రేషన్ డీలర్ భర్త వద్ద రూ.8వేల లంచం తీసుకుంటూ ..
గురజాల: రేషన్ డీలర్ భర్త వద్ద రూ.8 వేల లంచం తీసుకుంటూ సీఎస్‌డీటీ మాలెపాటి వీరవెంకటనారాయణమూర్తి ఏసీబీ వలలో పడిన సంఘటన గురజాలలో గురువారం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఎం.రాజారావు తెలిపిన వివరాల ప్రకారం.. రెంటచింతలకు చెందిన ఏశమ్మ గ్రామంలో షాపు నం.3 చౌకధరల దుకాణం నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టులో సోషల్ ఆడిట్ నిర్వహించగా.. సరుకు వివరాలు సరిగ్గా లేకపోవడంతో రేషన్ డీలర్‌ను సస్పెండ్‌చేసి షోకాజ్ నోటీసు అందజేశారు. ఆర్డీవోకు సమాధానం చెప్పి యధావిధిగా దుకాణాన్ని ప్రారంభించారు. అయితే, గత నెలలో గుర్తుతెలియని వ్యక్తులు డయల్ 100కు కాల్‌చేసి రెంటచింతల గ్రామంలో అక్రమంగా కిరోసిన్ తరలిస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఆ మేరకు పౌరసరఫరాల అధికారులు గత నెల 19న రేషన్ షాపులను తనిఖీచేశారు. రికార్డుల్లో కన్నా షాపు నం.3లో అదనంగా ఉన్న 50 కేజీల బియ్యం, 200 లీటర్ల కిరోసిన్, సుమారు ఐదు కేజీల పంచదారను పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్ (సీఎస్‌డీటీ) నారాయణమూర్తి సీజ్‌చేశారు. పౌరసరఫరాల చట్టం ప్రకారం రేషన్ డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేయాల్సివుంది. అయితే సీఎస్‌డీటీ రేషన్‌షాపు డీలర్ ఏశమ్మ భర్త ఓర్సు ప్రేమ్‌రాజుతో రూ.10 వేలు లంచం ఇస్తే ఎలాంటి కేసు లేకుండా చూస్తానని చెప్పాడు.
అంత ఇచ్చుకోలేనని రూ.8 వేలు ఇస్తాననగా సీఎస్‌డీటీ సరేనన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రేమ్‌రాజ్ గుంటూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథక రచనలో భాగంగా రూ.8వేల (8 వెయ్యి నోట్లు) నగదును ప్రేమ్‌రాజ్ గురువారం మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న సీఎస్‌డీటీ నారాయణమూర్తికి అందించాడు. అదేసమయంలో ఏసీబీ డీఎస్పీ రాజారావు తన సిబ్బందితో దాడి చేసి సీఎస్‌డీటీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ మేరకు విచారించి కేసు నమోదుచేశారు. దాడుల్లో రేంజ్ ఎస్‌ఐ కె.సీతారామయ్య, నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.
ఏసీబీ వలలో పౌరసరఫరాల డీటీ
Published Fri, Dec 19 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 6:23 PM
Advertisement