సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు వాటిని లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు.
భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు. 20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది.
ఆ సదుపాయమూ ఉంది
జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏదైనా రాష్ట్ర శాసనసభకు లోక్‌సభతో పాటుగా ఎన్నికలు జరపలేని పరిస్థితి ఎదురైతే ఎలా అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సదరు అసెంబ్లీకి లోక్‌సభ అనంతరం ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇందుకు వీలు కల్పిస్తూ బిల్లులో సెక్షన్ 2, సబ్ క్లాజ్ 5లో నిబంధన పొందుపరిచారు.
Comments
Please login to add a commentAdd a comment