
కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. లోక్‌సభకు, శాసన సభలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించే విషయం చర్చించడానికి మోదీ గత వారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 40 పార్టీలను ఆహ్వానిస్తే, 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మెజారీటీ పార్టీలు జమిలి ఎన్నికలకు సానుకూలత వ్యక్తం చేసినా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలనీ ఆ సమావేశం నిర్ణయించింది. నిజానికి జమిలి ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. 20 ఏళ్ల క్రితమే బీజేపీ–ఆరెస్సెస్‌లు ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన చేశాయి. అటల్ బిహారీ వాజపేయి హయాంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది. అప్పటి లా కమిషన్ కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది.
70వ దశకం వరకు ....
మన దేశంలో 1951 నుంచి 1967 వరకు లోక్‌సభ, శాసన సభలకు ఇంచుమించు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. రాష్ట్రాల పునర్విభజన జరగడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గడువు కంటే ముందే రద్దవడం వంటి కారణాల వల్ల లోక్‌సభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల శాతం తగ్గుతూ వచ్చింది.1970వ దశకం నుంచి జమిలి ఎన్నికలు దాదాపుగా జరగలేదనే చెప్పాలి. అయితే, 1990లలో బీజేపీ ఎన్నికల్లో బలం పుంజుకోవడంతో జమిలి ఎన్నికల ప్రతిపాదన బలపడుతూ వచ్చింది. అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,టీఆర్‌ఎస్ జమిలి ఎన్నికలను సమర్థిస్తోంటే, సీపీఐ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాయి. 2017 నుంచి మోదీ జమిలి ఎన్నికల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనం జరగాలని ఈ ఏడాది జనవరిలో మోదీ సూచించారు.
ఇవీ అవరోధాలు
జమిలి ఎన్నికలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. దానికి పార్లమెంటులో మూడొంతుల మెజారిటీ, సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో కూడా త్వరలో మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తే ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు ఉండవని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ కారణం చేతనయినా ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవి ఖాళీ అయినా, ప్రభుత్వం కూలిపోయినా గడువు వరకు వాటికి ఎన్నికలు జరిపే అవకాశం ఉండదంటున్నారు. ఈ విధానంతో ఖర్చు తగ్గుతుందని, రాజకీయ కక్షలు తగ్గుతాయని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయంటున్నారు.