సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంపై తమిళిసై సౌందరరాజన్ తాజాగా స్పందించారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నానని ఆమె తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ ప్రజలను వదిలేసి వెళ్తున్నందుకు బాధగా ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రజలందరూ తనకెప్పుడూ అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లేనని అన్నారు.
కాగా తెలంగాణ గవర్నర్ పదవికి సోమవారం తమిళిసై రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి బీజేపీ తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంతేగాక గవర్నర్ పదవి చేపట్టకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆమె నేడు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి చెన్నై బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడుతూ.. తనపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలను ఎన్నటికీ మరవనని.. అందరితో కలుస్తూ ఉంటానని చెప్పారు. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రశ్నను.. ఆమె దాటవేస్తూ వెళ్ళిపోయారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 8న తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తమిళిసై.. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment