ఇక ప్రజా క్షేత్రంలోకే! | KCR Supports Jamili Elections Adilabad | Sakshi
Sakshi News home page

ఇక ప్రజా క్షేత్రంలోకే!

Published Sun, Aug 12 2018 10:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

KCR Supports Jamili Elections Adilabad - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటికే ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ గడువుకు ముందే శాసనసభను రద్దు చేసి ఎన్నికలకు వెళుతుందన్న సంకేతాలను కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులకు ఇచ్చేశారు. వచ్చే డిసెంబర్‌లో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటే దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరపాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ యోచిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. ఒకవైపు పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసుకుంటూనే మరోవైపు ప్రజల్లోకి వెళ్లి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అన్ని ప్రధాన పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

అధికార టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోగా, వర్గపోరుతో ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటన తరువాత కార్యక్షేత్రంలోకి దూకాలని నిర్ణయించుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఈనెల 17 నుంచి 26 వరకు గ్రామ గ్రామాన బైక్‌ర్యాలీలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. వైఎస్సార్‌సీపీ నాయకులు సింగరేణి కార్మి కులు, నిరుద్యోగులు లక్ష్యంగా అధికార టీఆర్‌ఎస్‌ ఎన్నికల హామీలపై పోరుబాట పట్టింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో ఉనికినే కోల్పోయిన తెలుగుదేశం పార్టీ పొత్తు కోసం కాంగ్రెస్‌ వైపు ఆశగా చూస్తోంది. ప్రొఫెసర్‌ కోదండరాం పార్టీ టీజేఎస్, పవన్‌కల్యాణ్‌ జనసేనతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయజెండా ఆవిష్కరణల్లో పాల్గొని పార్టీ పతాకాలను కూడా ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పంతో ఆయా రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.

ప్రభుత్వ పథకాలే ప్రచారాస్త్రాలుగా...
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల అధికార యంత్రాంగం చేస్తున్న హ డావుడితో ఇప్పటికే గ్రామాల్లో చర్చ మొదలైనప్పటికీ... ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలకు చేరువగా వెళ్లడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 15న జాతీ య జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలతో ఎంపిక చేసుకొన్న గ్రామాల్లో పర్యటించేందుకు పది ని యోజకవర్గాల శాసనసభ్యులు సిద్ధమవుతున్నా రు. కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఈనెలలోనే మిషన్‌ భగీరథ నీటి సరఫరా, రైతుబంధు, రైతుబీమా పథకాలు, గొర్రెలు, బర్రెల పంపిణీ వంటి పథకాల గురించి తామే ప్రజలకు వివరించాలనే ప్రయత్నంలో ఉన్నారు.

మంత్రులు అల్లోళ్ల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ఉమ్మడి జిల్లా కార్యక్రమాల్లో పాల్గొంటూనే తమ నియోజకవర్గంలో పెండింగ్‌ పనులు పూర్తి చేసేందుకు చొరవ చూపుతున్నారు. ప్రభుత్వ విప్, చెన్నూర్‌ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు నియోజకవర్గానికే పరి మితమయ్యారు. కాగజ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్‌ పర్యటన తరువాత సిర్పూర్, ఆసిఫాబాద్‌లలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి జోష్‌ పెం చారు. మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్‌.దివాకర్‌రావు తనకు పట్టున్న గ్రామాలతో పాటు పట్టణంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. బోథ్‌లో బాపూరావు, ము ధోల్‌లో విఠల్‌రెడ్డి, ఖానాపూర్‌లో రేఖానాయక్‌ సైతం ఎక్కువగా నియోజకవర్గ పరిధిలోనే సమయాన్ని కేటాయిస్తూ, వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.

రాహుల్‌గాంధీ పర్యటన తరువాత  కాంగ్రెస్‌..
ఈనెల 13, 14 తేదీల్లో రాష్ట్రంలో పర్యటించనున్న రాహుల్‌గాంధీకి ప్రజాదరణ లభిస్తుందని భావి స్తున్న కాంగ్రెస్‌ నాయకులు ఆ మైలేజీని ఉపయోగించుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కె.ప్రేంసాగర్‌రావు గ్రూపులుగా విడిపోయిన నియోజకవర్గ నేతలు ఇప్పట్లో కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లే దు. కానీ ఎన్నికల సమయంలో టిక్కెట్లకు ప్రజ ల్లో ఉన్న ఆదరణను కొలమానంగా పరిగణిస్తామ ని రాహుల్‌గాంధీ చెపుతున్న మాటలతో క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలో ఎన్ని గ్రూపులున్నా... విడివిడిగానైనా ప్రజల్లోకి వెళ్తే తప్ప భవిష్యత్తులో మంచి ఫలితాలు లభించవనే నిర్ణయానికి వచ్చిన నాయకులు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

మహేశ్వర్‌రెడ్డి ఈ మేరకు తన వర్గం నాయకులకు కచ్చితమైన సూచనలు చేసినట్లు సమాచారం. మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, బోథ్, చె న్నూర్, సిర్పూర్‌లపై ప్రేంసాగర్‌రావు వర్గం ప్రధానంగా దృష్టి పెట్టి కార్యక్షేత్రంలోకి దిగాలని భావి స్తోంది. అదే సమయంలో శక్తియాప్‌నకు విస్తృత ప్రచారం తీసుకువచ్చేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు. యాప్‌ ద్వారా పార్టీ సభ్యత్వం ఇ ప్పించే ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్నా రు. మంచిర్యాలలో మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు వర్గాలు విడివిడిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నా యి. ఇదే పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉంది.

17 నుంచి బైక్‌యాత్రలతో బీజేపీ..
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, పట్టణాల్లో పార్టీ సానుభూతిపరులకు కొదువ లేకున్నా... ప్రజాదరణ పొందలేకపోతున్న బీజేపీ సైతం గ్రా మాల బాట పట్టాలని నిర్ణయించుకుంది. ఈనెల 17 నుంచి 26వ తేదీ వరకు గ్రామ గ్రామాన బైక్‌ ర్యాలీలతో కేంద్ర ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని మంచిర్యాల, భైంసా, నిర్మల్, ఆదిలాబాద్‌ పట్టణాల్లో తమకున్న బలాన్ని పెంచుకోవడంతో పాటు గ్రామాల్లో కూడా పార్టీని పరిపుష్టం చేయాలనే ఆలోచనతో జిల్లా పార్టీల అధ్యక్షులు ఉన్నారు.

ఈ మేరకు రాష్ట్ర నాయకత్వం నుంచి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు అందాయి. అలాగే మోదీ పిలుపు మేరకు ఆన్‌లైన్‌ ద్వారా పార్టీ సభ్యత్వాలు తీసుకున్న వారి వివరాల ఆధారంగా వారి ఇళ్లకు వెళ్లి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమాన్ని కూడా చేయబోతున్నారు. బైక్‌ర్యాలీ తరువాత ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం చేపడుతున్నట్లు మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు ముల్కల్ల మల్లారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మంచిర్యాలలోనే 26వేల సభ్యత్వం ఆన్‌లైన్‌ ద్వారా తీసుకున్నట్లు తెలిపారు.
 
ఉద్యోగాల కోసం వైఎస్సార్‌సీపీ   ఉద్యమాలు
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ పోరుబాట పట్టింది. సింగరేణి ఎన్నికల సమయంలో వారసత్వ ఉద్యోగాల కోసం ఉద్యమించిన ఈ పార్టీ నాయకులు ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడాలని నిర్ణయించారు. మంచిర్యాలలో శనివారం చేపట్టిన నిరుద్యోగుల సంతకాల సేకరణ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమం చేపడుతున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజ్జంకి అనిల్‌ ‘సాక్షి’కి తెలిపారు.

పొత్తు కోసం ‘తమ్ముళ్ల’ ఆరాటం
తెలంగాణ ఉద్యమంతో మసకబారి రాష్ట్ర ఆవి ర్భావం తరువాత కనుమరుగయ్యే స్థితికి చేరిన తెలుగుదేశం పార్టీ కొత్తగా కాంగ్రెస్‌ పొత్తు కోసం ఎదురుచూస్తోంది. ఈ పార్టీలో మిగిలిన కొద్దిపాటి నాయకులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొత్తులో రెండు సీట్లు అయినా సాధించుకొని పోటీ చేయాలనే యోచనతో ఉన్నారు. మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాల్లోని ఒకటి లేదా రెండు సీట్లపైన నాయకులు ఆశగా ఉన్నట్లు సమాచారం.

ప్రజాదరణకు దూరంగా టీజేఎస్‌..
ప్రొఫెసర్‌ కోదండరాం ఏర్పాటు చేసిన తెలంగాణ జన సమితి ఉమ్మడి జిల్లాలో జనంలోకి వెళ్లలేకపోతోంది. టీజేఎస్‌ మీద నమ్మకంతో అధికార పార్టీని కాదని వచ్చిన కాసిపేట ఎంపీపీ శంకరమ్మ అవిశ్వాసం నుంచి తప్పించుకొని ఇటీవలే కాంగ్రెస్‌ గూటికి చేరారు. చెన్నూర్, బెల్లంపల్లిలో పార్టీ సానుభూతిపరులు ఉన్నప్పటికీ, ఎలాంటి కార్యక్రమాలు లేక ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా ఉమ్మడి జిల్లాలో ఒకటో అరో సీట్లు లభించకపోతాయా అనే ఆలోచనతో నాయకులున్నారు.

సీపీఐ పరిస్థితి కూడా అదే. బెల్లంపల్లిలో గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన గుండా మల్లేష్‌కు పొత్తులో మరోసారి టిక్కెట్టు లభిస్తుందని ఆపార్టీ నాయకులు భావిస్తున్నారు. సీపీఎం ఇప్పటివరకు పోటీ, పొత్తుల విషయంలో స్పష్టత ఇవ్వలేదు. కాగా ప్రజా సమస్యలపై ఈ రెండు కమ్యూనిస్టు పార్టీలకు తోడు సీపీఐఎంఎల్‌ (న్యూ డెమోక్రసీ) కూడా ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. సినీహీరో పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీ ఇప్పటివరకు సామాజిక మాధ్యమాలకే పరిమితమవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement