నిద్దామని సర్దిచెప్పేవాడు. అయి తే ఇటీవలి ఎన్నికల్లో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటం, రైల్వే మంత్రి కూడా మారడంతో బాధితులు అతన్ని నిల దీయడం ప్రారంభించారు. తమ డబ్బులు తిరిగి ఇచ్చేయమని ఒత్తిడి చేయడంతో విశాఖలో ప్లాట్ల వ్యాపారం చేస్తున్నానని, డబ్బు అందగానే చెల్లించేస్తానని చెప్పి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతని జాడ లేకపోగా.. ఫోనులోనూ సక్రమంగా అందుబాటులోకి రాకపోవడంతో చివరికి బాధితులు తమ వద్ద ఉన్న ఆధారాలతో పోలీసులను ఆశ్రయించారు. ప్రామిసరీ నోట్ ఇచ్చాడు నా కుమారుడుకి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించారు. స్టాంప్ పేపర్‌పై ఆస్తి కూడా రాసిచ్చాడు. రెండేళ్ల నుంచి తిప్పుతున్నాడు. డబ్బులు ఇచ్చేయమంటే సమాధానం లేదు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. -హనుమంతు దాలినాయుడు రైల్వే మంత్రి బంధువు తెలుసన్నాడు రైల్వే మంత్రి బంధువు తనకు తెలుసునన్నాడు. ఉద్యోగం గ్యా రెంటీ అన్నాడు. రెండేళ్ల నుంచీ అదే మాట. ఉద్యోగం లేదు.. డబ్బులూ తిరిగివ్వలేదుు. నిలదీస్తే సరైన సమాధానం లేదు. -చిట్టి అసిరినాయుడు, బాధితుడు. భూమి అమ్మి డబ్బు కట్టా భూమి అమ్మి డబ్బులు చెల్లించాను. రాతపరీక్ష కాల్‌లెటర్ కూడా ఇచ్చాడు. మీ కుమారుడికి ఉద్యోగం వచ్చేసినట్లేనని నమ్మించాడు. నిజమేననుకున్నాను. మోసపోయామని ఇప్పుడు అర్థమైంది. -సీపాన పోలినాయుడు -
విరాళం ముసుగు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వాలంటూ రేషన్ డీలర్లపై తెలుగు తమ్ముళ్లు ఒత్తిడి తెస్తున్నారు. అందుకోసం ఓ వ్యూహం కూడా సిద్ధం చేసుకున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం లక్ష రూపాయల విరాళం ఇస్తున్నట్లు గుంటూరు జిల్లా తెనాలిలో ఓ రేషన్ డీలర్ ప్రకటించారు. ఇక్కడే లొసుగు ఉంది. ప్రకటించిన వ్యక్తి తెలుగుదేశం పర్టీ నాయకుడు. అతని పేరుతో రేషన్ షాపు లేదు. బినామీ పేరుతో నడుపుతున్నాడు. అతను చేసిన ప్రకటనను అడ్డం పెట్టుకుని రేషన్ డీలర్లంతా విరాళం ఇవ్వాలంటూ వారిపై జిల్లా నాయకత్వం ఒత్తిడి తెస్తోంది. తెనాలికి చెందిన రేషన్ డీలర్ చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని ఒక పక్క పేర్కొంటున్నా.. టీడీపీ ఒత్తిడికి మాత్రం తలొగ్గుతున్నారు. స్వచ్ఛందం పేరిట నిర్బంధంగా విరాళాలు సేకరించే ప్రక్రియకు తెలుగు తమ్ముళ్లు తెరలేపారు. అందుకోసం అధికారుల నుంచి తమపై ఒత్తిడి తెస్తున్నారని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లేని పక్షంలో రేషన్ డీలర్ లెసైన్స్ రద్దు చేయిస్తామని బెదిరింపులు, వ్యాపారం ఎలా నిర్వహిస్తారంటూ హెచ్చరికలు, ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర.. వంటి తదితర అంశాలు డీలర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. డీలర్లెవరూ తమ పేరును బహిర్గతం చేయకుండా ఎంతో కొంత ముట్టజెప్పడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ఇలా.. చేద్దాం నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం రేషన్ డీలర్లు ఓ సరికొత్త ప్రతిపాదనపై చర్చిస్తున్నారు. జిల్లాలోని రేషన్ డీలర్లకు 1995 నుంచి ఇప్పటి వరకూ దాదాపు రెండు కోట్ల రూపాయల పైచిలుకు కమీషన్ రూపంలో లేదా ఇతరత్రా పౌరసరఫరాలశాఖ నుంచి రావాల్సి ఉంది. మధ్యాహ్న భోజన పథకం బియ్యానికి సంబంధించి 1995 నుంచి రేషన్ డీలర్లకు రూ. 60 లక్షల నగదు అందాల్సి ఉంది. ఇక 2001 నుంచి పనికి ఆహార పథకానికి సంబంధించి రూ.1.20 కోట్లు అందాలి. మత్స్యకారుల వేటకు విరామం, చేనేతలకు 35 కేజీల ఉచిత బియ్యం పంపిణీ, అన్నపూర్ణ, అంత్యోదయ కార్డుదారులకు ఉచిత బియ్యం తదితరాలకు సంబంధించి కమీషన్ రూపంలో మరో రూ.20 లక్షల వరకు రేషన్ డీలర్లకు పౌరసరఫరాలశాఖ చెల్లించాల్సి ఉంది. ఆ మొత్తాన్ని మంజూరు చేస్తే అందులో కొంత నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇచ్చేందుకు డీలర్లు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు అధికారుల నుంచి అంగీకారం లభిస్తే జాయింట్ కలెక్టర్‌కు రాతపూర్వకంగా సంబంధిత విషయాన్ని తెలియజేయాలని తీర్మానించారు. నవ్యాంధ్ర ప్రదేశ్ నిర్మాణం కోసం తాము విరాళం ఎలా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ఏ రూపంలో ఇవ్వాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని రేషన్ డీలర్ల సంఘ నాయకులు పేర్కొంటున్నారు. -
ఆధార్ నంబర్ ఇస్తేనే రేషన్: డీఎస్ఓ
జహీరాబాద్ టౌన్: రేషన్ డీలర్లకు కార్డుదారులు ఆధార్ నంబరు ఇస్తేనే ఇకపై రేషన్ సరుకులు పంపిణీ చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి ఏసురత్నం చెప్పారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నెల 31వ తేదీ లోపు వారివారి రేషన్ డీలర్లకు అందజేయాలని సూచించారు. లేకుంటే ఇంటింటా సర్వే చేసి కార్డును శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు. ఆధార్ కార్డు లేనివారు మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. బోగస్ కార్డుల ఏరివేతకు ప్రభుత్వం చర్యలు తీసుకొందని, ఇలాంటి కార్డులుంటే రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లో వేయాలన్నారు. కార్డుదారుడు మరణించినా, ఒకరి పేరిటే రెండు కార్డులు ఉన్నా, గ్రామాల్లో ఉండని వారి కార్డులను కూడా బోగస్విగా గుర్తిస్తామన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీ కేంద్రాల్లో సన్నబియ్యం కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. కిలో రూ. 30 చొప్పున 30 కిలోలు పొందవచ్చని సూచించారు. నాణ్యత లేని బియ్యం పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని అర కిలో చక్కెర అదనంగా ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మండలంలోని డీలర్లతో సమావేశమయ్యారు. బోగస్ కార్డులు ఉంటే అందజేయాలని డీలర్లకు సూచి ంచారు. కార్డుదారులు కోరిన సరుకులనే పంపి ణీ చేయాలని సూచించారు. బలవంతంగా అవసరం లేని సరుకులు ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి నెలా ఒకటి నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాప్‌లను తెరచి ఉంచాలన్నారు. సమావేశంలో డిప్యూటీ తహశీల్దార్లు చంద్రశేఖర్, జనార్దన్, డీలర్లు పాల్గొన్నారు. -
పరేషాన్ డీలర్!
నందిగాం, న్యూస్‌లైన్ : నందిగాం పంచాయతీ పరిధి పెంటూరు గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బొడ్డ కేశవరావు(కృష్ణారావు) బరితెగించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ తెలుగుదేశం పార్టీలో చేరారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏం జరిగినా తెలుగుదేశం పార్టీ నేతలు అండగా ఉంటారనే బరితెగింపుతోనే ఆయన ఈ విధంగా చేశారని సమాచారం. ఆయన తీరుపై గ్రామస్తులు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పక్షపాతంతో నిత్యావసర వస్తువుల పంపిణీలో వివక్ష చూపితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల్లో కూడా కేశవరావు బహిరంగంగా ప్రచారం నిర్వహించారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టిం చుకోలేదని పలువురు చెప్పారు. గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఆయన ప్రస్తుతం మళ్లీ టీడీపీ శిబిరంలో చేరారు. -
‘కోడ్’ కూసినా ..
దోమకొండ, న్యూస్‌లైన్ : దోమకొండ మండలంలోని తుజాల్పూర్ లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి , మాజీ మంత్రి శ్రీధర్‌బాబులతో కూడిన బొమ్మలు ఉన్న పంచదార, గోధుమ ప్యాకెట్లను రేషన్‌డీలర్ విక్రయిస్తున్నారని ఆదివారం గ్రామస్తులు కొందరు తహశీల్దార్‌కు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీంతో తహశీల్దార్ బాలయ్యతో పాటు వీఆర్వో ముత్తన్న గ్రామానికి చేరుకుని వాటిని పరిశీలించారు. మండలంలో మొత్తం 37 రేషన్‌షాపులకు గాను 5 షాపుల్లో మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఉన్న బొమ్మల ప్యాకెట్లు వచ్చాయని తహశీల్దార్ తెలిపారు. పాత స్టాక్ రేషన్‌డీలర్లకు రాగా, ప్యాకెట్లపై ఉన్న మాజీ సీఎం ఫొటో కనబడకుండా వాటిపై ప్యాకెట్లు కప్పి లబ్ధిదారులకు అందించారని తెలి పారు. దీనిపై జిల్లా అధికారులకు వివరించినట్లు తహశీల్దార్ బాలయ్య చెప్పారు. -
మహిళపై కిరోసిన్ పోసి నిప్పుంటించిన దుండగులు
ఒడిషా: దుండగల ఆగడాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ఒకవైపు మహిళలపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలు విధిస్తామంటూ ప్రభుత్వం హెచ్చరిస్తున్న మహిళలపై ఉన్మాదులు దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. నిర్భయ చట్టం తెచ్చిన దుండగుల ఆగడాలు అరికట్టలేని దుస్థతి ఏర్పడింది. దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలు దాడులకు గురవతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళపై కిరోసిన్ పోసి దుండగులు నిప్పుంటించిన ఘటన ఒడిషా రాష్ట్రంలో బుధవారం చోటుచేసుకుంది. రేషన్ డీలర్‌గా వ్యాపారం చేస్తున్న ఆమెపై దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు. మంటల తీవ్రతతో ఆమె శరీరం దాదాపు సగం కాలిపోయినట్టు పోలీసులు తెలిపారు. ఆమె పరిస్థతి విషమించడంతో చికిత్స మేరకు విశాఖ జిల్లా ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ఆ మహిళ మృతిచెందినట్టు సమాచారం. -
భారీగా బోగస్ కార్డులు!
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:జిల్లాలో బోగస్‌కార్డుల వ్యవహారం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బోగస్ చిరునామాలు, పేర్లతో పలువురు రేషన్ డీలర్లు దరఖాస్తులు చేయడంతో ఈ కార్డులు పుట్టుకొచ్చాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. రచ్చబండ కార్యక్రమంలో వేలాది కార్డులను మంజూరు చేసినప్పటికీ వాటిని తీసుకెళ్లడానికి చాలామంది ముందుకు రాకపోవడం పట్ల సందేహా లు వెల్లువెత్తుతున్నాయి. రచ్చబండ- 2లో దరఖాస్తు చేసిన వారిలో విజయనగరం పట్టణంలో 4,826 మందికి రేషన్ కార్డులు మంజూరయ్యాయి. 3,367 మంది కార్డులు అందుకున్నారు. ఇటీవల కలెక్టరేట్ ప్రాంగణంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పా టు చేసి పంపిణీ చేయగా 129మంది మాత్రమే వచ్చి కార్డులను తీసుకున్నారు. ఒక్క విజయనగరం పట్టణంలోనే 1,336 మంది కార్డులు తీసు కోవడానికి ముందుకు రాలేదు. అయితే వీటిలో కొన్ని బోగస్ కార్డులు కాగా, మరికొన్ని కార్డులు వచ్చినట్టు కొందరికి తెలియకపోవడం వల్ల తీసుకోనివి ఉన్నాయి. కొంతమంది లబ్ధిదారులు పౌర సరఫరాల కార్యాలయానికి అడిగినప్పటికీ ప్రస్తుతం ఇవ్వలేమని ఉన్నతాధికారులను సంప్రదించి చెబుతామని సిబ్బంది చెప్పడంతో నిరాశతో వెనుదిరిగారు. పంపిణీ చేయగా మిగిలిన వాటిలో బోగస్ కార్డులు అధికంగా ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇదే పరిస్థితి దాదాపు జిల్లావ్యాప్తంగా ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బోగస్ కార్డుల జారీలో ఎవరి ప్రమేయం ఉందన్న అనుమానాలు అధికారులను వెంటాడుతున్నాయి. పంపిణీ కాకుండా మిగిలిన కార్డులను తక్షణమే స్వాధీనం చేసుకుని వాటి పై తక్షణమే దర్యాప్తు జరపాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించడానికి కొంతమంది డీలర్లే ఈ పని చేశారా? అన్న అనుమానా లు లేకపోలేదు. ఇది ఇలా ఉండగా రచ్చబండ-3లో 8వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటిలో కూడా బోగస్ దరఖాస్తు లు అధికంగా ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. కొన్ని మండలాల్లో రచ్చబండ కార్డుల పంపిణీ పూర్తికాలే దు. రచ్చబండలో తాత్కాలిక కూపన్లు అందజేసిన ప్రతి ఒక్కరికీ డిసెంబర్ కోటా ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. మరోవైపు మిగిలిన కార్డులు తక్షణమే అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్డులు వచ్చినట్లు గ్రామాల్లో డిపోలకు సమాచా రం అందినప్పటికీ లబ్ధిదారులకు మాత్రం కార్డులు అందజేయ డం లేదు. దీంతో వారు అధికారుల చుట్టూ ప్రద క్షిణలు చేస్తున్నా రు. గ్రామస్థాయిలో కొంతమంది అధికార పార్టీనేతల ఒత్తిడితో కార్డులు పంపిణీ చేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉన్నవారికే రేషన్ కార్డులు రచ్చబండ-2లో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి కి సంబంధించి జిల్లాకు 57,861 కార్డులు మంజూరయ్యాయి. వీటిని రచ్చబండ-3లో అధికారులు పంపిణీ చేయడానికి చర్య లు తీసుకున్నారు. అయితే రేషన్ బియ్యాన్ని బుక్కేందుకు కొం తమంది ఉన్నవారి పేరిటే రేషన్ కార్డులకు దరఖాస్తులు చేశారు. మరికొంత మందికి సంబంధించి గ్రామాలు, పట్టణాల్లో నివా సం లేనివారికి సైతం కార్డులు పుట్టించేశారు. దీంతో అధికారు లు ప్రాథమికంగానే అవకతవకలను గుర్తించి 5,200 కార్డుల పంపిణీని నిలిపివేశారు. మిగిలిన కార్డుల్లో కూడా మరిన్ని బోగస్ కార్డులు తేలే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. లబ్ధిదారులు రాకపోతే వెనక్కు పంపుతాం కార్డుల్లో ఉన్నవారు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కార్డుల పంపిణీపై డీలర్లకు సమాచారం ఇచ్చాం. తగిన ఆధారాలతో వచ్చిన వారికి మాత్రమే రేషన్ కార్డులు అందజేస్తాం. పంపిణీ కాగా మిగిలినవి వెనక్కి పంపిస్తాం. -ఆర్.శ్రీలత (ఇన్చార్జ్ డీఎస్వో) -
ఏసీబీకి చిక్కిన ఆత్మకూరు ఎంఆర్ఓ
వరంగల్ జిల్లాలోని ఆత్మకూరు తాహశీల్దార్ యాదగిరి నివాసంపై ఏసీబీ అధికారులు గురువారం ఉదయం దాడులు నిర్వహించారు. ఆత్మకూరు మండల పరిధిలోని ఓ రేషన్ డీలర్ నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటున్న యాదగిరిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రేషన్ డీలర్షిప్ రెన్యూవల్ చేసేందుకు ఎంఆర్ఓ యాదగిరి అధిక మొత్తంలో రేషన్ డీలర్‌ను డిమాండ్ చేశారు. దాంతో రేషన్ డీలర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దాంతో వలపన్నీ ఎంఆర్ఓ యాదగిరిని గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
రేషన్ డీలర్ కోసం ఢిల్లీ దాకా..!
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘నేను రాష్ట్ర మంత్రిని కాదు.. ఢిల్లీ మం త్రిని నేను చెప్పిన వారినే రేషన్ డీలర్ పోస్ట్‌కు ఎంపికచేయా లి’ అని ఒక మంత్రి, ‘నేను రాష్ట్ర మంత్రిని అంతా నా చేతి లోనే ఉంటుంది. నేను చెప్పిన వారికే డీలర్ పోస్ట్ ఇవ్వాలి’ అంటూ మరోమంత్రి..ఇలా జిల్లాలో రేషన్‌డీలర్ల కోసం గల్లీ నుంచి ఢిల్లీవరకు పైరవీలు ప్రారంభించారు. దీంతో అధికారులపై ఒత్తిడి పెరగడంతో ఎంపిక ప్రక్రియ గందరగోళంగా మారింది. మహబూబ్‌నగర్ డివిజన్ పరిధిలోని మండలా ల్లో ఖాళీగా ఉన్న 18డీలర్ పోస్టులకు అధికారులు ఇటీవల రాత పరీక్షను పూర్తి చేసుకుని ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల ఎంపికకు సిద్ధమయ్యారు. కానీ పరీక్షకు హాజరైన అభ్యర్థులేమైనా పిచ్చివాళ్లా, తమ సత్తా ఏమిటో అధికారులకు చూపిం చాలనే ఉద్దేశంతో తననే ఎంపిక చేయాలంటూ పైరవీలను ఢిల్లీకి చేర్చారు. దీంతో ఓ మంత్రి ఢిల్లీ నుంచి అధికారులకు ఫోన్‌చేసి తాను చెప్పిన వారినే ఎంపిక చేయాలని ఒత్తిడితెచ్చారు.ఈ విషయాన్ని తెలుసుకున్న మరికొంత మంది అభ్యర్థులు రాష్ట్రస్థాయి మంత్రులను ఆశ్రయించి, ఒకరికి మించి ఒకరు మంత్రులచే అధికారులపై ఒత్తిళ్లకు దిగారు. ఇంతవర కు డిప్యూటీ సీఎం, రెవెన్యూ, వ్యవసాయ, సివిల్ సఫ్లై, ఇన్చార్జి మంత్రి నుంచి ఒత్తిళ్లు వచ్చినట్లు సమాచా రం. వీరికి ధీ టుగానే జిల్లా మంత్రి సైతం ఇదే తరహా ఒత్తిళ్లు కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ఇక ఈ ఒత్తిళ్లతో రేషన్ డీలర్ల ఎంపిక ఎలా చేయాలో అధికారులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. మిడ్జిల్ డీలర్‌కు బలే డిమాండ్ మిడ్జిల్ మండల కేంద్రంలో డీలర్ పోస్ట్ ఖాళీగా ఉండగా, దీనికి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, జిల్లా మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్యే మల్లురవి అధికారులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఎవరికి వారు ఫోన్లు చేసి తమ అనుచరులకే ఇవ్వాల్సిందిగా ఆదేశిస్తుండడంతో, ఎవరిని ఎంపిక చేయాలో తెలియక అధికారులు తల పట్టుకుంటున్నారు. అయితే ఈ విషయంలో ఎవరు తమ మాట నెగ్గించుకుంటా రో వేచి చూడాల్సిందే. కంగుతింటున్న ఎమ్మెల్యేలు డీలర్ పోస్టులకు ఎంపికకు ఎప్పుడు ఎమ్మెల్యేల ఒత్తిళ్లు ఉండేవి, కానీ ఈసారి అభ్యర్థులు ఎమ్మెల్యేలను పక్కనపెట్టి మంత్రులను ఆశ్రయించడంతో వారంతా కంగుతింటున్నారు. ఇక రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులంతా ఇప్పుడు మంత్రులచే ఫోన్లు చేయించే పనిలో బిజీగా నిమగ్నమయ్యారు. దీంతో ఇంకేముంది రోజుకు వందల సంఖ్యలో అధికారులకు ఫోన్ల ఒత్తిళ్లు పెరిగాయి. డీలరు పోస్టులకు మంత్రులస్థాయి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో అధికారులు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. దీంతో రాత పరీక్షలో అభ్యర్థులు కనబర్చిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారా? లేక పైస్థాయి మంత్రుల ఒత్తిళ్లకు తలొగ్గి అభ్యర్థుల ఎంపిక చేస్తారానేది? ప్రస్తుతం పద్మవ్యూహంలో పడింది. ఇక ఎప్పుడు లేనంతగా ఈసారి రేషన్ డీలర్ పోస్టుల భర్తీ అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. -
రేషన్ డీలర్‌పై దాడి
కోనరావుపేట, న్యూస్‌లైన్ : అటవీ శాఖ అధికారులమని చెబుతూ ఇద్దరు యువకులు రేషన్ డీలర్‌పై దాడి చేశారు. బుధవారం రాత్రి మండలంలోని ఎగ్లాస్పూర్కు చెందిన మహేశ్, సుధాకర్ తాము అటవీ శాఖ అధికారులమని గ్రామ రేషన్ డీలర్ నాగరాజును డబ్బులు డిమాండ్ చేస్తూ దాడి చేశారు. రాత్రి 11 గంటల సమయంలో డీలర్‌ను లేపి డబ్బులు అడిగారు. ఆయన ఇవ్వకపోవడంతో దాడి చేశారు. దీంతో డీలర్ కేకలు వేయడంతో గ్రామస్తులు ఇద్దరు యువకులను పట్టుకొని నిలదీశారు. వారు అదే గ్రామానికి చెందినవారమని చెప్పడంతో చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసుల కన్నుగప్పి వారు పారిపోయారు. గురువారం ఉదయం పోలీసులు నిందితులను వదిలిపెట్టారని ఆరోపిస్తూ సుమారు రెండు వందల మంది గ్రామస్తులు కోనరావుపేట ఠాణాకు చేరుకున్నారు. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. డీలర్‌పై దాడి చేసిన మహేశ్, సుధాకర్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై అశోక్ చెప్పడంతో ఆందోళన విరమించారు.