ట్రాన్స్జండర్లు తమ జీవితంలో లెక్కలేనన్న అవమానాలను ఎదుర్కొంటుంటారు. అయితే వీటిని అధిగమించి, కష్టనష్టాలను దిగమింగుకుంటూ, అత్యున్నత స్థానానికి చేరుకున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటివారు ఈ తరహా వ్యక్తులకే కాకుండా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తుంటారు. అలాంటివారిలో ఒకరే సుమనా ప్రామాణిక్. నేడు అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయికి ఎదిగిన ఆమె ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు.
పశ్చిమబెంగాల్‌కు చెందిన ట్రాన్స్ జండర్ సుమనా ప్రామాణిక్ తన కలను సాకారం చేసుకున్నారు. ఇటీవలే రాష్ట్రప్రభుత్వం నిర్వహించిన పోటీ పరీక్షల్లో విజయం సాధించిన సుమనా అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యే అర్హతను దక్కించుకున్నారు. త్వరలోనే ఆమె ఏదో ఒక యూనివర్శిటీలో లేదా కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియామకం అందుకోనున్నారు. సుమనా తన చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ టీచర్ కావాలని కలలుగనేవారు.
సుమనా 2019లో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(సెట్)కు హాజరయ్యారు. అప్పుడు ఆమె ఆ పరీక్షలో విజయం సాధించలేకపోయారు. అయితే ఈ ఏడాది నిర్వహంచిన సెట్ పరీక్షలో ఆమె విజయం దక్కించుకున్నారు. ట్రాన్స్‌జండర్లు కొన్ని పనులకు మాత్రమే అర్హులనే భావన తప్పని, వారు ఏ రంగంలోనైనా రాణించగలరని సుమనా నిరూపించారు. సుమనా గతంలో అధ్యాపక వృత్తి చేపట్టాలని ప్రయత్నించినప్పుడు పలు వ్యతిరేకతలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఆమె వాటన్నింటికీ సమాధానం చెప్పారు.
సుమానా అత్యంత బీదకుటుంబంలో జన్మించారు. బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఆరేళ్ల వయసులోనే ఆమె అనాథాశ్రమానికి చేరుకున్నారు. అక్కడ ఉంటూనే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. తరువాత కృష్ణాకాలేజీలో డిగ్రీ చేశారు. అనంతరం కల్యాణీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వర్థమాన్ యూనివర్శిటీలో బీఈడీ కూడా పూర్తిచేశారు. ఈ సమయంలో సుమనా విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ వచ్చారు. ఒక కౌన్సిలర్ అందించిన ధైర్యంతో సుమనా చదువులో ముందడుగు వేశారు. ఐదేళ్ల కృషి అనంతరం సుమనా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మారి, తన కలను సాకారం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: పెళ్లి వేడుకల్లోకి చిరుత.. బంధించే పనిలో అటవీ సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment