ఈవీఎం ప్రొడక్షన్స్ .... సరికొత్త చిత్రం!
ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు మన ఎన్నికల ప్రక్రియను పూర్తిగా మార్చేశాయి. రిగ్గింగ్, బూత్ కబ్జాలకు దాదాపు మంగళం పాడేశాయి. ఈ సారి మొత్తం దేశంలో 17 లక్షల ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలు ఉపయోగించబోతున్నారు. గత లోకసభ ఎన్నికల కంటే 12 శాతం ఎక్కువన్న మాట. ఈ ఈవీఎంలే లేకపోతే బ్యాలెట్ పేపర్ల ముద్రణకు దాదాపు 7700 మెట్రిక్ టన్నుల కాగితం ఖర్చయ్యేది.
ఈ ఓటింగ్ యంత్రాల గురించి కొన్ని విశేషాలుః
ఈవీఎంలు ఎప్పుడు తయారయ్యాయి?
ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను మన దేశంలో మొట్టమొదటగా 1989-90 లో తయారు చేశారు. అనేక ప్రయోగాలు, పరీక్షల తరువాత వాటిని ప్రస్తుతం మనంచూస్తున్న రూపంలోకి తీసుకువచ్చారు. మొట్టమొదటగా ఈవీఎంలను తయారు చేసింది హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో. ఒక యంత్రం ఖరీదు దాదాపు 5500 రూపాయలు ఉంటుంది. అంటే కాగితం బ్యాలెట్లు, బాలెట్ బాక్సులకయ్యే ఖర్చు కన్నా చాలా తక్కువ అన్న మాట!
తొలిసారి ఎప్పుడు ఉపయోగించారు?
ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలను మన దేశంలో మొట్టమొదటిసారి 1998లో ఉపయోగించారు. ఆ సంవత్సరం రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదహారు నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా వాడారు. ఆ తరువాత క్రమేపీ దేశమంతటా వాటిని విస్తరించారు.
ఈ వీ ఎం లో ఎన్ని ఓట్లు రికార్డు చేయొచ్చు?
ఒక ఈవీఎం 3840 ఓట్లను రికార్డు చేయగలుగుతుంది. మామూలుగా ఒక పోలింగ్ బూత్ లో పదిహేనువందల ఓట్లు ఉంటాయి. కాబట్టి ఒక బూత్ కి ఒక ఈవీఎం సరిపోతుంది.
ఈవీఎం లో అత్యధికంగా ఎంతమంది అభ్యర్థుల ఓట్లు నమోదు చేయొచ్చు?
ఒక ఈవీఎంలో 16 మంది అభ్యర్థుల ఓట్లను హాయిగా ఎలాంటి ఇబ్బందీ లేకుండా నమోదు చేయవచ్చు. అయితే చిన్నపాటి మార్పుల చేస్తే దాదాపు 64 మంది అభ్యర్థుల వోట్లను రికార్డు చేయడానికి వీలుంటుంది. 64 మంది అభ్యర్థులను దాటితే మాత్రం పాత పద్ధతిలో కాగితం బ్యాలెట్ పత్రాలను ఉపయోగించాల్సిందే.
కరెంట్ లేకపోతే ఈవీఎంలు పనిచేస్తాయా?
కరెంటు లేకపోయినా ఈవీఎంలు పనిచేస్తాయి. ఈవీఎంలు 6 వోల్టుల బ్యాటరీపై పనిచేస్తుంది. కాబట్టి కరెంటు పోయినా, అసలే కరెంటు లేకపోయినా అది హాయిగా పనిచేస్తుంది. అలాగే ఒక యంత్రం ఏదైనా కారణం వల్ల పనిచేయకపోతే, ఉపయోగించేందుకు అధికారుల వద్ద ఇంకొన్ని ఈవీఎంలు ఉంటాయి. వాటిని వాడవచ్చు.