one nation-one election
-
మద్దతిచ్చిన వైఎస్సార్సీపీ, టీడీపీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన రాజ్యాంగ (129 సవరణ) బిల్లు–2024, కేంద్ర పాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024లను ప్రవేశ పెట్టడానికి జరిగిన ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మద్దతివ్వగా ఎంఐఎం పార్టీ ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. ఒకే దేశం–ఒకే ఎన్నికలకు సంబంధించి తెచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌లో టీడీపీ, వైఎస్సార్సీపీ పార్టీలకు చెందిన ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఈ సందర్భంగా టీడీపీ తరఫున కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘దేశమంతా ఒకే దశలో అసెంబ్లీ, లోక్‌సభకు ఎన్నికలను నిర్వహించాలనుకుంటోన్న కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అని అన్నారు. జాతీయ మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి ‘ఏకకాల ఎన్నికలతో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ రాష్ట్రానికి కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తున్నందున మాకు పెద్దగా సమస్యలు లేవు’ అన్నారు. ప్రాంతీయ పార్టీలను దెబ్బతీస్తుంది: ఒవైసీజమిలి ఎన్నికల బిల్లును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇది స్వయం పాలన హక్కును, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోంది. ఫెడరలిజం సూత్రాలను ఉల్లంఘిస్తోంది. ఈ తరహా చట్టంతో రాష్ట్రాల అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలకు వస్తాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం. దీనిని ఆమోదించే సామర్థ్యం పార్లమెంటుకు లేదు. రాష్ట్రపతి తరహా ప్రజాస్వామ్యం కోసం నేరుగా ఈ బిల్లు తీసుకొచ్చారు. ఈ బిల్లు దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీల ఉనికిని దెబ్బతీస్తుంది. చివరగా ఈ బిల్లును కేవలం అత్యున్నత నాయకుడి అహాన్ని సంతృప్తి పరచడానికే తీసుకొచ్చారు’ అని పేర్కొన్నారు. -
నేడు లోక్‌సభలో జమిలి బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లు–2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లు–2024ను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు వాటిని లోక్‌సభ బిజినెస్ జాబితాలో చేర్చారు. ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’కు సంబంధించిన ఈ బిల్లులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ లోక్‌సభలో ప్రవేశ పెడతారని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. అనంతరం విస్తృత సంప్రదింపులకు వీలుగా బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు పంపాల్సిందిగా స్పీకర్‌ను మంత్రి అభ్యర్థించవచ్చని వివరించాయి. ఇందుకు వీలుగా కమిటీకి చైర్మన్, సభ్యులను స్పీకర్ నియమిస్తారు. సంఖ్యాబలం ఆధారంగా పార్టీలకు అందులో స్థానం కల్పిస్తారు. బీజేపీ ఎంపీల్లో ఒకరిని చైర్మన్‌గా ఎంపిక చేయనున్నారు. భాగస్వామ్య పక్షాలందరితో చర్చించిన మీదట కమిటీ 90 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే గడువు పొడిగిస్తారు. 20వ తేదీతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నందున జమిలి బిల్లులను మంగళవారమే ప్రవేశపెట్టనున్నట్టు జాతీయ మీడియా కూడా పేర్కొంది. జమిలి ఎన్నికలకు 32 పార్టీలు మద్దతివ్వగా 15 పార్టీలు వ్యతిరేకించినట్టు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ వెల్లడించింది.ఆ సదుపాయమూ ఉందిజమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఏదైనా రాష్ట్ర శాసనసభకు లోక్‌సభతో పాటుగా ఎన్నికలు జరపలేని పరిస్థితి ఎదురైతే ఎలా అన్న సందేహాలూ తలెత్తుతున్నాయి. అలాంటప్పుడు ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు సదరు అసెంబ్లీకి లోక్‌సభ అనంతరం ఎన్నికలు నిర్వహించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇందుకు వీలు కల్పిస్తూ బిల్లులో సెక్షన్ 2, సబ్ క్లాజ్ 5లో నిబంధన పొందుపరిచారు. -
‘ఒక దేశం-ఒకే ఎన్నిక’కు కేంద్ర కేబినెట్ పచ్చజెండా... రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు ఆమోదం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
Mamata Banerjee: జమిలి ఎన్నికలను అంగీకరించం
కోల్‌కతా: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానాన్ని తాము అంగీకరించబోమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. మన దేశ సమాఖ్య నిర్మాణం ప్రకారం ’ఒక దేశం– ఒకే ఎన్నిక’ ఆలోచన ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల విధానం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కార్యదర్శి డాక్టర్ నితేన్ చంద్రకు ఈ మేరకు మమతా బెనర్జీ లేఖ రాశారు. ఈ అంశాన్ని హేతుబద్ధతతో పరిశీలించాలని ఆమె ఎన్నిల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘జమిలి ఎన్నికల యోచన సమాఖ్య నిర్మాణ కోణంలో చూస్తే సాధ్యం కాదు, ఆమోద యోగ్యం కాదు. సరైన విధానం కూడా కాదు. అందుకే, నేను ఈ విధానాన్ని ఆచరణాత్మక కోణంలో అంగీకరించను. ఈ అంశాన్ని చాలా చాలా హేతుబద్ధంగా ప్రత్యేకంగా పరిశీలించాలని కూడా భారత ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాను’అని ఆమె గురువారం సెక్రటేరియట్ వద్ద విలేకరుల సమావేశంలో అన్నారు. ‘ఇది కేవలం టీఎంసీ అభిప్రాయం మాత్రమే కాదు, ఇండియా కూటమి పార్టీలది కూడా. ఈ యోచనను పరిశీలించేటప్పుడు కేంద్ర, రాష్ట్ర విధానాలు, కేంద్రం, రాష్ట్ర నిర్మాణాలు వంటి వాటిని కూడా చూడాలి’అని ఆమె పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలపాలంటూ రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. -
జమిలి ఎన్నికలు... కోవింద్ కమిటీకి 5,000 సూచనలు
న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో ఏర్పాటైన ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటిదాకా 5,000 పై చిలుకు సలహాలు, సూచనలు అందినట్టు సమాచారం. కమిటీ దీనిపై గతవారం సలహాలను ఆహా్వనించడం తెలిసిందే. జనవరి 15 దాకా అందే సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. గత సెపె్టంబర్లో ఏర్పాటైన కోవింద్ కమిటీ ఇప్పటిదాకా రెండుసార్లు సమావేశమైంది. జమిలి ఎన్నికలపై సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ ఆరు జాతీయ, 33 గుర్తింపు పొందిన పారీ్టలకు లేఖలు రాసింది. లా కమిషన్‌తో సమావేశమై అభిప్రాయాలను తెలుసుకుంది. జమిలి ప్రతిపాదనను, కోవింద్ కమిటీ ఏర్పాటును కాంగ్రెస్, పలు ఇతర విపక్షాలు ఇప్పటికే తీవ్రంగా వ్యతిరేకించడం తెలిసిందే. -
One Nation, One Poll: జమిలి ఎన్నికలు...కోవింద్‌తో లా కమిషన్ భేటీ
న్యూఢిల్లీ: ‘ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు’ అంశంపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలోని ఉన్నత స్థాయి కమిటీతో కేంద్ర లా కమిషన్ బుధవారం భేటీ అయింది. లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు రాజ్యాంగానికి చేయాల్సిన సవరణలు తదితరాలతో కూడిన రోడ్ మ్యాప్‌ను కమిటీ ముందు ఉంచింది. లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాలను పరిశీలించాల్సిందిగా లా కమిషన్‌ను కేంద్ర న్యాయ శాఖ ఇప్పటికే పురమాయింది. వాటితో పాటు మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికలను ఒకేసారి జరిపే సాధ్యాసాధ్యాల పరిశీలన బాధ్యతను కోవింద్ కమిటీకి అప్పగించింది. ఈ అంశంపై లా కమిషన్ రూపొందిస్తున్న నివేదిక ఇంకా తుది రూపు సంతరించుకోవాల్సి ఉందని సమాచారం. ఒక దేశం–ఒకేసారి ఎన్నికలు అంశంపై అభిప్రాయాలు, సూచనలు 3 నెలల్లో చెప్పాలంటూ రాజకీయ పార్టీలకు కోవింద్ కమిటీ తాజాగా లేఖలు రాసింది. ఆరు జాతీయ పార్టీలు, 33 రాష్ట్ర పార్టీలు, ఏడు నమోదైన గుర్తింపు లేని పార్టీలకు లేఖలు వెళ్లాయి. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల పదవీకాలాలను పొడిగించడం, తగ్గించడం వంటి చర్యల ద్వారా 2029లో వాటికి సైతం లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిపేందుకు అవసరమైన విధాన రూపకల్పనలో లా కమిషన్ ప్రస్తుతం తలమునకలైంది. -
జమిలి ఎన్నికలు.. కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన మాజీ ఉప రాష్ట్రపతి
హైదరాబాద్: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలన్న కేంద్ర నిర్ణయాన్ని సమర్ధించారు భారత్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అలా కాకుండా తరచుగా ఎన్నికలు జరుగుతూ ఉంటే దానివలన దేశప్రగతికి నష్టం వాటిల్లుతుందని అన్నారు. ఈ సందర్బంగా ఇండియా పేరును భారత్ అని మార్చడంలో కూడా తప్పులేదని అన్నారు. ప్రయోజనకరమే.. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తరచుగా ఎన్నికలు జరగడం వలన ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతుందని, ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు నిర్వహిస్తే ఖజానాపై ఖర్చు భారం తగ్గుతుందని అన్నారు. ఎన్నికల కమిషన్, లా కమిషన్, పార్లమెంట్ ష్టాండింగ్ కమిటీ అభిప్రాయాలు సిఫారసుల ప్రకారం ఒకే దేశం ఒకే ఎన్నికల సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం మంచిదని అన్నారు. 1971 వరకు దేశంలో ఒకే ఎన్నికలు ఉండేవని తర్వాతి కాలంలో వివిధ కారణాల వలన ఈ ప్రక్రియకు తెరపడిందన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలి.. ప్రజాస్వామ్యంలో అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అభిప్రాయభేదాలు ఏర్పడవచ్చు. కానీ చర్చల ద్వారా ఏకాభిప్రాయం సాధించుకుని ముందుకు సాగాలని అన్నారు. చట్టసభ్యులు పార్టీలను ఫిరాయించడంపై ఆయన మాట్లాడుతూ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని సవరించాలని అన్నారు. తరచూ ఎన్నికలు జరగడం వలన ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నిరనలు తీసుకోలేవని తెలిపారు. ఇక ఇండియా పేరును భారత్‌గా మార్చడంపై అందులో తప్పేమీ లేదని ఆ పేరు ఎప్పటినుంచో వాడకంలోనే ఉందని అన్నారు. ఇది కూడా చదవండి: మీరు వద్దనుకుంటే పాకిస్తాన్‌కు ఇండియా పేరు పెట్టుకుంటాం -
‘జమిలి’ ఆలోచనకు 20 ఏళ్లు
కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది. లోక్‌సభకు, శాసన సభలకు ఒకే సారి ఎన్నికలు నిర్వహించే విషయం చర్చించడానికి మోదీ గత వారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 40 పార్టీలను ఆహ్వానిస్తే, 21 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. మెజారీటీ పార్టీలు జమిలి ఎన్నికలకు సానుకూలత వ్యక్తం చేసినా కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయాలనీ ఆ సమావేశం నిర్ణయించింది. నిజానికి జమిలి ఎన్నికల ఆలోచన ఇప్పటిది కాదు. 20 ఏళ్ల క్రితమే బీజేపీ–ఆరెస్సెస్‌లు ఒకే దేశం ఒకే ఎన్నిక ఆలోచన చేశాయి. అటల్ బిహారీ వాజపేయి హయాంలో దీనిపై విస్తృత చర్చ జరిగింది. అప్పటి లా కమిషన్ కూడా ఇందుకు సానుకూలత వ్యక్తం చేసింది. 70వ దశకం వరకు .... మన దేశంలో 1951 నుంచి 1967 వరకు లోక్‌సభ, శాసన సభలకు ఇంచుమించు ఒకేసారి ఎన్నికలు జరిగేవి. రాష్ట్రాల పునర్విభజన జరగడం, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గడువు కంటే ముందే రద్దవడం వంటి కారణాల వల్ల లోక్‌సభతో పాటు ఎన్నికలు జరిగే రాష్ట్రాల శాతం తగ్గుతూ వచ్చింది.1970వ దశకం నుంచి జమిలి ఎన్నికలు దాదాపుగా జరగలేదనే చెప్పాలి. అయితే, 1990లలో బీజేపీ ఎన్నికల్లో బలం పుంజుకోవడంతో జమిలి ఎన్నికల ప్రతిపాదన బలపడుతూ వచ్చింది. అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ,టీఆర్ఎస్ జమిలి ఎన్నికలను సమర్థిస్తోంటే, సీపీఐ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తున్నాయి. 2017 నుంచి మోదీ జమిలి ఎన్నికల గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనం జరగాలని ఈ ఏడాది జనవరిలో మోదీ సూచించారు. ఇవీ అవరోధాలు జమిలి ఎన్నికలు అమల్లోకి రావాలంటే రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది. దానికి పార్లమెంటులో మూడొంతుల మెజారిటీ, సగం రాష్ట్రాల ఆమోదం అవసరం. ప్రస్తుతం లోక్‌సభలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది. రాజ్యసభలో కూడా త్వరలో మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తే ఉప ఎన్నికలు, మధ్యంతర ఎన్నికలు ఉండవని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ కారణం చేతనయినా ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవి ఖాళీ అయినా, ప్రభుత్వం కూలిపోయినా గడువు వరకు వాటికి ఎన్నికలు జరిపే అవకాశం ఉండదంటున్నారు. ఈ విధానంతో ఖర్చు తగ్గుతుందని, రాజకీయ కక్షలు తగ్గుతాయని, సంక్షేమ పథకాలు కొనసాగుతాయంటున్నారు. -
జమిలి ఎన్నికలు.. ఆ తర్వాతే తుది నిర్ణయం: రాజ్‌నాథ్
ఢిల్లీ: సీపీఎం, సీపీఐ, ఎంఐఎం మినహా దాదాపు అన్ని పార్టీలు ఒకే దేశం- ఒకేసారి ఎన్నికల అంశానికి మద్ధతు తెలిపాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో అఖిల పక్ష సమావేశం జరిగింది. సమావేశం అనంతరం రాజ్‌నాథ్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంపై ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారని అన్నారు. నిర్ధిష్ట కాల పరిమితిలో కమిటీ నివేదిక ఇస్తుందని స్పష్టం చేశారు. కమిటీలో ఎవరెవరు ఉంటారో ప్రధాని నిర్ణయిస్తారని వివరించారు. సభ సజావుగా కొనసాగడానికి అందరూ అంగీకరించారని, చర్చల ద్వారానే అన్ని అంశాలు పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. నీటి సంరక్షణ, మహాత్మాగాంధీ 150వ జయంతి కార్యక్రమాలపై చర్చ జరిగిందని వెల్లడించారు. స్వాతంత్ర్య సమరంలో మహాత్మాగాంధీ ఎంత ముఖ్యంగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ప్రధానమైన వ్యక్తిగా బాపూజీని గౌరవిస్తున్నామని చెప్పారు. వివిధ పార్టీల అధ్యక్షులు వెనకబడిన జిల్లాలకు మరో 10 శాతం నిధులు పెంచాలని కోరినట్లు తెలిపారు. స్వచ్ఛత అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. అన్ని రాజకీయ పార్టీలను విశ్వాసంలోకి తీసుకునే తుది నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. -
‘జమిలి’పై భేటీకి మమత డుమ్మా
న్యూఢిల్లీ/కోల్‌కతా: జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై జరిగే 19వ తేదీన జరిగే సమావేశానికి పంపిన ఆహ్వానాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిరస్కరించగా కాంగ్రెస్, మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు. ఏక కాలంలో ఎన్నికలతోపాటు కీలకమైన అంశాలపై చర్చించేందుకు జరిగే ఈ సమావేశానికి లోక్‌సభ, రాజ్యసభల్లో కనీసం ఒక సభ్యుడున్న అన్ని రాజకీయ పార్టీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. మహాత్మాగాంధీ 150వ వర్థంతి, 2022లో జరిగే 75వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు.హడావుడిగా ఇలా సమావేశం జరపడం కంటే ఏకకాలంలో ఎన్నికలపై ముందుగా శ్వేతపత్రం విడుదల చేసి, పార్టీలు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషికి మంగళవారం మమత లేఖ రాశారు. అలా చేసినప్పుడే చాలా కీలకమైన ఈ అంశంపై తాము నిర్దిష్టమైన సలహాలు ఇవ్వగలుగుతామన్నారు. సాధారణ ఎన్నికల అనంతరం అధికార టీఎంసీని వీడి బీజేపీలో చేరిన నేతలపై సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. పార్టీ మారిన వారంతా అత్యాశపరులు, అవినీతిపరులని, ఆ చెత్తను బీజేపీ ఏరుకుంటోందని వ్యాఖ్యానించారు. ఇంకా ఎవరైనా వెళ్లాలనే ఆలోచనలో ఉంటే అలాంటి వారు తొందరగా వెళ్లిపోవాలని కోరారు.. కాగా, ఈ సమావేశంలో పాల్గొనే అంశంపై చర్చించేందుకు బుధవారం ఉదయం సమావేశం కావాలని కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల నేతలు నిర్ణయించారు. ప్రజాధనం ఆదా చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికలను ఒకేసారి జరపడం మేలంటూ గత ఆగస్టులో లా కమిషన్ సిఫారసు చేసింది. కాగా, ఎన్నికల్లో బీజేపీ 303 ఎంపీలతో అతిపెద్ద పార్టీగా అవతరించగా వరుసగా కాంగ్రెస్ (52), డీఎంకే (23), వైఎస్ఆర్ కాంగ్రెస్(22), టీఎంసీ(22) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. -
సాగు సంక్షోభం .. నిరుద్యోగం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ఎన్నికలు, నిరుద్యోగం, సాగు సంక్షోభం, కరువు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలను ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తింది. జమ్మూ కశ్మీర్లో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు కేంద్రం నిర్వహించిన ఈ భేటీలో.. ఈ అంశాలన్నిటినీ పార్లమెంటులో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది ఇప్పటికీ ఒక సైద్ధాంతిక పోరాటమేనని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ ఎంపీలు అధీర్ రంజన్ చౌదరి, కె.సురేష్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రీన్ తదితరులు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని కూడా విపక్షాలు గట్టిగా ప్రస్తావించాయి. కాగా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని టీఎంసీ నేతలు సుదీప్ బంద్యోపాధ్యాయ్, ఒబ్రీన్లు నొక్కిచెప్పారు. అదే సమయంలో సమాఖ్యవాదం బలహీనపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ..రాష్ట్రాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం ఆమోదనీయం కాదని విపక్షాలు స్పష్టం చేశాయి. ‘అధికారంలోకి వచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందించాం. ఇది సైద్ధాంతిక పోరాటం, గతంలోనూ సైద్ధాంతిక పోరాటమే. సైద్ధాంతిక పోరాటంగానే ఉంటుంది కూడా..’ అని ప్రభుత్వానికి చెప్పినట్లు సమావేశం తర్వాత ఆజాద్ విలేకరులకు తెలిపారు. లౌకిక శక్తులకు కాంగ్రెస్ పార్టీ పునాది వంటిదని, ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఆ స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. అధికారంలో లేకపోయినా రైతులు, కార్మికులు, మహిళల అభ్యున్నతికి కృషి కొనసాగిస్తామని అన్నారు. దేశంలో భారీ నిరుద్యోగిత, కరువు పరిస్థితులు, సాగు సమస్యలు, తాగునీటి కొరత వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ‘పత్రికా స్వేచ్ఛ గురించి కూడా లేవనెత్తాం. జర్నలిస్టుల విషయంలో అధికార పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావించాం. వారిని కొడుతున్నారు. వారి గొంతును అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని ఖండిస్తూ ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం..’ అని ఆజాద్ తెలిపారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన అవసరం లేదని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదన్నారు. ఎన్నికలకు రాష్ట్రాల నిధులు, బ్యాలెట్ పేపర్ల వంటి ఎన్నికల సంస్కరణలను టీఎంసీ లేవనెత్తింది. ప్రతిదానికీ ఆర్డినెన్సును ఉపయోగించడాన్ని కూడా టీఎంసీ ప్రస్తావించింది. దురదృష్టవశాత్తూ 16వ లోక్‌సభలో గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దానిని మితిమీరి ఉపయోగించారని బంద్యోపాధ్యాయ, ఒబ్రీన్ చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీ ఫలప్రదం: మోదీ ‘ఎన్నికల ఫలితాల తర్వాత, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఒక ఫలప్రదమైన అఖిలపక్ష భేటీ జరిగింది. విలువైన సూచనలిచ్చిన నేతలకు కృతజ్ఞుడినై ఉంటా’ అంటూ అఖిలపక్ష భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, అలాగే ఎన్డీయే భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగాయి. బడ్జెట్, ట్రిపుల్ తలాక్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా పదిహేడవ లోక్‌సభ మొదటి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం, ట్రిపుల్ తలాక్ వంటి ఇతర కీలక చట్టాలు ప్రభుత్వ ఎజెండాలో అగ్రభాగాన ఉండనున్నాయి. మొదటి రెండురోజులు సభ్యుల ప్రమాణ స్వీకారానికి వినియోగిస్తారు. 19న స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరుసటి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జూలై 5న బడ్జెట్ ప్రవేశ పెడతారు. 26 వరకు సమావేశాలు కొనసాగుతాయి. జూన్ 20 నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఏపీ ఎంపీల ప్రమాణస్వీకారం సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ వీరితో ప్రమాణం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీల ప్రమాణస్వీకారం సోమవారం మధ్యాహ్నానికి పూర్తికానుంది. అక్షర క్రమంలో మొదటగా అండమాన్ నికోబార్ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికెన వైఎస్సార్సీపీ ఎంపీలందరూ సోమవారం ఉదయం వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నివాసంలో భేటీ కానున్నారు. -
లోక్‌సభతోపాటు 11 రాష్ట్రాలకూ ఎన్నికలు!
న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికలతోపాటే 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మార్పును అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు పార్టీ వర్గాలంటున్నాయి. జమిలీ ఎన్నికలకు తాము సిద్ధమేనంటూ న్యాయ కమిషన్‌కు పార్టీ చీఫ్ అమిత్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ పరిణామాలకు ప్రాధాన్యత ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏడాదిన్నరలోపు ఎన్నికలు జరిగే (మహారాష్ట్ర, హరియాణా, జార్ఖండ్) రాష్ట్రాలకు కూడా 2019లో ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ చూస్తోంది. బిహార్ అసెంబ్లీకి 2020లో ఎన్నికలు జరగనున్నాయి. జేడీయూ బీజేపీ ఆలోచనకు మద్దతు తెలుపుతుండటంతో.. బిహార్‌ను ఈ జాబితాలో కలుపుతారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మిజోరంలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని భావిస్తున్నారు. అధిష్టానంతోపాటు పార్టీలోనూ ఒకేసారి ఎన్నికలు జరపడం ద్వారా మోదీ హవా.. రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ ప్రతిబింబిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను ఎదుర్కొనవచ్చని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య వ్యతిరేకమని విమర్శిస్తున్నాయి. ఏకకాల ఎన్నికలకు బీజేపీ మద్దతు దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరపాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అధికార బీజేపీ మద్దతు ప్రకటించింది. ఈ విధానం వల్ల ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని, దేశమంతా ఏడాది పొడవునా ఎన్నికల వాతావరణం ఉండకుండా చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా న్యాయ కమిషన్‌కు లేఖ రాశారు. ఈ లేఖను సోమవారం పార్టీ నేతలు లా కమిషన్‌కు అందజేశారు. ఏకకాలంలో ఎన్నికలు ఆలోచన మాత్రమే కాదు. ఆచరించదగింది కూడా అని పేర్కొన్నారు. రెండు దఫాలుగా ఎన్నికలు జరపడం వల్ల దేశ సమాఖ్య విధానం మరింత బలోపేతం అవుతుందని లేఖలో షా తెలిపారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధమే లేదన్నారు. తరచూ ఎన్నికలు పెడితే ఎన్నికల నియమావళి అమలవుతుందని, ఆ క్రమంలో అభివృద్ధి కార్యక్రమాలకు, విధాన నిర్ణయాలకు అవరోధం కలుగుతుందని తెలిపారు. ఏకకాల ఎన్నికలపై ప్రతిపక్షాల వ్యతిరేకత రాజకీయపరమైనదిగా కనిపిస్తోందన్నారు. అధికార ఎన్డీఏ పక్షంతోపాటు అకాలీదళ్, ఏఐఏడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, టీఆర్ఎస్ ఏకకాల ఎన్నికలను సమర్ధించగా, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, టీడీపీ, జేడీఎస్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. -
జమిలి ఎన్నికలకు సై : వైఎస్సార్ సీపీ
సాక్షి, న్యూఢిల్లీ : ఒకే దేశం-ఒకే ఎన్నికలను(జమిలి ఎన్నికలు) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమర్ధిస్తోందని పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు, అభివృద్ధి దృష్ట్యానే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. మంగళవారం లా కమిషన్‌తో పార్టీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సమావేశమయ్యారు. జమిలి ఎన్నికలను ఉద్దేశించి పార్టీ తరఫున తొమ్మిది పేజీల సూచనలను సమర్పించారు. సమావేశ అనంతరం విజయసాయి రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉమ్మడి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు కొత్తేమి కాదని అన్నారు. 2004 నుంచి 2014 వరకూ ఏపీలో ఎన్నికలు అలానే జరుగుతూ వస్తున్నాయని చెప్పారు. జమిలి ఎన్నికలను వైఎస్సార్ సీపీ సమర్ధిస్తోందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు, అవినీతి బాగా తగ్గుతుందని, అప్పుడే ఓటుకు కోట్లు లాంటి కేసులు పునరావృతం కావని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల నిరోధక చట్టం.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు చేయాలని లా కమిషన్‌కు సూచించినట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఫిరాయింపుల చట్టాన్ని వినియోగించి స్పీకర్ తన విధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఫిరాయింపుల విషయంలో అనర్హత వేసే అధికారం నుంచి స్పీకర్‌ను తప్పించి, ఆ స్థానంలో ఎన్నికల కమిషన్‌కు పవర్ ఇవ్వాలని, అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణ చేయాలని కోరినట్లు వివరించారు. జమిలి ఎన్నికలతో జాతీయ పార్టీలకే అధిక లాభం చేకూరుతుందని అన్నారు. ప్రాంతీయ పార్టీల మనుగడ దెబ్బతినకుండా వాటికి స్పష్టమైన భరోసా ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ముందుగా లోక్‌సభ లేదా అసెంబ్లీ రద్దయితే ఏం చేస్తారని లా కమిషన్‌ను ప్రశ్నించగా.. రద్దు అయిన కాలానికి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని కమిషన్ సభ్యులు చెప్పారని వివరించారు. జమిలి ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించి ఏకాభిప్రాయ సాధన చేయాలని కోరినట్లు తెలిపారు. బీజేపీకి మద్దతు ఇవ్వం.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి మద్దుతు ఇచ్చే ప్రసక్తే లేదని విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ, దాని తరఫు మిత్ర పక్షాలకూ మద్దతు ఇవ్వబోమని వివరించారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను బీజేపీ మోసం చేసినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇస్తారనే ఆశతోనే ఆనాడు రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తరఫు అభ్యర్థికి మద్దుతు ఇచ్చామని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. హోదా విషయంలో వైఎస్సార్ సీపీ ఏనాడు రాజీపడలేదని గుర్తు చేశారు. 2014 నుంచి హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్ సీపీనే అని పేర్కొన్నారు. -
జమిలి ఎన్నికలపై అఖిలేష్..
సాక్షి, లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘ఒక దేశం..ఒక ఎన్నిక’ నినాదాన్ని యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమర్థించారు. 2019 లోక్‌సభ ఎన్నికలతోనే జమిలి ఎన్నికలకు తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల కోసం క్షేత్రస్ధాయిలో ప్రజలతో సత్సంబంధాలు పెంచుకోవాలని అఖిలేష్ పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. మరోవైపు పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలన్న ప్రధాని మోదీ ప్రతిపాదనను యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సైతం ఇటీవల సమర్ధించారు. లోక్‌సభకు యూపీ నుంచే అత్యధిక సభ్యులు ప్రాతినిథ్యం వహిస్తున్న నేపథ్యంలో యోగి మద్దతు ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమేనంటూ యూపీ రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా నివేదికను సైతం రూపొందించినట్టు సమాచారం. యోగి సర్కార్ మరో నాలుగేళ్లు అధికారంలో కొనసాగనున్న క్రమంలో 2019లో అసెంబ్లీ ఎన్నికలు రాష్ట్రం సంసిద్ధంగా ఉందని ఈ నివేదికలో పొందుపరిచినట్టు సమాచారం. 2019లోనే జమిలి ఎన్నికలకు శ్రీకారం చుట్టాలని బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోందనే ఆందోళన విపక్షాల్లో వ్యక్తమవుతోంది. మోదీ సర్కార్‌పై పెరుగుతున్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఎత్తుగడకు బీజేపీ పదును పెడుతున్నట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు, విపక్షాలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నిమగ్నమైతే వాటి మధ్య ఐక్యతకు గండికొట్టవచ్చన్నది బీజేపీ వ్యూహంగా ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పట్ల వివిధ వర్గాల్లో పెరుగుతున్న అసంతృప్తితో బీజేపీ ఈ దిశగా కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు భావిస్తున్నారు. -
చంద్రబాబు ఇలా.. చినబాబు అలా..
అమరావతి: జమిలి ఎన్నికలను స్వాగతిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ఒక దేశం-ఒక ఎన్నిక’ను స్వాగతిస్తున్నానని అన్నారు. ప్రతి మూడు నెలలకోసారి ఎన్నికలు జరగడం సరికాదని అభిప్రాయపడ్డారు. దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ పార్టీల ఆధితప్యం పెరుగుతుందన్న వాదనలో వాస్తవం లేదన్నారు. ప్రజలకు ఎవరు మంచిచేస్తే వారే గెలుస్తారని చెప్పారు. గతంలో తనను ఎవరూ ఓడించలేదని, ఏదో చేద్దామన్న తొందరలో కొన్ని తప్పిదాలు జరిగిపోయాయని చెప్పుకొచ్చారు. కాగా, దేశంలో ఏక కాలంలో ఎన్నికలు సాధ్యంకావని చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ నిన్న వ్యాఖ్యానించారు. ఏడాది ముందు ఎన్నికలంటే ఏ రాష్ట్రం ఒప్పుకోదని, ఆరు నెలల ముందంటే ఒప్పుకునే అవకాశముందని అన్నారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదన్నారు.