social audit
-
‘ఉపాధి’ నిధులను సద్వినియోగం చేసుకోవాలి
సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవాలని.. ఇందులో భాగంగా గ్రామాల్లో పకడ్బందీగా సోషల్ ఆడిట్ చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ ఆదేశించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ విభాగం అధికారులతో పవన్‌కళ్యాణ్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్ జరిగే తీరును, పనుల పురోగతి, నిధులు దుర్వినియోగానికి సంబంధించిన కేసుల వివరాలను అధికారులు పవన్‌కు తెలిపారు. పవన్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు వస్తాయన్నారు.ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలని.. గ్రామాల్లో ప్రొటోకాల్‌ను అనుసరించి సోషల్ ఆడిట్ సభలు నిర్వహించాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం నిధులు దుర్వినియోగం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. చిన్నారుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంచాలిగ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. గురువారం విజయవాడలో సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. వైజ్ఞానిక ప్రదర్శనలు గ్రామ స్థాయి నుంచి నిర్వహించాలన్నారు. రాజమండ్రి ఎస్ఆర్ఎస్సీ ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని అధికారులు పవన్‌కు తెలియజేయగా.. త్వరలో ప్రజలకు అందుబాటులోకి తెద్దామని పవన్ అన్నారు. కాగా, తనకు కేటాయించిన శాఖలపై వరుసగా సమీక్షలు నిర్వహించిన పవన్.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడంతో పాటు రక్షిత మంచి నీటి సరఫరాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. తుపాన్ల నుంచి తీరాన్ని రక్షించే మడ అడవులపై చర్చించారు. -
పలకని పవన్.. నాదెండ్ల సైగ చేసినా సరే మౌన ప్రేక్షకుడిగానే !
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఈసారి విలేకరుల సమావేశంలో పూర్తి ప్రేక్షక పాత్ర వహించారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పవన్‌కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నేతల సమావేశం జరిగింది. అనంతరం అరగంటకుపైగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో పవన్‌కళ్యాణ్ వేదికపై మౌనంగా కూర్చోగా, పార్టీ నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఒక దశలో పవన్‌ను మాట్లాడాలంటూ నాదెండ్ల సైగ చేస్తూ మైక్ జరిపినా స్పందించేందుకు నిరాకరించారు. 3 రోజులు జనసేన సోషల్ ఆడిట్.. నవంబరు 12, 13, 14వతేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలలో జనసేన తరఫున సోషల్ ఆడిట్ నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీ నేతలు మూడు రోజుల పాటు జగనన్న కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణంపై నివేదిక ఇస్తారని చెప్పారు. పవన్‌కళ్యాణ్ ఏదో ఒక ప్రాంతంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 26 జిల్లా కేంద్రాల్లోనూ ‘జనవాణి’ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
‘బేటీ బచావో బేటీ పడావో’ నిధులు ప్రచారానికేనా?
న్యూఢిల్లీ: 2016 నుంచి 2019 వరకూ ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకానికి విడుదల చేసిన రూ.446.72 కోట్లలో 78 శాతానికి పైగా నిధులను కేవలం మీడియాలో ప్రచారానికే ఖర్చు చేయడం పట్ల పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలికల విద్య కోసం వ్యయం చేయాల్సిన సొమ్మును ప్రకటనలపై వెచ్చించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. మహిళా సాధికారతపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తాజాగా తన నివేదికను లోక్‌సభకు సమర్పించింది. ఈ పథకం అమలు తీరుపై జిల్లా స్థాయిలో ఏదైనా సామాజిక సంస్థ లేదా థర్డ్ పార్టీ/నిపుణులతో సోషల్ ఆడిట్ కచ్చితంగా నిర్వహించాలని పేర్కొంది. -
‘ట్యాక్స్ పేయర్స్ మనీ’ అంటూ ‘సోషల్ ఆడిట్’!
మరో మూడు నెలలకు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అనగా... 2004 ఫిబ్రవరిలో హైదరాబాద్ వచ్చిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ అధ్యక్షుడు క్లవుస్ శ్వాబ్ ఇలా అన్నారు– ‘‘ప్రపంచం ముందు ఉన్న ప్రధాన సవాలు, పేదరిక నిర్మూలన. ఇది ఈ సమాజాన్ని నిరంతరం విభజిస్తూనే ఉంటుంది. సమాజంలో ప్రతి ఒక్కరికి వికాసం పొందే అవకాశం కల్పిస్తే తప్ప, మనకు ఎంత మాత్రమూ భద్రత ఉండదు.’’ ఆయన ఆ రోజు ‘విభజిస్తూనే ఉంటుంది...’ అన్నట్టుగానే, మరో పదేళ్లకు అదే హైదరాబాద్ నగరం వేదికగా రాష్ట్ర ‘విభజన’ జరిగింది. అయితే అదక్కడ ఆగలేదు, శ్వాబ్ మాటల్లోని ‘నిరంతర విభజన...’ అనే భావన రాష్ట్ర విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో వాస్తవమని స్పష్టమవుతూనే వుంది. గత రెండున్నర ఏళ్లుగా జగన్మోహన రెడ్డి ప్రభుత్వ పాలనలో ఇప్పటికీ దిగువన మిగిలిన వర్గాలకు అమల వుతున్న పథకాలు... వారికవి– ‘నీడ్స్’ అవుతాయా లేక ‘లగ్జరీస్’ అవుతాయో ఎవ్వరికీ తెలియని బ్రహ్మరహస్యం ఏమీ కాదు. అయినప్పటికీ, పైకి చెప్పలేని కారణాలతో కొందరు వీటికి అడ్డుపడుతున్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా కొత్తగా మధ్యతరగతిగా మారినవారిలో కూడా కొందరు చిత్రంగా ఈ పథకాలను తప్పుపట్టడం చూశాము. ఎవరు వీళ్ళంతా అంటే,.. ఒకప్పుడు వీరిది దిగువ మధ్య తరగతి. అయితే వారి ప్రమేయం లేకుండా, వృద్ది లక్ష్యంగా... వేగంగా విస్తరించిన రోడ్లు, రవాణా వ్యవస్థతో వీరి భూముల విలువ కోట్ల రూపాయలు అయింది. కమ్యునికేషన్, ఐ.టీ. రంగ విస్తరణ కారణంగా వీరి పిల్లల ప్రైవేట్ రంగ ఉద్యోగాలతో వీరి జీవన ప్రమాణాలలో ఊహించని ఎదుగుదల వచ్చింది. ఇంతవరకు బాగానే వుంది. కానీ, వీళ్ళు కూడా కొత్తగా– ‘ట్యాక్స్ పేయర్స్ మనీ...’ అంటూ సంక్షేమ పథకాల అమలుపై ‘‘సోషల్ ఆడిట్’’ చేస్తున్న సంపన్న వర్గాల భాషను మాట్లాడుతున్నారు! ఇక్కడే జర్మనీకి చెందిన ప్రొఫెసర్ శ్వాబ్ ప్రాసంగికత మనవద్ద స్పష్టం అవుతున్నది. పేదరికం సమాజాన్ని ‘నిరంతరం విభజించడం’ అదొక అంశం సరే. పేదలకు మంచిచేసే పథకాలకు అడ్డుపడ కుండా ఉండలేకపోతున్నవారు... తాము ఎంత జాగ్రత్తగా నిగ్రహించుకుని ఉంటున్నప్పటికీ, ఎక్కడో ఒకచోట బయటపడడం వీరికి కొత్తగా వచ్చిన కష్టం అయింది! అందుకు కారణం– ఉనికి ప్రమాదం వీరి కొత్త సమస్య. గతంలో కంటే, విభజన వల్ల చిన్న ‘యూనిట్’ అయిన రాష్ట్రంలో, ఇది మునుపటికంటే మరింత బాహాటంగా స్పష్టమవుతున్నది. ఇలా– ‘భూమి’ కేంద్రంగా ఏర్పడ్డ అంతరాలను తగ్గించడానికి, జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ఎలాగోలా ఆపడానికి; బయట పడుతున్నవారి రంగులు వెలిసి చివరికి వెలవెలబోతున్నాయి. (చదవండి: తొలి ‘హైబ్రిడ్ స్టేట్’ దిశగా ఏపీ అడుగులు) శ్వాబ్ చెప్పిన మరో అంశం– ‘సమాజంలో ప్రతి ఒక్కరికి వికాసం...’ ఇండియా వంటి ‘మూడవ ప్రపంచ దేశం’లో ఆ మాట చెబుతున్నది శ్వాబ్ కావొచ్చు, కానీ దానికున్న చరిత్ర చాలా పాతది. ఒకప్పుడు సామాజిక శాస్త్రవేత్తలు దీన్ని ‘సోషల్ డార్వినిజం’ అన్నారు. ఇది మనకు బాగా పరిచయమైన– ‘బలవంతుడిదే రాజ్యం’ (సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్) సిద్ధాంతం. ఆధునిక పరిపాలనలో అది కుదరదు. ‘హారిజాంటల్’గా పంపిణీ నలువైపులకు విస్తరించాలి అంటున్న నమూనా మరొకటి వుంది. శ్వాబ్ ఇండియా వచ్చి, ఇక్కడ సంస్కరణల అమలును అందరికంటే ముందుగా తలకెత్తుకున్న ఆంధ్రప్రదేశ్‌లో– ‘సమాజంలో ప్రతి ఒక్కరికి వికాసం...’ అంటూ ‘హారిజాంటల్’ నమూనాను మనకు ప్రతిపాదిస్తున్నాడు. అటువంటప్పుడు రెండు అంశాల విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కావాలి. మొదటిది– ప్రతి ఒక్కరు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం జీవించే– ‘సాంఘిక పెట్టుబడి’ (సోషల్ కేపిటల్) మీద సింహభాగం నిధులను ప్రభుత్వం ఖర్చు చేయాలి. అవి– గృహనిర్మాణం, వైద్యం, విద్య, సాంఘిక భద్రత వంటివి. రెండవది– ‘వికాసం, సమాజంలో ప్రతి ఒక్కరికి’ అన్నప్పుడు, వి.పి. సింగ్ ప్రధానిగా 1989–90 మధ్య అమలులోకి తెచ్చిన మండల్ కమిషన్ నివేదిక ప్రస్తావన ఇక్కడ తప్పదు. అప్పటినుంచి దానికి కొనసాగింపుగా జరుగుతున్న– ‘వర్నాక్యులైజేషన్ ఆఫ్ డెమోక్రసీ’ దశల వారీగా నత్త నడకన అమలు కావడం తెలిసిందే. దాన్నే, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత ఏ.పి. ముఖ్యమంత్రి జగన్ తదుపరి దశకు చేర్చడానికి మరింత లోపలికి, సూక్ష్మ స్థాయికి తీసుకుని వెళుతున్నాడు. ఎలా? ‘బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ,’ ‘ఏ.పి. వడ్డెర డెవలప్మెంట్ కార్పో రేషన్’ వంటి కొత్త సంస్థల ఏర్పాటుకు ఈ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను మనం చూడవలసింది ఆ దృష్టిలో నుంచే. ఎందుకంటే, ఈ రెండింటిలో– ‘ప్రాంతం’ ఉంది, ‘ప్రజలు’ ఉన్నారు. ఒక ‘రాజ్యం’ శ్రద్ధ తీసుకోవలసిన ప్రధాన అంశాలివి. (చదవండి: ‘ఆఖరి మైలు’ జనహృదయానికి దగ్గరయితే...) చివరిగా శ్వాబ్ చెప్పిన కీలకమైన అంశం– ‘మనకు భద్రత వుండదు...’ ఎవరీ ‘మనం’? వీరికి ఎటువంటి విషయంగా భద్రత ఉండదు? గతంలోకి ఒకసారి చూస్తే, ఆర్థిక సంస్కరణల అమలు కాలంలోనే నగరాలలోని ప్రతి పెద్ద ఆవరణ గేట్ ముందు నీలిరంగు యూనిఫారం సెక్యూరిటీ రావడం మనం గమనించలేనంత నిశ్శబ్దంగా జరిగిపోయింది. ఇక ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాల నుంచి వస్తున్న దొంగల ముఠాల కదలికలు ఎక్కువయ్యాక... ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో సంపన్న వర్గాల కాలనీలలో ‘ఫార్మ్ హవుస్’ల వద్ద ‘సి.సి కెమెరాలు,’ ‘ఎలక్ట్రిక్ ఫెన్సింగ్’ వంటి భద్రతా చర్యలు అవసరం అయ్యాయి. వీటికి– ‘సైబర్ క్రైం’ అదనం. ఇలా మనం మన నివాసాలలో ఉంటున్నప్పటికీ ‘భద్రత’ మన ప్రాధాన్యాలలో ఒక కొత్త అంశం అయింది. చివరిగా మనమెటు? అనేది త్వరితంగా తేల్చుకోవడం వల్ల, ఇప్పుడున్న ‘క్రాస్ రోడ్స్’ వద్ద ఒక కొత్త దశాబ్దిలో మన వైఖరికి స్పష్టత రావచ్చు. (చదవండి: తీరప్రాంత రక్షణలో మన ఐఎన్ఎస్ విశాఖపట్టణం) - జాన్సన్ చోరగుడి అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
దొరికారు..
సాక్షి, తూర్పుగోదావరి : ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలు సోషల్ ఆడిట్లో బయటపడ్డాయి. 2018–19 ఆర్థిక సంవత్సరంలో మండలంలో ఉపాధి హమీ పథకం ద్వారా జరిగిన వివిధ పనులపై క్షేత్ర స్థాయిలో సోషల్ ఆడిట్ బృందాలు తనిఖీ నిర్వహించి నివేదిక సమర్పించాయి. ఈ నివేదికపై మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ డి.రాంబాబు అధ్యక్షతన మంగళవారం ప్రజావేదిక నిర్వహించారు. ఎం.బుక్ రికార్డు చేయకుండా బిల్లులు చెల్లింపులు, పనులు జరిగిన ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయక పోవడం, ఇల్లు నిర్మాణం చేపట్టకుండానే బిల్లులు డ్రా చేయడం, మొక్కల పెంపకంలో అక్రమాలు వంటి పలు అవకతవకలను డీఆర్పీలు ప్రజావేదికలో బహిర్గతం చేశారు. వీటిపై పీడీ ఎం.శ్యామల ఫీల్డ్ అసిస్టెంట్లు వెలుగు సిబ్బంది, వృక్ష సేవకులను నిలదీశారు. వృక్ష సేవకులు నాటిన మొక్కలు కొన్ని గ్రామాల్లో 80 శాతం చచ్చిపోగా వాటికి సంబంధించిన ట్రీ గార్డులు, నీరుపోయుట, పరిశీలన కింద లక్షలాది రూపాయల నిధులు చెల్లింపులు జరిగినట్టు సోషల్ ఆడిట్ బృందం వెల్లడించింది. గేదెల్లంక గ్రామంలో ఉపాధి హమీ పథకంలో పనులకు సంబంధించి మస్టర్ల నమోదు షీటులో 10 మందికి సంబంధించి ఒకే రకమైన సంతకాలు, వేలి ముద్రలు ఉండడంతో అవినీతి జరిగినట్టు ఆడిట్ బృందం గుర్తించినట్టు ప్రజా వేదికలో పీడీ ఎం.శ్యామల ఫీల్డ్ అసిస్టెంట్ వి.రాధకృష్ణను నిలదీశారు. అయితే ఆ మస్టర్లు తానే వేసినట్టు ఆయన అంగీకరించడంతో అతడిని సస్పెండ్ చేశారు. ఎన్ఆర్ఈజీఎస్ పనుల అవకతవకలకు సంబంధించి రూ.41,994, పంచాయతీరాజ్ పనులకు సంబంధించి రూ.36,287, మొక్కల పెంపకానికి సంబంధించి రూ.75,540, గృహనిర్మాణానికి సంబంధించి రూ.1,32,450, పశుసంవర్ధక శాఖకు సంబంధించి రూ.10, 586, సర్వశిక్షాభియాన్ సంబంధించి రూ.860 అవకతవకలు జరిగినట్టు గుర్తించి వాటి రికవరీకి ఆదేశించారు. ఈ ప్రజావేదికలో ఏపీడీ జే.రాంబాబు, హెచ్ఆర్ మేనేజర్ జి.రాజేష్, ఐఎంటీ బి.దాసు, ఎస్ఆర్పీ పి.జగన్నాథం, ఏపీఓ ఏఎస్వీ కృష్ణ, హౌసింగ్ ఏఈ జగన్, ఈసీ ఎస్బీ నారాయణ, టెక్నికల్, ఫీల్డు అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
అక్కడ అవినీతి ‘భద్రం’
►అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన రామభద్రపురం ►క్కడికెళ్లిన అధికారులకు అంటుకుంటున్న అవినీతి మరక ►మూడేళ్లుగా వెలుగు చూస్తున్న అక్రమాలు ►ఏటా ఎవరో ఒకరి సస్పెన్షన్ సాక్షి ప్రతినిధి, విజయనగరం : రామభద్రపురం మండలం అక్రమాలకు, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అక్కడకు ఏ అధికారి వెళ్లినా ఆ మరక అంటించుకుంటున్నారు. ఇటీవలి జరిగిన సంఘటనలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. 2015లో పీఐడీపీ పనుల్లో అక్రమాలతో కొందరిపై సస్పెన్షన్ వేటు పడింది. 2016లో నీరు చెట్టు అక్రమాలతో పలువురు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇప్పుడేమో వ్యవసాయ అధికారి సస్పెండ్ అయ్యారు. పీఐడీపీ అక్రమాల్లో ఏడుగురిపై సస్పెన్షన్ వేటు 2015లో రామభద్రపురం మండలంలో చేపట్టిన పీఐడీపీ(పబ్లిక్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్) పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. ఏడాది కాలంలో రూ.5కోట్ల విలువైన 150చెరువు పనులు చేపట్టారు. దానికి సంబంధించిన మట్టి పనుల్ని కూలీల చేత చేయించాలి. కానీ ఇక్కడ కొన్ని చెరువుల మట్టి పనుల్ని యంత్రాలతో చేయించి, కూలీల చేత చేయించినట్టు బిల్లులు డ్రా చేసేశారు. రోజురోజుకు ఎక్కువైన అక్రమాల నేపథ్యంతో పాటు అధికారుల మధ్య మనస్పర్ధలు రావడంతో అన్నీ బట్టబయలయ్యాయి. సాక్షాత్తు అక్కడి ఏపీఓ సత్యవతి నేరుగా ఫిర్యాదు చేయడం విశేషం. రూ.5లక్షల అంచనా వ్యయంతో బూసాయివలస కేజీబీవీ పాఠశాల మైదానం చదును పనులు చేపట్టగాఇందులో కూలీలతో చేయించాల్సిన మట్టి తవ్వకాలను యంత్రాలతో చేసి సుమారు రూ.2లక్షలు అడ్డగోలుగా డ్రా చేశారని ఆరోపించారు. ముచ్చర్లవలసలో శ్మశానం చదునుకు రూ.4.15లక్షల అంచనాతో పనులు చేపట్టగా ఇందులో కూలీలతో చేయాల్సిన మట్టి తవ్వకాలను యంత్రాలతో చేయించి రూ.1.75లక్షలను డ్రా చేశారని, రామభద్రపురం ఎంపీడీఓ కార్యాలయ సముదాయం చదునుకు రూ.3.34లక్షలు కేటాయించగా అందులో కూలీలతో చేయాల్సిన మట్టి పనుల్ని యంత్రాలతో చేయించి రూ.80వేలు డ్రా చేసుకున్నారని ఆరోపించారు. దీంతో డ్వామా అధికారులు శాఖాపరమైన విచారణ జరిపించారు. పలు లోపాల్ని గుర్తించారు. సోషల్ ఆడిట్ కూడా నిర్వహించారు. అక్రమాలు బయటపడ్డాయి. ఒక ఇంజినీరింగ్ కన్సల్టెంట్, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు ఫీల్డ్ అసిస్టెంట్లు సస్పెన్షన్‌కు గురయ్యారు. 2016లో నీరు చెట్టు అక్రమాలు నీరుచెట్టు నిధుల దుర్వినియోగంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయి. 2016లో ఇదొక టాక్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ అయ్యింది. అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కైపోయి ఇష్టారీతిన పనులు చేపట్టారు. రూ. 3కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పార్వతీపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ అధికారి సంతకాన్ని కూడా ఫోర్జరీ చేశారు. నచ్చినంతకు బిల్లు తయారు చేసి పాస్ ఆర్డర్ జారీ చేసుకున్నారు. మరికొన్నిచోట్ల కొలతల పుస్తకాలు(ఎంబుక్) తారుమారు చేసి నిధులు డ్రా చేశారు. దీనిపై శాఖా పరమైన విచారణ చేపట్టారు. ఒకవైపు ఇరిగేషన్, డ్వామా అధికారులు విచారణ చేపట్టగా, మరోవైపు సోషల్ ఆడిట్ నిర్వహించారు. దాదాపు అన్ని విచారణల్లోనూ అక్రమాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో ఎంపీడీఓ, ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, అసిస్టెంట్ ఇంజినీర్, ఏపీఓ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు 16మంది ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశారు. వారితో పాటు 22మంది సర్పంచ్ల చెక్ పవర్ కూడా రద్దు చేశారు. దీన్ని బట్టి ఇక్కడెంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా వ్యవసాయ అధికారి... పెసర, మినుము విత్తనాలతో పాటు ఎరువుల విక్రయ సొమ్మును రామభద్రపురం వ్యవసాయ అధికారి చింతాడ ప్రసాదరావు పక్కదారి పట్టించారు. మార్క్‌ఫెడ్, ఏపీ సీడ్స్‌కు చెల్లించాల్సిన సొమ్మును సొంతానికి వాడుకున్నారు. సుమారు రూ. 8లక్షల వరకు కట్టకపోవడంతో ఉన్నతాధికారులు తాజాగా సస్పెండ్ చేశారు. ఇప్పుడిది మండలంలో కలకలమయ్యింది. మొత్తానికి వరుస సస్పెన్షన్లతో రామభద్రపురం మండలం జిల్లాలోనే చర్చనీయాంశమవుతోంది. -
పేదల పథకం...పెద్దల భోజ్యం
– ఉపాధి హామీ పథకంలో భారీగా నిధుల దుర్వినియోగం - అరకొర రికవరీకి ఆదేశం – ఎఫ్ఏ, ఇద్దరు టీఏలతో పాటు మరో ముగ్గురు సీనియర్ మేట్ల తొలగింపు – సామాజిక తనిఖీల్లో వెలుగుచూసిన అవినీతి భాగోతం – నేతల ఒత్తిళ్లతో బయటకు పొక్కకుండా అధికారుల జాగ్రత్తలు ఓర్వకల్లు : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించి వలసలను అరికట్టాలని ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారిపోతుంది. పర్యవేక్షణ లేమి, అధికారులు ఉదాసీనతతో ఈ పథకం పెద్దలకు భోజ్యంగా మారింది. సమాజిక తనిఖీల్లో వెలుగుచూస్తున్న అక్రమాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం ద్వారా ఓర్వకల్లు మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో దాదాపు రూ.6 కోట్లకు సంబంధించిన పనులు చేపట్టారు. అందులో పండ్ల తోటల పెంపకం, మట్టి రోడ్ల నిర్మాణం, ఫారంపాండ్్స తవ్వకాలు, వర్మికంపోస్టు తయారీ, చెరువులు, వాగులో పూడిక తీత, మొక్కలు నాటడం తదితర పనులను చేపట్టారు. ఈ పనులను సామాజిక తనిఖీ బృందం గ్రామాలకు వెళ్లి పరిశీలించింది. దాదాపు వారం రోజుల పాటు నిర్వహించిన గ్రామ స్థాయి విచారణలో పలు అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది. ఉపాధి పనుల బాధ్యతలు తెలుగుతమ్ముళ్లకే.. మండలంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు చాలా గ్రామాల్లో ఆ పార్టీ వారికే ఉపాధి పనులు చేపట్టే బాధ్యతలను అప్పగించారు. వాటిలో ప్రధానంగా పూడికతీత పనులు, మట్టిరోడ్లు, సీసీ రోడ్లు, నిర్మాణాలో్ల భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఫీల్డు అసిస్టెంట్లు, సీనియర్ మేట్ల ఆధ్వర్యంలో చేపట్టిన వర్మికంపోస్టు తయారీ, ఫారంపాండ్స్, పండ్ల తోటల పెంపకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తదితర పనులలో అక్రమాలు కొంత తక్కువేనని సమాచారం. 17 గ్రామాలో చేపట్టిన ఫారంపాండ్స్ తవ్వకాలలో 345 యూనిట్లకు గాను 245 యూనిట్ల నిర్మాణాలు పూర్తికాగా, అందుకు రూ.65.65 లక్షలు ఖర్చుచేసినట్లు తనిఖీ బృందం గుర్తించింది. 10 గ్రామ పంచాయతీలలో చేపట్టిన వర్మికంపోస్టు యూనిట్లలో 100 యూనిట్ల పనులు ప్రారంభం కాగా, వాటిలో 58 యూనిట్లకు రూ.6.22 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో మొత్తం 10 గ్రామాల్లో మట్టి రోడ్ల నిర్మాణం చేపట్టారు. దుర్వినియోగం భారీ..రికవరీ అరకొర మండలంలో మొత్తం రూ.6 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టగా అందులో దాదాపు రూ.80 లక్షలు దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది. బాధ్యుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయాల్సిన అధికారులు నాలుగైదు లక్షల రికవరీకి మాత్రమే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఒక ఫీల్డు అసిస్టెంటు, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు మరో ముగ్గురు సీనియర్ మేట్లను విధుల నుంచి తొలగించాలని డ్వామా అధికారుల ఆదేశించినట్లు సమాచారం. ఈ వివరాలతో పాటు ఉపాధిలోని అక్రమాల భాగోతం బయటకు పొక్కకుండా అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ నేతల ఒత్తిళ్లే ఇందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి. -
ఉపాధి పథకం సోషల్ ఆడిట్‌పై సమీక్ష
గుంటూరు వెస్ట్: ఉపాధి హామీ పథకం సోషల్ ఆడిట్‌పై జెడ్పీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సోషల్ ఆడిట్ రాష్ట్ర డైరెక్టర్ సౌమ్య కిదాంబీ, ప్రోగ్రామ్ మేనేజర్ వరలక్ష్మి, 13 జిల్లాలకు చెందిన ప్రోగామ్ మేనేజర్లు, రాష్ట్ర, జిల్లా రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జరిగిన ఉపాధి హామీ సోషల్ ఆడిట్‌పై ప్రధానంగా సమీక్షించారు. పంచాయతీరాజ్ కమిషనర్ బీ.రామాంజనేయులు సమావేశానికి హాజరయ్యారు. -
ఆసరాపై ఆడిట్!
ఆసరా పింఛన్లలో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. సోషల్ ఆడిట్ నిర్వహించాలని నిర్ణరుుంచిం ది. సరైన పత్రాలు లేకున్నా మంజూరు చేసినవాళ్లపై, అర్హత లేకున్నా తీసుకున్నవారిపై క్రిమినల్ కేసుల నమోదుకు రంగం సిద్ధం చేస్తోంది. అర్హులకే ఆసరా అందించేలా చర్యలు తీసుకుంటోంది. బోయినపల్లి : ఆసరా పింఛన్లలో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సెర్ప్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 28 మండలాల్లో ఆసరా ఫించన్లపై సామాజిక తనిఖీ చేసేందుకు సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏ.మురళి ఈ నెల 13న ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలను అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలకు పంపించగా, వారు తనిఖీలు జరిగే మండలాల ఎంపీడీవోలకు ఆదేశాలు పంపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ఆగస్టు 3 వరకు సామాజిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. మన జిల్లాలో వీణవంక, శ్రీరాంపూర్, బోరుునపల్లి మండలాల్లో సామాజిక తనిఖీ చేయనున్నారు. అరుుతే గోదావరి పుష్కరాలు రావడంతో ముందుగా సూచించిన తేదీల్లో సోషల్ ఆడిట్ జరిగే పరిస్థితి కనిపించలేదు. అధికారులు పుష్కరాల విధులకు వెళ్లడం... గ్రామాల్లో కూడా పుష్కరస్నానాలకు వెళ్లే అవకాశముండడంతో సోషల్ ఆడిట్ చేపట్టలేదు. పుష్కరాలు ముగియడంతో సోషల్ ఆడిట్‌పై మళ్లీ కదలిక మొదలైంది. రెండు మూడు రోజుల్లో పై మూడు మండలాల్లో సామాజిక తనిఖీ చేయనున్నట్లు సమాచారం. బోరుునపల్లి మండలంలో ఆగస్టు 3న సోషల్ ఆడిట్ చేయనున్నట్లు సమాచారం. ఆసరా పథకం కింద 2014 నవంబర్ 1 నుంచి 2015 మే 31 వరకు ఇచ్చిన వృద్ధాప్య, వితంతు, వికలాంగ, బీడీ కార్మికుల పింఛన్లపై అధికారులు ఆడిట్ నిర్వహించనున్నారు. చూసే రికార్డులివే.. ఆసరా ఫించన్ల సామాజిక తనిఖీ నిర్వహించే ఉద్యోగులు కింది రికార్డులు ఆధారం చేసుకుంటున్నారు. పింఛన్ కోసం చేసుకున్న దరఖాస్తుతో పరిశీలన రిపోర్ట్ ఎస్కేఎస్ ఫారం, పింఛన్ మంజూరు పత్రం, రిజెక్ట్ చేసిన జాబితా, వెయిటింగ్ లేదా పెండింగ్ లిస్ట్, కొత్త మంజూరు జాబితా, పింఛన్ డబ్బుల పంపిణీ చేసిన అక్విటెన్స్ జాబితా నెలలవారీగా, ఎన్ని పింఛన్లు, పంపిణీ చేసిన డబ్బుల వివరాలు ఈ అంశాలను తనిఖీ ఉద్యోగులకు మండల అధికారులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎంపీడీవో కార్యాలయంలో తీసుకున్న ఈ సమాచారం ఆధారంగా తనిఖీ అధికారులు గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి తనిఖీలు చేస్తారు. తనిఖీలు చేసేది వీరు స్టేట్ రిసోర్స్ పర్సన్(ఎస్సార్పీ) మానిటరింగ్‌లో, ఒక సీనియర్ డీఆర్పీ ప్రతీ గ్రామపంచాయతీలో ఒక సీనియర్ వీఎస్ఏను ఎంపిక చేసుకుని వారికి తనిఖీ అంశాలపై శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన సీనియర్ వీఎస్ఏ డీఆర్పీ సూచనలతో బాధ్యతతో గ్రామాల్లో డోర్‌టూడోర్ తిరిగి విచారణ చేపడతారు. సామాజిక తనిఖీకి వెళ్లే ముందు రోజు మండలంలో పింఛన్లకు సంబంధించిన రికార్డులు వీరు పరిశీలిస్తారు. ఈ రికార్డులు ఆయా మండాలల్లో ఎంపీడీవోలు అందుబాటులో ఉంచుతారు. అనంతరం గ్రామాల్లో పంచాయతీల కార్యదర్శులతో వీఎస్‌ఏలు సమన్వయ సమావేశం నిర్వహించి కార్యాచరణలోకి దిగుతారు. అక్రమాలు జరిగితే క్రిమినల్ కేసులు అర్హతలు లేకున్నా పింఛన్లు మంజూరు చేసిన వారిపై, సదెరం ధ్రువీకరణ పత్రం లేకుండా పింఛన్ మంజూరుపై, చనిపోయిన వారి పింఛన్లు వాడుకున్న వారిపై, మంజూరైన వారికి డబ్బులు ఇవ్వకుండా స్వాహా చేసిన వారిపై, బీడీలు చేయని వారికి పింఛన్ మంజూరు చేసిన వారిపై, పింఛన్ డబ్బులు డ్రా చేసి పంచని వారిపై, నాన్‌లోకల్ వారికి పింఛన్లు మంజూరు తదితర ఆసరా ఫించన్లలో అక్రమాలు చేస్తే సంబంధిత అధికారులకు పెద్ద మొత్తంలో జరిమానా విధించడంతోపాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయా మండలాల్లో అధికారులు ఆసరా పింఛన్లలో అక్రమాలు లేకుండా రికార్డులు జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నారు. -
మగాళ్లకూ వితంతు పింఛన్లు
మహానంది: మా భర్త చనిపోయాడు.. పిల్లలకు దిక్కులేదు.. కుటుంబం గడవటం కష్టంగా ఉంది.. కరుణించి పింఛన్లు ఇవ్వండి అంటూ వితంతువులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా కరుణించరు. ఎన్ని వినతి పత్రాలు అందజేసినా చలించరు. ఎన్నో నిబంధనలు అడ్డేస్తారు. రేషన్ కార్డులో పేరు తప్పుందని, ఓటరు కార్డులో ఫొటో సరిగా కనిపించడం లేదని.. వేలి ముద్రలు పడటం లేదని నిలిపేసే అధికారులు మగాళ్లు వితంతు పింఛన్లు తీసుకున్నా పట్టించు కోలేదు. మహానంది మండలంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, పింఛన్ల పంపిణీపై చేపట్టిన సామాజిక తనిఖీ అనంతరం శుక్రవారం ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ సులోచనమ్మ, వివిధ శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో జరిగింది. కార్యక్రమంలో ఎంపీడీఓతో పాటు సర్పంచులు కేశవరావు, సుబ్బయ్య, వివిధ గ్రామాల ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు. సోషల్ ఆడిట్ నివేదికల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. మహానందికి చెందిన మంగలి నారాయణ(ఐడీ నెంబరు 342432) వితంతు పింఛను తీసుకుంటున్నారు. సెప్టెంబర్ 2007లో వితంతు పింఛను మంజూరైంది. సెప్టెంబర్ 1014 వరకు తీసుకున్నట్లు సామాజిక తనిఖీ బృందం వారు గుర్తించారు. ఇదే గ్రామానికి చెందిన అనంత అనే అమ్మాయికి పట్టుమని పదిహేనేళ్లు లేవు. అయితే 342326 ఐడీ మీద వృద్ధాప్య పింఛను తీసుకుంది. ఇదే గ్రామంలో ఏడుగురు గ్రామంలో లేకున్నా సెప్టెంబర్ 2014వరకు పింఛన్లు డ్రా చేశారు. బుక్కాపురం గ్రామానికి చెందిన ఇటుకల నాగశేషుడు(ఐడీ నెంబరు 496723) ఇతని పేరు మీద కూడా వితంతు పింఛను డిసెంబర్ 2014 వరకు వచ్చినట్లు గుర్తించారు. గాజులపల్లె గ్రామంలో ఆరుగురు మృతి చెందినా వారి పేర్ల మీద పింఛన్లు డ్రా చేశారు. వారిలో లాలూబీ మృతి చెందినా ఆమె పేరు మీద రూ. 800, ఎస్. వెంకటేశ్వర్లు పేరు మీద రూ. 800, సాంబయ్య పేరుమీద రూ. రూ. 400, ఫర్వీన్‌బీ పేరు మీద 12 నెలలకు రూ. 2400, అమినాబీ పేరు మీద రూ. 2000, వెంకటమ్మ పేరు మీద మృతి చెందిన తర్వాత 11 నెలలకు రూ. 2200 డ్రా అయినట్లు వెలుగులోకి వచ్చాయి. ఇదే గ్రామంలో ఇద్దరి పేర్ల మీద రెండేసి పింఛన్లు ఉన్నాయి. లబ్ధిదారులకు ఒకే పింఛను అని తెలిసినా మరో పింఛను డబ్బులు మాత్రం డ్రా చేశారు. వారిలో పరమేశ్, సి.వెంకటలక్ష్మమ్మలు ఉన్నారు. పరమేశ్ తీసుకుంటున్న పింఛనుతో పాటు తన పేరు మీద ఉన్న మరో పింఛను ద్వారా రూ. 17,500 డ్రా అయినట్లు గుర్తించారు. గాజులపల్లె ఫీల్డుఅసిస్టెంటు వెంకటేశ్వర్లు ఐహెచ్ఎల్ వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణంలో 10 రోజుల పాటు పనిచేసినట్లు, మస్టర్లో రాసి రూ. 1490 తీసుకున్నాడని రికార్డుల్లో ఉంది. గాజులపల్లెలో వేతన రశీదులు ఉన్నా, తమకు వేతనాలు చెల్లించలేదని 181 మంది కూలీలు ఫిర్యాదులు చేశారు. అయితే వెబ్రిపోర్ట్లో చూడగా రూ. 2,83,952 డ్రా చేసినట్లు గుర్తించారు. గతంలో ఉన్న బ్యాంకు వారు డ్రా చేసి ఉంటారని, వారికి వెంటనే కూలీల వేతనాలు అందిస్తామని ఏపీడీ తెలిపారు. -
ఆమ్ఆద్మీ బీమా యోజనలో అక్రమాలు
సామాజిక తనిఖీలో వెలుగులోకి బతికుండగానే చంపేసి రూ. 30 వేలు స్వాహా పెద్దమండ్యం: ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో జరిగిన అక్రమాలు సామాజిక తనిఖీలో వెలుగులోకి వస్తున్నాయి. బతికుండంగానే ఓ యువకుడిని చనిపోయినట్లు చూపించి రూ.30 వేలు స్వాహా చేశారు. నాలుగు సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోయిన అక్రమాలు సామాజిక తనిఖీతో వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథనం మేరకు.. దిగువపల్లె పంచాయతీ వడ్డివంకతాండాకు చెందిన మూడే శివనాయక్, మూడే సునీత వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సునీత స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉంది. ఆమ్ ఆద్మీ భీమా యోజనా పథకంలో పాలసీ చేసింది. వీరికి ప్రభుత్వం జారీచేసిన డబ్ల్యూఏపి 100102300033 నెంబరు గల రేషన్‌కార్డు ఉంది. అయితే మే 2011 లో సునీత భర్త శివానాయక్ సాధారణ మరణం చెందినట్లు చెప్పి తక్షణ సహాయంగా ఆమ్ఆద్మీ ద్వారా వచ్చిన రూ.5 వేలు సొమ్మును తీసుకున్నారు. మరో విడతగా రూ.25 వేలు అదే గ్రామానికి శంకరమ్మ బ్యాంక్ ఖాతాకు (నెంబరు 86454160) జవ చేశారు. శివానాయక్ మృతి చెందినట్లు చూపించి రూ.30 వేలు స్వాహా చేసినట్లు తేలింది. సామాజిక తనిఖీలో భాగంగా ఆమ్ఆద్మీ ఇన్సూరెన్స్ పొందిన వారి వివరాలను తనిఖీ బృందాల సభ్యులు సేకరించారు. దీంతో బతికే ఉన్న శివానాయక్ పేరు మీద ఆమ్ ఆద్మీ ఇన్సూరెన్స్ సొమ్ము రూ.30 వేలను స్వాహా చేశారని తేలిపోయింది. ఈ మేరకు బాధితుడు శివనాయక్ స్థానిక పోలీసులు, ఎంపీడీవో, ఐకేపీ ఇన్చార్జి ఏపీఎంకు ఫిర్యాదు చేశారు. బతికుండంగానే చంపేశారు.. స్వయం సహాయక సంఘంలో నా భార్య సునీత సభ్యురాలుగా ఉంది. నేను బతికి ఉండగానే కాల్ సెంటర్‌కు చనిపోయారని ఎవరు చెప్పారు. ఆమ్ ఆద్మీ ద్వారా వచ్చిన సొమ్ము స్వాహా చేసిన వారెవరో తేల్చాలి. -మూడే శివనాయక్, వడ్డివంకతాండా -
పింఛన్ల అవినీతిపై సోషల్ ఆడిట్
నారాయణఖేడ్: ఆసరా పింఛన్ల పంపిణీపై త్వరలో సోషల్ ఆడిట్ జరుగుతుందని డీఆర్డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నారాయణఖేడ్‌కు వచ్చిన ఆయన ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో జరిగిన గ్రీవెన్స్ సెల్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసరా పింఛన్లు, ఆహార భద్రత కార్డులు రాని అర్హుల కోసం ప్రభుత్వం 16, 17 తేదీల్లో మరోసారి దరఖాస్తు చేసుకునేలా గ్రీవెన్స్ సెల్లో అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆసరా పింఛన్ల కోసం నాలుగుసార్లు నిధులను ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ద్వారా విడుదల చేసిందన్నారు. ఒకటి, రెండుసార్లు చేసిన నిధుల విడుదలలో మూడు నెలల పింఛన్లను, తర్వాత నిధుల విడుదలలో ఒక నెల పింఛన్‌ను విడుదల చేయడం జరిగిందన్నారు. కంగ్టిలో జరిగిన పింఛన్ల ప్రక్రియపై విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదించామన్నారు. బ్యాంకు రికార్డులు, ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్, ఆక్విటెన్సీ రికార్డులను పరిశీలించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యులు రవీందర్‌నాయక్, టీఆర్ఎస్ నాయకులు మూఢ రాంచెందర రాజగిరి శ్రీనివాస్, సీపీఎం నాయకులు చిరంజీవిలు అనర్హులకు వచ్చే పింఛన్లను తొలగించి, అర్హులకు త్వరగా పింఛన్లను అందించాలని కోరారు. కొన్ని గ్రామాల్లో ఒకే నెల పింఛన్లను అందిస్తున్నారని మూడు నెలల పింఛన్లను అందించాలని పీడీని కోరారు. పీడీ వెంట డీఆర్డీఏ ఏపీఓ సిధారెడ్డి, తహశీల్దార్ రాణాప్రతాప్‌సింగ్, ఇన్చార్జి ఎంపీడీఓ జాన్, ఖేడ్ ఈఓ వాసంతి తదితరులు ఉన్నారు. -
సోషల్ ఆడిట్ సిబ్బంది నిర్బంధం
ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ అవకతవకలు వెలికి తీయూలని ఆందోళన మహబూబాబాద్ రూరల్ : ఉపాధి హామీ పథకం అమలుపై సామాజిక తనిఖీ కోసం వచ్చిన సిబ్బందిని మహబూబాబాద్ మండలం బేతోలు గ్రామస్తులు, ఉపాధి కూలీలు గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం నిర్బంధించారు. ఉపాధి పనులు కల్పించాలని, గతంలో జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలను వెలికితీయాలని డిమాండ్ చేస్తూ అక్కడే ఆందోళన చేపట్టారు. వారికి సర్పంచ్ గద్దపాటి సంతోష్, వార్డు సభ్యులు మద్దతు పలికారు. గత ఏడాది ఉపాధి హామీ పథకంలో జరిగిన పనులపై గ్రామసభ పెట్టి సామాజిక తనిఖీ నిర్వహించేందుకు సోషల్ ఆడిట్ సభ్యులు మురళి, ఆరిఫ్, వినాయక్ కుమార్, నరేశ్, డీఆర్పీ రవి, టీఏ డి.సంతోష్ గ్రామపంచాయతీ కార్యాలయూనికి చేరుకున్నారు. వారితోపాటు అక్కడే ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ షైనాబీని గ్రామస్తులు, ఉపాధి కూలీలు గ్రామపంచాయతీలో బంధించి గేటుకు తాళం వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గతంలో బేతోలు గ్రామానికి రూ.30 లక్షల ఉపాధి హామీ పనులను కేటాయించారని, ఇందులో రూ.5 లక్షల పనులు మాత్రమే చేయించారని, కూలీలకు వేతనాలు కూడా చెల్లించలేదన్నారు. కురవి పోలీసులు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడుతుండగానే మానుకోట ఇన్చార్జి ఎంపీడీఓ జి.రవీందర్, ఉపాధి హామీ ఏపీఓ విజయ చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. మిగతా రూ.25 లక్షల ఉపాధి పనులను గ్రామానికి కేటాయిస్తామని, గతంలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. ఆందోళనలో వార్డు సభ్యులు ఖాదర్‌బాబు, గంగుల శ్రీను, జినుక ఎల్లయ్య, రవీందర్రావు, గ్రామస్తులు కిషన్, లక్ష్మయ్య, చేసం చిలుకమ్మ, సగరం పద్మ, ఎస్కే మాలుంబీ, ఎస్కే.యాకూబ్‌పాషా పాల్గొన్నారు. -
ఏసీబీ వలలో పౌరసరఫరాల డీటీ
రేషన్ డీలర్ భర్త వద్ద రూ.8వేల లంచం తీసుకుంటూ .. గురజాల: రేషన్ డీలర్ భర్త వద్ద రూ.8 వేల లంచం తీసుకుంటూ సీఎస్‌డీటీ మాలెపాటి వీరవెంకటనారాయణమూర్తి ఏసీబీ వలలో పడిన సంఘటన గురజాలలో గురువారం చోటుచేసుకుంది. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఎం.రాజారావు తెలిపిన వివరాల ప్రకారం.. రెంటచింతలకు చెందిన ఏశమ్మ గ్రామంలో షాపు నం.3 చౌకధరల దుకాణం నడుపుతోంది. ఈ నేపథ్యంలో ఆగస్టులో సోషల్ ఆడిట్ నిర్వహించగా.. సరుకు వివరాలు సరిగ్గా లేకపోవడంతో రేషన్ డీలర్‌ను సస్పెండ్‌చేసి షోకాజ్ నోటీసు అందజేశారు. ఆర్డీవోకు సమాధానం చెప్పి యధావిధిగా దుకాణాన్ని ప్రారంభించారు. అయితే, గత నెలలో గుర్తుతెలియని వ్యక్తులు డయల్ 100కు కాల్చేసి రెంటచింతల గ్రామంలో అక్రమంగా కిరోసిన్ తరలిస్తున్నారని ఫిర్యాదుచేశారు. ఆ మేరకు పౌరసరఫరాల అధికారులు గత నెల 19న రేషన్ షాపులను తనిఖీచేశారు. రికార్డుల్లో కన్నా షాపు నం.3లో అదనంగా ఉన్న 50 కేజీల బియ్యం, 200 లీటర్ల కిరోసిన్, సుమారు ఐదు కేజీల పంచదారను పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్ (సీఎస్‌డీటీ) నారాయణమూర్తి సీజ్‌చేశారు. పౌరసరఫరాల చట్టం ప్రకారం రేషన్ డీలర్‌పై 6ఏ కేసు నమోదు చేయాల్సివుంది. అయితే సీఎస్‌డీటీ రేషన్‌షాపు డీలర్ ఏశమ్మ భర్త ఓర్సు ప్రేమ్రాజుతో రూ.10 వేలు లంచం ఇస్తే ఎలాంటి కేసు లేకుండా చూస్తానని చెప్పాడు. అంత ఇచ్చుకోలేనని రూ.8 వేలు ఇస్తాననగా సీఎస్‌డీటీ సరేనన్నాడు. ఈ పరిస్థితుల్లో ప్రేమ్‌రాజ్ గుంటూరులోని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల పథక రచనలో భాగంగా రూ.8వేల (8 వెయ్యి నోట్లు) నగదును ప్రేమ్‌రాజ్ గురువారం మధ్యాహ్నం తహశీల్దార్ కార్యాలయంలో ఉన్న సీఎస్‌డీటీ నారాయణమూర్తికి అందించాడు. అదేసమయంలో ఏసీబీ డీఎస్పీ రాజారావు తన సిబ్బందితో దాడి చేసి సీఎస్‌డీటీని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ మేరకు విచారించి కేసు నమోదుచేశారు. దాడుల్లో రేంజ్ ఎస్ఐ కె.సీతారామయ్య, నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘ఉపాధి’ అక్రమాలపై కొరడా
ఖమ్మం మయూరిసెంటర్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో ఓపెన్‌ఫోరం, సోషల్ ఆడిట్లో బయటపడిన అవకతవకలు, అక్రమాలపై ఈనెల 22 నుంచి వచ్చే నెల ఒకటో తేదీ వరకు ు మండలాల వారీగా వ్యక్తిగత విచారణ చేపడుతున్నట్లు డ్వామా అధికారులు తెలిపారు. 22న అశ్వాపురం, చర్ల, కుక్కునూరు, వాజేడు, 24న భద్రాచలం, ఏన్కూర్, కొణిజర్ల, వైరా, 27న గార్ల, కూనవరం, ములకలపల్లి, 29న కల్లూరు, మధిర, డిసెంబర్ ఒకటిన మణుగూరు, పాల్వంచ మండలాల్లో విచారణ చేపడుతున్నట్లు వివరించారు. అశ్వాపురం మండలంలో ఏడో విడత ఉపాధి పనుల్లో రూ.25,187 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 11 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, చర్ల మండలంలోని ఆరో విడత పనుల్లో రూ. లక్ష 80 వేల 984 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 14 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కుక్కునూరు మండలంలో ఏడో విడత పనుల్లో రూ.45, 692 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 18 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వాజేడు మండలంలో ఐదో విడతలో రూ.41,990 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, నలుగురు కంప్యూటర్ ఆపరేటర్లు, 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, భద్రాచలం మండలంలో ఏడో విడతలో రూ.45, 408 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 24 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏన్కూర్ మండలంలో ఏడో విడతలో రూ. 7,399 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కొణిజర్ల మండలంలోని ఏడో విడత రూ.7, 948 మేర అక్రమాలపై ఇద్దరు ఏపీఓలు, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 9 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వైరా మండలంలోని ఏడో విడతలో రూ. 39, 288 మేర అభియోగాలపై ఏపీఓ, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, గార్ల మండలంలోని ఆరో విడతలో రూ. 3,09,811 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, కూనవరం మండలంలోని ఆరో విడతలో రూ. 81,131 మేరకు అక్రమాలపై ఏపీఓ, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 17 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ములకలపల్లి మండలంలో ఏడో విడతలో రూ. 38, 009 మేర అ క్రమాలపై ఏపీఓ, ఈసీ, నలుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, 10 మం ది ఫీల్డ్ అసిస్టెంట్లు, కల్లూరు మండలంలో ఏడో విడతలో రూ. 7, 382 మేర అక్రమాలపై ఏపీఓ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, మధిర మండలం ఏడో విడతలో రూ. 29,984 మే అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, 23 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, మణుగూరు మండలంలో ఏడో విడతలో రూ. 19, 460 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఆరుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, పాల్వంచలో ఐదో విడతలో రూ. 25, 458 మేర అక్రమాలపై ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, తొమ్మిది మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏడో విడతలో రూ. 42, 951 మేర అక్రమాలపై ఏపీఓ, ఈసీ, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్, 13 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధించి వ్యక్తి గత విచారణ నిర్వహించనున్నట్లు డ్వామా అధికారులు తెలిపారు. -
ఆడిట్ దడ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ప్రక్షాళన మొదలైంది. డ్వామా నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పథకం పనుల్లో పలు అవకతవకలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే వీటిపై అధికారులు పలు దఫాలుగా విచారణ చేశారు. గతంలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఉపాధిహామీ పథకం అమలులో కీలకపాత్ర వహించే క్షేత్రస్థాయి ఉద్యోగులు కొందరు అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్లు సోషల్ ఆడిట్లోనిర్దారణయింది. దుర్వినియోగమైన సొమ్మును అక్రమార్కుల నుంచి కక్కించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 2007 నుంచి జిల్లాలో ఈ పథకం అమలులో ఉంది. నాటి నుంచి అక్రమాలు కోకొల్లలుగా చోటుచేసుకుంటున్నాయి. కాస్త ఆలస్యంగానైనా ప్రభుత్వం మేల్కోవడంతో కొంతమేరకైనా అవినీతికి అడ్డుకట్టపడినట్టే. సోషల్ఆడిట్తో అక్రమాలకు చెక్ ప్రభుత్వ సొమ్ము నిజమైన కూలీలకు చెందకుండా దళారీలు, చేతివాటం ప్రదర్శించే ఉద్యోగుల జేబుల్లోకి వెళ్లడంపై అధికారులు దృష్టి సారించారు. ఈ ప్రక్రియకు కళ్లెం వేసేందుకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సోషల్ఆడిట్ నిర్వహిస్తున్నారు. ఉపాధిహామీలో అక్రమాలను వె లుగులోకి తెస్తున్నారు. చేయని పనిని చేసినట్లుగా చూపించటం, పనుల కొలతత్లో హెచ్చుతగ్గులు, కూలీలు ఎక్కువ పనిదినాలు చేసినట్లు చూపడం, క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికన్నా ఎక్కువ మందిని కంప్యూటర్లలో నమోదు చేయడం, పని ప్రారంభం కాకుండానే మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చినట్లుగా చూపించడం వంటి అక్రమాలపై అధికారులు సోషల్ ఆడిట్లో నిగ్గుతేల్చారు. జిల్లాలో ఈ తరహా అక్రమాలకు పాల్పడిన నలుగురు ఎంపీడీవోలపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు సైతం వేసింది. వీరు తిరిగి ఉద్యోగాలు పొందగలిగినా వీటికి సంబంధించిన కేసుల విచారణ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ పథకంలో అవకతవకలకు పాల్పడినట్లు పూర్తిస్థాయి నిర్ధారణకు వచ్చిన ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు 144 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 22 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను విధుల్లో నుంచి తొలగించింది. సత్ఫలితాలిస్తున్న చర్యలు ఉపాధిహామీ పథకంలో మార్పులు తేవడంతోపాటు ఉద్యోగుల్లో అంకితభావాన్ని పెంచేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు ఇస్తున్నాయి. గతంలో జరిగిన అవకతవకలపై మాత్రం అధికారులు చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. పథకం అమలునాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో రెండు కోట్ల రెండు లక్షల ఆరువేల రూపాయలు దుర్వినియోగం అయినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఉపాధి హామీ పథకం అమలులో భాగస్వామ్యులైన వివిధ విభాగాల ఉద్యోగుల్లో అవకతవకలకు పాల్పడిన వారి నుంచి ఇప్పటికే రూ.83.33 లక్షలు రివకరీ చేశారు. ఈ ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులు, క్షేత్రస్థాయి సిబ్బందిలో అంకితభావం, హామీ పథకం లక్ష్యాల ను వివరించటం, ఉపాధి కోసం కూలీలు పడుతున్న ఇబ్బందిని పరిగణలోకి తీసుకోవాలని కిందిస్థాయి సిబ్బందికి డ్వామా అధికారులు ఉద్బోధిస్తున్నారు. ఇంకా వసూలు కావాల్సిన దాదాపు రూ.1.18 కోట్లపై సైతం అధికారులు దృష్టి సారించారు. భవిష్యత్తులో ఈ పథకంలో అక్రమాలు చోటు చేసుకోకుండా చూసేందుకు అధికారులు పలు పద్ధతులను అమలు చేస్తున్నారు. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. వారం రోజుల క్రితం చండ్రుగొండలో ఏపీవో పేరుతో ఒక క్షేత్రస్థాయి ఉద్యోగి చెక్‌ను ఫోర్జరీ చేశాడు. రూ.4.15 లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేశాడు. అప్రమత్తమైన అధికారులు ఈ తరహా అక్రమాలు జరగకుండా మరింత పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రికవరీపై మరింత దృష్టి ఉపాధి హామీ పథకం అమలులో జరిగిన అవకతవకలపై డ్వామా పీడీ జగత్కుమార్రెడ్డిని ‘సాక్షి’ వివరణ కోరింది. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసిన వారి నుంచి తిరిగి రాబట్టేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన అన్నారు. ఉన్నతాధికారుల నుంచి ఈ మేరకు ఆదేశాలు వచ్చాయన్నారు. ఈ పథకం అమలును వేగవంతం చేస్తున్నామన్నారు. అందరికీ ఉపాధి లభించేలా తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీని కోసం క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. -
బడిదొంగల ఆటకట్టు !
