సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన రాజ్యాంగ (129 సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024లను ప్రవేశ పెట్టడానికి జరిగిన ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మద్దతివ్వగా ఎంఐఎం పార్టీ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. ఒకే దేశం–ఒకే ఎన్నికలకు సంబంధించి తెచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ పార్టీలకు చెందిన ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.
ఈ సందర్భంగా టీడీపీ తరఫున కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘దేశమంతా ఒకే దశలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలను నిర్వహించాలనుకుంటోన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి ‘ఏకకాల ఎన్నికలతో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ రాష్ట్రానికి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నందున మాకు పెద్దగా సమస్యలు లేవు’ అన్నారు.
ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తుంది: ఒవైసీ
జమిలి ఎన్నికల బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇది స్వయం పాలన హక్కును, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది. ఫెడరలిజం సూత్రాలను ఉల్లంఘిస్తోంది. ఈ తరహా చట్టంతో రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలకు వస్తాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం. దీనిని ఆమోదించే సామర్థ్యం పార్లమెంటుకు లేదు. రాష్ట్రపతి తరహా ప్రజాస్వామ్యం కోసం నేరుగా ఈ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీస్తుంది. చివరగా ఈ బిల్లును కేవలం అత్యున్నత నాయకుడి అహాన్ని సంతృప్తి పరచడానికే తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment