not acceptable
-
Supreme Court Of India: వయసు నిర్ధారణకు ‘ఆధార్’ ప్రామాణికం కాదు
న్యూఢిల్లీ: వయసు నిర్ధారణకు ఆధార కార్డు ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పరిహారం నిమిత్తం రోడ్డు ప్రమాద మృతుడి వయసును నిర్ధారించడానికి ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవచ్చని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఆధార్ కార్డును బట్టి కాకుండా పాఠశాల టీసీలో పేర్కొన్న తేదీని పుట్టిన తేదీగా పరిగణించాలని జువెనైల్ జస్టిస్ యాక్ట్–2015 టీసీలో పేర్కొన్న తేదీకి చట్టపరమైన గుర్తింపునిస్తోందని తెలిపింది. ‘ఆధార్ గుర్తింపు కార్డుగా పనికొస్తుందే తప్ప పుట్టినతేదీని నిర్ధారించడానికి కాదని దాన్ని జారీచేసే యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా 2023లో సర్క్యులర్ ద్వారా స్పష్టం చేసింది’ అని జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం పేర్కొంది. 2015లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి మోటర్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ రూ. 19.35 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. మృతుడి వయసును టీసీ ఆధారంగా లెక్కించి (45 ఏళ్లు) పరిహారాన్ని గణించింది. పంజాబ్– హరియా ణా హైకోర్టు ఆధార్ కార్డు ఆధారంగా వయసును గణించి (47 ఏళ్లుగా) పరిహారాన్ని రూ. 9.22 లక్షలకు తగ్గించింది. దీన్ని బాధిత కుటుంబం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా వయసు నిర్ధారణకు ఆధార్ కార్డును ప్రామా ణికంగా పరిగణించలేమని సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు ఇచ్చింది. -
ఉమ్మడి పౌరస్మృతి ఆమోదయోగ్యం కాదు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి ముస్లింలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పేర్కొంది. ముస్లిం పర్సనల్ లా విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని తేలి్చచెప్పింది. ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి మాట్లాడుతూ ‘లౌకిక పౌరస్మృతి’ తేవాల్సిన అవసరం ఉందన్న విషయం తెలిసిందే. మతపరమైన పౌరస్మృతిగా పర్సనల్ చట్టాలను మోదీ అభివర్ణించడంపై ముస్లిం బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. లౌకిక పౌరస్మృతి పక్కా ప్రణాళికతో కూడిన కుట్రని, తీవ్ర విపరిణామాలుంటాయని ముస్లిం బోర్డు అధికార ప్రతినిధి ఎస్.క్యూ.ఆర్.ఇలియాస్ అన్నారు. -
క్రిప్టోలను కరెన్సీగా గుర్తించం..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలపై భారత్ విధానం మారబోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కరెన్సీలను ప్రభుత్వం లేదా సెంట్రల్ బ్యాంకులే జారీ చేయాలే తప్ప క్రిప్టోలను కరెన్సీగా గుర్తించే ప్రసక్తే లేదన్నారు. ఇటువంటి అసెట్స్‌ను నియంత్రించే దిశగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ రూపొందించే అంశాన్ని జీ20 కూటమి పరిశీలిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, ప్రపంచ మార్కెట్లు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నా దేశీయంగా స్టాక్ మార్కెట్ స్థిరంగానే వ్యవహరిస్తోందని ఆమె పేర్కొన్నారు. కాబట్టి మార్కెట్‌ను దాని మానాన వదిలేయాలని అభిప్రాయపడ్డారు. స్మాల్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో బబుల్ తరహా పరిస్థితులు ఉన్నాయని, వాటిపై చర్చాపత్రాన్ని తెచ్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి ఇటీవల తెలిపిన నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
నావల్నీ అంత్యక్రియలకు చర్చిలు నిరాకరించిన వేళ..
మాస్కో: ఇటీవల అనుమానాస్పదంగా జైలులో మరణించిన రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు చర్చిలేవీ స్వచ్ఛందంగా ముందుకు రావడ లేదు. అధ్యక్షుడు పుతిన్ ఆగ్రహిస్తారన్న భయమే ఇందుకు కారణమని నావల్నీ సంస్థ అధికార ప్రతినిధి ఆరోపించారు. ‘‘నావల్నీ పేరు చెప్పగానే ఇప్పటికే బుకింగ్ అయిపోయాయంటూ చాలా చర్చిల నిర్వాహకులు తప్పించుకున్నారు. ఎట్టకేలకు మాస్కో శివార్లలోని మేరీనో పట్టణంలో ఉన్న మదర్ ఆఫ్ గాడ్ క్వెంచ్ మై సారోస్ చర్చి నావల్నీ అంత్యక్రియల నిర్వహణకు ముందుకొచ్చింది’’ అని ఆమె ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ‘వాస్తవానికి గురువారమే అంత్యక్రియలు పూర్తిచేద్దామనుకున్నాం. కానీ పార్లమెంట్‌ను ఉద్దేశిస్తూ పుతిన్ ప్రసంగం ఉండటంతో ఆ రోజు అంత్యక్రియలకు చర్చిలేవీ ముందుకు రాలేదు. అందుకే శుక్రవారం మధ్యాహ్నం ఖననం చేయనున్నాం’ అని చెప్పారు. -
Mamata Banerjee: జమిలి ఎన్నికలను అంగీకరించం
కోల్‌కతా: ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ విధానాన్ని తాము అంగీకరించబోమని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. మన దేశ సమాఖ్య నిర్మాణం ప్రకారం ’ఒక దేశం– ఒకే ఎన్నిక’ ఆలోచన ఆచరణ సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల విధానం అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ కార్యదర్శి డాక్టర్ నితేన్ చంద్రకు ఈ మేరకు మమతా బెనర్జీ లేఖ రాశారు. ఈ అంశాన్ని హేతుబద్ధతతో పరిశీలించాలని ఆమె ఎన్నిల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. ‘జమిలి ఎన్నికల యోచన సమాఖ్య నిర్మాణ కోణంలో చూస్తే సాధ్యం కాదు, ఆమోద యోగ్యం కాదు. సరైన విధానం కూడా కాదు. అందుకే, నేను ఈ విధానాన్ని ఆచరణాత్మక కోణంలో అంగీకరించను. ఈ అంశాన్ని చాలా చాలా హేతుబద్ధంగా ప్రత్యేకంగా పరిశీలించాలని కూడా భారత ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నాను’అని ఆమె గురువారం సెక్రటేరియట్ వద్ద విలేకరుల సమావేశంలో అన్నారు. ‘ఇది కేవలం టీఎంసీ అభిప్రాయం మాత్రమే కాదు, ఇండియా కూటమి పార్టీలది కూడా. ఈ యోచనను పరిశీలించేటప్పుడు కేంద్ర, రాష్ట్ర విధానాలు, కేంద్రం, రాష్ట్ర నిర్మాణాలు వంటి వాటిని కూడా చూడాలి’అని ఆమె పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సారథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలు తెలపాలంటూ రాజకీయ పార్టీలకు లేఖలు రాసిన విషయం తెలిసిందే. -
టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటివరకు ఆమోదించలేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. జనార్దన్‌రెడ్డి సోమవారం రాజీనామా సమర్పించగా, పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్‌కు దానిని ఆన్లైన్ ద్వారా పంపినట్టు అధికారులు తెలిపారు. బుధవారం గవర్నర్ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారని, రాజీనామాను ఆమోదించే విషయంలో అప్పుడే నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం చోటుచేసుకోవడంతో రాతపరీక్షలు రద్దు అయ్యాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు జరిపిన దర్యాప్తుపట్ల గవర్నర్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామాపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. -
ఈ ప్రదర్శనను ఆపండి...!
న్యూఢిల్లీ: ఒక వైపు కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న ఓ మాతృమూర్తి..పరిహారం చెక్కు ఇస్తూ ఫొటో తీయించుకోవాలనే మంత్రి యావను చూసి అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రదర్శనను ఆపండి’ అంటూ అక్కడున్న వారిని వేడుకున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రి తీరును ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఎండగట్టారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో యూపీలోని ఆగ్రాకు చెందిన కెప్టెన్ శుభమ్ గుప్తా అసువులు బాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కు అందజేసేందుకు మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ శుక్రవారం ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. తీవ్ర శోకంలో ఉన్న కెప్టెన్ శుభమ్ గుప్తా తల్లితో మంత్రి మాట్లాడారు. అనంతరం పరిహారం చెక్కు ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నించగా ఆమె తీసుకోలేదు. ‘నాకు ఏమీ వద్దు, ఈ ఎగ్జిబిషన్(ప్రదర్శని మత్ లగావో)ను ఇక ఆపండి’ అంటూ వేడుకున్నా చెక్కును అలాగే పట్టుకుని ఫొటో తీయించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో రికార్డయింది. -
‘స్టాక్ మార్కెట్ల’పై సుప్రీంకోర్టు కమిటీ
న్యూఢిల్లీ: స్టాక్ట్ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను సీల్డ్ కవర్లో స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మదుపరుల ప్రయోజనాలను కాపాడే విషయంలో పూర్తి పారదర్శకత కావాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేసింది. ప్రభుత్వ ప్రతిపాదిత నిపుణుల కమిటీ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి సిట్టింగ్ జడ్జిని నియమించడం సాధ్యం కాదని పేర్కొంది. అదానీ గ్రూప్ కంపెనీలపై హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత మదుపరులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లపై నియంత్రణ చర్యలను బలోపేతం చేయాలని, ఇందుకోసం సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలని, మదుపరుల ప్రయోజనాలను కాపాడాలని కోరుతూ న్యాయవాదులు ప్రశాంత్ భూషణ్, ఎంఎల్ శర్మతోపాటు పలువురు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు(పిల్స్) దాఖలు చేశారు. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస జేబీ పార్దివాలాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. నియంత్రణ చర్యలను బలోపేతం చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని గత విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. కమిటీ సభ్యుల పేర్లు, విధివిధానాలను శుక్రవారం సీల్డ్ కవర్లో అందజేయగా, ధర్మాసనం స్వీకరించలేదు. ప్రభుత్వం సూచించిన సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తే అది పూర్తిగా ప్రభుత్వ కమిటీ అవుతుందని అభిప్రాయపడింది. పారదర్శకత కావాలి కాబట్టి తామే ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని, తద్వారా న్యాయస్థానంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందని వెల్లడించింది. ఇకపై సిట్టింగ్ న్యాయమూర్తులు ఈ అంశాన్ని విచారిస్తారని, కమిటీలో మాత్రం వారు సభ్యులుగా ఉండబోరని తెలిపింది. -
‘అగ్రిగోల్డ్’పై ప్రభుత్వ ఉదాశీనతను సహించం: లేళ్ల
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ వంచితులైన 20లక్షల మంది బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారని, ఈ విషయంలో ప్రభుత్వ ఉదాశీనతను సహించేది లేదని స్పష్టం చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ప్రజాసంకల్ప యాత్రలోను పలువురు బాధితులు జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసు కుంటున్నారన్నారు. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశాన్ని విజయవాడలో ఈనెల 20న(శనివారం) నిర్వహిస్తున్నామని చెప్పారు. బాధితుల కోసం పనిచేసే అందరినీ కలుపుకుని వారికి న్యాయం జరిగేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. బాధితుల్లో ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, ఏడు నెలల కిందట జి.ఓ జారీ చేసినా నేటికీ పరిహారం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం రూ.1200 కోట్లు చెల్లించి 14లక్షల మందికి ఊరట కల్పించాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వం కుమ్మక్కు అయ్యిందన్నారు. ఈ పరిస్థితుల్లో బాధితులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అప్పిరెడ్డి అన్నారు. -
సాధ్వి వ్యాఖ్యలు ఆమోదనీయం కాదు!
రాజ్యసభలో ప్రధాని ప్రకటన శాంతించని విపక్షం; సాధ్వి రాజీనామాకు డిమాండ్ వరుసగా మూడోరోజూ ఉభయ సభల్లో ప్రతిష్టంభన న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన జ్యోతి అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యల వ్యవహారం వరుసగా మూడో రోజూ పార్లమెంటును కుదిపేసింది. మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయడమో లేక మంత్రిమండలి నుంచి ఆమెను తొలగించడమో చేయాల్సిందేనంటూ విపక్షమంతా ఒక్కటై గురువారం ఉభయసభలను స్తంభింపచేసింది. సాధ్వి జ్యోతి క్షమాపణ కోరారంటే దానర్థం ఆమె నేరం చేశానని ఒప్పుకున్నట్లేనని.. అందువల్ల మంత్రిగా కొనసాగే అర్హత ఆమెకు లేదని వాదించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ప్రకటన చేసినప్పటికీ.. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు. ఈ అంశంపై స్పందించకుండా గత మూడు రోజులుగా మౌనం పాటించిన ప్రధాని గురువారం ఎట్టకేలకు స్పందించారు. రాజ్యసభలో జీరో అవర్‌లో మాట్లాడుతూ.. సాధ్వి నిరంజన జ్యోతి చేసిన వ్యాఖ్యలు తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదనీయం కాదని తేల్చి చెప్పారు. ‘బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగిన రోజే సాధ్వి నిరంజన జ్యోతి చేసిన వ్యాఖ్యల విషయం తెలిసింది. అలాంటి భాష వాడకూడదంటూ ఆ రోజే మా ఎంపీలకు చెప్పాను. ఆమె సభకు కొత్త. ఆమె నేపథ్యం మనకు తెలుసు. ఎన్నికల వేడిలో అలా మాట్లాడారు. అయినా, అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. అవి మాకు ఆమోదనీయం కాదు. అయితే, సాధ్వి జ్యోతి క్షమాపణలు చెప్పారు కాబట్టి.. క్షమాపణలకు అర్థమేంటో తెలిసిన సీనియర్ సభ్యులు దేశ ప్రయోజనాల కోసం సభ సజావుగా సాగేందుకు సహకరించాలి. ఈ క్షమాపణల ద్వారా భాష విషయంలో హద్దులు దాటకూడదని, గౌరవమర్యాదలు పాటించాలని మనందరికి ఒక సందేశం వెళ్లింది’ అని వివరణ ఇచ్చారు. అయినా శాంతించని కాంగ్రెస్, తృణమూల్, ఆప్ తదితర విపక్ష పార్టీల సభ్యులు ఆమెను తొలగించాల్సిందేనంటూ నినాదాలతో సభను హోరెత్తించారు. ప్రధాని నుంచి కొన్ని వివరణలు కావాలన్న విపక్ష సభ్యుల అభ్యర్థనలను డిప్యూటీ చైర్మన్ అనుమతించలేదు. దాంతో వారు వెల్‌లోకి దూసుకెళ్లి సభాకార్యక్రమాలను అడ్డుకున్నారు. అప్పటికే నాలుగుసార్లు వాయిదాపడిన సభను డెప్యూటీ చైర్మన్ శుక్రవారానికి వాయిదా వేశారు. లోక్‌సభలోనూ..: సాధ్వి జ్యోతి వ్యాఖ్యలపై ప్రధాని సభలో ప్రకటన చేయాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దానికి ప్రధాని నుంచి స్పందన రాకపోవడంతో సభా కార్యక్రమాలను బహిష్కరించాలని మూకుమ్మడిగా నిర్ణయించారు. ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు వెల్‌లోకి వెళ్లి నినాదాలతో సభను అడ్డుకున్నారు. అధికారపక్ష సభ్యుల నిరసనల మధ్యనే.. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉండటంతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. ప్రభుత్వ వైఖరిని అడ్డుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌దేనన్నారు. అనంతరం టీఎంసీ, ఆప్, ఎస్పీ, ముస్లిం లీగ్ సభ్యులతో కలసి పార్లమెంటు వెలుపల ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సాధ్వి జ్యోతి వ్యాఖ్యలను ప్రధాని సమర్ధిస్తున్నారా? ఆయన అభిప్రాయం తెలుసుకోవాలని సభ కోరుకుంటోంది. రెండు రోజులుగా ఈ అంశాన్ని లేవనెత్తడానికి మేం ప్రయత్నిస్తున్నా ప్రధాని నుంచి స్పందన లేదు. మాకు మెజారిటీ ఉంది. మేమేమైనా చేస్తాం అన్నట్లుగా వారి వైఖరి ఉంది’ అని ఖర్గే ధ్వజమెత్తారు. ఎన్నాళ్లీ ప్రతిష్టంభన సాధ్వి వివాదాస్పద వ్యాఖ్యల అంశం గత మూడు రోజులుగా రాజ్యసభను స్తంభింపజేయగా, లోక్‌సభలోనూ ఆ ప్రకంపనలు గట్టిగానే ఉన్నాయి. సాధ్వి జ్యోతి క్షమాపణలు చెప్పారు కనుక ఈ అంశాన్ని వదిలేయాలని, ఆమెను పదవి నుంచి తొలగించబోమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అయితే 30% ఓట్లు మాత్రమే సాధించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, తన వ్యాఖ్యలతో మిగతా 70% ప్రజలను ఆమె అవమానించారని, అందువల్ల ఆమెను తొలగించడమే న్యాయమని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. దీంతో పార్లమెంటులో ఈ ప్రతిష్టంభన తొలగేలా కనిపించడం లేదు.