
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి మరిన్ని ఫిర్యాదులు చేసింది. దాదాపు 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. ఈ నెల 8న జరిగిన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని ఈవీఎంల బ్యాటరీలు 99 శాతం చార్జింగ్‌తో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు.
అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మిగతా ఈవీఎంల బ్యాటరీల్లో 80 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉందన్నారు. 99 శాతం చార్జింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తమ పార్టీ ఫిర్యాదులపై ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈవీఎంలను తారుమారు చేశారని వారు అనుమానిస్తున్నారు. అందుకే న్యాయం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment