Electronic Voting Machines (EVM)
-
ఈవీఎంలలో అవకతవకలపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదులు
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎంలు) అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎన్నికల సంఘానికి మరిన్ని ఫిర్యాదులు చేసింది. దాదాపు 20 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్లపై పోటీ చేసిన అభ్యర్థులు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందించారు. ఈ నెల 8న జరిగిన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కొన్ని ఈవీఎంల బ్యాటరీలు 99 శాతం చార్జింగ్‌తో ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. అది ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మిగతా ఈవీఎంల బ్యాటరీల్లో 80 శాతం కంటే తక్కువ చార్జింగ్ ఉందన్నారు. 99 శాతం చార్జింగ్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. తమ పార్టీ ఫిర్యాదులపై ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ పేర్కొన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసిన 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈవీఎంలను తారుమారు చేశారని వారు అనుమానిస్తున్నారు. అందుకే న్యాయం కోసం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించారు. -
Lok Sabha Election 2024: పెళ్లిపత్రికలోనూ ఈవీఎంపై వ్యతిరేకత!
లాతూర్: మా పెళ్లికి విచ్చేసి భోజనతాంబూలాదులు స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. ఇది చాలా పెళ్లిపత్రికల్లో కనిపించే ఒక విన్నపం. కానీ ఇక్కడ ఒక పత్రికలో విజ్ఞాపనకు బదులు ‘వ్యతిరేకత’ కనిపించింది. ‘‘ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను నిషేధించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి’’ అంటూ కొటేషన్‌ను పెట్టాడు ఒక పెళ్లికొడుకు. మహారాష్ట్రలోని ఛాకూర్ తహసీల్ పరిధిలోని అజన్సోందా(ఖుర్ద్) గ్రామానికి చెందిన దీపక్ కుంబ్లే పెళ్లి వచ్చే నెల ఎనిమిదో తేదీన లాతూర్ పట్టణంలో జరగనుంది. కుంబ్లే అందరికీ పంచిన తన వివాహ ఆహా్వన పత్రికలో ఇలా ఈవీఎంలపై తన అసంతృప్తి వెళ్లగక్కాడు. సాధువులు, సంఘ సంస్కర్తలు, స్వాతంత్య్ర సమరయోధుల ఫొటోలను ఆ వెడ్డింగ్ ఇని్వటేషన్ కార్డులో ప్రచురించాడు. తనకు పాఠాలు బోధించిన స్కూలు టీచర్ల ఫోటోలకు ఈ ఆహ్వానపత్రికలో స్థానం కలి్పంచాడు. ఈయన అఖిలభారత వెనకబడిన, మైనారిటీ వర్గాల ఉద్యోగుల సంఘం(బామ్సెఫ్) సభ్యుడు. ‘‘ ఈవీఎంల వ్యతిరేక ఉద్యమం సార్వత్రిక ఎన్నికలకు ముందే ఊపందుకుంది. బంధువులు, స్నేహితుల్లోనూ ఉద్యమంపై మరింత అవగాహన పెంచాలనే ఇలా ఈవీఎంల అంశాన్ని పెళ్లికార్డులో ప్రస్తావించా’ అని కుంబ్లే చెబుతున్నారు. కార్డులో కథాకమామిషు, ఫొటోలను చూసి ముక్కున వేలేసుకున్న వాళ్లూ లేకపోలేదు. కార్డు ఎలాగుంటే మనకెందుకు? పెళ్లికెళ్లి నాలుగు అక్షింతలు వేసి భోంచేసి వచ్చేద్దాం అని ఊళ్లో చాలా మంది డిసైడ్ అయ్యారట! -
One Nation One Election: జమిలి ఎన్నికలకు 30 లక్షల ఈవీఎంలు కావాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే 30 లక్షల ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) అవసరమని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే జమిలి ఎన్నికలకు సన్నాహాలు పూర్తిచేయడానికి దాదాపు ఏడాదిన్నర సమయం కావాలని పేర్కొన్నాయి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశంలో చర్చ జరుగుతోంది. లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర లా కమిషన్ ప్రస్తుతం జమిలి ఎన్నికల అంశంపై కసరత్తు చేస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు ఎన్నికావాలి? ఎంత సమయం అవసరం? అన్నదానిపై ఎన్నికల సంఘం అధికారులు లా కమిషన్‌కు కొన్ని నెలల క్రితం సమాచారం ఇచి్చనట్లు తెలుస్తోంది. ఒక్కో ఈవీఎంలో భాగంగా ఒక కంట్రోల్ యూనిట్, ఒక బ్యాలెట్ యూనిట్, ఒక వీవీప్యాట్ ఉంటాయి. జమిలి ఎన్నికలకు 30 లక్షల కంట్రోల్ యూనిట్లు, 43 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 32 లక్షల వీవీప్యాట్లు కావాలని చెబుతున్నారు. కొన్ని బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లను రిజర్వ్‌లో ఉంచాల్సి ఉంటుంది కాబట్టి అదనంగా అవసరమని పేర్కొంటున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్లు కలిపి దాదాపు 35 లక్షల ఓటింగ్ యూనిట్లను కొత్తగా సమకూర్చుకోవాల్సి ఉంటుందని సమాచారం. 12.50 లక్షల పోలింగ్ కేంద్రాలు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పటికీ రెండు ఓట్లు వేర్వేరుగా వేయాల్సి ఉంటుంది. అందుకు రెండు ఈవీఎంలు కావాలి. జమిలి ఎన్నికల్లో ఓటింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపర్చడానికి తగిన వసతులు ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 12.50 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 15 లక్షల కంట్రోల్ యూనిట్లు, 15 లక్షల వీవీప్యాట్లు, 18 లక్షల బ్యాలెట్ యూనిట్లు ఉపయోగించారు. అన్నీ కలిపి కోటి యూనిట్లు కొనుగోలు చేయాలంటే రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలతోపాటు మున్సిపాల్టీలు, పంచాయతీల ఎన్నికలు నిర్వహించడంపై(ఒక దేశం, ఒకే ఎన్నిక) మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం కొనసాగిస్తోంది. -
ఈవీఎంల కోసం రూ.1,900 కోట్లు కేటాయింపు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు (ఈవీఎం) కొనుగోలు చేయడానికోసం కేంద్ర న్యాయశాఖకు ఈ బడ్జెట్లో దాదాపు రూ.1,900 కోట్లను కేటాయించారు. 2024లో రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఈవీఎంలను సమకూర్చుకోవడంతోపాటు వాటికి అనుబంధంగా వాడే ఇతర పరికరాల కొనుగోలు చేయడానికి వీలుగా రూ.1,891.78 కోట్లను కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఇతర పరకరాలను కొనుగోలు చేయడమేకాక పాతవాటిని తుక్కుకింద మార్చడానికి ఈ నిధులను వినియోగిస్తారు. 2024 సంవత్సరంలో రానున్న లోక్‌సభ ఎన్నికలతోపాటు ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘానికి నిధులు అవసరమవుతాయని కేంద్ర న్యాయశాఖ ప్రతిపాదించడంతో కేంద్ర కేబినెట్ గత నెలలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఈవీఎంలకోసం బడ్జెట్లో నిధులను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల నుంచి ఈవీఎంలను కొనుగోలు చేయనున్నారు. -
బ్యాలెట్‌కు వెళ్లే ప్రసక్తే లేదు : సీఈసీ
న్యూఢిల్లీ : బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలను నిర్వహించే ప్రసక్తే లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా స్పష్టం చేశారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయడం సాధ్యం కాదని తెలిపారు. బుధవారం టైమ్స్ నౌ సమిట్‌లో పాల్గొన్న సునీల్ ఆరోరా ఈ విషయాలను వెల్లడించారు. ఈవీఎంల పనితీరుపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ఇటువంటి ఆరోపణలను అడ్డుకట్టవేసేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల సంస్కరణలు, మోడల్ కోడ్‌పై చర్చించేందుకు రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలతో సమావేశం కానున్నట్టు చెప్పారు. కారు, పెన్నులు మెరాయించినట్టు ఈవీఎంలలో కూడా సమస్యలు తలెత్తుత్తాయి.. కానీ వాటిని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని సునీల్ ఆరోరా తెలిపారు. 20 ఏళ్లుగా ఈవీఎంలు వాడుకలో ఉన్నాయని.. తిరిగి బ్యాలెట్ పేపర్ విధానానికి వెళ్లే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. సుప్రీం కోర్టుతో సహా వివిధ కోర్టులు ఈవీఎంల వాడాకాన్ని సమర్థించాయని గుర్తుచేశారు. కాగా, ఈవీఎంల పనితీరుపై కొన్ని రాజకీయ పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఓటింగ్ శాతం వెల్లడించం ఆలస్యం కావడంతో ఈవీఎంల పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఓటింగ్ శాతం వెల్లడి ఆలస్యం కావడంతో ఆప్ నేతలు విమర్శలు గుప్పించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల సంఘం ఓటింగ్ శాతం ప్రకటించడానికి సిద్ధంగా లేకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి అని ఎంపీ సంజయ్ సింగ్ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికలు జరిగినప్పుడు కేవలం గంట వ్యవధిలోనే ఓటింగ్ శాతం వెల్లడించిన ఈసీ.. చిన్న రాష్ట్రమైన ఢిల్లీలో పోలింగ్ వివరాలు తెలిపేందుకు ఎందుకు ఇంత సమయం తీసుకుంటుందని ప్రశ్నించారు. -
ఓట్లను ఎలా ట్యాంపరింగ్ చేయవచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గురువారం నిర్వహించి ఫలితాలను వెనువెంటనే వెల్లడించేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు ఎక్కడ ఫలితాలను తారుమారు చేస్తాయేమో అన్న ఆందోళన ప్రతిపక్ష పార్టీలను పట్టుకు పీకుతోంది. ఆ పార్టీలు గత కొన్నేళ్లుగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. వాటిని పాలకపక్షం ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందంటూ గొడవ చేస్తూనే ఉన్నాయి. అసలు ట్యాంపరింగ్ అంటే ఏమిటీ? అందుకు నిజంగా అవకాశాలు ఉన్నాయా? ఉంటే అవి ఎలాంటివి? వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఈవీఎంలు అంటే ఏమిటీ ? అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈవీఎంలు అంటే... భారత పార్లమెంట్‌కు, రాష్ట్ర అసెంబ్లీలకు గతంలో బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరిగేవి. అది సుదీర్ఘమైన ప్రహసనం. ఓట్లు లెక్కించి పూర్తి ఫలితాలు ప్రకటించేందుకు రెండు రోజులు కూడా పట్టేది. మందీ మార్బలంతో పోలింగ్ కేంద్రాలను స్వాధీనం చేసుకొని రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం కూడా ఉండేది. ఆ ఎన్నికల ప్రక్రియ స్థానంలో ‘ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్స్ (ఈవీఎం)లు వచ్చాయి. ఇందులో ప్రధానంగా మూడు విభాగాలు ఉంటాయి. మొదటి విభాగాన్ని ‘కంట్రోల్ యునిట్’గా వ్యవహరిస్తారు. ఈ యునిట్ ప్రతి పోలింగ్ కేంద్రంలో పోలింగ్ అధికారి వద్ద ఉంటుంది. ఈ యునిట్ ప్రతి ఓటును లెక్కించి తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఇది కరెంట్ఫై ఆధారపడకుండా బ్యాటరీపైనే నడుస్తుంది. ఇక రెండో విభాగాన్ని ‘బ్యాలెటింగ్ యునిట్’ అంటారు. వీటిపై అభ్యర్థుల పేర్లు, వారి పార్టీ గుర్తులుగల బటన్లతో ఓ ప్యానెల్ ఉంటుంది. ఈసారి అభ్యర్థుల ఫొటోలను కూడా ఏర్పాటు చేశారు. ఈవీఎం ప్యానల్పైనున్న బటన్‌ను నొక్కి ఓటు వేయడం మూడవ విభాగం. ఓటరు ఏదైనా బటన్‌ను నొక్కినప్పుడు ఆ బటన్పైనున్న అభ్యర్థి పేరిట ఓటు పడుతుంది. ఇప్పుడు ఓటరు తానేసిన ఓటు ఎవరికి పడిందో తెలుసుకునేందుకు వీలుగా ‘వీవీపీఏటీఎం’ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఓటరు బటన్‌ను నొక్కగానే దానికి అనుసంధానించిన మరో యంత్రం స్క్రీన్ మీద ఆ ఓటు ఎవరికి పడిందో తెలియజేసే ఓ కాగితం ఏడు సెకడ్లపాటు కనిపిస్తుంది. ఆ తర్వాత అది యంత్రం లోపలి బాక్సులో పడిపోతుంది. ఈ మరో యంత్రాన్నే ‘వోటర్ వెరీఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ మెషీన్ (వీవీపీఏటీఎం)’ అని వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత తనిఖీ చేసినప్పుడు ఈవీఎం మొదటి యునిట్‌లో నిక్షిప్తమైన డేటాతో వీవీపీఏటీఎంలో పడిన స్లిప్పులతో సరిపోవాలి. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చా? ఓటింగ్ జరిగినప్పుడు ఈవీఎంలో నిక్షిప్తమైన డేటాను తారుమారు లేదా తలకిందులు చేయడాన్ని ట్యాంపరింగ్‌గా పేర్కొనవచ్చు. అంటే ఓడిపోయిన అభ్యర్థిని గెలిచినట్లుగా, గెలిచిన అభ్యర్థిని ఓడిపోయినట్లుగా చూపడం. ఈవీఎంలకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం. ఇంటర్నెట్ ద్వారా డేటాను తారుమారు చేసే అవకాశం ఉంటుంది కనుకనే ఆ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేదు. అయినా ట్యాంపరింగ్ చేయాలంటే పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి భౌతికంగా ఈవీఎంలను చేతుల్లోకి తీసుకొని అనుకూలంగా ట్యాంపర్ చేయవచ్చు. అసలు ఓటరుకు బదులు ఇతరులు బటన్ నొక్కి ఓటు వేయవచ్చు. ఎన్నికల సిబ్బంది, సీసీటీవీ కెమేరాలు, వివిధ పార్టీల ఏజెంట్లు పోలింగ్ కేంద్రాల్లో ఉంటారు కనుక అలా చేయడం అసాధ్యం. ఆ తర్వాత పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను సీల్చేసి గట్టి సెక్యూరిటీ మధ్య వాటిని నిల్వచేసే ‘స్ట్రాంగ్ రూమ్’లకు పంపిస్తారు. మరి ఎలా ట్యాంపర్ చేయవచ్చు? ఈవీఎంలను తరలించే క్రమంలోగానీ, వాటిని స్ట్రాంగ్ రూముల్లో నిల్వ చేసినప్పుడుగానీ వాటిని తస్కరించి వాటి స్థానంలో ముందుగా ట్యాంపరింగ్ చేసిన ఈవీఎంలను ఏర్పాటు చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయవచ్చు. స్ట్రాంగ్ రూమ్‌లకు తీసుకెళ్లే ఈవీఎంలకు నెంబర్లు, దానికి ఎన్నికల అధికారుల సంతకాలతో కూడిన సీలింగ్ ఉంటుంది. ఓట్లను లెక్కించే సమయంలో వాటిని పరిగణలోకి తీసుకుంటారు. అక్రమాలకు పాల్పడాలంటే సంతకాల ఫోర్జరీ, సీల్ సరిపోవాలి. పైగా పోలింగ్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్ వరకు గట్టి భద్రత మధ్య వాటిని తరలించడమే కాకుండా అడుగడుగున వాటిపై నిఘా ఉంటుంది. ఈ విషయంలో ఎన్నికల సిబ్బందికి ఎన్నికల కమిషన్ నియమించిన ‘మైక్రో’ పరిశీలకులు సహా పలు రకాల పరిశీలకులు, వీడియో గ్రాఫర్లు తోడుగా ఉంటారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్ వద్ద అభ్యర్థి తాలూకు వ్యక్తి ఒకరు 24 గంటలపాటు కాపలా ఉండేందుకు కూడా ఎన్నికల కమిషన్ అవకాశం కల్పిస్తోంది. కనుక అదంతా ఈజీ కాదు. పాలకపక్షాలకు అవకాశం ఉంటుందా? స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను మార్చే అవకాశం పాలకపక్షాలకు ఉంటుందనేది అన్ని ప్రతిపక్షాల ఆరోపణ. పాలకపక్షం తలచుకుంటే ముందస్తు ప్రణాళికతో ఈవీఎంల నెంబర్లను, ఎన్నికల అధికారులు సూచించే కోడ్లను ముందే తెలుసుకోవచ్చు. అప్పుడు భద్రతా సిబ్బందిని, పలు అభ్యర్థుల నిఘాపరులను ప్రలోభపెట్టి ఈవీఎంలను తారుమారు చేయవచ్చు. అందుకు ఎన్నికల కమిషన్, పోలింగ్ నిర్వహించే ప్రభుత్వ సిబ్బంది, పార్టీల ఏజెంట్లు కుమ్మక్కు కావాల్సి ఉంటుంది. అది దాదాపు అసాధ్యం. అన్నింటికన్నా ముఖ్యం ఎన్నికలను తారుమారు చేయాలనుకునే వ్యక్తుల వద్ద ఈవీఎంలు ఉండాలి. వాటిని సాధించడం కూడా అంత సులభం కాదు. ఈవీఎంల తయారు చేసే చోటే జరగవచ్చా? ఈవీఎంలను తయారు చేసే చోటే వాటిని ట్యాంపరింగ్ చేసేందుకు అవకాశం ఉంది. ఒకరికి ఓటు వేసేందుకు బటన్‌ను నొక్కితే మరొకరికి వెళుతుందంటూ ప్రత్యక్షంగా ఈవీఎంలను సవాల్ చేసినవాళ్లు ఉన్నారు. దేశంలో రెండు ప్రభుత్వరంగ సంస్థలు (ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత్ ఎలక్ట్రానిక్స్) మాత్రమే వీటిని తయారు చేస్తున్నాయి. వాటిని తయారు చేస్తున్న ఇంజనీర్లను పట్టుకొని తయారీలోనే ట్యాంపరింగ్ చేయవచ్చు. వాళ్లు తయారు చేసిన ఈవీఎంలు దేశంలో ఏ ప్రాంతానికి వెళతాయో వారికే కాదు. కంపెనీ యజమానులకు కూడా తెలిసే అవకాశం లేదు. నామినేషన్ల గట్టం పూర్తయ్యే వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు, ఎంత మంది నిలబడతారో తెలియదు. అలాంటప్పుడు ముందుగా ట్యాంపరింగ్ చేయడం కూడా సాధ్యం కాదు. వీడియోల్లో కనిపించే ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లోకి వెళ్లాల్సిన ఈవీఎంలు దారితప్పాయంటూ మనం పలు వీడియోలను సాక్షంగా చూస్తుంటాం. ఆ ఈవీఎంలు అత్యవసరం కోసం అందుబాటులో ఉంచిన అదనపు లేదా మొరాయించిన ఈవీఎంలని ఎన్నికల కమిషన్ వర్గాలే స్పష్టం చేశాయి. ఎన్నికల మార్గదర్శక సూత్రాల ప్రకారం అదనపు లేదా మొరాయించిన ఈవీఎంలను కూడా గట్టి భద్రత మధ్య స్ట్రాంగ్ రూముల్లోకి తరలించాలి. ఈ విషయంలో ఈసీ వర్గాలు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాయో అర్థం కాదు. ఈవీఎంలను మార్చడం సాధ్యం కాదు కనుక వాటిని ఎత్తుకు పోవచ్చు. యూపీ, బీహార్, పంజాబ్, గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో దాదాపు రెండు లక్షల ఈవీఎంలు గల్లంతయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాటిలో నిజానిజాలను ఈసీ వర్గాలే తేల్చాలి. వీవీపీటీఎం పద్ధతే మంచిది ఈవీఎంలలో ఓట్లతోపాటు వీవీపీటీఎంలను లెక్కించడం ద్వారా అవకతవకలను సులభంగానే కనిపెట్టవచ్చు. ప్రతి నియోజకవర్గంలో ఒక్క పోలింగ్ కేంద్రానికి మాత్రమే దీన్ని పరిమితం చేస్తామని ఎన్నికల కమిషన్ పేర్కొనగా, సుప్రీం కోర్టు ఆ సంఖ్యను ఐదింటికి పెంచింది. ఈ సంఖ్యను 33 నుంచి 50 వరకు పెంచాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్
-
ప్రజాతీర్పుతో పరిహాసం!
సాక్షి, న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరును వివాదాస్పదం చేయడం ద్వారా ఈ అంశాన్ని సజీవంగా ఉంచేందుకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 2014లో ఇవే ఈవీఎంలతో గెలిచిన చంద్రబాబు ఈసారి పరాజయం ఖాయమనే నిర్థారణకు వచ్చి వీటిని సాకుగా చూపేందుకు ఇతర పార్టీలనూ ఇందులోకి లాగుతూ ఈ వివాదంలో భాగస్వాములుగా మార్చే యత్నం చేస్తున్నారు. ఐదు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పులకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ నియోజకవర్గంలోని మిగతా కేంద్రాల్లోనూ వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలన్న డిమాండ్‌తో మంగళవారం ఢిల్లీలో విపక్షాల సమావేశం జరిగింది. ఈ అంశంపై ఎన్నికల సంఘాన్ని కలసి వినతిపత్రం సమర్పించడానికి ముందు 22 పార్టీలు సమావేశమయ్యాయి. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడే ముందు జరిగిన ఈ భేటీకి చంద్రబాబు, ఒకరిద్దరు ప్రధాన నేతలు మినహా విపక్షాల అధినేతలెవరూ హాజరుకాకపోవడం గమనార్హం. తనకు తానే పెద్దన్నగా చెప్పుకుంటూ... టీడీపీ పరాజయం అంచున ఉందని ఎన్నికల షెడ్యూలు కంటే ముందుగానే పలు సర్వే సంస్థలు ఒపీనియన్ పోల్స్ ద్వారా ప్రకటించినప్పటి నుంచి చంద్రబాబు తన వైఫల్యాలను ఈవీఎంలపై నెట్టివేసేందుకు మార్గాలను అన్వేషించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్‌కు గురవుతాయంటూ అప్పటి నుంచే ప్రచారాన్ని ఉధృతం చేస్తూ వచ్చారు. మళ్లీ బ్యాలెట్ పద్ధతి తేవాలని ఈసీని డిమాండ్ చేశారు. 2018లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తరువాత ఈ అంశాన్ని పట్టించుకోని కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడడంతో ఈవీఎంలపై చంద్రబాబు డిమాండ్‌కు తలొగ్గింది. ఎన్డీయేతర విపక్షాలను ఏకం చేసే ఎజెండాలో ఇదొక భాగమైంది. కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు ఐక్య వేదికపైకి వచ్చేందుకు ఇది దోహదపడుతుండడంతో మిగిలిన పక్షాలూ జత కలిశాయి. వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలంటూ ఈ పార్టీలన్నీ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటివరకు నియోజకవర్గానికి ఒక పోలింగ్ స్టేషన్లో వీవీప్యాట్ స్లిప్పులను లెక్కిస్తున్న విధానాన్ని ఐదు పోలింగ్ స్టేషన్లకు వర్తింపజేస్తూ తీర్పు ఇచ్చారు. దీన్ని సమీక్షించాలని మరోసారి రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో చంద్రబాబు మరో కొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. చివరి రౌండ్లో కాకుండా ముందుగానే ఐదు కేంద్రాల్లో వీవీ ప్యాట్లను లెక్కించాలని, ఒకవేళ ఈవీఎం ఓట్లకు, వీవీప్యాట్ పత్రాలకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలతోపాటు వీవీప్యాట్ పత్రాలను లెక్కించాలన్నది ఈ డిమాండ్. మే రెండో వారంలో దీనిపై ఈసీని కలిసినా స్పందించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో పరాజయం అంచున ఉన్న చంద్రబాబు ఈ డిమాండ్‌ను తనకు అనుకూలంగా వాడుకుంటూ వారం రోజులుగా జాతీయ నేతలను కలుస్తున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నానంటూ తనకు తానే పెద్దన్నగా చెప్పుకుంటున్నారు. ఈసీని కలిసిన అనంతరం బయటకు వస్తున్న చంద్రబాబు, గులాం నబీ ఆజాద్ తదితరులు అధినేతల నుంచి స్పందన కరువు ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాక తీవ్ర నైరాశ్యంలో ఉన్న విపక్ష పార్టీలు చంద్రబాబు డిమాండ్లపై పెద్దగా స్పందించడం లేదు. ఎన్నికల సంఘంతో చర్చించాల్సిన అంశాలపై మాట్లాడేందుకు మంగళవారం మధ్యాహ్నం భేటీ కావాలంటూ చంద్రబాబు హడావుడి చేసినా కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఎస్పీ, బీఎస్పీ అధినేతలు ఎవరూ హాజరు కాలేదు. ఆయా పార్టీల ప్రతినిధులు మాత్రమే వచ్చారు. సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ మాత్రమే హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, అశోక్ గెహ్లాట్, అభిషేక్ సింఘ్వీ, కొప్పుల రాజు, రాజ్‌బబ్బర్, ఎస్పీ నుంచి రాంగోపాల్ యాదవ్ ఎన్సీపీ నుంచి ప్రఫుల్‌పటేల్, మజీద్ మెమన్, డీఎంకే నుంచి కనిమొళి, తృణమూల్ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, బీఎస్పీ నుంచి సతీష్‌చంద్ర, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, ఎల్జేడీ నుంచి జావేద్, జేడీ(ఎస్) నుంచి కుపేంద్రరెడ్డి తదితరులు హాజరయ్యారు. ధర్నాపై భిన్నాభిప్రాయాలు.. తమ డిమాండ్లపై సరైన స్పందన రానిపక్షంలో ఈసీ కార్యాలయం ఎదుట ధర్నా ఉంటుందని టీడీపీ వర్గాలు, అనుకూల మీడియా ప్రచారం చేశాయి. అయితే ఈ ప్రతిపాదనపై సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్టు సమాచారం. రాజ్యాంగబద్ధమైన సంస్థ కార్యాలయం ముందు ధర్నా చేయడం సముచితం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్టు తెలిసింది. ఒకవేళ ఎన్నికల సంఘం ఈ సమస్యకు పరిష్కారం చూపించకుంటే బుధవారం ఈసీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాలని నిర్ణయించినట్లు సమాచారం. నేడు చర్చిస్తామన్న ఈసీ ఈసీతో భేటీ పూర్తయిన వెంటనే మంగళవారం మరోసారి కానిస్టిట్యూషన్ క్లబ్లో విపక్షాల ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం విపక్షాల కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. సమావేశం అనంతరం కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మీడియాతో మాట్లాడుతూ ‘ఈవీఎంలో పోలైన ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పుల లెక్కకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ నియోజకవర్గంలోని మొత్తం పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని కోరాం..’ అని వివరించారు. ‘మేం దీనిపై చాలా రోజులుగా అడుగుతున్నా ఈసీ స్పందించలేదు. ఎట్టకేలకు బుధవారం ఉదయం ఈ అంశంపై చర్చిస్తామని ఈసీ తెలిపింది’ అని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ పేర్కొన్నారు. ‘ప్రజాతీర్పును మార్చడానికి వీల్లేకుండా చూడాలని ఈసీని కోరుతున్నాం..’ అని టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు చెప్పారు. బాబు హడావుడి వెనక అసలు కథ? గురువారం వెలువడే ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు తీవ్ర ఆందోళనతో ఉన్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాతీర్పును హుందాగా గౌరవించకుండా పరాజయ భారాన్ని ఈవీఎంలపై నెట్టేయడానికి కారణాలను రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పరాజయం పాలైతే జాతీయ రాజకీయాల్లో తనకు ఒక పాత్ర దక్కాలన్నదే చంద్రబాబు ఆకాంక్ష. ఒకవేళ ఎన్డీయేతర పక్షాలు అధికారంలోకి రాకుంటే విపక్షాల కూటమిని సజీవంగా ఉంచేందుకు వీలుగా కన్వీనర్ లేదా కో కన్వీనర్ లాంటి పదవిని ఆశిస్తున్నారు. ఆ ప్రయత్నాలను ఆయన ఇప్పటికే ముమ్మరం చేశారు. రేపు పరాజయం పాలైతే ఆ భారాన్ని ఈవీఎంలపై గెంటేసేందుకు ఈ ప్రయత్నాలు పనికొస్తాయి. విపక్షాలతో మితృత్వం చంద్రబాబుకు ఎంతో అవసరం. ఎన్డీయే మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రబాబు పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది ..’ అని రాజకీయ, మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. -
రేపే కౌంటింగ్
సాక్షి, అమరావతి: ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. ఫలితాలు వెల్లడి కావడానికి ఇక గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో క్షణక్షణానికి ఉత్కంఠ పెరిగిపోతోంది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 36 చోట్ల స్ట్రాంగ్‌రూమ్‌ల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) భద్రపర్చారు. గురువారం ఓట్ల లెక్కింపు జరగనుంది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 6 చోట్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. గురువారం స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి ఈవీఎంలను బయటకు తీసుకొచ్చి, పక్కనే ఉన్న కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తారు. ఓట్ల లెక్కింపులో మొత్తం 25,000 మందికిపైగా ఉద్యోగులు పాల్గొంటున్నారు. భద్రత కోసం 25,000 మందికిపైగా పోలీసు బలగాలను వినియోగిస్తున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కేంద్రాల వివరాలివీ... శ్రీశివానీ ఇంజనీరింగ్ కాలేజ్, చిలకపాలెం,శ్రీకాకుళం: పాలకొండ(ఎస్టీ), ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, ఆముదాలవలస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం(ఎస్సీ) ఎంవీజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, చింతలవలస, విజయనగరం: కురుపాం(ఎస్టీ), పార్వతీపురం(ఎస్సీ), సాలూరు(ఎస్టీ), శృంగవరపుకోట. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్, విశాఖపట్నం: అరకు వ్యాలీ(ఎస్టీ), పాడేరు(ఎస్టీ), భీమిలి, విశాఖ తూర్పు, విశాఖ దక్షిణం, విశాఖ ఉత్తరం, విశాఖ పశ్చిమ, గాజువాక, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, పాయకరావుపేట(ఎస్సీ), నర్సీపట్నం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, కాకినాడ: రంపచోడవరం(ఎస్టీ) జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం: బొబ్బిలి, గజపతినగరం లెండి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్, జొన్నాడ, విజయనగరం: చీపురుపల్లి, నెల్లిమర్ల పోలీస్ ట్రైయినింగ్ కాలేజ్, కంటోన్మెంట్, విజయనగరం: విజయనగరం జేఎన్టీయూ–కాకినాడ: తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట, ముమ్మిడివరం, మండపేట, రాజానగరం రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ: అమలాపురం(ఎస్సీ), రాజోలు(ఎస్సీ), గన్నవరం(ఎస్సీ), కొత్తపేట డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథార్టీ, కాకినాడ: రామచంద్రాపురం ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్, కాకినాడ: అనపర్తి, రాజమండ్రి సిటీ, రాజమండ్రి గ్రామీణం సర్ సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, ఏలూరు: కొవ్వూరు(ఎస్సీ), నిడదవోలు, గోపాలపురం(ఎస్సీ) విష్ణు స్కూల్, భీమవరం: నర్సాపురం, భీమవరం విష్ణు డెంటల్ కాలేజ్, భీమవరం: ఆచంట, పాలకొల్లు బి.సీతా పాలిటెక్నిక్, విష్ణు కాలేజ్, భీమవరం: ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఏలూరు: ఉంగుటూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం(ఎస్టీ), చింతలపూడి(ఎస్సీ) కృష్ణా యూనివర్సిటీ, మచిలీపట్నం: నూజివీడు, కైకలూరు, గన్నవరం, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు(ఎస్సి), పెనమలూరు ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీ–గంగూరు: తిరువూరు (ఎస్సీ), విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ(ఎస్సీ), జగ్గయ్యపేట నాగార్జున యూనివర్సిటీ, నంబూరు: తాడికొండ (ఎస్సీ), మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు(ఎస్సీ), గుంటూరు పశ్చిమ, గుంటూరు తూర్పు, వేమూరు(ఎస్సీ), రేపల్లె, బాపట్ల లయోలా పబ్లిక్ స్కూల్, నల్లపాడు: పెదకూరపాడు, చిలకలూరిపేట, నరసరావుపేట, సత్తెనపల్లి, వినుకొండ, గురజాల, మాచర్ల పేస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వల్లూరు: పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు(ఎస్సీ) రైజ్ కృష్ణసాయి ప్రకాశం గ్రూపు, వల్లూరు: ఎర్రగొండపాలెం(ఎస్సీ), దర్శి, ఒంగోలు, కొండెపి(ఎస్సీ) రైజ్ కృష్ణసాయి గాంధీ గ్రూపు, వల్లూరు : మార్కాపురం, గిద్దలూరు రైజ్ కృష్ణసాయి పాలిటెక్నిక్, వల్లూరు: కనిగిరి, కందుకూరు రాయలసీమ యూనివర్సిటీ, కర్నూలు: ఆళ్లగడ్డ, శ్రీశైలం, నందికొట్కూరు(ఎస్సీ), పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్ రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కర్నూలు: పత్తికొండ, ఎమ్మిగనూరు జి.పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్, కర్నూలు: కోడుమూరు(ఎస్సీ), కర్నూలు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్, అనంతపురం: రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, శింగనమల(ఎస్సీ), అనంతపురం, కళ్యాణదుర్గం ఎస్కే యూనివర్సిటీ, అనంతపురం: రాప్తాడు, మడకశిర(ఎస్సీ), హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, ధర్మవరం, కదిరి కేఎల్ఎం ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, కడప: బద్వేలు(ఎస్సీ), కడప, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట, రైల్వేకోడూరు(ఎస్సీ), రాయచోటి గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్, నెల్లూరు: కావలి, ఆత్మకూరు, కొవ్వూరు, నెల్లూరు సిటీ, నెల్లూరుగ్రామీణం, ఉదయగిరి ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్, నెల్లూరు: సర్వేపల్లి, గూడూరు(ఎస్సీ), సూళ్లూరుపేట(ఎస్సీ), వెంకటగిరి వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్, పూతలపట్టు: తిరుపతి, తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు ఆర్కేఎం లా కాలేజ్, పూతలపట్టు: శ్రీకాళహస్తి, సత్యవేడు(ఎస్సీ) శ్రీనివాస ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, తిమ్మసముద్రం: చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు(ఎస్సీ), చిత్తూరు, పూతలపట్టు(ఎస్సీ), పలమనేరు, కుప్పం -
ఈవీఎంలు... అంతా కట్టుదిట్టం!
ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్న ఈవీఎంలపై అపోహలు కొత్త కాదు. ఎప్పటి నుంచో ఉన్నవే. ఓడిన ప్రతిసారీ నాయకులు నెపాన్ని యంత్రాలపై నెట్టేస్తున్నారని మాజీ ప్రధాన ఎన్నికల అధికారులు ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు కూడా. అయినా ఈ యంత్రాలపై అసత్య ఆరోపణల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ నేతలు తరచూ వ్యక్తం చేసే అనుమానాలు.. సామాన్యులకు కలిగే సందేహాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేసేందుకు సాక్షి ఒక ప్రయత్నం చేసింది. ఈవీఎంలను తయారు చేసిన కంపెనీల్లో ఒకటైన ఈసీఐఎల్ మాజీ ఉన్నతోద్యోగి, టెలికం డిపార్ట్మెంట్ నుంచి చీఫ్ జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేసిన బి.జగదీశ్‌కుమార్‌తో చర్చించింది. ఆ వివరాలు.... ఈవీఎం పాడైతే... ఏదైనా పోలింగ్ కేంద్రంలో ఈవీఎం పనిచేయకుండా పోతే.. దాని స్థానంలో కొత్త ఈవీఎంను ఏర్పాటు చేస్తారు. ఓటింగ్ మధ్యలో యంత్రం పాడైతే.. అప్పటివరకూ నమోదైన ఓట్లన్నీ కంట్రోల్ యూనిట్లో భద్రంగా నిక్షిప్తమై ఉంటాయి. కొత్త ఈవీఎంలతో ఓటింగ్‌ను కొనసాగించవచ్చు. కౌంటింగ్ రోజు రెండు కంట్రోల్ యూనిట్లలోని ఓట్లను లెక్కిస్తారు. ఒకసారి కంట్రోల్ యూనిట్లో చేరిన సమాచారం (ఓటింగ్ వివరాలు) 15 ఏళ్లపాటు స్టోర్ చేసి ఉంచవచ్చు. ఏ మీట నొక్కినా ఓట్లు ఒకే పార్టీ్టకా? ఈవీఎంలలో వాడే మైక్రోప్రాసెసర్‌ను ఒక్కసారి మాత్రమే ప్రోగ్రామ్ చేయవచ్చు. కొంచెం సింపుల్‌గా చెప్పాలంటే బండరాయిపై అక్షరాలు చెక్కినట్లు. చెక్కడం వరకూ మన చేతుల్లో ఉంటుందిగానీ.. చెరిపేయడం అస్సలు సాధ్యం కాదు. కాబట్టి ఆ సమాచారానికి మార్పులు చేయడమూ అసాధ్యం. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు కాబట్టి మైక్రోప్రాసెసర్లోని సమాచారాన్ని తెలుసుకోవడం కూడా వీలుపడదు. ఒకవేళ ఎవరైనా... ఏదో ఒక పద్ధతిలో ఇందులో మార్పులు చేస్తే మార్పులు ఏవో జరిగినట్లు ఫస్ట్ లెవల్ చెకింగ్లోనే తెలిసిపోతుంది. ఏ ఈవీఎం ఎక్కడికి వెళుతుందో ముందుగానే తెలుసుకోవచ్చా? అస్సలు సాధ్యం కాదు. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థులు ఎవరు? వారి సీరియల్ నంబర్లు ఏవి అన్నది.. నామినేషన్ల పరిశీలన, ఆమోదం తరువాత మాత్రమే స్పష్టమవుతుంది. ఆ తరువాత అక్షర క్రమంలో వివరాలను బ్యాలెట్ యూనిట్లోకి ఎక్కిస్తారు. ముందుగా జాతీయ, రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థుల పేర్లు, ఆ తరువాత ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీల వారు.. తరువాత స్వతంత్ర అభ్యర్థుల పేర్లు వరుస క్రమంలో వస్తాయి. ఈవీఎంలను రెండు దశల్లో పూర్తిస్థాయిలో కలగలిపిన తరువాత మాత్రమే వాటిని పోలింగ్ కేంద్రాలకు కేటాయిస్తారు. ర్యాండమైజేషన్ అని పిలిచే ఈ ప్రక్రియ తొలి దశ జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో జరిగితే... రెండోది అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ ఆఫీసర్ స్థాయిలో జరుగుతుంది. మొత్తమ్మీద పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు సాక్షులుగా ఉంటారు. వీవీప్యాట్ స్లిప్పై ఏదైనా తేడా ఉంటే ఫిర్యాదు చేయవచ్చా? తాము ఓటేసిన వారికి బదులు ఇతరులకు ఓటు పడిందని ఓటర్లు ఎవరైనా వీవీప్యాట్ల స్లిప్ సాయంతో ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల నియమావళిలోని 49ఎంఏ ప్రకారం తప్పుడు ఆరోపణలు చేస్తే జరగబోయే పరిణామాలను వివరించిన తరువాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటరు నుంచి రాతపూర్వకమైన ప్రకటన రూపంలో ఫిర్యాదు స్వీకరిస్తారు. ఆ తరువాత ప్రిసైడింగ్ ఆఫీసర్, అభ్యర్థి /పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓటు వేస్తారు. వీవీప్యాట్ ద్వారా వచ్చే ప్రింట్‌ను పరిశీలిస్తారు. ఓటరు ఆరోపణ నిజమైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆ విషయాన్ని వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్‌కు తెలియజేస్తారు. ఓటింగ్ నిలిపివేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ ఆదేశాలకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉంటాయి. ఒకవేళ ఓటరు ఆరోపణ తప్పు అని రుజువైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫార్మ్ 17ఏలో వివరాలు నమోదు చేస్తారు. ఆ ఓటరు ఏ అభ్యర్థికి, ఏ సీరియల్ నంబరుకు ఓటేసిందీ నమోదు చేస్తారు. దీన్ని ధ్రువీకరిస్తూ ఓటరు నుంచి సంతకాలు సేకరిస్తారు. టెస్ట్ ఓట్లను నమోదు చేయాల్సిన 17సీ ఫార్మ్‌లోనూ వివరాలు నమోదు చేస్తారు. తయారయ్యే చోటే మారిస్తే...? ఇది కూడా సాధ్యం కాదు. ఎందుకంటే కఠినాతికఠినమైన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. వేర్వేరు ప్రాంతాల్లో తయారైన ఈవీఎంలను ముందుగా రాష్ట్రాలకు, ఆ తరువాత జిల్లాలకూ పంపుతారు. కొన్నేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో ఏ అభ్యర్థికి ఏ సీరియల్ సంఖ్య ఉంటుందో తెలియదు కాబట్టి.. అందుకు అనుగుణంగా ఫ్యాక్టరీలోనే మార్పులు చేయడమన్న ప్రశ్నే రాదు. ప్రతి ఈవీఎం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసిన కారణంగా మార్పులుచేర్పులన్నది అసాధ్యం. ఈవీఎంలను హ్యాక్ చేయడం సాధ్యమా? అసలు సాధ్యం కాదు. ఎన్నికల కమిషన్ ఇప్పటివరకూ మూడు మోడళ్ల ఈవీఎంలను తయారు చేసింది. 2006 వరకూ తయారైన ఈవీఎంలను మోడల్ 1 అంటారు. నెట్వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ వంటివేవీ లేని ప్రోగ్రామబుల్ మైక్రోచిప్‌లను మాత్రమే ఇందులో వాడారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ కమిటీ సిఫారసుల మేరకు 2006 – 2012 మధ్యకాలంలో తయారైన రెండో మోడల్ ఈవీఎంలలో మాత్రం డైనమిక్ కీ కోడింగ్‌ను వాడారు. బ్యాలెట్ యూనిట్‌పై నొక్కిన బటన్‌కు సంబంధించిన వివరాలు పూర్తిగా సంకేత భాషలో (ఎన్క్రిప్టెడ్) కంట్రోల్ యూనిట్‌కు వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా రియల్ టైమ్ సెట్టింగ్ అనే అంశం కారణంగా బ్యాలెట్ యూనిట్‌పై ఏ క్రమంలో బటన్లు నొక్కారో తెలిసిపోతుంది. కంప్యూటర్ల ద్వారా పనిచేయించకపోవడం, నెట్‌వర్క్‌కు అనుసంధానం కాకపోవడం, రేడియో తరంగాలతోపాటు ఏ ఇతర విద్యుదయస్కాంత తరంగాలను పంపేందుకు, స్వీకరించేందుకు ఏర్పాట్లు లేకపోవడం, యూఎస్బీ లాంటివి జత చేసే ఏర్పాట్లూ లేకపోవడం వంటి కారణాల వల్ల ఈవీఎంలను హ్యాక్ చేయడం అస్సలు సాధ్యం కాదు. ఈవీఎంలను కంప్యూటర్ల ద్వారా నియంత్రించరు. ఏ ఇతర పరికరంతోనూ అనుసంధానమై ఉండదు. ఇంటర్నెట్ లేదా నెట్వర్క్ కూడా ఉండదు. ఫలితంగా వీటిని హ్యాక్ చేయడం కుదరదు. ఒక పద్ధతి ప్రకారం బటన్లను నొక్కడం ద్వారా ఈవీఎంలకు ప్రత్యేక సంకేతాలు వెళతాయన్న మాటలోనూ వాస్తవం లేదు. ఎందుకంటే ఓటరు మీట నొక్కినప్పటి నుంచి కంట్రోల్ యూనిట్లో ఆ ఓటు నమోదు అయ్యేంతవరకూ ఇతర బటన్లు ఏవీ పనిచేయవు కాబట్టి!! పాశ్చాత్యదేశాల్లో బ్యాలెట్ పేపర్లను వాడుతున్నారా? అమెరికాతోపాటు యూరోపియన్ యూనియన్ దేశాల్లో వాడే ఈవీఎంలన్నీ కంప్యూటర్ల ద్వారా నియంత్రించగలిగేవి. గతంలో కొన్ని దేశాలు ప్రయోగాత్మకంగా ఇలాంటి ఈవీఎంలను వాడాయి. కంప్యూటర్లతో నియంత్రించడం అంటే.. మార్పులుచేర్పులకు, హ్యాకింగ్‌కు అవకాశమిచ్చినట్లే అన్నది తెలిసిందే. దీంతో అక్కడ ఓటింగ్ ప్రక్రియపై సందేహాలు చెలరేగాయి. అంతేకాకుండా తగినన్ని భద్రతా ఏర్పాట్లు, చట్టాల్లో మార్పుల్లేకపోవడంతో వీటి వాడకాన్ని నిలిపివేశారు. భారత ఎన్నికల కమిషన్ తయారు చేసిన ఈవీఎంలలో ఈ చిక్కుల్లేవు. బాక్సులు తెరిచి చిప్ మారిస్తే...? సాధ్యం కాదు. 2013 తరువాత తయారైన ఎం3 మోడల్లో ఈవీఎం బాక్సులను బలవంతంగా తెరిచే ప్రయత్నాలను గుర్తించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ట్యాంపర్ డిటెక్షన్ అని పిలిచే ఈ ఫీచర్ వల్ల ఒకసారి ఎవరైనా బాక్సును బలవంతంగా తెరిచే ప్రయత్నం చేస్తే ఈవీఎం పనిచేయకుండా పోతుంది. మైక్రో ప్రాసెసర్ స్థాయిలో మార్పులను పసిగట్టేందుకు సెల్ఫ్ డయాగ్నస్టిక్స్ అనే ఫీచర్ కూడా ఉంటుంది. హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్వేర్లలో ఏవైనా మార్పులు జరిగితే ఆ విషయాన్ని వెంటనే గుర్తిస్తుంది ఇది. ఈవీఎంలను ఆన్ చేసిన ప్రతిసారీ ఈ సెల్ఫ్ డయాగ్నస్టిక్స్ ఫీచర్ పనిచేయడం మొదలవుతుంది. -
ఎన్నికలు ఓ ఫార్సు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఓ ఫార్సు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ట్యాంపరింగ్ చేశారని, అందులోని చిప్‌లను మార్చేశారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) స్థానంలో అనిల్‌చంద్ర పునేఠాను మార్చి ఒక కోవర్టును నియమించారని మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి కేసుల్లో సహ నిందితుడైన వ్యక్తిని సీఎస్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం ఉండవల్లిలోని ప్రజావేదికలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై తీవ్రస్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలింగ్ రోజు సీఎస్.. డీజీపీ కార్యాలయానికి వెళ్లడం ఏమిటని ఆక్షేపించారు. ఇలా ఎప్పుడైనా జరిగిందా? అని నిలదీశారు. సీఎస్ తనకు నచ్చని పనులు ఎలా చేస్తారని అన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం(ఈసీ) పూర్తిగా విఫలమైందని, తన జీవితంలో ఇంత పనికిమాలిన ఎన్నికల సంఘాన్ని చూడలేదని విమర్శించారు. చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఎవరి ఊహకూ అందనంత సైలెంట్ వేవ్ ఉంది. అది జగన్మోహన్రెడ్డి కోసం ఉంటుందా? సాధారణంగా పోలింగ్ మొదట్లో మందకొడిగా సాగి, ఆ తర్వాత పుంజుకుంటుంది కానీ, ఈసారి దీనికి భిన్నంగా ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎంలు) పనిచేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. 31 శాతం ఈవీఎంలు పనిచేయలేదు. ఈవీఎంలను సరిచేసిన తర్వాత హింసను ప్రేరేపించారు. ఈవీఎంలు రిపేర్ చేస్తామని వచ్చిన వాళ్లు రిపేర్లు చేశారా? లేక ట్యాంపరింగ్ చేశారా? ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైనా జగన్మోహన్రెడ్డి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఇప్పుడు జరిగింది ఎన్నిక కాదు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. నరేంద్ర మోదీ, జగన్, కేసీఆర్ వంటి వారితో పోరాడాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని చాలాచోట్ల దాడులకు పాల్పడ్డారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఇవన్నీ జరిగాయి. తెలంగాణ నుంచి వచ్చే ఏపీకి బస్సులను ఆపేశారు. పోలింగ్‌లో కుట్ర చేశారు ఓటు వేసేందుకు ఎక్కడెక్కడి నుంచో జనం వచ్చారు. పూణే నుంచి వచ్చి ఓటు కోసం పోలింగ్ కేంద్రాల్లో గొడవపడుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే నుంచి ఓటు వేసేందుకు వస్తే, వారిని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. పోలింగ్‌లో కుట్ర చేశారు. ఉదయం ఓటేద్దామని పోలింగ్ కేంద్రాలకు వెళితే ఈవీఎంలు పనిచేయలేదు. అందరితో మాట్లాడి పరిస్థితులు తెలుసుకున్నాను. ఒక పథకం ప్రకారమే ఇదంతా చేశారు. ఎన్నికల సంఘానికి మేము ముందే చెప్పినా వినకుండా సీనియర్ అధికారులందరినీ మార్చేశారు. కడప జిల్లా ఎస్పీని కూడా మార్చారు. ఎన్నికల సంఘం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ల ప్రధాన ఎన్నికల అధికారియే(సీఈవో) ఓటేయలేక వెనక్కి వచ్చేశారు. ఎన్నికల సంఘం సీఈవోనే ఓటేయలేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఈవీఎంలను మార్చి కొత్తవి పెట్టారు. ప్రజాస్వామ్య భవిష్యత్తును ఒక యంత్రం మీద వదిలి పెట్టారు. కరెంటు లేకపోతే ఈవీఎం పనిచేయలేదు. చాలాచోట్ల మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ప్రారంభించి సాయంత్రం ఆరు గంటలకే ముగించారు. శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎప్పుడైనా రౌడీయిజం ఉందా? పోలింగ్ రోజు అక్కడ గూండాల్ని దింపి అల్లకల్లోలం సృష్టించారు. ఎన్నికలను రౌడీలకు అప్పగించారు దేశంలో అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ బ్రాంచ్ ఆఫీసులా మార్చేశారు. పోలీసులపై దాడులు చేసి, ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఈవీఎంల సమస్య ఏపీలో పెద్ద సమస్యే కాదని ఎన్నికల అధికారి చెబుతున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా పనిచేసిన ఎన్నికల సంఘాన్ని ఇంతవరకు నేను చూడలేదు. పోలీస్ బలగాలు కూడా లేకుండా చేసి రౌడీలకు అప్పజెప్పాలని చూశారు. ఎన్నికల సంఘం వైఫల్యాలపై జగన్మోహన్రెడ్డి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన లోటస్‌పాండ్ నుంచే రాష్ట్రాన్ని పరిపాలిస్తారా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చెబితే ఎన్నికల సంఘం దాన్ని పాటించే పరిస్థితి ఉంది. ప్రతిపక్షానికి ఇన్ని రూ.వేల కోట్ల ఎక్కడి నుంచి వచ్చాయి? ఈవీఎంల ఊతంతో ఎన్నికల తతంగాన్ని ఒక ఫార్సుగా మార్చేశారు. ఎమ్మెల్యే పదవిని మార్కెట్లో సరుకులా మార్చారు. వీవీ ప్యాట్లను లెక్కించాలంటే ఆరు రోజులు పడుతుందని కబుర్లు చెబుతున్నారు. ఈవీఎంలపై నమ్మకం ఉంటుందా? పోలింగ్ రోజు పరిస్థితులను చూశాక దేశంలో ఎవరికైనా ఈవీఎంలపై నమ్మకం ఉంటుందా? నేను వేసిన ఓటు మా పార్టీకే పడిందో లేదో తెలియలేదు. ఈవీఎంలను రిపేర్లు చేస్తున్నారో, ఏమారుస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. కంప్యూటర్ ఆపరేటర్ మీద, ప్రోగ్రామర్ మీద, చిప్ మీద ప్రజాస్వామ్యం ఆధారపడే పరిస్థితి ఉంది. ఈవీఎంలలో చిప్‌లు మార్చేశారు. ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టం. మంత్రులు, ఎంపీలతో కలిసి శనివారం ఢిల్లీకి వెళ్లి, ఎన్నికల సంఘాన్ని కలుస్తా. అవసరమైతే ధర్నా చేస్తా. ఈవీంఎలపై న్యాయస్థానంలో పోరాటం కొనసాగిస్తాం. ఎన్నికల సంఘం సీఈవోనే ఓటేసుకోలేకపోయాడంటే ఇది వాళ్ల చేతకానితనం కాదా? ఏపీలో గత ఎన్నికలను చివరి విడతలో నిర్వహించి, ఈసారి తొలి విడతలో ఎందుకు పెట్టారు? మోదీ చెప్పడం వల్లే మన రాష్ట్రంలో మొదటి విడతలో ఎన్నికలు నిర్వహించారు. ఎవరితోనూ చర్చించకుండా ఎన్నికలు నిర్వహించడం దారుణం’’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. మీడియాతో చాలాసేపు మాట్లాడిన చంద్రబాబు ఎన్నికల ఫలితాలపై మాత్రం స్పందించలేదు. ఎవరు గెలుస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... తామే గెలుస్తున్నామని బదులిచ్చారు. -
మే మొదటి వారంలో పరిషత్ ఎన్నికలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా పరిషత్, మండల పరిషత్‌లకు మే నెల మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం తొలిదశలోనే (ఏప్రిల్ 11) తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ పూర్తవుతోంది. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే పరిషత్ ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏప్రిల్ రెండో నోటిఫికేషన్ ఇచ్చి.. దీనికి అనుగుణంగానే ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల కోడ్ అమలు గడువు ముగిసేలోపు (మే 25) జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను ముగించేలా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబరులో అసెంబ్లీ, జనవరిలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తాజాగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఇలా వరుస ఎన్నికల నేపథ్యంలో నెలల తరబడి ఎన్నికల నియమావళి అమల్లో ఉంటోంది. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల పురోగతి ఉండటంలేదు. ఈ నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను త్వరగా ముగించాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈవీఎంలతో పరిషత్ ఎన్నికల్లో ఈసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యం త్రాలు (ఈవీఎం) ఉపయోగించాలనే ఆలోచనలో ఎస్ఈసీ ఉంది. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. దీనిపై టీఆర్ఎస్, తదితర పార్టీల నుంచి సానుకూలత వ్యక్తమైనట్టు సమాచారం. ఈ ఎన్నికలు రెండువిడతల్లో నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది. త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ ఈవీఎంలను ఉపయోగించాలనే ఆలోచనతో ఎస్ఈసీ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు కూడా అన్ని పార్టీలనుంచి ఆమోదం వచ్చినట్లు సమాచారం. వేగంగా ఏర్పాట్లు పరిషత్ ఎన్నికలకోసం ఎస్ఈసీ ఏర్పాట్లును వేగవంతం చేసింది. వచ్చే జూలై 4న కొత్త జడ్పీలు, ఎంపీపీ పాలకవర్గాలు ఏర్పడేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలోని పాత 9 జడ్పీల స్థానంలో 32 జడ్పీల చైర్పర్సన్లు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాల పరిధిలో ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. కొత్త జడ్పీలు, ఎంపీపీల పరిధిలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల పునర్విభజన కూడా పూర్తయింది. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారయ్యాయి. 32 జడ్పీలు, 535 ఎంపీపీలు ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ ప్రక్రియను పూర్తిచేయడంలో భాగంగా ఇప్పటికే పాత 9 జడ్పీల స్థానంలో జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా 32 జడ్పీలు, వాటి పరిధిలోని 535 గ్రామీణ రెవెన్యూ మండలాలను ఎంపీపీలుగా పునర్విభజన పూర్తిచేశారు. 32 జడ్పీ చైర్పర్సన్లు, 535 ఎంపీపీలకు సంబంధించి ఎస్టీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కూడా ఖరారుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లో మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్టు సమాచారం. కొత్తగా 68 మున్సిపాటిలీలు ఏర్పడిన నేప థ్యంలో ఆయా మండలాల పరిధిలోని కొన్ని గ్రామ పంచాయతీలను వాటిలో విలీనం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 489 ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. 27న ఓటర్ల తుది జాబితా ఈ నెల 27న రాష్ట్రంలో గ్రామపంచాయతీల వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాలను సిద్ధం చేయాలని అధికారులను ఎస్ఈసీ ఇదివరకే ఆదేశించింది. తుది జాబితా సిద్ధం చేసి మార్చి 27న ప్రచురించాలని గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త పంచాయతీరాజ్ చట్టంలో సూచించిన మేరకు వార్డుల విభజన పూర్తిచేయాలని ఆదేశాలొచ్చాయి. ఈ నెల 16న వార్డుల వారీగా విభజించిన గ్రామపంచాయతీ ముసాయిదా ఫొటో ఓటర్ల జాబితాను సిద్ధం చేసి గ్రామపంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈ జాబితాలపై వివిధ ప్రక్రియలను నిర్వహించాక 27న డీపీవో చేసిన వార్డుల విభజనకు అనుగుణంగా గ్రామపంచాయతీ ఫొటో ఓటర్ల తుది జాబితా ప్రచురించాలి. -
వచ్చేసింది.. ఓట్ల పండుగ
పేరు చెప్పడానికీ సిగ్గుపడే దశ నుంచి... ఓటు మా హక్కు అని మహిళలు గొంతెత్తే వరకూ... నా ఒక్క ఓటేయకపోతే పోయేదేముందిలే అనుకునే దగ్గర్నుంచి... బాధ్యతగా చేసుకున్న మిలినియల్స్ వరకూ.. గల్లీ గల్లీ తిరిగి కరపత్రాలు పంచి ప్రచారం చేసే స్థాయి నుంచి... కాక రేపే ఫేస్బుక్ పోస్టు ఒక్కటి చాలని అనుకునే వరకు... గెలిచింది ఎవరో తెలిసేందుకు రోజులు పట్టే కాలం నుంచి.. గంటల్లో విజేతలను నిర్ణయించే దశ వరకూ... ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం.. మన భారతీయంలో వింతలు విశేషాలు.. అన్నీ ఇన్నీ కావు! సామాన్యుడు.. దేవుడయ్యే సమయం దగ్గరకొచ్చింది! ఎడమచేతి చూపుడువేలిపై సిరా గుర్తు పడే రోజు వచ్చేస్తోంది! ఏడు దశాబ్దాల ఎన్నికల పండుగ ప్రజాస్వామ్య ప్రస్థానం సాగింది ఇలా... అభ్యర్థికో బాక్స్ నుంచి ఈవీఎంల వరకు మన ఎన్నికల ప్రక్రియ అభ్యర్థికో బాక్స్ నుంచి బ్యాలెట్ పత్రం దిశగా వెళుతూ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వరకు చేరుకుంది. తొలి ఎన్నికల్లో ప్రతీ అభ్యర్థికి వేర్వేరు రంగుల్లో ఉన్న ఒక్కో బ్యాలెట్ బాక్స్‌ని కేటాయించారు. ఆ బాక్స్‌పై వారి పేరు, ఎన్నికల గుర్తుని పెయింట్ చేశారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో బరిలో ఉన్న అభ్యర్థులు ఒక్కొక్కరికీ ఒక బ్యాలెట్ బాక్స్ అన్నమాట. నచ్చిన అభ్యర్థి బ్యాలెట్ బాక్స్‌లో ఓటరు బ్యాలెట్ పేపర్‌ను వేస్తే సరిపోతుంది. అప్పట్లో ఈ బ్యాలెట్ బాక్స్‌లను గోద్రేజ్ కంపెనీ బొంబాయిలోని విఖ్రోలి ప్రాంతంలో తయారు చేసింది. 1957 ఎన్నికల్లోనూ ఇదే ప్రక్రియను అనుసరించారు. మూడవ సార్వత్రిక ఎన్నికల (1962)లో బరిలో ఉన్న అభ్యర్థులు, గుర్తులను ఒకే బ్యాలెట్ పేపర్‌పై ముద్రించారు. ఇరవైఏళ్లపాటు ఇదే పద్ధతి కొనసాగగా.. 1982లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీఎంలు) వాడారు. అయితే అప్పట్లో పరూరు నియోజకవర్గంలోని 50 పోలింగ్ స్టేషన్లకే వీటిని పరిమితం చేశారు. 1998లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 16 స్థానాల్లో వీటిని మరోసారి పరీక్షించారు. ఇవన్నీ మంచి ఫలితాలు ఇవ్వడంతో 2004లో తొలిసారి మొత్తం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఈవీఎంల వాడకం మొదలుపెట్టారు. అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకం చేసేందుకు 2010లో ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రెయిల్ (వీవీప్యాట్)లను ప్రవేశపెట్టారు. ఈవీఎంల వాడకంతో ఓటింగ్ ప్రక్రియ సులభతరం కావడమే కాకుండా, ఫలితాల ప్రకటన కూడా వేగవంతమైంది. పోలింగ్ కేంద్రాల్లో జరిగే రిగ్గింగ్, ఆక్రమణ వంటి అక్రమాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమైంది. తక్కువ బరువు ఉండటం వల్ల ఈవీఎల రవాణ కూడా సులభం. ఒక్కో ఈవీఎం ఖరీదు ఐదారు వేలు ఉంటుంది. పదిహేనేళ్ల పాటు పని చేస్తుంది. ఇన్ని లాభాలున్నా.. ఈవీఎంలలో లోపాలున్నాయన్న ఆరోపణలు రావడం సాధారణమైపోయింది. కాలినడక, పడవల్లో, ఏనుగులపై ప్రయాణాలు ఒకప్పుడు ప్రయాణ సాధనాలు అంతగా లేవు. సరైన రహదారి సౌకర్యాలు ఉండేవి కావు. కొండ ప్రాంతాల్లోనూ, నక్సల్స్ ప్రాబల్యం ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనూ, ఎడారుల్లోనూ, సముద్రం మధ్య ద్వీపాల్లోనూ ఓటింగ్ నిర్వహణ దుర్లభంగా ఉండేది. ఎన్నికల కమిషన్ సభ్యులు నానా పాట్లు పడేవారు. ఎన్నికల సామగ్రి మోసుకుంటూ మైళ్లకి మైళ్లు నడిచే పరిస్థితి. ఇఅదీ ప్రజాస్వామ్య వ్యవస్థకి మనం ఇచ్చే గౌరవం. హిందూమహాసముద్రం ద్వీపాల్లో ఎన్నికల కోసం ఏకంగా నేవీ అధికారుల సాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాలకు ఎన్నికల సిబ్బందిని, సామగ్రిని చేర్చడానికి హెలికాప్టర్ సాయం తీసుకునే వారు. ఇప్పుడు ప్రయాణ సాధనాలు మెరుగు పడినప్పటికీ అటవీ ప్రాంత పోలింగ్ స్టేషన్లకి వెళ్లాలంటే కాలినడకే మార్గం. ఇక ప్రత్యేక వాహనాలు, రైళ్లు, హెలికాప్టర్లు, బోట్లలో కూడా సిబ్బందని తరలిస్తారు. కొన్నిసార్లు పోలింగ్ స్టేషన్ చేరుకోవడానికి ఏనుగులు వాడిన సందర్భాలూ లేకపోలేదు. రాజస్థాన్ వంటి ఎడారుల్లో ఒంటెలే సాధనం. దేశం మొత్తమ్మీద దాదాపుగా 80 వేల పోలింగ్ కేంద్రాల వద్ద మోబైల్ఫోన్ సౌకర్యం కూడా లేదు. ఇంకో ఇరవై వేల పోలింగ్ స్టేషన్లు అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక్కడున్నాడు! ఒక్క ఓటు. ఒకే ఒక్క ఓటు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కూడా ఎంతో కీలకం. అందుకే ఎన్నికల సంఘం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి మరీ గుజరాత్లో దట్టమైన గిర్ అడవుల్లోకి కాలినడకన వెళుతుంది. ఆ ఒక్కడి కోసం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. అతని పేరు మహంత్ భరత్‌దాస్ దర్శన్ దాస్. ఆలయపూజారి. ఆయన ప్రతీ ఏడాది తన ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఇందుకోసం ఎన్నికల సిబ్బంది గిర్ అడవుల్లోని బనేజ్కు ఏకంగా 35 కి.మీ. ప్రయాణం చెయ్యాలి. ఆ ప్రయాణంలో వారిని సింహాలు భయపెడతాయి. అడవి జంతువులు ఎదురవుతాయి. అయినా ప్రాణాలకు తెగించి మరీ ఆ ఒక్క ఓటు నమోదు కోసమే అధికారులు వెళతారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఏ పౌరుడు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 2 కి.మీ.దూరానికి మించి ప్రయాణించకూడదు. అందుకే తాము భరత్‌దాస్ దగ్గరకి వెళతామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు చెప్పారు. ఆ ప్రాంతంలో ఫోన్లు పని చెయ్యవు. టీవీ రాదు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదు. అయినప్పటికీ దర్శన్‌దాస్ శివుడిపై అపారమైన భక్తితో ఆ ప్రాంతంలోనే చాలా ఏళ్లుగా ఉంటున్నారు. చూడడానికి కాస్త ఆధునికంగానే కనిపిస్తారు. 60 ఏళ్లు దాటిన దర్శన్ దాస్ నల్ల కళ్లద్దాలు,తెల్ల గడ్డం, తలకి టోపీతో అందరినీ ఆకర్షిస్తుంటారు. ఆయనపై నమ్మకంతో ఆ అడవిలో వెళ్లేవారికి ఆధ్యాత్మిక బోధనలు చేస్తారు. పౌర సమాజానికి దూరంగా విసిరేసి ఉన్నప్పటికీ ఆయనకు ఓటు విలువ గురించి బాగా తెలుసు. ‘‘నా ఓటు ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. వాజపేయి సర్కార్ కేవలం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిపోయింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని ఎన్నికల సిబ్బంది ఇంత దూరం వస్తున్నందుకు వారిని ఎంతో గౌరవిస్తాను. నా ఓటు ఎంత విలువైనదో తెలుసుకొని గర్విస్తాను‘‘ అని అంటారు. ఒక్క వ్యక్తి కోసం పోలింగ్ బూల్ ఏర్పాటు చేస్తున్న సంగతి వెలుగులోకి వచ్చాక ఎందరో జర్నలిస్టులు గిర్ అడవుల్లోకి వెళ్లి భరత్దాస్తో మాట్లాడారు. అతని ప్రత్యేకతను ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. శభాష్ శరణ్.. ఆయనకు ఓటంటే బాధ్యత శ్యామ్ శరణ్ నేగి. ఆయన వయసు 102 సంవత్సరాలు. మన దేశంలో అతి పెద్ద వయసున్న ఓటరు ఆయనే. స్వాతంత్య్ర సమర సంగ్రామంలో పాల్గొన్న నేగికు ఓటు అంటే హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. అందుకే ఇప్పటివరకు అన్ని ఎన్నికల్లోనూ ఓటు హక్కు వినియోగించుకున్న ఏకైక ఓటరుగా ఆయన రికార్డులకెక్కారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కల్పా అనే చిన్న గ్రామంలో ఉంటారు. కిన్నెర కైలాస్ పర్వత శ్రేణుల్లో ఉండే ఆ గ్రామంలో నిత్యం మంచు కురుస్తూనే ఉంటుంది. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయరు. మొదటి ఓటు తనే వేయాలనుకుంటారు. దీనికి గ్రామస్తులు కూడా సహకరిస్తారు. పొద్దున్నే ఇంకా ఎన్నికల సిబ్బంది పోలింగ్ బూత్ తెరవక ముందే ఉన్ని కోటు వేసుకొని ఆయన వస్తారు. గ్రామస్తులందరూ కూడా ఆయనకు గౌరవాన్ని ఇచ్చి దారి విడిచిపెడతారు. 1951–52లో జరిగే మొదటి ఎన్నికల్లో కూడా నేగి తొలి ఓటును వేసి ప్రజాస్వామ్య భారతంలో తొలిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తిగా చరిత్రపుటల్లో నిలిచిపోయారు. అప్పట్నుంచి వేగి ప్రతీసారి ఎన్నికల్లో తన ఓటు హక్కుని వినియోగించుకుంటూనే ఉన్నారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న వ్యక్తిగా మహాత్మగాంధీ సిద్ధాంతాలను ఆయన బాగా ఒంట బట్టించుకున్నారు. నూలు ఒడికి ఖాదీ వస్త్రాలు ధరించేవారు. ఒకప్పుడు ఆయనకు కాంగ్రెస్ పార్టీ అంటే చెప్పలేనంత ఇష్టం ఉండేది. దేశానికి స్వాతంత్య్రం సాధించిన పార్టీగా ఆయనకు కాంగ్రెస్ పట్ల దేశభక్తి పొంగిపొర్లేది. కానీ కాలంతోపాటు ఆయన అభిప్రాయాలూ మారిపోయాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు అత్యంత ఇష్టమైన నాయకుడు. ‘‘ఇప్పుడున్నది ఒకప్పటి కాంగ్రెస్ కాదు. ఎన్నో కుంభకోణాలకు పాల్పడింది. ఇప్పుడున్న నేతల్లో మోదీనే అభిమానిస్తాను. అవినీతిని అంతమొందించడానికి ఆయన తనకు చేతనైంది చేస్తున్నారు‘‘ అంటూ ప్రశంసిస్తారు. 17వ లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి ఓటేసేందుకు ఆయన అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తొలి అడుగు.. సుకుమార్ సేన్ చుట్టూ చీకటి. ముందున్న దారి కనిపించదు. అడుగు ఎలా వెయ్యాలో తెలీదు. కానీ వెయ్యాలి. ఎవరో ఒకరు ముందుగా నడవాలి. అలా నడిచి మన ఎన్నికల వ్యవస్థని ఒక గాడిలో పెట్టింది మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుకుమార్‌సేన్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ (ఐసీఎస్) అధికారిగా, న్యాయమూర్తిగా పనిచేసిన ఆయన దేశంలో ఎన్నికల ప్రక్రియకు తొలిసారిగా వేసిన బాట మరువలేనిది. ఎన్నికల నిర్వహణకు ముందు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ల జాబితా రూపకల్పనలో సుకుమార్ సేన్ బృందానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఓటర్లలో 70 శాతం నిరక్షరాస్యులు కావడం, మహిళా ఓటర్లు పేరు వెల్లడించడానికి ఇష్టపడకపోవడంతో ఓటర్ల జాబితా రూపొందించడమే కష్టసాధ్యమైంది. దీంతో చాలా మంది ఓటు హక్కు పొందలేకపోయారు. 17 కోట్ల మంది ఓట్లతో తొలి జాబితా రూపొందింది. ఎన్నికల్లో బూత్‌ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, బ్యాలెట్ బ్యాక్స్‌లు రూపొందించడం వంటివన్నీ ఒక ప్రణాళికాబద్ధంగా చేసి సుకుమార్ సేన్ బృందం విజయవంతమైంది. తొలి ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 25, 1951 నుంచి 1952 మార్చి 27 వరకు మొత్తం నాలుగు నెలల పాటు జరిగింది. ఒకసారి వేటు వేసిన వాళ్లు మళ్లీ ఓటు వెయ్యకుండా చూపుడు వేలి మీద ఇంకు గుర్తు వేయడం తొలి ఎన్నికల్లోనే ప్రవేశపెట్టారు. నేపాల్, ఇండోనేసియా, సూడాన్ వంటి దేశాలు భారత్ ఎన్నికల నిర్వహణను దగ్గరుండి పరిశీలించడానికి తమ ప్రతినిధుల్ని పంపించాయి. విదేశీ మీడియా కూడా భారత్‌లో తొలి ఎన్నికల నిర్వహణను శెభాష్ అంటూ ప్రశంసించింది. సూడాన్ దేశం కూడా తమ తొలి ఎన్నికల నిర్వహణ బాధ్యతను సుకుమార్ సేన్ చేతుల్లోనే పెట్టింది. కానీ ఆయనకు రావల్సిన గుర్తింపు రాలేదని రామచంద్రగుహ వంటి చరిత్రకారులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. భారతరత్న పురస్కారం ఇవ్వదగిన వ్యక్తిని చరిత్ర మరచిపోయిందన్నది ఆయన అభిప్రాయం. ఎన్నికల సిత్రాలు అనామకుడి చేతిలో ఓడిన అంబేడ్కర్... రాజ్యాంగ నిర్మాత, భారత తొలి న్యాయశాఖా మంత్రి, తరతరాలుగా అణచివేతకు గురవుతోన్న అట్టడుగు వర్గాలైన దళిత, ఆదివాసీలకు ప్రత్యేక నియోజవకర్గాలకోసం అహరహం కృషిచేసి రిజర్వుడు నియోజకవర్గాలను తీసుకువచ్చిన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ అప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజకీయవేత్త. అయినప్పటికీ ఒక అనామకుడి చేతిలో, అది కూడా రిజర్వుడు నియోజకవర్గంనుంచి ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బీఆర్ అంబేడ్కర్ బొంబాయి(నార్త్ సెంట్రల్) రిజర్వుడు నియోజకవర్గం నుంచి ఆల్ఇండియా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తరఫున పోటీ చేసి ఓ అనామకుడి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆ వ్యక్తి పేరు నారాయణ్ నడోబా కజ్రోల్కర్. నడోబా కజ్రోల్కర్కి 1,38,137 ఓట్లు వస్తే, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్‌కి 1,23,576 ఓట్లు వచ్చాయి. ఆ తరువాత అంబేడ్కర్ రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులోకి అడుగుపెట్టారు. మళ్ళీ 1954లో భన్దారా లోక్‌సభ ఉప ఎన్నికలో ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బోర్కర్ చేతిలో మళ్ళీ ఓటమిపాలయ్యారు. జేబీ కృపలానీ – సుచేతా కృపలానీ... అతను ఓడినా ఆమె గెలిచారు... బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రాన్ని సాధించుకునే సమయానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆచార్య జేబీ కృపలానీ ఉన్నారు. పూర్తి పేరు జీవత్రామ్ భగవాన్‌దాస్ కృపలానీ. స్వాతంత్య్రానికి పూర్వమూ, స్వాతంత్య్రానంతరమూ భారత రాజకీయాల్లో కీలకంగా పనిచేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఫైజాబాద్ కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కానీ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మన్మోహినీ సెహెగల్ ని ఢిల్లీలో ఆచార్యకృపలానీ భార్య సుచేతా కృపలానీ ఓడించారు. 1957లోనే పోలింగ్ బూత్‌ల ఆక్రమణ.... పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకొని పోలైన ఓట్లను «ధ్వంసం చేయడం, తాము గెలవమనుకున్న చోట్ల బ్యాలెట్ బాక్స్‌లను ఎత్తుకెళ్ళడం, లేదా బ్యాలెట్ బాక్సుల్లో ఇంకుపోసి ఓట్లు చెల్లకుండా చేయడం లాంటి దుశ్చర్యలు 1957 సార్వత్రిక ఎన్నికల నుంచి ప్రారంభం అయ్యాయి. బీహార్‌లోని బేగుసరాయ్ జిల్లాలోని రచియాహిలోని మటిహాని అసెంబ్లీ నియోజకవర్గంలో 1957లో జరిగిన ఎన్నికల్లో తొలి పోలింగ్ బూత్‌ల ఆక్రమణ జరిగింది. పోటీ చేసే అభ్యర్థులూ, పార్టీల సంఖ్య ఎన్నో రెట్లు పెరిగి, పోటీ పెరిగిపోవడంతో 1970–80 వ దశకం చివర్లో బూత్‌ల ఆక్రమణ అనే పదం ప్రాచుర్యంలోకి వచ్చింది. దీని వల్ల దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని పార్టీలు బూత్‌లను ఆక్రమించుకోవడంతో పాటు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం మొదలయ్యింది. పోలింగ్ బూత్‌ల ఆక్రమణని సైతం శిక్షార్హమైన నేరంగా పరిగణించి, బూత్‌ల ఆక్రమణ జరిగిన ప్రాంతాల్లో ఎన్నికలు రద్దు చేయడం, లేదా అక్కడ ఎన్నికలు వాయిదా వేసేలా ప్రజాప్రాతినిధ్య(1951) చట్టానికి 1989లో మార్పులు చేసారు. 13 రోజుల ప్రధాని... గుల్జారీలాల్ నందా మొత్తం రెండు సార్లు ప్రధాని అయ్యారు. అయితే రెండు సందర్భాల్లోనూ 13 రోజులు, 13 రోజులే ప్రధాని పదవిలో ఉండడం ఒక విశేషం అయితే, రెండు సార్లూ పదవిలో ఉన్న ప్రధానమంత్రులు మరణించడంతో ఈయనకు ఆ అవకాశం లభించింది. ఒకటి జవహర్ లాల్ నెహ్రూ మరణం అయితే, మరొకరు లాల్‌బహదూర్ శాస్త్రి మరణంతో గుల్జారీలాల్కి ఈ అవకాశం దక్కింది. రెండుసార్లూ కలుపుకొని మొత్తం 26 రోజులు పాటు గుల్జారీలాల్ నందా ప్రధానిగా పనిచేశారు. రెండవ లోక్‌సభ(ఏప్రిల్ 2, 1962 – మార్చి 3 1967)నుంచి 1964, మే 27 జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్నారు. మే 27, 1964 జవహర్ లాల్ నెహ్రూ మరణం తరువాత తొలిసారి గుల్జారీలాల్ తాత్కాలిక ప్రధాని అయ్యారు. మే 27 నుంచి జూన్ 9, 1964న లాల్ బహదూర్ శాస్త్రి ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా ఉన్నారు. రెండవసారి 1966 జనవరి 11న లాల్‌బహదూర్ శాస్త్రి మరణించిన తరువాత మళ్ళీ 13 రోజుల పాటు గుల్జారీలాల్ ప్రధాని బాధ్యతలు చేపట్టారు. శాస్త్రి మరణానంతరం ఉత్తర ప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న ఇందిరాగాంధీ 1966 జనవరి 24న ప్రధాని బాధ్యతలు చేపట్టే వరకూ గుల్జారీలాల్ ప్రధానిగా కొనసాగారు. ఆపరేషన్ దుర్యోధన... 2005, డిసెంబర్ 12 న స్టార్ టీవీ న్యూస్ ఛానల్ ప్రసారం చేసిన స్టింగ్ ఆపరేషన్, ఆపరేషన్ దుర్యోధనతో 11 మంది పార్లమెంటు సభ్యులు స్వయంగా డబ్బులు తీసుకుంటున్న విజువల్స్ బయటపెట్టారు. దీనిపై పార్లమెంటులో దుమారం రేగడంతో రాజ్యసభలోని ఎథిక్స్ కమిటీ, లోక్ సభ ప్రత్యేక కమిటీ విచారణలో వీరిని దోషులుగా నిర్ధారించడంతో 10 మంది లోక్ సభ సభ్యులూ, ఒక రాజ్య సభ సభ్యుడిని ఆయా సభల నుంచి తొలగించారు. -
వీవీ ప్యాట్లపై హైకోర్టుకు!
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను తారుమారు చేశారనే అనుమానంతో వీవీ ప్యాట్లతో అన్ని నియోజకవర్గాల్లో కౌంటింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజాకూటమి.. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కి కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయగా, కూటమి పక్షాన కలిసి కోర్టును ఆశ్రయించాలని కూటమి నేతలు యోచిస్తున్నారు. దీనిపై బుధవారం సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఓటర్ల జాబితా అవకతవకల నుంచి ఈవీఎం యంత్రాల నిర్వహణ వరకు ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై తమకు అనుమానాలున్నాయని మొదటి నుంచి చెబుతున్నామని, దీనిపై ఈసీ స్పందన కూడా అనేక అనుమానాలకు తావిస్తోందని టీపీసీసీకి చెందిన ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. ఈ విషయంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే సరైన మార్గమని భావిస్తున్నామని చెప్పారు. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఇప్పటికే న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రక్రియ వీవీ ప్యాట్ల ద్వారా కొనసాగేంత వరకు కోర్టులో పోరాటం చేస్తామని ఆయన వెల్లడించారు. కోర్టుకు ఎప్పుడు వెళ్లాలన్నది కూటమి నేతలంతా కలిసి నిర్ణయిస్తారని తెలిపారు. 15 లేదా 16న సీఎల్పీ సమావేశం.. కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఈ నెల 15 లేదా 16 తేదీల్లో జరగనుంది. తెలంగాణతోపాటు ఎన్నికలు జరిగిన రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందున పార్లమెంటుకు సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కాంగ్రెస్ అధిష్టానం నుంచి నేతలు వచ్చి సీఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తారని గాంధీభవన్ వర్గాలు తెలిపాయి. సీఎల్పీ నేతగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి లేదా ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్కలలో ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ పదవీ కాలం ఈ నెలలోనే నాలుగేళ్లు అవుతున్నందున ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించాలనుకుంటే సీఎల్పీ నేతగా అవకాశమివ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. లేదంటే ప్రచార కమిటీ చైర్మన్ హోదాలో ఎన్నికలను ఎదుర్కొన్న భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తం మీద ఉత్తమ్, భట్టిలలో ఒకరు టీపీసీసీ అధ్యక్షుడు, మరొకరు సీఎల్పీ నేతగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఈసీ స్పందించకపోతే కోర్టుకు: కుంతియా వీవీ ప్యాట్లపై కోర్టుకు వెళ్లే విషయమై ఉత్తమ్‌తోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా స్పందించారు. ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారుల సహకారం, డబ్బు బలంతోనే కేసీఆర్ విజయం సాధించారని, ఈవీఎంలను తారుమారు చేశారని, దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని, సీఈసీ తమ ఫిర్యాదుపై స్పందించని పక్షంలో కోర్టుకు వెళతామని చెప్పారు. -
ఈవీఎంలలో అభ్యర్థుల భవితవ్యం..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికలు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రా (ఈవీఎం)ల్లో నిక్షిప్తమైంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసే సమయానికి రాష్ట్రంలో సుమారుగా 67.7% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం అంచనా వేసింది. కచ్చిత మైన గణాంకాలను శనివారం ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్ పేర్కొన్నారు. 2014లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 69.5 % పోలింగ్ నమోదుకాగా ఈసారి కూడా అంతే స్థాయిలో పోలింగ్ నమోదు కావచ్చునన్నారు. 13 వామపక్ష తీవ్రవాద ప్రభావిత నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగియగా మిగిలిన 106 స్థానాల్లో 5 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుని లైన్లలో నిలబడిన ఓటర్లకు అదనపు సమయంలో ఓటేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 11న ఫలితాలను ప్రకటించనున్నారు. గంట ఆలస్యంగా ప్రారంభం... షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 గంటల నుంచి సా యంత్రం 4 లేదా 5 గంటల వరకు పోలింగ్ జరగా ల్సి ఉండగా ఈవీఎంలు మొరాయించడంతో చాలా ప్రాంతాల్లో దాదాపు గంట నుంచి రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేం ద్రాల్లో ఉదయం 6 నుంచి 6.45 గంటల మధ్య మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరును పరీక్షించిన అనంతరం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. మాక్ పోలింగ్‌లో ఈవీ ఎంలతోపాటు ఓటర్ వెరిఫయబుల్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్) యంత్రాలు మొరాయించడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. చెదురుమదురు ఘటనలు మినహా... చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నాలుగైదు చోట్ల స్వల్ప ఘర్షణలతో ఉద్రిక్తత ఏర్పడినా పోలీసులు సకాలంలో రంగంలోకి దిగి పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. దీంతో ఎన్నికల యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. పోలింగ్ ముగిసే సమయానికి లైన్లలో ఉన్న ఓటర్లకు ఓటు హక్కు కల్పించేందుకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం6 గంటల వరకు పోలింగ్ కొనసాగించారు. పోలింగ్ విధుల్లో 37,594 మంది ప్రిసైడింగ్ అధికారులు, 37,556 మంది సహాయక ప్రిసైడింగ్ అధికారులు, 74,873 మంది ఇతర పోలింగ్ అధికారులు కలిపి మొత్తం 1,50,023 మం ది సిబ్బంది పాల్గొన్నారు. పోలింగ్ ముగిసిన అనంత రం పోలింగ్ అధికారులు కట్టుదిట్టమైన భద్రత మ« ధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. భారీగా ఓట్లు గల్లంతు! ఓటర్ల జాబితాలో అడ్డగోలుగా పేర్లను తొలగించడంతో శాసనసభ ఎన్నికల్లో లక్షల మంది పౌరు లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఓటరు గుర్తింపు కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రజలకు ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేవని అధికారులు చెప్పడంతో తీవ్ర నిరసన తెలియజేశారు. ప్రధానంగా హైదరాబాద్ జంట నగరాల నుంచి పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితా నుంచి పేర్లు గల్లంతయ్యాయని ఫిర్యాదులొచ్చాయి. ఓటర్ల జాబితాలను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయడానికి 2015లో నిర్వహించిన ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ (ఐఆర్‌ఈఆర్) కార్యక్రమంలో భాగంగా బోగస్ ఓటర్ల పేరుతో దాదాపు 20 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఓటర్ల పేర్ల తొలగింపులో పొరపాట్లు జరిగాయని సీఈఓ రజత్‌కుమార్ అంగీకరించారు. ఓటు హక్కు వియోగించుకున్న ప్రముఖులు -
మళ్లీ రంగు మారె!
(సవ్యసాచి) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి రాజకీయ బంధాలెంత బలంగా ఉంటాయో, బలహీనంగా ఉంటాయో తెలంగాణ ఎన్నికలతో మరింత తేటతెల్లమౌతోంది. కమ్యూనిస్టులు, తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ తదితర పార్టీలతో లోగడ పొత్తో, కూటమో కట్టిన ఆయన.. ఇలా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో కాంగ్రెస్‌తో బంధం అల్లుతున్నారు. ఒక ఎన్నిక నుంచి మరో ఎన్నికకు వచ్చేసరికి ఆయన ఎటు నుంచి ఎటు మారతారో అంచనాలకు అందని పరిస్థితి. ఈ శిబిరాలు మార్చడం సంగతెలా ఉన్నా ఒక మూల సూత్రం మాత్రం అన్ని వేళలా కచ్చితంగా ఉంటుంది. అదేంటంటే, అధికారమే ఆయనకు పరమావధి!. ఎటుతిరిగి, ఉన్న అధికారాన్ని నిలబెట్టుకోవడమో, లేని అధికారాన్ని కైవసం చేసుకోవడమో లక్ష్యంగానే ఆయన ఎత్తులు–ఎత్తుగడలు సాగుతాయి. అందుకు, ఏది పనికి వస్తుందనుకుంటే నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా అదే చేస్తారాయన!. ‘నలుగురేమనుకుంటారో! నవ్విపోతారేమో!!’ అన్న మీమాంసే ఉండదు. ‘‘ప్రజలకు జ్ఞాపకశక్తి చాలా తక్కువ, దాన్నే నమ్ముకొని తిమ్మిని బమ్మిని–బమ్మిని తిమ్మిని చేసి జనాన్ని నమ్మించి బోల్తాకొట్టే ‘అనుకూల మీడియా’ సహకారముంటే చాలు! ఇక ఏమైనా చేయొచ్చు!’’ అన్నదే ఆయన నమ్మే రాజకీయ విధానం. తన మీద తనకు నమ్మకం లేకపోయినా, ఈ సమీకరణం మీద ఆయనకు ఎక్కడ లేని విశ్వాసం! ఇక నైతిక విలువలు! సిద్ధాంతమంటారా? అవి ఆయన డిక్షనరీలోనే లేవన్నది అందరికీ తెలుసు. తాజా రాజకీయ సమీకరణమే అందుకు సరిపోయే ఉదాహరణ! ‘నలభయ్యేళ్ల ఇండస్ట్రీ’, ‘దేశంలో నేనే సీనియర్ నాయకుడ్ని’ అని కాలర్ ఎగరేసే ఆయన ఈ మధ్య ఓ చిత్రమైన వ్యాఖ్య చేశారు. ‘నిజానికి నేనసలు టీఆరెస్‌తోనే పొత్తు పెట్టుకుందామనుకున్నాను. అందుకు ప్రయత్నించాను, కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే కానీయకుండా అడ్డుతగిలార’ని తమ పార్టీ నాయకుల సమావేశంలో వెల్లడించారు. బయట కూడా, మోదీని విమర్శించే ఓ సందర్భంలో, ఆయన మీద అభియోగం లాగా ఇదే మాట మరో రూపంలో చెప్పారు చంద్రబాబు. అధికార పక్షమైన టీఆరెస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లాలనుకున్నారాయన. కానీ, ఇతరేతర కారణాల వల్ల వీలుపడనందున, వారి ప్రత్యర్థులైన కాంగ్రెస్‌తో ఇప్పుడు పొత్తు పెట్టుకుంటూ... అవే ఎన్నికల్లో, అదే టీఆరెస్‌పై పోటీ చేస్తున్నారు! అంటే, ఏమిటి అర్థం? ‘ఎవరితోనైనా చేతులు కలిపి ఎవరిపైనైనా పోరాడుతాం, మాకు కావాల్సిందల్లా ‘అధికారం’ అనేగా! అదే చేస్తున్నారిప్పుడు. తన తప్పుడు నిర్వాకాల వల్ల సొంతంగా ఏ ఎన్నికా గెలవలేనని ఆయనకు తెలుసు. అందుకే, ఆయన ఎప్పుడూ ఆ సాహసం చేయలేదు. 1995లో తాను సీఎం అయిందీ, 1994లో తన మామ ఎన్టీరామారావు (తెలుగుదేశం)కు తెలుగు ప్రజలు కట్టిన పట్టం, దాన్ని వెన్నుపోటుతో తాను లాక్కున్న ఫలం! ఆ అధికారాన్ని 1999 ఎన్నికల్లో నిలబెట్టుకున్నది, ‘ఒక ఓటుతో ప్రభుత్వం పోగొట్టుకున్నార’ని ప్రజల సానుభూతి పొందిన వాజ్‌పేయి చలువతోనే! పరిస్థితి గమనించి, బీజేపీ చంకలో చేరిన బాబు, వాజ్‌పేయి నేతృత్వపు బీజేపీతోనే (1999) అభివృద్ధి సాధ్యమన్నారు. పదేళ్ల టీడీపీ పాలనకు ( 2004లో) ప్రజలు ఛీకొట్టారు. అప్పుడు ‘మిత్రు’లపైన నెపం నెట్టడానికి, ‘బీజేపీ మసీదులు కూల్చే పార్టీ–వారితో కలవడం మా తప్పు’ అని (2009) లెంపలేసుకున్నారు. కాంగ్రెసేతర పార్టీలతో ‘మహాకూటమి’ కట్టి పోరినా... ప్రజలకు ఆయనపై నమ్మకం ఏర్పడలేదు. ఫలితంగా టీడీపీ మళ్లీ విపక్షానికే పరిమితమైంది. ‘కాంగ్రెస్, అది నేతృత్వం వహించే యూపీయే కూటమి దేశానికి అరిష్టం, మోదీయే వెలుగురేఖ, అభివృద్ధి మంత్ర (2014)’ అని నాటకీయంగా మాట మార్చి బాబు మళ్లీ బీజేపీ పంచన చేరారు. ఇప్పుడు, మరోమారు గొంతు మార్చి.. మోదీ ద్రోహి, బీజేపీ అన్నింటా విఫలమైంది, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ‘కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఒక రాజకీయ అనివార్యత’ అని కొత్త ‘రా(హుల్)గా(ంధీ’)న్నందుకున్నారు. నిన్నటివరకు కలిసున్న పార్టీలను నేడు తిట్టడం, నేటి నుంచి కొత్తగా సఖ్యత కూరిన పార్టీలను పొగడటం.. రేపేమయినా అయితే వారికి జెల్ల కొట్టి కొత్త వారి చంకన చేరడం.. ఇదీ వరుస!’ ఏ ఎన్నికయినా, ఎవరో ఒకరి పంచన చేరి లబ్ధిపొందడానికి యత్నించడం, ఏ రోటి కాడ ఆ పాట పాడి, ప్రజల్ని బోల్తాకొట్టించి ఓట్లతో తన బొచ్చె నింపుకో చూడటం, ఇది తప్పని ఎవరైనా ఎత్తి చూపితే వారి నోరు కొట్టి మాట్లాడటం, తానే పెద్ద నోరు చేసుకొని అరిచి గీపెట్టడం’ ఇదే మన బాబుకు తెలిసిన మహా విద్య!. ఇదంతా తెలుసుకొని నడుచుకోవాల్సింది ప్రజలే.! ఒక్కో ఈవీఎంలో గరిష్టంగా నమోదయ్యే ఓట్ల సంఖ్య 3,840 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషీన్ (ఈవీఎం) రాకతో ఎన్నికల నిర్వహణ సులభతరమైంది. పనితీరు విషయానికొస్తే.. ఒక్కో ఈవీఎం 3,840 ఓట్లను నమోదు చేయగలదు. మన దేశంలో జరిగే ఎన్నికల్లో 1,400 మంది ఓటర్లకు ఒక ఈవీఎం చొప్పున కేటాయిస్తున్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో వీటిని పాక్షికంగా వినియోగించగా, 2004 ఎన్నికల నుంచి పూర్తి స్థాయిలో వాడుకలోకి తెచ్చారు. -
ముందస్తుకు వీవీ–పాట్ ఈవీఎంలు
సాక్షి, మెదక్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ముందస్తు ఎన్నికలు జరిగితే ఎన్నికల కమిషన్ తెలంగాణలో వీవీ పాట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వాడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వాడకంపై కాంగ్రెస్ సహా పలు పార్టీ అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి ఫలితాలను తారుమారు చేసే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీ–పీఏటీ) యంత్రాల వాడకం ద్వారా ఓటర్లు, రాజకీయ పార్టీల్లో ఈవీఎంల వాడకంపై మరింత నమ్మకం పెరిగేలా చూడాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జాయింట్ కలెక్టర్లు, డీఆర్ఓ స్థాయి అధికారులకు ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీ–పీఏటీ) ఈవీఎంల వాడకంపై శిక్షణ ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో నిర్వహించిన ఈ శిక్షణ తరగతులకు రాష్ట్రం లోని అన్ని జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు, డీఆర్వోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాంకేతిక నిపుణులు వాటి ఉపయోగంపై శిక్షణ ఇచ్చారు. వీవీ–పీఏటీ యంత్రాల పనితీరుపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ముందస్తు ఎన్నికలు జరిగిన పక్షంలో ఈ రకమైన కొత్త ఈవీఎంలు వాడే అవకాశం ఎక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఎన్నికలకు ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఎన్ని అవసరం అవుతాయో జిల్లాల వారీగా ఈసీ వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. వీవీ–పీఏటీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తయారీ బాధ్యతను ఈసీఐఎల్‌కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఈవీఎంలపై నమ్మకం పెరిగేలా చర్యలు.. ఈవీఎంలపై ఓటర్లకు, రాజకీయపార్టీలకు మరింత నమ్మకం పెరిగేలా ఈసీ చర్యలు చేపట్టింది. ఈవీఎంలు హ్యాక్ చేయకుండా చర్యలు తీసుకుంది. ఈవీఎంలకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా నష్టంచేయాలని ప్రయత్నిస్తే ఈవీఎం ఆటోమేటిక్‌గా సేఫ్ మోడ్లకు వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంది. ఓటర్లు తాము ఎవరికి ఓటు వేసింది స్పష్టంగా తెలుసుకునేందుకు వీవీ–పీఏటీని ఈసీ రూపొందించింది. బ్యాలెట్ యూనిట్లో ఓటు వేసిన వెంటనే ఓటరు ఏ అభ్యర్థికి, ఏ గుర్తుకు ఓటు వేసింది వీవీ–పాట్ యంత్రం ఓటింగ్ స్లిప్‌ను ముద్రిస్తుంది. ఈ స్లిప్‌ని వీవీ–పాట్ యంత్రంలోని గ్లాస్ డిస్ప్లేలో ఓటరు స్పష్టంగా చూడవచ్చు. ఓటింగ్ స్లిప్ ఏడు సెకండ్లపాటు మాత్రమే ఉంటుంది. ఓటును ఈవీఎం ద్వారా టాంపరింగ్ చేసేందుకు వీలు పడదు. -
పెరగనున్న పోలింగ్ కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సాధారణ ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఈ విషయంలో అన్ని రకాల ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టింది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ జరుగుతోంది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో 30,518 పోలింగ్ కేంద్రాలున్నాయి. తాజాగా దాదాపు 1,686 కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా వచ్చే సాధారణ ఎన్నికలకు 32,204 పోలింగ్ కేంద్రాలు ఉండనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వెయ్యి మంది ఓటర్లకు ఓ పోలింగ్ బూత్ ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. అనివార్య పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్ల సంఖ్య 1,200 ఉండనుంది. పట్టణ ప్రాంతాల్లో గరిష్టంగా 1,500 మందికి ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. 85 వేల ఈవీఎంలు: సాధారణ ఎన్నికలకు అవసరమయ్యే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల సేకరణను రాష్ట్ర ఎన్నికల కార్యాలయం చేపడుతోంది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే 85 వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. షెడ్యూ ల్ ప్రకారం వచ్చే ఏడాది జనవరి 4న ఓటర్ల తుది జాబితా సిద్ధం కానుంది. -
ఈవీఎంలపై గళమెత్తిన మరో ముఖ్యమంత్రి!
ఈవీఎంలపై గళమెత్తిన మరో సీఎం కోల్‌కతా: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎంలు) ట్యాంపరింగ్‌కు గురయ్యాయంటూ ఇప్పటికే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపణాస్త్రాలు సంధిస్తుండగా.. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం ఈ విషయమై గళమెత్తారు. ఈవీఎంలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్నిపార్టీలతో అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయవచ్చునంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి పేర్కొన్న వీడియోక్లిప్ గురించి ఆమె తాజాగా స్పందించారు. 'ఇది నేను చెప్పిన విషయం కాదు. చట్టబద్ధంగా ప్రసిద్ధుడైన సుబ్రహ్మణ్యస్వామి చెప్పారు. ఆయన చెప్పిన దానిని పరిగణనలోకి తీసుకొని.. విచారణ జరపాలి' అని ఆమె అన్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమంటూ ఎన్నికల సంఘం చేసిన ప్రకటనను తాను చూశానని, అయితే, వాటిని ట్యాంపరింగ్ చేయవచ్చునంటూ సుబ్రహ్యణ్యస్వామి పేర్కొంటున్నారని, కాబట్టి ఈ అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని ఆమె కోరారు. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంలు గోల్మాల్ చేశాయని, ఈ అంశంపై విచారణ నిర్వహించాలని మాయావతి, అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
14 లక్షల కొత్త ఈవీఎంల కొనుగోలు
న్యూఢిల్లీ: ఎన్నికల సంఘం ప్రతిపాదనల మేరకు 2019 సార్వత్రిక ఎన్నికలకోసం 14 లక్షల కొత్త ఈవీఎం(ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు)లను కొనాలని మంత్రుల బృందం నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆ బృందం సిఫార్సులు చేసింది. వీటికోసం రూ.5,000 కోట్ల రూపాయలను ఖర్చుపెట్టనున్నారు. ఈ మంత్రుల బృందానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహించారు. 2015-16 నుంచి 2018-19 మధ్య దశలవారీగా వీటిని కొంటారు. ప్రస్తుతం వినియోగంలో ఉన్నవాటిలో 9 లక్షలకు పైగా ఈవీఎంలు 2019 ఎన్నికల నాటికి పనికిరావు. ఈవీఎంలను బెంగళూరులోని బీఈఎల్, హైదరాబాద్‌లోని ఈసీఐఎల్లు తయారుచేస్తాయి. -
‘వీవీప్యాట్’ను రూపొందించిన ఈసీఐఎల్
* ఈవీఎంలతో పాటు పక్కనే వీవీప్యాట్ పరికరాల ఏర్పాటు * ఖమ్మం, వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రయోగాత్మకంగా వినియోగం * ఓటింగ్‌లో పారదర్శకత దిశగా ఈసీ తొలిమెట్టు * వీవీప్యాట్ పనితీరును వివరించిన ఈసీఐఎల్ సీఎండీ సుధాకర్ హైదరాబాద్: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఈవీఎం)పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి పారదర్శకంగా, విశ్వసనీయంగా ఎన్నికల ప్రకియ జరిగేలా.. ఓటరు సంతృప్తి చెందేలా ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్) ప్రింటింగ్ యంత్రాన్ని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) రూపొందించింది. శుక్రవారం ఈసీఐఎల్ కార్యాలయంలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పి.సుధాకర్ వీవీప్యాట్ పనితీరును మీడియాకు వివరించారు. ఇటీవల ఓటర్లు తాను ఓటు వేసిన అభ్యర్థికే ఓటు నమోదైందా? లేదా? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారని, వీటిని నివృత్తి చేసేందుకే వీవీప్యాట్‌ను రూపొందించామని తెలిపారు. దీనిని ఓటింగ్ యంత్రంతో పాటు ఉంచుతామని, ఓటరు ఓటు వేసిన వెంటనే తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థి పేరు, గుర్తు వీవీప్యాట్ పరికరంలోని స్క్రీన్‌పై కొన్ని క్షణాల పాటు కనిపిస్తుందని, ఆ వివరాలు ప్రింట్ మాదిరిగా అందులోనే నిక్షిప్తమవుతాయని వివరించారు. దీనివల్ల ఓటరుకు తాను ఎంపిక చేసుకున్న అభ్యర్థికే ఓటు వేశానన్న సంతృప్తి కలగడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తినా మ్యానువల్‌గా ఓట్లను లెక్కించే సౌలభ్యం ఉంటుందన్నారు. ఒక్కో యంత్రం లో 1,500 ఓట్లను నమోదు చేసే సామర్థ్యం ఉంటుందన్నారు. 2014లో జరిగిన స్థానిక ఎన్నికల్లో కొన్నిచోట్ల.. బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లోనూ ప్రయోగాత్మకంగా వినియోగించినట్లు తెలిపారు. తాజాగా వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో వీటిని వినియోగించాలని ఎన్నికల కమిషన్ భావిస్తోందని, ఇప్పటికే 40కిపైగా వీవీప్యాట్ యంత్రాలను ఖమ్మం పంపించామని చెప్పా రు. 2019 సాధారణ ఎన్నికలకల్లా దేశవ్యాప్తంగా వీటిని వినియోగంలోకి తీసుకువచ్చేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశాలు లేవని, కొన్ని పరికరాలను అమర్చితే ట్యాంపరింగ్ చేయవచ్చనేది అపోహ మాత్రమే అని సుధాకర్ స్పష్టం చేశారు. అనేక రకాల సందేహాలు తమ దృష్టికి వచ్చిన సందర్భంలో వాటిని నివృత్తి చేస్తూ వస్తున్నామని, ఇక భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా వీవీప్యాట్ దోహదపడుతుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డైరక్టర్ ఫైనాన్స్ కిశోర్ రుంగ్టా, డైరక్టర్ పర్సనల్ వీఎస్ బంగారుబాబు, ఈవీఎం డివిజన్ హెడ్ మహేంద్రన్, ఇన్స్ట్రుమెంట్ డివిజన్ జీఎం అనురాగ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఖమ్మం ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లు
హైదరాబాద్ : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల పనితీరుకు సంబంధించి పలు అనుమానాలు, ఫిర్యాదులు వెల్లువెత్తున్న నేపధ్యంలో ఈసారి ఎన్నికల్లో ఈవీఎంలకు ప్రింటర్లను ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ప్రయోగాత్మకంగా ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలలో 35 డివిజన్లలో ప్రింటర్లతో కూడిన ఏవీఎంల ద్వారా ఓటింగ్ అమలు చేయాలని ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఈవీఎంలలో ఓటర్లు ఓటు వేయగానే రశీదులు వచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. -
ఈవీఎంలు సిద్ధం
కుషాయిగూడ: గ్రేటర్ ఎన్నికలకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్(ఈవీఎం)లను సిద్ధం చేసినట్లు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి 2న జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్న విషయం విదితమే. 7,790 పోలింగ్ కేంద్రాలకు గాను 9,370 ఈవీఎంలు సిద్ధం చేశారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అవసరమైన అన్ని రకాల పరీక్షలు ఇప్పటికే పూర్తైట్లు తెలిపారు. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా పరిష్కరించేందుకు సాంకేతిక నిపుణుల బృందాన్ని అందుబాటులో ఉంచామన్నారు. ఆపేక్స్ లెవల్ అధికారితో పాటు అనుభవం ఉన్న ఆఫీసర్, ఐదు సర్కిళ్ల చొప్పున ఒక సీనియర్ అధికారి, ప్రతి డివిజన్‌కు అనుభవజ్ఞులైన ఇద్దరు ఇంజినీర్లను నియమించారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెప్పారు. ఈసీఐఎల్ ప్రస్థానంలో ఈవీఎంల రూపకల్పన మైలురాయిగా మిగిలిపోతుందని సంస్థ ప్రతినిధులు పేర్కొంటున్నారు. -
‘స్థానికం’లోనూ ఈవీఎంలు
మొదటిసారి ప్రయోగాత్మకంగా అమలుకు కసరత్తు వచ్చే నెల జిల్లాలో ఖాళీగా ఉన్న పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సీఈఓ, డీపీఓ సమావేశం నల్లగొండ: స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి సారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (ఈవీఎం) వినియోగించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సిన సర్పంచ్ స్థానాలు-13, జెడ్పీటీసీ-1, ఎంపీటీసీ-1, వార్డులు-46 ఉన్నాయి. దీంట్లో నకిరేకల్ పంచాయతీ రిజర్వేషన్ ఎటూ తేలకపోవడంతో ఎన్నికల జాబితాలో ఆ గ్రామ పంచాయతీని చేర్చలేదు. అదే విధంగా బొమ్మలరామారం మండలం కంచల్ తండాలో సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలోనే ఓటింగ్ ఉంటుంది. ఈ రెండు మినహా మిగిలిన 11 సర్పంచ్ స్థానాలకు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ రెండు స్థానాలకు ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ఈవీఎంల వాడకం ఈ ఎన్నికల్లో విజయవంతమైతే రా బోయే రోజుల్లో ఈవీఎంల సహాయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒక్కో ఈవీఎం సామర్థ్యం 12 వందల ఓట్లుకాగా.. ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నందున 650 ఓట్లకు ఒక ఈవీఎం చొప్పున ఏర్పాటు చేయనున్నారు. సర్పంచ్ స్థానాలకు 33 ఈవీఎంలు అవసరంగా కాగా అదనంగా మరో 18 ఈవీఎంలను అందుబాటులో ఉంచనున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 42 ఈవీఎంలు అవసరం కాగా.. అదనంగా 18 ఈవీఎంలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవీఎంల పనితీరును పరిశీలించేందుకు జూన్ మొదటి వారంలో ఈసీఎల్ కంపెనీకి చెందిన సాంకేతి నిపుణులు జిల్లాకు రానున్నారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగానే బ్యాలెట్ పత్రాలను ముద్రించేందుకు ఆర్డర్లు ఇవ్వనున్నారు. -
రెండు బూత్‌లలో రీ-పోలింగ్
సాక్షి, న్యూఢిల్లీ: రోహతాస్‌నగర్, ఢిల్లీ కంటోన్మెంట్ పరిధిలోని రెండు పోలింగ్ బూత్‌లలో సోమవారం రీ-పోలింగ్ జరిగింది. శనివారం విధానసభ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున ఈ రెండు పోలింగ్ బూత్‌లలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు సరిగ్గా పనిచేయలేదని గుర్తించిన ఎన్నికల అధికారులు అక్కడ రీ-పోలింగ్ జరిపించాలని నిర్ణయించారు. తూర్పు ఢిల్లీలోని రోహతాస్‌నగర్‌లో ఉన్న 132 నంబరు పోలింగ్ బూత్‌లో మాక్ పోలింగ్ డేటాను తొలగించలేదని, ఢిల్లీ కంటోన్మెంట్‌లోని డీఐడీ లైన్స్ ఏరియాలోని 31వ నంబరు పోలింగ్ బూత్‌లో ఓటింగ్ యంత్రంలో సమస్య కారణంగా పరిశీలకుని నివేదిక సరిగ్గా నమోదుకాలేదని అధికారులు గుర్తించారు. దీంతో ఈ రెండు పోలింగ్ బూత్‌లలో సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు రీ-పోలింగ్ నిర్వహించారు.