
సాక్షి, హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి రాజీనామాను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఇప్పటివరకు ఆమోదించలేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. జనార్దన్‌రెడ్డి సోమవారం రాజీనామా సమర్పించగా, పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్‌కు దానిని ఆన్‌లైన్ ద్వారా పంపినట్టు అధికారులు తెలిపారు. బుధవారం గవర్నర్ హైదరాబాద్‌కు తిరిగి రానున్నారని, రాజీనామాను ఆమోదించే విషయంలో అప్పుడే నిర్ణయం తీసుకుంటారనే చర్చ జరుగుతోంది.
టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణం చోటుచేసుకోవడంతో రాతపరీక్షలు రద్దు అయ్యాయి. దీంతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు జరిపిన దర్యాప్తుపట్ల గవర్నర్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే టీఎస్‌పీఎస్సీ చైర్మన్ రాజీనామాపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.