ఖమ్మం : నెలనెలా వేతనాలు తీసుకుంటూ పాఠశాలలకు డుమ్మా కొడుతున్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల భరతం పట్టేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలిసింది. జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు సక్రమంగా బడికి వెళ్లడం లేదని తరచూ ఫిర్యాదులు రావడం, దీనిపై స్వయంగా జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఉపాధ్యాయుల హాజరుపై అధికారులు ప్రత్యేక నిఘా పెడుతున్నారని సమాచారం. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయుల హాజరు శాతం ప్రతిరోజు ఆన్లైన్లో పొందుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో కదిలిన విద్యాశాఖ... ‘నేను ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థిని.. ప్రభుత్వ పాఠశాలలు అంటే చులకనేమీ కాదు.. ఇక్కడ కూడా అర్హత గల ఉపాధ్యాయులే ఉన్నారు.. పాఠశాలలపై పర్యవేక్షణ పెంచితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు’ అని కలెక్టర్ ఇలంబరితి ఇటీవల విద్యాశాఖ అధికారుల సమావేశంలో, ఆ తర్వాత ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సమావేశంలోనూ ప్రస్తావించారు. సెలవులో ఉంటే హాజరుపట్టికలో ఉదయమే సీఎల్ పెట్టాలని, సాయంత్రం వరకు సెలవు పత్రాన్ని చూపిస్తూ ఉంచడం నేరమని హెచ్చరించారు. దీంతోపాటు ఇటీవల డీఈవోతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయుల హాజరు విషయంపై ప్రత్యేక శ్రద ్ధ పెట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన జిల్లా విద్యాశాఖ అధికారులు.. బడికి వెళ్లకుండా హాజరు వేయించుకుంటున్న ఉపాధ్యాయుల గుట్టు రట్టు చేసేలా కసరత్తు చేస్తున్నారు. ఆన్‌లైనల్‌లో హాజరు నమోదు... ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల హాజరు వివరాలు ప్రతిరోజు సేకరించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా స్కూల్ కాంప్లెక్స్‌లకు హాజరు నమోదు వివరాలు చేరవేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మండల విద్యాశాఖ, ఆ తర్వాత జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాలకు సాయంత్రానికి హాజరు వివరాలు వస్తాయి. దీనిపై నిజనిర్ధారణ చేసేందుకు కూడా కట్టుదిట్టమైన ప్రణాళికతో విద్యాశాఖ ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రతిరోజు సేకరించిన హాజరు పట్టికతోపాటు, ప్రతినెలా ఆయా పాఠశాల యాజమాన్య కమిటీ, గ్రామ పెద్దలు, సర్పంచ్ సమక్షంలో ఓపెన్ ఫోరం ఏర్పాటు చేసి.. ఉపాధ్యాయుల హాజరు వివరాలు, తల్లిదండ్రులు, విద్యార్థుల ద్వారా సేకరించిన వివరాలతో సరిచూస్తారు. దీంతో పాఠశాలకు రాకుండా హాజరు వేయించుకున్న ఉపాధ్యాయుడు, అందుకు సహకరించిన ఇతర ఉపాధ్యాయుల గుట్ట రట్టు అయ్యే అవకాశం ఉంది. స్కూల్ విజిట్ రిపోర్టులో హాజరుకు ప్రత్యేక కాలం... స్కూల్ కాంప్లెక్స్ అధికారి, ఎంఈవో, డిప్యూటీఈవో, డీఈవోలతోపాటు, సర్వశిక్ష అభియాన్ అధికారులు తరుచూ చేసే స్కూల్ విజిట్‌లో కూడా ఉపాధ్యాయుల హాజరు విషయంపై ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి విద్యార్థులను, తల్లిదండ్రులను, ఇతర సిబ్బంది ద్వారా వివరాలు సేకరించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వకరు పాఠశాల సందర్శన సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల నమోదు, పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, బడి బయట ఉన్నవారి సంఖ్య, పాఠశాలకు మంజూరైన నిధుల వినియోగం, టాయిలెట్స్, తాగునీటి వసతి, కంప్యూటర్ల పనితీరు, విద్యుత్ సౌకర్యం, బోధనోపకరణాల వినియోగం, విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిన తీరుపై పరిశీలించేవారు. ఇక ఇప్పుడు ప్రత్యేకంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య, వారిలో క్రమం తప్పకుండా హాజరయ్యే ఉపాధ్యాయులు, తరుచూ సెలవు పెట్టే ఉపాధ్యాయుల వివరాలను సేకరించేలా ఫార్మాట్ తయారు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు చెపుతున్నారు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టారు!
తాండూరు రూరల్ (పెద్దేముల్): పెద్దేముల్లో అధికారులు చేపట్టిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ తీరు ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా ఉంది. గత ఉపాధి హామీ తనిఖీలో అవకతవకలకు పాల్పడిన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సీఎస్పీలపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తుండగా.. మండలంలో 1-8-2013 నుంచి 31-5-2014 వరకు చేసిన ఉపాధి పనులపై తాజాగా సోషల్ ఆడిట్ జరిగింది. ఇందుకు 25 గ్రామ పంచాయతీల్లో రూ.3 కోట్ల 97 లక్షల 69 వేల పనులు జరిగాయి. కానీ రూ. లక్ష 50 వేలు మాత్రమే అవకతవకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. నెల రోజుల నుంచి మండలంలో 36 మంది వీఎస్ఓ (విలేజ్ సోషల్ అడిటర్స్)లు సోషల్ అడిట్ నిర్వహించారు. సోమవారం పెద్దేముల్ ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ 7వ సామాజిక తనిఖీ కార్యక్రమం జరిగింది. డ్వామా అడిషినల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి, జిల్లా విజిలెన్స్ ఆఫీసర్ రమేష్ గుప్తా, డ్వామా ఎగ్జిక్యూటివ్ రాంచందర్, ఏపీడీ ఉమాదేవి, డీపీఎం సునీల్ సోషల్ అడిట్ నిర్వహించారు. సోషల్ ఆడిట్ అనంతరం డ్వామా అడిషినల్ పీడీ ప్రభాకర్‌రెడ్డి పలు అంశాలను వెల్లడించారు. ► రేగొండి కూలీలకు రూ.92,825 చెల్లించాల్సిన డబ్బులు ఇవ్వనందున మండల కమిటీ కో ఆర్డినేటర్ శివకుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు. ►తట్టేపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ సంజీవ్‌కుమార్.. బినామీ కూలీల పేర్లను సృష్టించి రూ.21,548 అవకతవకలకు పాల్పడటంతో అతడిని విధుల నుంచి తొలగించారు. ►అత్కూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ పేర్లతో రూ.1980 కాజేయడంతో సొమ్ము రికవరీకి ఆదేశం. ►బుద్దారం కూలీలకు చెల్లించాల్సిన రూ.60 వేలను గ్రామ సీఎస్పీ ఇవ్వనందు న తొలగింపునకు ఆదేశాలు. ►నాగులపల్లి ఫీల్డ్ అసిస్టెంట్ రాములు బినామీ కూలీల పేర్లు సృష్టించి డబ్బులు కాజేయడంతో తొలగింపు. ►గోపాల్పూర్ ఫీల్డ్ అసిస్టెంట్ కృష్ణ రూ.56 వేల అవకతవకలకు పాల్పడటంతో తొలగింపు. ►పాషాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ బినామీ కూలీల పేర్లను సృష్టించి రూ.5,158 కాజేయడంతో రికవరీకి ఆదేశం. ►కోట్‌పల్లి ఫీల్డ్ అసిస్టెంట్ భీమయ్య రూ.18,850, అడికిచర్ల ఫీల్డ్ అసిస్టెంట్ స్వామిదాస్ రూ.14,208 కాజేయడంతో విధుల్లోంచి తొలగింపు. పలువురు సీఎస్పీలు.. వీబీకేల తొలగింపు.. గ్రామాల్లో కూలీలకు డబ్బులు ఇవ్వడంలో నిర్లక్ష్యం, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లలో అవకతవకలకు పాల్పడిన సీఎస్పీలు, వీబీకేలను తొలగించినట్లు ఏపీడీ ఉమాదేవి పేర్కొన్నారు. కోట్‌పల్లి, పాషాపూర్, ఇందూర్, నాగులపల్లి, కందనెల్లి, బుద్దారం, మారెపల్లి, గాజీపూర్ సీఎప్పీలను తొలగిం చామన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లలో అవకతవకలు జరగడంతో రుక్మాపూర్, పాషాపూర్, నాగులపల్లి, ఓమ్లనాయక్ తండా వీబీకేలను తొలగించామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ వాణిశ్రీ, వైస్ ఎంపీపీ నర్సమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు స్వరూప, ఎంపీడీఓ సంధ్య, ఏపీడీ శోభారాణి, ఏపీఓ శారద పాల్గొన్నారు. -
రికవరీకి నో ‘హామీ’
ఖమ్మం : వలసల నివారణ, అడిగిన ప్రతి కూలీకి పని కల్పించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాల్సిన ఉపాధి హామీ పథకం జిల్లాలో అక్రమాల పుట్టగా మారింది. వాటర్‌షెడ్ పనుల్లో కోట్ల రూపాయల కుంభకోణంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. వాటిపై ఇప్పటి వరకు నిజానిజాలు నిగ్గు తేల్చలేదనే ఆరోపణలు ఉన్నాయి. పథకం ప్రారభం నుంచి నేటి వరకు ఈజీఎస్‌లో జరిగిన అవకతవకలపై నిర్వహించిన సామాజిక తనిఖీ (సోషల్ ఆడిట్)లో కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని వెల్లడైంది. అయినా వాటిని రికవరీ చేసేందుకు జిల్లా అధికారులు ప్రయత్నించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నామమాత్రంగా ఒకరిద్దరిపై చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు ప్రాంతాల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై గ్రామసభలు కూడా నిర్వహించడం లేదని, పనులు చేయకుండానే చేసినట్లు రికార్డులు సృష్టిస్తూ, కోట్ల రూపాయలు డ్రా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రికవరీకి నోచని రూ. 2.49 కోట్లు... జిల్లాలో 5, 82,759 జాబ్ కార్డులు ఉండగా వీటి ద్వారా 14,41,083 మంది కూలీలకు ఉపాధి కల్పిస్తున్నారు. పథకం ప్రారంభమైన 2010 నుంచి ప్రతి సంవత్సరం వందల కోట్ల రూపాయల విలువైన పనులు చేస్తున్నారు. ఇందులో కింది నుంచిపైస్థాయి అధికారుల చేతివాటంతో కోట్ల రూపాయల అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేటతెల్లమైంది. 2010 నుంచి ఈ సంవత్సరం వరకు ఈ అక్రమాలపై ఏడు సార్లు సోషల్ అడిట్ నిర్వహించారు. ఈ ఆడిట్ ద్వారా జిల్లాలో 3,14,00,739 రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారించారు. అయితే, వాటిని రికవరీ చేయడంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మొదటి విడత తనిఖీల్లో రూ. 15 లక్షలకు పైగా అక్రమాలకు పాల్పడినట్టు తేలగా, అందులో రూ. 13 లక్షలు రికవరీ చేశారు. అదే రెండో విడతలో రూ. 59 లక్షలు దుర్వినియోగం కాగా, ఇందులో కేవలం రూ. 20 లక్షలు, మూడో విడతలో రూ. 26 లక్షలకు రూ.13 లక్షలు, నాలుగో విడతలో రూ. 28 లక్షలకు రూ. 6 లక్షలు మాత్రమ రికవరీ చేశారు. ఐదో విడతలో అత్యధికంగా రూ.1.23 కోట్లు దుర్వినియోగం కాగా, ఇందులో రూ.8.17 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. దీన్నిబట్టి చూస్తే ఉన్నతాధికారుల తీరు ఎలా ఉందో అర్థమవుతోంది. అయితే జిల్లాలో జరిగిన అక్రమాలలో అక్కడి ఉద్యోగులతోపాటు పలువురు నాయకులు, ఉన్నతాధికారుల ప్రమేయం కూడా ఉందని, అందుకోసమే రికవరీ చేయడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తోడు రికవరీ పేరిట పలు ప్రాంతాల్లో ఉద్యోగులను వేధిస్తూ వారి వద్దనుంచి అధికారులు ముడుపులు వసూళ్లు చేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
‘ఉపాధి’.. పక్కదారి !
- పథకం పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు - తూతూమంత్రంగా సామాజిక తనిఖీ - పూర్తిస్థాయిలో వెలుగులోకి రాని అక్రమాలు గ్రామాల్లో కూలీల వలసలు నివారించి, వారికి స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి. పనుల్లో అవినీతి, అక్రమాలు తారాస్థాయికి చేరి నిధులు దుర్వినియోగమవుతున్నాయి. ఇందుకు సామాజిక తనిఖీ ప్రజావేదికల్లో వెలుగుచూస్తున్న అవినీతి, అక్రమాలే నిదర్శనం. సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ఐదో విడత సామాజిక తనిఖీ ముగిసింది. ఇటీవలే ఆరో విడతలో భాగంగా 32 మండలాల్లో, ఏడో విడతలో ఒక మండలంలో తనిఖీ పూర్తయింది. ఇందులో భాగంగా రూ.13,60,15,448 విలువైన ఉపాధి హామీ పథకం పనులను సామాజిక తనిఖీ బృందం సభ్యులు తనిఖీ చేశారు. వీటిలో రూ.33,17,841 నిధులు దుర్వినియోగమైనట్లు తేల్చారు. మరో రూ.95,69,633 విలువైన పనులకు సంబంధించి సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు రూ.88,51,721 రికవరీ చేశారు. సామాజిక తనిఖీలో అవకతవకలు నిజమని తేలడంతో 59 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 34 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, ఐదుగురు కంప్యూటర్ ఆపరేటర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. వాస్తవానికి పథకం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అత్యధిక గ్రామాల్లో ఎన్నికల కోడ్ దృష్ట్యా సభలు నిర్వహించకపోవడంతో ఇంకా చాలా అక్రమాలు వెలుగులోకి రాలేదని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల ఖర్చు, పనులు జరిగిన తీరు, కూలీల ఉపాధి వివరాలకు పొంతన లేదనే విమర్శలున్నాయి. అక్రమార్కులకు వరం.. ఎన్నికల కోడ్ ఎన్నికల కోడ్ సమయంలో జరిగిన 5, 6వ విడత సామాజిక తనిఖీలు అక్రమార్కులకు వరంగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాజిక తనిఖీలో భాగం గా గ్రామంలో పనికి ఇచ్చిన గుర్తింపు సంఖ్య, వెచ్చించిన నిధులు, హాజరైన కూలీలు, చేసిన పనిదినాలు, చె ల్లించిన వేతనం తదితర వివరాలు సమీక్షిస్తారు. గ్రామంలో బహిరంగ సభ నిర్వహించి గ్రామస్తులు, కూలీల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించి, చేసిన పనులపై చర్చించాల్సి ఉంది. అయితే ఇటీవల రెండు నెలలపాటు ఎన్నికల కోడ్ అమలు ఉండడంతో సామాజిక తనిఖీలకు సంబంధించి అధికారులు గ్రామసభలు నిర్వహించలేకపోయారు. దీంతో కోడ్ సమయంలో సామాజిక తనిఖీ తూతూమంత్రంగా ముగిసిందనే ఆరోపణలున్నాయి. సభ నిర్వహించకపోవడంతో పనుల్లో జరిగిన అక్రమాలపై ప్రజలు, కూలీలకు ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోయిందని పలువురు పేర్కొంటున్నారు. సభ నిర్వహించి ఉంటే వీరి ద్వారా మరిన్ని అక్రమాలు వెలుగుచూసేవని చెబుతున్నారు. -
ఆడిట్లు సరే...మరి యాక్షనో?
‘ఉపాధి’ అక్రమార్కులపై చర్యలు శూన్యం రికార్డులను మాయం చేసిన వారిపై కూడా... గద్వాల డివిజన్లో 18.5 కోట్ల రికార్డులు గల్లంతు గట్టులో అత్యధికంగా 1.92 కోట్ల అక్రమాలను గుర్తించిన అధికారులు అయిజ, వడ్డేపల్లి, ఇటిక్యాల, ధరూర్, మల్దకల్, గద్వాలలో వెలుగుచూసిన అక్రమాలు అన్ని మండలాల్లోనూ అరకొర చర్యలే! గద్వాల: నియోజకవర్గంలోని గట్టు మం డలంలో అత్యధికంగా అక్రమాలు జరిగి నట్లు అధికారులు సామాజిక తనిఖీలలో గుర్తించారు. అక్కడ రూ.1.92కోట్ల అక్రమాలను గుర్తించినా, రూ.54,322లు మాత్రమే రికవరీ చేశారు. ఉద్యోగంలో ఉ న్న వారి అక్రమాలపై వసూళ్లను నెలవారీ కటింగ్లతో, ఉద్యోగులు కాని వారి అక్రమాల సొమ్మును రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా వసూళ్లు చేస్తామని అధికారులు ప లుమార్లు ప్రకటించారు. రెవెన్యూ రికవరీ యాక్ట్‌ను ఉపయోగించి వసూళ్లు చేసే అ ధికారాన్ని తహశీల్దార్లకు అప్పగించామని జిల్లా అధికారులు చెబుతున్నా, ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని తహశీ ల్దార్లు అంటున్నారు. మరోవైపు రెవెన్యూ రికవరీ యాక్టు ద్వారా నిధులను కాజేసిన వారి నుంచి వసూళ్లు లేకపోయినా, ఉపా ధి అక్రమాలపై సామాజిక తనిఖీలను చే స్తూనే ఉన్నారు. అధికారులు ఏ స్థాయిలో అక్రమాలను తేల్చినా అవి కాగితాలకే పరిమితం కాక తప్పదు. గుర్తించిన అక్రమాల విలువ... గట్టులో రూ.1.92 కోట్లు అక్రమంగా కా జేసినట్లు అధికారులు తేల్చినా, ఈ లెక్క ను కుదించే ప్రయత్నాలు జరిగాయి. అ యిజలో రూ.18 లక్షలు, వడ్డేపల్లిలో రూ.13 లక్షలు, ఇటిక్యాలలో రూ.12 లక్ష లు, ధరూరులో రూ.8 లక్షలు, మల్దకల్ లో రూ.15 లక్షలు, గద్వాలలో గతంలో రూ. 3 లక్షల అక్రమాలు ఉండగా, ఫిబ్రవరిలో నిర్వహించిన సామాజిక తనిఖీలో మరో లక్ష రూపాయలఅక్రమాలు వెలుగు చూశాయి. ఇలా అన్ని మండలాల్లోనూ అక్రమాలు వెలుగు చూసినా చర్యలు మాత్రం కనిపించడం లేదు. కిందిస్థాయి సిబ్బందిపై చర్యలు... గట్టు మండలంలో ఉపాధి హామీ అక్రమాలకు కారకులుగా భావించి ఒక ఎంపీడీఓ, 18మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐదుగురు టెక్నికల్ అసిస్టెంట్లను గతంలో తొలగించారు. అయిజలో ఇద్దరు ఫీల్డ్ స్టాఫ్‌పై చర్యలు తీసుకున్నారు. మల్దకల్ మండలంలో జరిగిన అక్రమాలకు బా ధ్యులుగా ఐదుగురు ఫీల్డ్ అసిస్టెంట్లను, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లను పక్కనబెట్టారు. ధరూరు మండలంలో నలుగురు ఫీల్డ్ అసిస్టెంట్లు, 21మంది మేటీలను తొ లగించారు. గద్వాల మండలంలో ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్, ఇద్దరు టీఎఫ్‌లకు షోకాజ్‌లిచ్చారు. రికార్డుల గల్లంతుపై చర్యలెక్కడ? డివిజన్లో దాదాపు రూ.18 కోట్ల విలువై న ఉపాధి పనులకు రికార్డులు గల్లంతయ్యాయి. ఇంత జరిగిందని తెలిసినా చర్యలు లేకపోవడం విశేషం. అలంపూర్ మండలంలో దాదాపు రూ.10 కోట్ల విలువైన ఉపాధి రికార్డులు, గట్టు మండలంతో రూ.5 కోట్ల విలువైన రికార్డులు, అయిజ మండలంలో రూ.3.5 కోట్ల విలువైన పనుల రికార్డులను సామాజిక తని ఖీల వేదిక వద్దకు రాకుండా గల్లంతు చేశారు. రికార్డులు ఎలా గల్లంతయ్యా యి, బాధ్యులు ఎవరనే విషయంపై జిల్లా అధికారులు తీవ్రంగా స్పందించి విచార ణ చేపట్టకపోవడంతో నేటికీ రికార్డుల విషయం అంతుబట్టని ప్రశ్నగానే మిగిలింది. చర్యలకు ఆదేశాలు ఇవ్వలేదు నేను ఏపీడీగా బాధ్యతలు మూడు నెలల క్రితమే తీసుకున్నాను. గతంలో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి నాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం అన్ని మండలాల్లో ఉపాధిహామీ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. పల్లెల్లో వ్యవసాయ కూలీలకు పనిదినాలు కల్పిస్తున్నాం. - ఏపీడీ గోపాల్ -
‘ఉపాధి’ స్కాం...ఢాం..!
మహబూబ్‌నగర్ వ్యవసాయం, న్యూస్‌లైన్: పల్లెల్లో వలసలు నివారించి,గ్రామాల్లో ఉన్న చోటనే పేద ప్రజలకు పనులు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహత్మగాంధీ జాతీయ ఉపాధి హమీ పథకాన్ని అవినీతి తిమింగలాలు అమాంతం మింగేస్తున్నాయి. జిల్లాలో 2007 నుండి ఇప్పటి వరకు అయిదు విడతల్లో జరిగిన సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్)లలో 20.40 కోట్ల అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ సిబ్బంది గుర్తించారు. జిల్లా ఉపాధి విజిలెన్స్ అధికారులు మాత్రం ఇప్పటి వరకు వాటిపై విచారించి అందులో రూ.10.16 కోట్లు కచ్చితంగా కట్టాల్సిందేనని తేల్చేశారు. దాంట్లో అవినీతికి పాల్పడిన సిబ్బంది నుండి అధికారులు ఇప్పటి వరకు వసూళ్లు చేసింది మాత్రం రూ. 3.48 కోట్లు మాత్రమే. మిగతా 6.68 కోట్ల రికవరీ పెండింగ్‌లోనే ఉంది. మరో 10.23 కోట్ల అవినీతి గుట్టు విప్పేందుకు అధికారులు సిద్ధమయ్యారు.ఇది మాత్రమే కాకుండా రూ.2కోట్ల మేర అవినీతికి పాల్పడ్డట్లు వచ్చిన ఆరోపణలపై డ్వామా అధికారులు విచారణ చేసి క్లీన్ చిట్ ఇచ్చేశారు. వామ్మో..ఇంత మింగుడా జిల్లాలో రోజురోజుకు ఉపాధి పనుల్లో అవినీతి చిట్టా పెరిగి పోతుండడంతో జిల్లా అధికారులు కంగు తినాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు 10.16 కోట్లను రికవరీ చేయాలని విజిలెన్స్ అధికారులు తేల్చగా గత అయిదేళ్లుగా కేవలం రూ.3.48 కోట్లనే చేయగలిగారు. అక్రమాలు గుర్తించినా ఇతర ఉపాధి సిబ్బందికి పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేసినా వాటిని పట్టించుకోలేదు. ఇక రూ. 6.68 కోట్లను రికవరీ చేయడం డ్వామా అధికారులకు తలకు మించిన భారంగా మారింది. కొందరు వీటిపై కోర్టులను ఆశ్రయించేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరూ తమ రాజకీయ ప్రాబల్యంతో గట్టెక్కే మార్గాలను అన్వేషిస్తున్నారు.రూ. 10.23 కోట్ల అవినీతిపై విచారించాల్సి ఉంది. అది జరిగే లోపే మరిన్ని సోషల్ ఆడిట్ల ద్వారా వచ్చి చేరుతున్నాయి. ఇలా ఈ చిట్టా పెరిగిపోతుండడం అందర్నీ బెంబేలెత్తిస్తోంది. ఒక మండలంలోనే రూ.2.50 కోట్ల పనుల్లో అవకతవకలు లింగాల మండలంలో గతేడాది 13 గ్రామాలలో జరిగిన పనులపై గత నెల 12వ తేదీన జరిగిన అయిదో విడత సామాజిక తనిఖీలో రూ.4.37 కోట్ల పనులకు ఆడిట్ చేయగా ఏకంగా రూ.2.50 కోట్ల మేర అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ బృందం గుర్తించింది.సామాజిక తనఖీల రాష్ట్ర డెరైక్టర్ సౌమ్య నేతృత్వంలో జరిగిన ప్రజావేదికలో ఈ అక్రమాల చిట్టా బయట పడ్డాయి. వీరిలో వలసలు వెళ్లినవారు, పెళ్లిళ్లు జరిగి ఇతర గ్రామాలకు వెళ్లిపోయిన వారు, ఆఖరికి చనిపోయిన వారి పేర్లు కూడా ఉన్నాయి. వారి పేర్లను మస్టరుల్లో రాసి బినామి బిల్లులతో స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఇలా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఏర్పడింది. పలువురిపై వేటు వేసినా... వివిధ సామాజిక తనిఖీల్లో గుర్తించిన అవినీతి ఆధారంగా పలువురిపై రికార్డు స్థాయిలో వేటు వేసినా అవినీతి పరులు చలించడం లేదు. ఇటీవలే పెద్ద సంఖ్యలో ఉపాధికి సంబంధించి కొందరిపై చర్యలు తీసుకున్నారు. ఉపాధి పనుల్లో ఏకంగా రూ. 2.50 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించిన జిల్లా అధికారులు లింగాల మండల స్థాయి సిబ్బందిపై క ఠిన చర్యలు తీసుకునేందుకు పూనుకున్నారు.సామాజిక తనిఖీలో జరిగిన అక్రమాలు వెలువడిన వెంటనే ఆ మండల ఏపిఓ లక్ష్మినారాయణతోపాటు నలుగురు టి.ఏలు, ఇద్దరు కంప్యూటర్ ఆపరేటర్లు, ఎనిమిది మంది క్షేత్ర సహాయకులను విధుల నుంచి ఇటీవల తాత్కలికంగా తొలగించారు.వారిపై ఉన్న అభియోగాలపై విచరణ చేపట్టే పనిలో అధికారులు ఉన్నారు.అంతేకాకుండా అదే మండలానికి చెందిన 150 మంది మేట్లను శాశ్వతంగా విధుల నుంచి తప్పించినట్లు సమాచారం. ఇలా ఇప్పటి వరకు దాదాపు 5వేల మంది ఉపాధి సిబ్బంది రూ. 20 కోట్లకు పైగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ విధులకు కొందరు తాత్కాలికంగా దూరమవ్వగా, మరికొంత మంది సిబ్బందిని శాశ్వతంగా విధుల నుండి తొలగించారు. ఇందులో ఎక్కువగా గ్రామాల్లో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు 1086మంది ఉన్నారు. వీరే దాదాపు 10 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డట్టు సామాజిక తనిఖి నివేదికల ద్వారా అధికారులు గుర్తించారు. వారి తరువాతి స్థానంలో సాంకేతిక సహాయకుల(టి.ఏ) రెండో స్థానంలో నిలిచారు.జిల్లాలోని 725 మంది టి.ఏలపై రూ. 5.41 కోట్ల మేర అవినీతికి పాల్పపడ్డట్టు అధికారులు గుర్తించారు.ఇలా ఆయా మండలాల్లో 1999 మంది మేట్లు 1.10కోట్లు,31 మంది ఏఈఈలు రూ.కోటి, 57మంది ఏపిఓలు 32లక్షలు ,159మంది సి.ఓలు 14లక్షలు, సర్పంచ్‌లు రూ.23లక్షల, 71 మంది ఈసీలు అవినీతికి పాల్పపడ్డట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. -
జనం భాగస్వామ్యం పెరగాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజా భాగస్వామ్యం పెరిగితేనే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చెప్పారు. ఈ దిశగా ముందడుగు వేయడానికి సోషల్ ఆడిట్ అవసరమని అభిప్రాయపడ్డారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన తర్వాత సైనిక, పోలీసు దళాల వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రగతిని వివరించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న విధంగానే విశాఖపట్నంలోనూ త్వరలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ఏర్పాటుకానుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ‘ఫాస్ట్ ట్రాక్’ విధానంలో అనుమతులు లభిస్తాయన్నారు. ‘విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్’ను సూపర్ స్పెషాలిటీ వైద్య రంగంలో అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. ప్రారంభంలో, చివరలో ఆయన తెలుగులో మాట్లాడారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, స్పీకర్ మనోహర్, పలువురు మంత్రులు, అధికారులు, ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కన్నులపండువగా వేడుకలు గణతంత్ర వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. 19 కంటింజెంట్లు మార్చ్ఫాస్ట్ చేశాయి. మార్చ్ఫాస్ట్లో సీనియర్ విభాగంలో ఈఎంసీ (ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ సెంటర్) బృందం మొదటి బహుమతి, ఆర్టిలరీ సెంటర్ రెండో బహుమతి పొందాయి. జూనియర్ విభాగంలో ఎన్సీసీ బాయ్స్‌కు, ఎన్సీసీ గర్ల్స్‌కు ప్రథమ, ద్వితీయ బహుమతులు వచ్చాయి. జడ్జిల సంఖ్య పెంపునకు కేంద్రం ఓకే: సీజే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా తెలిపారు. ప్రస్తుతం 49 మంది జడ్జిలు ఉండగా 61కి పెంచేందుకు కేంద్ర న్యాయశాఖ ఇప్పటికే అంగీకారం తెలియచేసిందన్నారు. హైకోర్టులో ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. హైకోర్టు జడ్జిలు, రిటైర్డ్ జడ్జిలు, రిజిస్ట్రార్లు, బార్ కౌన్సిల్ అధ్యక్షుడు ఎ.నర్సింహారెడ్డి, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎ.గిరిధరావు, పలువురు న్యాయవాదులు ఇందులో పాల్గొన్నారు.