‘ఉపాధి’.. పక్కదారి !
- పథకం పనుల్లో పెద్దఎత్తున అక్రమాలు
- తూతూమంత్రంగా సామాజిక తనిఖీ
- పూర్తిస్థాయిలో వెలుగులోకి రాని అక్రమాలు
గ్రామాల్లో కూలీల వలసలు నివారించి, వారికి స్థానికంగా ఉపాధి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు పక్కదారి పడుతున్నాయి. పనుల్లో అవినీతి, అక్రమాలు తారాస్థాయికి చేరి నిధులు దుర్వినియోగమవుతున్నాయి. ఇందుకు సామాజిక తనిఖీ ప్రజావేదికల్లో వెలుగుచూస్తున్న అవినీతి, అక్రమాలే నిదర్శనం.
సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ఐదో విడత సామాజిక తనిఖీ ముగిసింది. ఇటీవలే ఆరో విడతలో భాగంగా 32 మండలాల్లో, ఏడో విడతలో ఒక మండలంలో తనిఖీ పూర్తయింది. ఇందులో భాగంగా రూ.13,60,15,448 విలువైన ఉపాధి హామీ పథకం పనులను సామాజిక తనిఖీ బృందం సభ్యులు తనిఖీ చేశారు. వీటిలో రూ.33,17,841 నిధులు దుర్వినియోగమైనట్లు తేల్చారు. మరో రూ.95,69,633 విలువైన పనులకు సంబంధించి సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
ఈ మేరకు రూ.88,51,721 రికవరీ చేశారు. సామాజిక తనిఖీలో అవకతవకలు నిజమని తేలడంతో 59 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 34 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, ఐదుగురు కంప్యూటర్ ఆపరేటర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. వాస్తవానికి పథకం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, అత్యధిక గ్రామాల్లో ఎన్నికల కోడ్ దృష్ట్యా సభలు నిర్వహించకపోవడంతో ఇంకా చాలా అక్రమాలు వెలుగులోకి రాలేదని స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల ఖర్చు, పనులు జరిగిన తీరు, కూలీల ఉపాధి వివరాలకు పొంతన లేదనే విమర్శలున్నాయి.
అక్రమార్కులకు వరం.. ఎన్నికల కోడ్
ఎన్నికల కోడ్ సమయంలో జరిగిన 5, 6వ విడత సామాజిక తనిఖీలు అక్రమార్కులకు వరంగా మారాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాజిక తనిఖీలో భాగం గా గ్రామంలో పనికి ఇచ్చిన గుర్తింపు సంఖ్య, వెచ్చించిన నిధులు, హాజరైన కూలీలు, చేసిన పనిదినాలు, చె ల్లించిన వేతనం తదితర వివరాలు సమీక్షిస్తారు. గ్రామంలో బహిరంగ సభ నిర్వహించి గ్రామస్తులు, కూలీల నుంచి ఫిర్యాదులు, సూచనలు స్వీకరించి, చేసిన పనులపై చర్చించాల్సి ఉంది.
అయితే ఇటీవల రెండు నెలలపాటు ఎన్నికల కోడ్ అమలు ఉండడంతో సామాజిక తనిఖీలకు సంబంధించి అధికారులు గ్రామసభలు నిర్వహించలేకపోయారు. దీంతో కోడ్ సమయంలో సామాజిక తనిఖీ తూతూమంత్రంగా ముగిసిందనే ఆరోపణలున్నాయి. సభ నిర్వహించకపోవడంతో పనుల్లో జరిగిన అక్రమాలపై ప్రజలు, కూలీలకు ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోయిందని పలువురు పేర్కొంటున్నారు. సభ నిర్వహించి ఉంటే వీరి ద్వారా మరిన్ని అక్రమాలు వెలుగుచూసేవని చెబుతున్నారు.