
న్యూఢిల్లీ: తన వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేయడంతో తనకు తాను అమెరికాను వీడిన భారత్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థిని రంజినీ శ్రీనివాస్.. కొలంబియా యూనివర్శిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లు పాటు పని చేసినందుకు తనకు ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొలంబియా యూనివర్శిటీ నుంచి ఈ తరహా ఉద్వాసన ఊహించలేదని, కానీ అది జరిగిందంటూ ఆమె అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈనెల రెండో వారంలో ఆమెపై పలు ఆరోపణలతో అమెరికా వీసా రద్దు చేయడంతో,.. స్వచ్ఛందంగా అమెరికాను వీడారు. గత డిసెంబర్ లో ఆమె వీసా రెన్యువల్ అయిన నెలల వ్యవధిలోనే దాన్ని రద్దు చేయడంపై ఆమె కలత చెందారు. అదే సమయంలో కెనడాకు వెళ్లిపోయారు రంజినీ శ్రీనివాసన్. దీనిలో భాగంగా తాజాగా ఆమె మాట్లాడుతూ..
ఊహించలేదు.. కానీ జరిగింది..
‘కొలంబియా యూనివర్శిటీలో ఐదేళ్లు ఉన్నాను. అక్కడ పని చేస్తూ నా పీహెచ్ డీని పూర్తి చేసే పనిలో ఉన్నా. కానీ ఇలా జరిగింది. నేను దీన్ని ఊహించలేదు. కొన్నిసార్లు అక్కడ వారానికి వంద గంటలు పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంతటి ద్రోహాన్ని అస్సలు ఊహించనే లేదు’ అని అంతర్జాతీయ మీడియా ఏఐ జజీరాకుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే పీహెచ్ డీ పూర్తి కావడానికి సంబంధించిన తతంగాన్ని కొలంబియా యూనివర్శిటీ పూర్తి చేస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. యూఎస్ కు మళ్లీ వెళ్లే అవసరం లేదన్న రంజినీ శ్రీనివాసన్.. ఆ సంస్థ తనకు అర్హత ఇవ్వడం ఇప్పుడు ఒక లాంఛనప్రాయం మాత్రమే అని పేర్కొంది.
నేను అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు..
‘నా పీహెచ్‌డీకి సంబంధించిన అన్ని అర్హతలు పూర్తయ్యాయి, ఇంకా మిగిలి ఉన్నవి, దాని కోసం నేను అమెరికాలో ఉండాల్సిన అవసరం లేదు" అని ఆమె చెప్పింది, దీన్ని కొలంబియా పూర్తి చేయాలని, ఈ విషయాన్ని సదరు యూనివర్శిటీకి చెప్పడానికి యత్నిస్తున్నట్లు ఆమె తెలిపారు.
పాలస్తీనాకు మద్దతిచ్చారనే వీసా రద్దు
కాగా, భారత పౌరురాలు, కొలంబియా విశ్వవిద్యాలయ విద్యార్థిని రంజినీ శ్రీనివాసన్ వీసాను అమెరికా ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆమె పాలస్తీనాకు అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలపై వీసాను రద్దు చేశారు. అయితే, రంజినీ శ్రీనివాసన్ హింసకు మద్దతు ఇచ్చారనేందుకు వారి వద్ద ఏ ఆధారాలు ఉన్నాయో అధికారులు మాత్రం చెప్పలేదు.
ఇదిలా ఉండగా.. గతేదాడి పాలస్తీనా-ఇజ్రాయెల్ దాడుల సందర్బంగా పాలస్తీనాకు అనుకూలంగా కొలంబియా యూనివర్సిటీలో నిరసనలు చేపట్టిన విదేశీయులపై ట్రంప్ సర్కార్ ఫోకస్ పెట్టింది. వారిని అమెరికా నుంచి బహిష్కరించాలని, వారిపై చర్యలు తీసుకునేందుకు ప్లాన్ చేస్తోందని అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ నివేదించింది. ఇందులో భాగంగానే పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.