One Nation One Election: జమిలి ఎన్నికలకు 30 లక్షల ఈవీఎంలు కావాలి | One Nation One Election: EC will require around 30 lakh EVMs, 1. 5-year preparation | Sakshi
Sakshi News home page

One Nation One Election: జమిలి ఎన్నికలకు 30 లక్షల ఈవీఎంలు కావాలి

Published Sat, Oct 28 2023 4:43 AM | Last Updated on Sat, Oct 28 2023 4:43 AM

One Nation One Election: EC will require around 30 lakh EVMs, 1. 5-year preparation - Sakshi

న్యూఢిల్లీ:  దేశవ్యాప్తంగా లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటే 30 లక్షల ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు(ఈవీఎంలు) అవసరమని అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే జమిలి ఎన్నికలకు సన్నాహాలు పూర్తిచేయడానికి దాదాపు ఏడాదిన్నర సమయం కావాలని పేర్కొన్నాయి. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశంలో చర్చ జరుగుతోంది.

లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్ర లా కమిషన్‌ ప్రస్తుతం జమిలి ఎన్నికల అంశంపై కసరత్తు చేస్తోంది. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎంలు ఎన్నికావాలి? ఎంత సమయం అవసరం? అన్నదానిపై ఎన్నికల సంఘం అధికారులు లా కమిషన్‌కు కొన్ని నెలల క్రితం సమాచారం ఇచి్చనట్లు తెలుస్తోంది. ఒక్కో ఈవీఎంలో భాగంగా ఒక కంట్రోల్‌ యూనిట్, ఒక బ్యాలెట్‌ యూనిట్, ఒక వీవీప్యాట్‌ ఉంటాయి.

జమిలి ఎన్నికలకు 30 లక్షల కంట్రోల్‌ యూనిట్లు, 43 లక్షల బ్యాలెట్‌ యూనిట్లు, 32 లక్షల వీవీప్యాట్లు కావాలని చెబుతున్నారు. కొన్ని బ్యాలెట్‌ యూనిట్లు, వీవీప్యాట్లను రిజర్వ్‌లో ఉంచాల్సి ఉంటుంది కాబట్టి అదనంగా అవసరమని పేర్కొంటున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికలు నిర్వహిస్తే కంట్రోల్‌ యూనిట్లు, బ్యాలెట్‌ యూనిట్లు, వీవీప్యాట్లు కలిపి దాదాపు 35 లక్షల ఓటింగ్‌ యూనిట్లను కొత్తగా సమకూర్చుకోవాల్సి ఉంటుందని సమాచారం.  

12.50 లక్షల పోలింగ్‌ కేంద్రాలు  
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగినప్పటికీ రెండు ఓట్లు వేర్వేరుగా వేయాల్సి ఉంటుంది. అందుకు రెండు ఈవీఎంలు కావాలి. జమిలి ఎన్నికల్లో ఓటింగ్‌ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రపర్చడానికి తగిన వసతులు ఉండాలని ఎన్నికల సంఘం పేర్కొంది. గత లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 12.50 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ ఎన్నికల్లో 15 లక్షల కంట్రోల్‌ యూనిట్లు, 15 లక్షల వీవీప్యాట్లు, 18 లక్షల బ్యాలెట్‌ యూనిట్లు ఉపయోగించారు. అన్నీ కలిపి కోటి యూనిట్లు కొనుగోలు చేయాలంటే రూ.15,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అంచనా. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలతోపాటు మున్సిపాల్టీలు, పంచాయతీల ఎన్నికలు నిర్వహించడంపై(ఒక దేశం, ఒకే ఎన్నిక) మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం కొనసాగిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement