పేదల పథకం...పెద్దల భోజ్యం
పేదల పథకం...పెద్దల భోజ్యం
Published Tue, Nov 22 2016 11:56 PM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
– ఉపాధి హామీ పథకంలో భారీగా నిధుల దుర్వినియోగం
- అరకొర రికవరీకి ఆదేశం
– ఎఫ్‌ఏ, ఇద్దరు టీఏలతో పాటు మరో ముగ్గురు సీనియర్ మేట్ల తొలగింపు
– సామాజిక తనిఖీల్లో వెలుగుచూసిన అవినీతి భాగోతం
– నేతల ఒత్తిళ్లతో బయటకు పొక్కకుండా అధికారుల జాగ్రత్తలు
ఓర్వకల్లు : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించి వలసలను అరికట్టాలని ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం లక్ష్యం నీరుగారిపోతుంది. పర్యవేక్షణ లేమి, అధికారులు ఉదాసీనతతో ఈ పథకం పెద్దలకు భోజ్యంగా మారింది. సమాజిక తనిఖీల్లో వెలుగుచూస్తున్న అక్రమాలే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకం ద్వారా ఓర్వకల్లు మండలంలోని 20 గ్రామ పంచాయతీలలో దాదాపు రూ.6 కోట్లకు సంబంధించిన పనులు చేపట్టారు. అందులో పండ్ల తోటల పెంపకం, మట్టి రోడ్ల నిర్మాణం, ఫారంపాండ్్స తవ్వకాలు, వర్మికంపోస్టు తయారీ, చెరువులు, వాగులో పూడిక తీత, మొక్కలు నాటడం తదితర పనులను చేపట్టారు. ఈ పనులను సామాజిక తనిఖీ బృందం గ్రామాలకు వెళ్లి పరిశీలించింది. దాదాపు వారం రోజుల పాటు నిర్వహించిన గ్రామ స్థాయి విచారణలో పలు అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు వెల్లడైంది.
ఉపాధి పనుల బాధ్యతలు తెలుగుతమ్ముళ్లకే..
మండలంలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు చాలా గ్రామాల్లో ఆ పార్టీ వారికే ఉపాధి పనులు చేపట్టే బాధ్యతలను అప్పగించారు. వాటిలో ప్రధానంగా పూడికతీత పనులు, మట్టిరోడ్లు, సీసీ రోడ్లు, నిర్మాణాలో్ల భారీ అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. ఫీల్డు అసిస్టెంట్లు, సీనియర్ మేట్ల ఆధ్వర్యంలో చేపట్టిన వర్మికంపోస్టు తయారీ, ఫారంపాండ్స్, పండ్ల తోటల పెంపకం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, తదితర పనులలో అక్రమాలు కొంత తక్కువేనని సమాచారం. 17 గ్రామాలో చేపట్టిన ఫారంపాండ్స్ తవ్వకాలలో 345 యూనిట్లకు గాను 245 యూనిట్ల నిర్మాణాలు పూర్తికాగా, అందుకు రూ.65.65 లక్షలు ఖర్చుచేసినట్లు తనిఖీ బృందం గుర్తించింది. 10 గ్రామ పంచాయతీలలో చేపట్టిన వర్మికంపోస్టు యూనిట్లలో 100 యూనిట్ల పనులు ప్రారంభం కాగా, వాటిలో 58 యూనిట్లకు రూ.6.22 లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో మొత్తం 10 గ్రామాల్లో మట్టి రోడ్ల నిర్మాణం చేపట్టారు.
దుర్వినియోగం భారీ..రికవరీ అరకొర
మండలంలో మొత్తం రూ.6 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టగా అందులో దాదాపు రూ.80 లక్షలు దుర్వినియోగమైనట్లు సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది. బాధ్యుల నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయాల్సిన అధికారులు నాలుగైదు లక్షల రికవరీకి మాత్రమే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఒక ఫీల్డు అసిస్టెంటు, ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు మరో ముగ్గురు సీనియర్ మేట్లను విధుల నుంచి తొలగించాలని డ్వామా అధికారుల ఆదేశించినట్లు సమాచారం. ఈ వివరాలతో పాటు ఉపాధిలోని అక్రమాల భాగోతం బయటకు పొక్కకుండా అధికారులు గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాజకీయ నేతల ఒత్తిళ్లే ఇందుకు కారణమనే ఆరోపణలు వస్తున్నాయి.
Advertisement