న్యూఢిల్లీ: వివాహానికి ఆమోదం తెలపక పోవడాన్ని ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా భావించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. తన కుమారుడితో పెళ్లికి నిరాకరించడం వల్లే అతడి ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఓ మహిళపై దాఖలైన కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయపడింది.
ఐపీసీలోని సెక్షన్–306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా భావించలేమని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది. పిటిషనర్ కుమారుడు, అతడి ప్రియురాలికి మధ్య ఉన్న విభేదాలే ఆధారంగానే ఈ ఆరోపణలు చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాలు వంటి నమోదైన ఆధారాలు సరైనవే అని భావించినా, పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది.
ఆత్మహత్యకు మినహా మరే ప్రత్యామ్నాయం కూడా మృతురాలికి లేకుండా పిటిషనర్ చేశారనే ఆరోపణలు కూడా లేవని స్పష్టం చేసింది. అదేవిధంగా, పిటిషనర్, కుటుంబంతో కలిసి తన కుమారుడితో బంధం తెంచుకోవాలని మృతురాలిపై ఒత్తిడి చేసినట్లు కూడా చూపలేకపోయారని ధర్మాసం తెలిపింది.
ప్రియురాలితో తన కుమారుడి వివాహానికి పిటిషనర్ నిరాకరించినా ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒత్తిడి చేసినట్లుగా భావించలేమని తెలిపింది. వాస్తవానికి మృతురాలి కుటుంబానికే ఈ పెళ్లి ఇష్టం లేదన్నది నిజమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘నా కుమారుడిని పెళ్లి చేసుకోకుండా నీవు బతకలేవా?’అంటూ పిటిషనర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐపీసీలోని సెక్షన్ 306ను అనుసరించి తీవ్రమైన ఆత్మహత్య నిర్ణయానికి కారణమని చెప్పలేమంది.
Comments
Please login to add a commentAdd a comment