Law Commission: 2029 నుంచే జమిలి ఎన్నికలు! | Law Commission: Jamili elections from 2029 | Sakshi
Sakshi News home page

Law Commission: 2029 నుంచే జమిలి ఎన్నికలు!

Published Sat, Sep 30 2023 6:30 AM | Last Updated on Sat, Sep 30 2023 6:30 AM

Law Commission: Jamili elections from 2029 - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. జమిలి ఎన్నికలు వచ్చే ఏడాది సాధ్యం కాదని లా కమిషన్‌ తేలి్చచెప్పినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై జస్టిస్‌ రితూరాజ్‌ అవస్థీ నేతృత్వంలోని లా కమిషన్‌ అధ్యయనం చేస్తోంది.

2029 నుంచి లోక్‌సభతోపాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా కమిషన్‌ ఓ ఫార్ములాను ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. దాని ప్రకారం.. కొన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని పొడిగించాలి. మరికొన్ని రాష్ట్రాల శాసనసభల కాలపరిమితిని తగ్గించాలి. ఈ ఫార్ములాతోజమిలి ఎన్నికలు నిర్వహించడం సులువేనని లా కమిషన్‌ నిర్ణయానికి వచి్చనట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని సైతం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  

ఉమ్మడి ఓటర్ల జాబితాతో మేలు  
ఓటర్ల జాబితా విషయంలోనూ లా కమిషన్‌ కీలక సిఫార్సును తెరపైకి తీసుకొస్తోంది. లోక్‌సభ, శాసనసభలు, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రస్తుతం వేర్వేరు ఓటర్ల జాబితాలను ఉపయోగిస్తున్నారు. వీటిని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రాల ఎన్నికల సంఘాలు రూపొందిస్తున్నాయి. అన్ని రకాల ఎన్నిలకు ఒక ఉమ్మడి ఓటర్ల జాబితా ఉండాలన్నదే లా కమిషన్‌ ఉద్దేశమని సమాచారం. దీనివల్ల ఖర్చు, మానవ వనరుల వినియోగం గణనీయంగా తగ్గుతాయని అభిప్రాయపడుతోంది.

ఉమ్మడి ఎన్నికల జాబితా కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని చెబుతోంది. జమిలి ఎన్నికల ప్రక్రియలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు పోలింగ్‌ బూత్‌కు కేవలం ఒకే ఒక్కసారి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని లా కమిషన్‌ సూచిస్తోంది. అంటే ఒకే పోలింగ్‌ బూత్‌లో ఒకేసారి రెండు ఎన్నికల్లో ఓట్లు వేసేలా ఏర్పాట్లు ఉండాలని చెబుతోంది. జమిలి ఎన్నికలపై లా కమిషన్‌ సిఫార్సులు కొన్ని అనధికారికంగా బయటకు వచి్చనప్పటికీ తుది నివేదిక ఇంకా సిద్ధం కాలేదు. ఇంకా కొన్ని అంశాలపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.   

ఏడాది వ్యవధిలో రెండు దశలు   
లోక్‌సభ, శాసనసభలతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధ్యయనం బాధ్యతను రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీకి కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. లా కమిషన్‌ మాత్రం ఏకకాలంలో లోక్‌సభ, శాసనసభల ఎన్నికలు నిర్వహించడంపై అధ్యయనం చేస్తోంది. కోవింద్‌ కమిటీ ఏర్పాటు నేపథ్యంలో లా కమిషన్‌ కూడా మూడు రకాల ఎన్నికలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. లోక్‌సభ, శాసనసభల ఎన్నికలను ఒక దశలో, స్థానిక సంస్థల ఎన్నికలను రెండో దశలో నిర్వహించాలని లా కమిషన్‌ అభిప్రాయపడుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement