డీలర్‌ను మార్చండి.. మా వారికే షాపు ఇవ్వండి
అప్పటి వరకు బియ్యం బండి రానివ్వబోం
ప్రకాశం జిల్లా ఇండ్లచెరువులో టీడీపీ నేతల బరితెగింపు
రెండుసార్లు వచ్చిన రేషన్ బియ్యం లారీ ఊరి బయటే నిలిపివేత
పోలీసు బందోబస్తుతో వచ్చినా అడ్డుకుని దౌర్జన్యం
మూడో తేదీ వచ్చినా గ్రామస్తులకు అందని రేషన్ బియ్యం
దర్శి: ‘ఇప్పుడున్న రేషన్ డీలర్‌ను తొలగించండి. మేం చెప్పినవారికి డీలర్‌షిప్ ఇవ్వండి. అప్పటి వరకు మా ఊరిలో రేషన్ ఇవ్వడానికి వీల్లేదు. మేం చెప్పినట్లు చేయకుండా గ్రామంలోకి రేషన్ బియ్యం తీసుకువస్తే ఆ బండిని తగలబెడతాం..’ అని ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇండ్లచెరువు గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. రెండుసార్లు రేషన్ బియ్యం తీసుకువెళ్లిన లారీని అడ్డుకున్నారు. వారి అడ్డగోలు చర్యల వల్ల గ్రామంలోని పేదలకు ఇప్పటి వరకు రేషన్ బియ్యం అందని పరిస్థితి నెలకొంది.
ఇందుకు సంబంధించిన వివరాలు... ఇండ్లచెరువు గ్రామంలో బీసీ కులానికి చెందిన అద్దంకి వెంకటేశ్వర్లు 20 ఏళ్లుగా రేషన్ షాపు పరి్మనెంట్ డీలర్‌గా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డీలర్‌ను తీసివేయాలని స్థానిక నాయకులు నిర్ణయించుకున్నారు. డీలర్ ఈ విషయం తెలుసుకుని టీడీపీ నేతలను కలసి ‘20 ఏళ్లుగా రేషన్ దుకాణం నిర్వహిస్తున్నాను. ఇదే నాజీవనాధారం. నా కడుపు కొట్టి నా కుటుంబాన్ని బజారున పడేయొద్దు’ అని వేడుకున్నాడు.
అయినా కనికరించని వారు డీలర్‌ను తొలగించాలని రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. ఆయన రాజీనామా చేస్తే తప్ప తీసివేయడానికి తమకు అధికారం లేదని అధికారులు చెప్పారు. దీంతో తమ గ్రామంలోకి రేషన్ బియ్యం ఎలా తెస్తారో చూస్తామని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీచేశారు. ఈ క్రమంలో గత నెల 31వ తేదీన దొనకొండలోని పౌరసరఫరాల శాఖ గోదాము నుంచి 12 టన్నుల రేషన్ బియ్యాన్ని లారీలో ఇండ్లచెరువుకు పంపగా, టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. తమను కాదని గ్రామంలోకి రేషన్ బియ్యం లారీ వస్తే తగులబెడతామని హెచ్చరించారు. దీంతో సిబ్బంది లారీని తీసుకుని వెనక్కి వెళ్లిపోయారు.
పోలీసులనూ లెక్క చేయలేదు
పోలీస్ బందోబస్తుతో శనివారం ఉదయం 11 గంటలకు మరోసారి రేషన్ బియ్యంతో లారీ ఇండ్లచెరువుకు బయలు దేరగా... టీడీపీ నాయకులు వచ్చి ఊరి బయటే అడ్డుకున్నారు. గ్రామంలోకి వస్తే తగులబెడతామని, వెనక్కి వెళ్లాల్సిందేనని హెచ్చరించారు. పోలీసులు సాయంత్రం వరకు బతిమిలాడినా టీడీపీ నాయకులు వినకపోవడంతో లారీని వెనక్కి పంపారు. టీడీపీ నాయకులు ఇంత బరితెగించి దౌర్జన్యం చేస్తున్నా పోలీసులు బతిమిలాడుకోవడం చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పోలీసు వ్యవస్థ ఇంత నిరీ్వర్యమైపోతే సామాన్యులకు ఏం న్యాయం చేస్తారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment