సాగు సంక్షోభం .. నిరుద్యోగం | At all-party meet chaired by PM Modi, unemployment, farmer distress | Sakshi
Sakshi News home page

సాగు సంక్షోభం .. నిరుద్యోగం

Published Mon, Jun 17 2019 3:52 AM | Last Updated on Mon, Jun 17 2019 4:56 AM

At all-party meet chaired by PM Modi, unemployment, farmer distress - Sakshi

అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మోదీ, రాజ్‌నాథ్, ప్రహ్లాద్‌ జోషి, గులాం నబీ ఆజాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల ఎంపీలు నామా నాగేశ్వరరావు, కేశవరావు, మిథున్‌రెడ్డి తదితరులు

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌ ఎన్నికలు, నిరుద్యోగం, సాగు సంక్షోభం, కరువు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలను ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా లేవనెత్తింది. జమ్మూ కశ్మీర్‌లో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరింది. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలకు ఒకరోజు ముందు కేంద్రం నిర్వహించిన ఈ భేటీలో.. ఈ అంశాలన్నిటినీ పార్లమెంటులో చర్చించాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఇది ఇప్పటికీ ఒక సైద్ధాంతిక పోరాటమేనని కాంగ్రెస్‌ పేర్కొంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్‌ ఎంపీలు అధీర్‌ రంజన్‌ చౌదరి, కె.సురేష్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఒబ్రీన్‌ తదితరులు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు అంశాన్ని కూడా విపక్షాలు గట్టిగా ప్రస్తావించాయి. కాగా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని టీఎంసీ నేతలు సుదీప్‌ బంద్యోపాధ్యాయ్, ఒబ్రీన్‌లు నొక్కిచెప్పారు. అదే సమయంలో సమాఖ్యవాదం బలహీనపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ..రాష్ట్రాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్‌ చేయడం ఆమోదనీయం కాదని విపక్షాలు స్పష్టం చేశాయి. ‘అధికారంలోకి వచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందించాం.

ఇది సైద్ధాంతిక పోరాటం, గతంలోనూ సైద్ధాంతిక పోరాటమే. సైద్ధాంతిక పోరాటంగానే ఉంటుంది కూడా..’ అని ప్రభుత్వానికి చెప్పినట్లు సమావేశం తర్వాత ఆజాద్‌ విలేకరులకు తెలిపారు. లౌకిక శక్తులకు కాంగ్రెస్‌ పార్టీ పునాది వంటిదని, ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఆ స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. అధికారంలో లేకపోయినా రైతులు, కార్మికులు, మహిళల అభ్యున్నతికి కృషి కొనసాగిస్తామని అన్నారు. దేశంలో భారీ నిరుద్యోగిత, కరువు పరిస్థితులు, సాగు సమస్యలు, తాగునీటి కొరత వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ‘పత్రికా స్వేచ్ఛ గురించి కూడా లేవనెత్తాం. జర్నలిస్టుల విషయంలో అధికార పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావించాం. వారిని కొడుతున్నారు. వారి గొంతును అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

దీనిని ఖండిస్తూ ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం..’ అని ఆజాద్‌ తెలిపారు. కశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన అవసరం లేదని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదన్నారు. ఎన్నికలకు రాష్ట్రాల నిధులు, బ్యాలెట్‌ పేపర్ల వంటి ఎన్నికల సంస్కరణలను టీఎంసీ లేవనెత్తింది. ప్రతిదానికీ ఆర్డినెన్సును ఉపయోగించడాన్ని కూడా టీఎంసీ ప్రస్తావించింది.  దురదృష్టవశాత్తూ 16వ లోక్‌సభలో గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దానిని మితిమీరి ఉపయోగించారని బంద్యోపాధ్యాయ, ఒబ్రీన్‌ చెప్పారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు.

అఖిలపక్ష భేటీ ఫలప్రదం: మోదీ
‘ఎన్నికల ఫలితాల తర్వాత, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఒక ఫలప్రదమైన అఖిలపక్ష భేటీ జరిగింది. విలువైన సూచనలిచ్చిన నేతలకు కృతజ్ఞుడినై ఉంటా’ అంటూ అఖిలపక్ష భేటీ అనంతరం మోదీ ట్వీట్‌ చేశారు. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, అలాగే ఎన్డీయే భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగాయి.

బడ్జెట్, ట్రిపుల్‌ తలాక్‌ ప్రభుత్వ ప్రధాన ఎజెండా
పదిహేడవ లోక్‌సభ మొదటి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం, ట్రిపుల్‌ తలాక్‌ వంటి ఇతర కీలక చట్టాలు ప్రభుత్వ ఎజెండాలో అగ్రభాగాన ఉండనున్నాయి. మొదటి రెండురోజులు సభ్యుల ప్రమాణ స్వీకారానికి వినియోగిస్తారు. 19న స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. మరుసటి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జూలై 5న బడ్జెట్‌ ప్రవేశ పెడతారు. 26 వరకు సమావేశాలు కొనసాగుతాయి. జూన్‌ 20 నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

నేడు ఏపీ ఎంపీల ప్రమాణస్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్‌ వీరేంద్ర కుమార్‌  వీరితో ప్రమాణం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి గెలిచిన ఎంపీల ప్రమాణస్వీకారం సోమవారం మధ్యాహ్నానికి పూర్తికానుంది. అక్షర క్రమంలో మొదటగా అండమాన్‌ నికోబార్‌ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేస్తారు.   ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎన్నికెన వైఎస్సార్‌సీపీ ఎంపీలందరూ సోమవారం ఉదయం వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నివాసంలో భేటీ కానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement