కోల్‌కతా: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానాన్ని తాము అంగీకరించబోమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. మన దేశ సమాఖ్య నిర్మాణం ప్రకారం ’ఒక దేశం– ఒకే ఎన్నిక’ ఆలోచన ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల విధానం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కార్యదర్శి డాక్టర్ నితేన్ చంద్రకు ఈ మేరకు మమతా బెనర్జీ లేఖ రాశారు.
ఈ అంశాన్ని హేతుబద్ధతతో పరిశీలించాలని ఆమె ఎన్నిల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘జమిలి ఎన్నికల యోచన సమాఖ్య నిర్మాణ కోణంలో చూస్తే సాధ్యం కాదు, ఆమోద యోగ్యం కాదు. సరైన విధానం కూడా కాదు. అందుకే, నేను ఈ విధానాన్ని ఆచరణాత్మక కోణంలో అంగీకరించను. ఈ అంశాన్ని చాలా చాలా హేతుబద్ధంగా ప్రత్యేకంగా పరిశీలించాలని కూడా భారత ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాను’అని ఆమె గురువారం సెక్రటేరియట్ వద్ద విలేకరుల సమావేశంలో అన్నారు.
‘ఇది కేవలం టీఎంసీ అభిప్రాయం మాత్రమే కాదు, ఇండియా కూటమి పార్టీలది కూడా. ఈ యోచనను పరిశీలించేటప్పుడు కేంద్ర, రాష్ట్ర విధానాలు, కేంద్రం, రాష్ట్ర నిర్మాణాలు వంటి వాటిని కూడా చూడాలి’అని ఆమె పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలపాలంటూ రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment