assistant professor
-
డైట్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ అరెస్టు
సాక్షి, అనకాపల్లి : అధికార పార్టీకి సంబంధించినవైతే చాలు పోలీసులు ఎలాంటి ఘోరాలు, నేరాలు అయినా నోరు మెదపడంలేదు. టీడీపీ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్ అనకాపల్లిలో నడుపుతున్న దాడి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (డైట్) అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆగడాలే ఇందుకు ఉదాహరణ. మెంటార్‌గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ మురళి తనను వేధిస్తున్నాడని ఇంజినీరింగ్ సెకండియర్ విద్యార్థిని చాలాకాలంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎట్టకేలకు అరెస్టుచేసి శుక్రవారం రిమాండ్‌కు పంపారు. కానీ, ఈ విషయాన్ని అనకాపల్లి టౌన్ పోలీసులు చాలా గోప్యత పాటిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెంటార్ మురళి ఏడాది కాలంగా వేధిస్తున్నాడని బాధితురాలు పేర్కొంటోంది. ప్రతిరోజు రాత్రులు తనకు ఫోన్‌చేసి మాట్లాడాలని, వాట్సాప్ మెసేజ్‌లు చేయాలని, కళాశాలకు వచ్చినప్పుడు తనను కలవాలని, హగ్ చేసుకోవాలని రకరకాలుగా వేధిస్తుండటంతో ఆమె నరకం అనుభవిస్తోంది. అతని వేధింపులు భరించలేక తన స్నేహితుడికి సమస్యలు వివరించడంతో.. ఇటీవల ఆ యువకుడు మురళిని ప్రశ్నించగా ‘నీకేందుకురా పో’.. అంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్ దురుసుగా ప్రవర్తించాడు. మీ ఇద్దరి మధ్య వేరే సంబంధం ఉందని మీ తల్లిదండ్రులకు చెబుతానని బెదిరించాడు. అధ్యాపకుడి ఫోన్‌కాల్ రికార్డింగ్ ఆధారంగా కళాశాలలో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో బాధిత విద్యార్థిని జిల్లా పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు సైతం ఈ విషయాలను రహస్యంగా ఉంచడం విస్మయం కలిగిస్తోంది. మరోవైపు.. తమ కుమార్తెపట్ల అసిస్టెంట్ ప్రొఫెసర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు బాధితురాలి తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. నిందితుడ్ని 14రోజులపాటు రిమాండ్ విధించినట్లు విశ్వసనీయ సమాచారం. కానీ, ఈ విషయం సీఐ వెల్లడించకపోవడం గమనార్హం. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ మురళి గతంలో చాలామందిపట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, కళాశాలలో మెంటర్ కావడంతో విద్యార్థులు మౌనంగా భరిస్తున్నారని ఇతర విద్యార్థులు చెబుతున్నారు. -
NIMS: నిమ్స్ వైద్యురాలి ఆత్మహత్య!
హైదరాబాద్, సాక్షి: మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని నిమ్స్ వైద్యురాలు ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శనివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. డాక్టర్ ప్రాచీ కర్(46) నిమ్స్‌లో అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బేగంపేట బ్రాహ్మణవాడిలోని తన ఇంట్లో ఆమె అపస్మాకర స్థితిలో కనిపించారు. పక్కనే అనస్థీషియా మత్తు వాయిల్ పడి ఉండడం గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే నిమ్స్‌కు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె కన్నుమూశారు.అనస్థీషియా అధిక మోతాదులో తీసుకోవడం వల్లే ఆమె చనిపోయారని నిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ప్రాచీ కర్ చనిపోయిన విషయాన్ని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు అయ్యింది. ప్రాచీ కర్ మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి, పలువురిని ప్రశ్నిస్తున్నారు. -
గోవా ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఎంపికై న శ్రీకాకుళం వాసి
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన డాక్టర్ సువ్వారి ఆనందరావు ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యో గం సాధించారు. ఆయన స్వస్థలం ఎచ్చెర్ల మండలం పొన్నాడ పంచాయతీ పరిధిలోని కమ్మవారిపేట గ్రామం. అత్యున్నత ప్రమాణాలు కలిగిన గోవా ఐఐటీ సంస్థలో ఆర్థిక శాస్త్రం విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డాక్టర్ ఆనందరావు ఉగ్యోగానికి ఎంపికయ్యాడు. శుక్రవారమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. కమ్మవారిపేటకు చెందిన సువ్వారి నీలాచలం, పద్మావతిలు ఆనంద రావు తల్లిదండ్రులు. పాఠశాల స్థాయి నుంచి ఆనందరావు చదువుల్లో చురుగ్గా ఉండేవారు. ప్రాథమిక విద్య అనంతరం ఎకనామిక్స్‌పై ఆసక్తితో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఐఎంఏలో చేరి ఉత్తీర్ణులయ్యారు. అక్కడే క్యాంపస్ ఇంటర్వ్యూ ద్వారా ఓ బీమా సంస్థలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేశారు. అయితే పరిశోధనలపై ఉన్న ఆసక్తితో ‘ఎఫీషియన్సీ అండ్ ఫెర్మార్మన్స్ అసెస్మెంట్ ఆఫ్ లైఫ్ ఇన్యూరెన్స్ ఇండస్ట్రీ, సమ్ న్యూ ఎవిడెన్స్ ఫర్ ఇండియా’ అనే అంశంపై పీహెచ్డీ పూర్తిచేసి చేసి డాక్టరేట్ అందుకున్నారు. అనంతరం ఆయన 2019 జూలై నుంచి 2020 వరకు ఏపీ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ విభాగంలో అధ్యాపకులుగా పనిచేశా రు. 2020 నవంబరు నుంచి 2023 జనవరి వరకూ ఏపీ ఎస్ఆర్ఎం విశ్వ విద్యాలయంలో సహాయ ఆచార్యునిగా, ఎకనామిక్స్ హెచ్ఓడీగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2023 నుంచి హైదరాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ (ఐఎంటీ) హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌గా పనిచే స్తూ.. తాజాగా ప్రతిష్టాత్మక ఐఐటీ గోవాలో ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఇప్పటివరకు ఆయన ప్రచురించిన జర్న ల్స్ అంతర్జాతీయ పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి. -
మెర్సీ ప్లీజ్!
‘‘విధి కన్నెర్ర చేసి కోలుకోని దెబ్బకొట్టినా.. మనిషి తట్టుకుని నిలబడ గలుగుతాడు. కానీ అక్కున చేర్చుకుని ఓదార్చాల్సిన సమాజం ఈసడింపులు, చీదరింపులతో అసహ్యంగా చూస్తే బతకాలన్న కోరిక చచ్చిపోతుంది. కోరిక లేని మనిషికి చావు తప్ప మరోమార్గం కనిపించదు, ఇదే నా జీవితంలో ప్రస్తుతం జరుగుతోంది. కనీసం నన్ను ప్రశాంతంగానైనా చావనివ్వండి ప్లీజ్’’ అని అడుగుతోంది డాక్టర్ పార్వతీ కుమారి. జార్ఖండ్‌లోని చిన్న నగరం ధన్‌బాద్. ఇక్కడే పుట్టింది పార్వతీ కుమారి. తాతయ్య, నాయనమ్మలు, ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అక్కచెల్లెళ్ల మధ్య ఆడుతూ పాడుతూ పెరిగింది. పదోతరగతి పాసై∙ఎంచక్కా కాలేజీకి వెళ్దామని అడ్మిషన్ తీసుకుంది. సరిగా అప్పుడే పార్వతికి విపరీతమైన తలనొప్పి వచ్చింది. ఇంటిచిట్కాలు పాటిస్తూ నొప్పిని తగ్గించుకోవడానికి ప్రయత్నించింది. కానీ తగ్గకపోగా రోజురోజుకి ఎక్కువవుతూ పోయింది. ఎన్ని ట్రీట్మెంట్లు తీసుకున్నా ఫలితం కనిపించలేదు.. ఓరోజున ఉన్నట్టుండి కోమాలోకి వెళ్లిపోయింది పార్వతి. కళ్లు తెరిచింది కానీ.... స్పృహæలేకుండా జీవచ్ఛవంలా పడి ఉన్న పార్వతి... మూడు నెలల తరువాత కోమా నుంచి బయటకు వచ్చింది. కళ్లు తెరిచి చూసింది కానీ ఏమీ కనిపించడం లేదు. సీనియర్ కంటి డాక్టర్‌కు చూపించగా...‘‘వివిధ రకాల మందుల దుష్ప్రభావం వల్ల కంటిచూపు పోయింది’’ అని చెప్పారు. పార్వతికీ, ఆమె తల్లిదండ్రులకు ప్రపంచం తలకిందులైనట్లు అనిపించింది. ఇంట్లో పార్వతి తండ్రి ఒక్కడిదే సంపాదన. ఆమె చికిత్సకు చాలా ఖర్చవడంతో అప్పుల పాలయ్యారు. ‘‘కళ్లులేని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? బతికుంటే తల్లిదండ్రులకు భారమే అని’’ ఇరుగు పొరుగు ఈసడింపుగా మాట్లాడేవారు. పీహెచ్డీ దాకా... అనేక భయాందోళనల మధ్య ఉన్న పార్వతి మూడేళ్లు గడిపేసింది. ఆ తరువాత డెహ్రాడూన్‌లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ విజువల్లీ హ్యాండీక్యాప్డ్’లో చేరింది. పదకొండో తరగతిలో అడ్మిషన్ తీసుకుని మొదటి మూడు నెలలు బ్రెయిలీ స్క్రిప్ట్‌ను నేర్చుకుంది. డెభ్బై రెండు శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పాసైంది. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ కాలేజీలో బీఏ, దౌలత్‌రామ్ కాలేజీలో ఎమ్.ఏ. చేసింది. తరువాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీలో ఎమ్‌ఫిల్, పీహెచ్డీ పూర్తి చేసింది. ఇలా చకచకా చదివేసి జేఆర్‌ఎఫ్‌గా సెలక్ట్ అయ్యింది. ఒక పక్క చదువుతూనే మరోపక్క సాహిత్య సేవ కూడా చేసింది. పుంజుకునేలోపే... కుటుంబ సభ్యులు, కాలేజీ లెక్చరర్లు, తోటి విద్యార్థులు, స్నేహితుల సాయంతో చదివిన పార్వతికి ఓ ఈవినింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. హమ్మయ్య ఇంతకాలానికి ఎవరి సాయం తీసుకోకుండా నా కాళ్లమీద నేను నిలబడ్డాను, ఇప్పుడు నేను కూడా నా కుటుంబ సభ్యులకు, ఇతరులకు సాయం చేయవచ్చు అనుకుని.. సంతోషంగా తన డ్యూటీ చేసుకునేది పార్వతి. కాలేజీలో కాంట్రాక్ట్ ప్రొఫెసర్లను పర్మినెంట్ చేసే సమయం వచ్చింది. తాను కూడా పర్మినెంట్ ఉద్యోగి అయిపోతుంది అనుకుంది పార్వతి. అయితే పర్మినెంట్ చేయడం మాట అటుంచి కనీసం కారణం కూడా చెప్పకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించేశారు!! దీంతో మరోసారి తన జీవితం అంధకారమైనట్లనిపించింది. ‘‘వెలుగు కోసం వేచిచూస్తూ లైన్లో ఉన్న నన్ను మళ్లీ చీకటిలోకి ఈడ్చిపడేసారు. ఇక నాకు పోరాడే ఓపికలేదు. అందుకే కనీసం ప్రశాంతంగా చనిపోనివ్వండి’ అని ఈ దేశప్రజలు, సమాజాన్ని అడుగుతున్నాను.’’ అని తీవ్రమైన నిరాశతో పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రొఫెసర్‌గా తానేమిటో ఇప్పటికే నిరూపించుకుంది. తన కాళ్లమీద తాను నిలబడేలా చేసి ఆ కళ్లకు వెలుగు చూపిస్తే పోయేదేముంది? -
దటీజ్ డాక్టర్ మహాలక్ష్మీ..వెయ్యికి పైగా డైడ్బాడీస్కి పోస్ట్‌మార్టం
‘అమ్మాయిలు పోస్ట్‌మార్టం చేయలేరు’ ఈ అపోహ తప్పని నిరూపిస్తున్నారు ఈ రంగంలోకి వస్తున్న యువ డాక్టర్లు. నాలుగేళ్లలో వెయ్యికి పైగా మృతదేహాలకు పోస్ట్‌మార్టం చేసి, అమ్మాయిలూ చేయగలరు అని నిరూపిస్తున్నారు కర్ణాటకలోని కార్వార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహాలక్ష్మి మన దేశంలో మొట్టమొదటి ఫోరెన్సిక్ సైంటిస్ట్‌గా డాక్టర్ రుక్మిణీ కృష్ణమూర్తి వార్తల్లో నిలిచారు. ముంబయ్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో 1974లో చేరిన ఆమె రిటైర్ అయ్యేంతవరకు వర్క్ చేశారు. ఆమె స్ఫూర్తితో ఆ తర్వాత ఈ రంగంవైపు ఆసక్తి చూపినవాళ్లు ఉన్నారు. కానీ, వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలోనే ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని చూడటం సాధారణం. కానీ, కాలిపోయిన శరీరాలు, ప్రమాదాలలో ఛిద్రమైన శరీరాలు, నీటిలో మునిగిపోయిన శరీరాలు చూడటం సాధారణం కాదు. విషం కారణంగా శరీరం నీలం రంగులోకి మారడం లేదా ఆత్మహత్య కారణంగా మృతదేహాలను చూడటం మరింత బాధాకరం. సున్నితమనస్కులైన మహిళలు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించలేరనేది అందరూ అనుకునేమాట. అయితే, ఈ వృత్తిని తాను ఛాలెంజింగ్‌గా తీసుకున్నానని చెబుతున్నారు డాక్టర్ మహాలక్ష్మి. చదువుకునే రోజుల్లో... ‘‘అమ్మనాన్నలకు ఐదుగురం ఆడపిల్లలం. అందులో ముగ్గురం డాక్టర్లమే. ఒక అక్క డెంటిస్ట్, మరొకరు ఆయుర్వేద డాక్టర్. వాళ్లని చూసే నేనూ డాక్టర్ కావాలని కల కన్నాను. ఆయుర్వేద వైద్యురాలైన మా అక్క ఫోరెన్సిక్ డాక్టర్ కావాలనుకుంది. కానీ, తను ఆ దారిలో వెళ్లలేకపోయింది. నేను ఈ టాపిక్‌ను ఎంచుకున్నప్పుడు మా అక్క ఎంతో సపోర్ట్‌నిచ్చింది. మా నాన్న ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. మా ఇంట్లో ఎప్పుడూ చదువుకే ప్రాధాన్యత ఉండేది. రిస్క్ ఎందుకు అన్నారు.. చదువుకునే రోజుల్లో సీఐడీ సీరియల్ చూసేదాన్ని. అందులో ఫోరెన్సిక్ విభాగం నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలోనే ఫోరెన్సిక్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టాను. మా ప్రొఫెసర్లు కూడా నాకు ఆ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని, నేర కథనాలను వివరించేవారు. ఇందుకు సంబంధించిన నవలలు కూడా చదివాను. మా క్లాస్మేట్ అబ్బాయిలు మాత్రం ‘ఈ విభాగం వద్దు, అమ్మాయివి ఎందుకు రిస్క్. ఇది కేవలం మార్చురీ గురించి మాత్రమే కాదు, సాక్ష్యం కోసం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులతో కలిసి పనిచేయాలి. రాత్రి, పగలు ఎప్పుడు అవసరమున్నా చురుగ్గా పనిచేయాలి. లేడీస్‌కి అంత సులభం కాదు’ అన్నారు. ‘మా నాన్నగారు కూడా పెళ్లై, సంప్రదాయ కుటుంబంలోకి వెళితే ఇబ్బందులుగా మారతాయి’ అన్నారు. కానీ, ఒక కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణుల పాత్ర చాలా ముఖ్యం అని నాకు తెలుసు. ఈ ఫీల్డ్‌లో ఛాలెంజెస్ ఎక్కువ. నేను చేయగలను అని భావించే ఈ విభాగంలోకి వచ్చాను. ఇప్పుడు నా నిర్ణయాన్ని అంతా సమర్ధిస్తున్నారు’’ అని వివరించారు ఈ ఫోరెన్సిక్ డాక్టర్. అనేక పరిశోధనలు.. మేల్ డామినేటెడ్ వృత్తిలో ఎలా చోటు సంపాదించుకున్నావని నన్ను చాలామంది అడుగుతుంటారు. సవాళ్లు అంటే ఇష్టం అని చెబుతుంటాను. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని హుబ్లీ నగరం. ప్రాథమిక విద్య వరకు బెల్గాంలో చదివాను. ఆ తర్వాత కాలేజీ చదువంతా హుబ్లీలోనే. 2007 నుండి 2017 మధ్యన బెల్గాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఏడాది పాటు గ్రామీణ ప్రజలకు సేవ చేశాను. 2020లో ఫోరెన్సిక్ విభాగంలో చేరాను. అప్పటి నుండి అనేక పరిశోధనలను ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో కలిసి పనిచేశాను. మెడికల్ స్టూడెంట్స్‌కు క్లాసులు తీసుకుంటున్నాను. ఈ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. – డాక్టర్ మహాలక్ష్మి -
590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) పరిధిలో 41 స్పెషాలిటీ, సపర్ స్పెషాలిటీల్లో 590 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. డైరెక్ట్, లేటరల్ ఎంట్రీ విధానాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నెల 17 నుంచి వెబ్సైట్లో ఆన్లైన్ అప్లికేషన్ అందుబాటులోకి రానుంది. ఈనెల 26 దరఖాస్తుకు వరి గడువు. ఓసీ అభ్యర్థులు రూ.వెయ్యి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యఎస్, వికలాంగ అభ్యర్థులు ర.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుం.వెయ్యి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, వికలాంగ అభ్యర్థులు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్యకళాశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతోపాటు కొత్తగా ఏర్పాటుచేసిన కడప మానసిక ఆస్పత్రి, పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్, పలు సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్య పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చాయి. ఈ పోస్టుల భర్తీలో భాగంగా తాజా నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండకుండా చర్యలు చేపట్టిన సీఎం జగన్ ప్రభుత్వం 50 వేలకుపైగా పోస్టులను భర్తీచేసింది. చదవండి: ఏది నిజం?: ‘ఈనాడు’ వంకర రాతలు.. రామోజీ ఇవన్నీ సాధ్యమయ్యాయిగా? -
లక్ష్మీకాంతమ్మ సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
అనంతపురం క్రైం: ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని గైనిక్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మీకాంతమ్మ సస్పెన్షన్‌కు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆమె సస్పెన్షన్‌కు కలెక్టర్ గౌతమి సిఫారసు చేశారు. ఇటీవల ధర్మవరం మండలం చిగిచెర్ల గ్రామానికి చెందిన గర్భిణి కవిత(25)కు అబార్షన్ చేసి, మృతికి కారణమైందన్న ఆరోపణల్లో వెల్లువెత్తిన నేపథ్యంలో దీనిపై ‘అనంతలో దారుణం, చిదిమేస్తున్నారు, కదిలిన వైద్యురాలి అక్రమాల డొంక, అన్నీ అబాద్దాలే’ తదితర శీర్షికలతో ‘సాక్షి’లో వరుస కథనాలు వెలువడ్డాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ సమగ్ర విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ వీరబ్బాయి, పీసీపీఎన్డీటీ యాక్ట్ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ యుగంధర్, డెమో బృందం ఇటీవల అమ్మవారిపల్లి, చిగిచెర్ల గ్రామాలను సందర్శించి మృతురాలి కుటుంబీకులతో స్టేట్మెంట్ రికార్డు చేశారు. అంతేకాక ఘటనకు సంబంధించి డాక్టర్ లక్ష్మీకాంతమ్మ, రూత్ ఆస్పత్రిపై అనంతపురం త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. 99 మందికి అబార్షన్లు: వైద్యాధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతుల్లేకుండానే అనంతపురంలోని శ్రీనివాసనగర్‌లో రూత్ ఆస్పత్రిని డాక్టర్ లక్ష్మీకాంతమ్మ నిర్వహిస్తోందని గుర్తించారు. అంతేకాక మెడికల్ టర్నినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(అబార్షన్) చేయడానికి అనుమతులు లేకున్నా 2022 నుంచి ఇప్పటి వరకూ ఏకంగా 99 అబార్షన్లు చేసినట్లు (అభిజ్ఞ ఆస్పత్రిలో) బహిర్గతం కావడంతో విచారణాధికారులు విస్తుపోయారు. ఈ నేపథ్యంలో రూపొందించిన తుది నివేదికను సోమవారం కలెక్టర్‌కు సమర్పించారు. పరిశీలించిన కలెక్టర్ గౌతమి.. వెంటనే డాక్టర్ లక్ష్మీకాంతమ్మను సస్పెన్షన్‌కు సిఫారసు చేశారు. అయితే డాక్టర్ లక్ష్మీకాంతమ్మ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో ఉండడంతో కలెక్టర్ చేసిన సిఫారసుతో పాటు విచారణ నివేదికను వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీదేవి ద్వారా డీఎంఈకి చేర్చేలా డీఎంహెచ్ఓ డాక్టర్ వీరబ్బాయి చర్యలు తీసుకున్నారు. చట్టపరమైన చర్యలకు ఆదేశిస్తాం ఎంటీపీ అనుమతులు తీసుకోకుండా అబార్షన్లు చేసిన డాక్టర్ లక్ష్మీకాంతమ్మపై విచారణ కొనసాగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో అబార్షన్లు చేశారు. ఎంటీపీ చట్టాన్ని అతిక్రమించిన డాక్టర్ లక్ష్మీకాంతమ్మపై చట్టపరమైన చర్యలకు ఆదేశిస్తాం. – డాక్టర్ యుగంధర్,పీసీపీఎన్డీటీ యాక్ట్ జిల్లా నోడల్ ఆఫీసర్ -
మెడికల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: మెడికల్ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల భర్తీకి కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) డాక్టర్ రమేష్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రతీ రోజూ ఉదయం 10 గంటల నుంచి కోఠీలో ఉన్న డీఎంఈ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు పారదర్శకంగా కౌన్సిలింగ్ పద్ధతిలో పోస్టింగ్‌లు ఇస్తామని తెలిపారు. మల్టీ జోన్ –1 అభ్యర్థులకు 15, 16 తేదీల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. మల్టీ జోన్ –2 అభ్యర్థులకు 17, 18 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మల్టీ జోన్ 1, 2 రెండింటిలోని సూపర్ స్పెషాలిటీ అభ్యర్థులకు 19వ తేదీన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులందరికీ ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా సమాచారం పంపిస్తారు. అభ్యర్థులందరూ డీఎంఈ వెబ్సైట్లో పేర్కొన్న సూచనలు పాటించాలని, ఆ ప్రకారం సంబంధిత ధ్రువీకరణపత్రాలతో పాటు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని కోరారు. జోన్ వారీగా, సబ్జెక్ట్ వారీగా వివరాల షెడ్యూల్ వివరాలను అధికారిక వెబ్సైట్ https://dme.telangana.gov.in లో ఉంచామని తెలిపారు. 1442 పోస్టుల భర్తీ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 34 స్పెషాలిటీలకు చెందిన 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను మెడికల్ – హెల్త్ సర్వి సెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 8వ తేదీన ప్రకటించారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు తమవెంట తప్పనిసరిగా ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకొని రావాలి. బోర్డుకు అందజేసిన దరఖాస్తు ఫారం కాపీ, బీసీ రిజర్వేషన్‌కు సంబంధించిన నాన్ క్రిమీలేయర్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకొని రావాలి. అలాగే ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకొని రావాలి. సీట్ మ్యాట్రిక్స్‌ను కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ప్రదర్శిస్తారు. ఉదయం పూట కౌన్సిలింగ్ ఉన్న అభ్యర్థులు 10 గంటలకు కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకోవాలి. మధ్యాహ్నం సమయం కలిగిన అభ్యర్థులు 1.30 గంటల కల్లా చేరుకోవాలి. ఏ రోజు ఎవరికి కౌన్సిలింగ్? ♦ 15వ తేదీన మల్టీ జోన్–1 అభ్యర్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, రేడియాడయాగ్నసిస్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, డీవీఎల్, జనరల్ మెడిసిన్, టీబీసీడీ విభాగాల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. ♦ 16వ తేదీన మల్టీ జోన్–1 అభ్యర్థులకే జనరల్ సర్జరీ, ఆప్తాల్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, ఈఎన్టీ విభాగాల్లో నిర్వహిస్తారు. ♦ 17వ తేదీన మల్టీ జోన్–2 అభ్యర్థులకు అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్ మెడిసిన్, సైకియాట్రీ, పీడియాట్రిక్స్, డీవీఎల్, టీబీసీడీ, జనరల్ సర్జరీ విభాగాల్లో కౌన్సిలింగ్ ఉంటుంది. ♦ 18వ తేదీన ఆప్తాల్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, అనెస్థీషియా, ఈఎన్టీ రేడియో డయాగ్నసిస్ విభాగాల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ♦ 19వ తేదీ ఉదయం 10.30 గంటల నుంచి మల్టీ జోన్ –1 అభ్యర్థులకు... మధ్యాహ్నం 12 గంటల నుంచి మల్టీ జోన్–2 అభ్యర్థులకు ఈఎండీ, రేడియేషన్ ఆంకాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ ఎఈడీ, హాస్పిటల్ అడ్మిని్రస్టేషన్, కార్డియాలజీ, సీటీవీఎస్, ఎండోక్రైనాలజీ, ఎంఈడీ గ్యాస్ట్రో, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
మొన్నటి వరకు బంట్రోతు.. ఇప్పుడేమో ఆచార్య
వేర్ దేర్ ఈజ్ ఏ విల్.. దేర్ ఈజ్ ఏ వే.. అని ఊరికనే అనలేదు. ఏదైనా సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే.. అందుకు ఏదో ఒక మార్గం కచ్చితంగా ఉంటుంది. బహుశా కమల్ కిషోర్ మండల్ సార్‌లాంటి వాళ్లను ఉద్దేశించే అది పుట్టుకొచ్చిందేమో. మొన్నటి వరకు ఏ యూనివర్సిటీలో.. ఏ విభాగంలో బంట్రోతుగా పని చేశారో.. అదే యూనివర్సిటీలో.. పైగా అదే డిపార్ట్మెంట్లో ఆయనిప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా డ్యూటీకెక్కారు మరి!.. కమల్ సార్ ప్రయాణం గురించి తెలుసుకుంటే.. అందులో ఏ ఒక్కటీ ఆయనకు అనుకూలంగా అనిపించదు. పేదరికం, సరైన వసతులు కూడా లేని ఇల్లు, తల్లి అనారోగ్యం కోసం ఖర్చు.. ఇంటి నిండా పుట్టెడు కష్టాలే. అయినా సరే విజయం సాధించాలనే పట్టుదలతో అద్భుతమైన సంకల్ప శక్తిని ప్రదర్శించారు. అందుకేనేమో ఇరుకుగల్లీలో రంగులు వెలిసిపోయిన ఆయన రెండు గదుల ఇంటికి అభినందల కోసం ఇప్పుడు జనం క్యూ కడుతున్నారు. కమల్ కిశోర్ మండల్(42) .. ఉండేది బీహార్ భగల్పూర్ ముండీచాక్ ప్రాంతం. చాలా పేద కుటుంబం ఆయనది. కమల్ తండ్రి గోపాల్ రోడ్డు పక్కన టీ అమ్ముతుంటారు(ఇప్పటికీ). డిగ్రీ వరకు ఎలాగోలా స్కాలర్షిప్ మీద నెట్టుకొచ్చారు కమల్. అయితే ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డిగ్రీతోనే 23 ఏళ్లకు చదువు ఆపేశారు. చదివింది పొలిటికల్ సైన్స్ అయినా.. కుటుంబ పోషణ కోసం 2003లో ముంగర్‌లో ఉండే ఆర్డీ అండ్ డీజే కాలేజీ నైట్ వాచ్‌మెన్‌గా చేరాడు. అదృష్టంకొద్దీ నెల తర్వాత డిప్యుటేషన్ మీద తిల్కా మాంజీ భగల్పూర్ యూనివర్సిటీ(TMBU)కి ప్యూన్‌గా వెళ్లాడు. అక్కడ పీజీలోని అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్కు ప్యూన్‌గా పని చేశాడు. అది ఆయన జీవితాన్ని పెను మలుపు తిప్పింది. స్టాఫ్‌కు చాయ్‌లు, టిఫిన్లు, పేపర్లు అందించిన కమల్‌కి.. అక్కడికి వచ్చే విద్యార్థులు, అధ్యాపకులను చూసిన కిశోర్‌కు మళ్లీ చదువుకోవాలనే కోరిక కలిగింది. దీంతో సంబంధిత విభాగానికి ఆయన అర్జీ పెట్టుకున్నారు. వెంటనే అనుమతి దొరికింది. ఉదయం కాలేజీ.. మధ్యాహ్నాం నుంచి బంట్రోతు పని.. రాత్రిళ్లు చదువు.. ఇలా ఏళ్లకు ఏళ్లు గడిచిపోయింది. మొత్తానికి ఎంఏ(అంబేద్కర్ థాట్ అండ్ సోషల్ వర్క్)ను 2009లో పూర్తి చేశారు. ఆ వెంటనే పీజీ కోసం డిపార్ట్మెంట్లో అనుమతి కోరగా.. మూడేళ్ల తర్వాత అది లభించింది. ఆపై 2013లో పీహెచ్డీ కోసం దరఖాస్తు చేసుకుని.. 2017లో థీసిస్ సమర్పించారు. 2019లో పీహెచ్డీ పట్టా దక్కింది కమల్‌కి. అంతేకాదు.. అదే ఊపుతో లెక్చరర్‌షిప్‌కు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET) పూర్తి చేసి.. నొటిఫికేషన్ల కోసం ఎదురు చూశారు. అయితే లక్ష్య సాధనకు ఆయనకు ఎంతో సమయం పట్టలేదు. 2020లో బీహార్ స్టేట్ యూనివర్సిటీ సర్వీస్ కమిషన్(BSUSC) టీఎంబీయూకి సంబంధించిన నాలుగు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. 12 మంది ఇంటర్వ్యూకి హాజరయ్యారు. అందులో కమల్ కిషోర్ మండల్ కూడా ఒకరు. మే 19, 2022న ఫలితాలు వెలువడగా.. అందులో అర్హత సాధించి.. ఏ యూనివర్సిటీలో అయితే బంట్రోతుగా పని చేశారో.. ఆ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అర్హత సాధించారు. అక్టోబర్ 12వ తేదీన ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్ విధుల్లో చేరారు. పేదరికం, కుటుంబ సమస్యలు నా చదువుకు ఆటంకంగా మారలేదు. ఉదయం కాలేజీకి వెళ్లి.. మధ్యాహ్నం డ్యూటీ చేసేవాడిని. రాత్రి పూట చదువుకునేవాడిని. సహకరించిన ప్రొఫెసర్లు, ఉన్నతాధికారులకు ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నా:: కమల్ కిశోర్ మండల్ పరిస్థితులు అనుకూలించలేదని, పేదరికం వల్లే తాము చదువు దూరమయ్యామని, మంచి ఉద్యోగం సాధించలేకపోయామని కొందరు చెబుతుంటారు. కానీ, చదువుకోవాలనే కోరిక మనసులో బలంగా ఉంటే పేదరికం ఆటంకం కాదనే నిరూపించాడు కమల్. ప్రతికూల పరిస్థితులను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుని విజయం సాధించిన కిశోర్ మండల్ సమాజానికి ఓ ప్రేరణ.. చదువుకోవాలనే అతడి సంకల్పానికి సెల్యూట్ చేస్తున్నా:: నెట్ కోసం కిశోర్‌కు ఉచిత శిక్షణ ఇచ్చిన ప్రొఫెసర్ సంజయ్ కుమార్ జైస్వాల్ -
ఇటుక అండగా.. ఇల్లు చల్లన! కూల్ బ్రిక్స్ తయారీలో అసిస్టెంట్ ప్రొఫెసర్
వేసవిని జయించేందుకు ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎవరి స్థోమతకు తగ్గట్టు వాళ్లు పరికరాల్ని అమర్చుకుంటున్నారు. ఇవేమీ అవసరం లేకుండా.. ఇంట్లో వేడిని తగ్గించే ప్రయత్నం చేశారు నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్. ఇంటి నిర్మాణం కోసం కూల్ బ్రిక్స్‌ను తయారు చేశారు. వీటి వాడకం వల్ల ఏడాదంతా ఇంటి లోపల చల్లని వాతావరణం ఉంటుంది. ఈ బ్రిక్స్ తయారీకి ఇటీవలే డాక్టర్ శశిరాం భారత ప్రభుత్వం నుంచి పేటెంట్ కూడా పొందారు. ఆ చల్లని ఇటుకల విశేషాలేంటంటే.. – కాజీపేట అర్బన్ వ్యర్థానికో అర్థం చూపాలనుకున్నారు. డంపింగ్ యార్డులో పడేసిన బూడిదకు ఓ ఆకృతిని చ్చారు డాక్టర్ శశిరాం. ఆమె మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో 2017లో ‘కో ఫైర్డ్ బ్లెండెడ్ యాష్ బ్రిక్స్’ అనే అంశంపై పరిశోధన చేశారు. ఆ సమయంలో వివిధ రకాల బాయిలర్లను వేడి చేసేందుకు బయోమాస్, కోల్(బొగ్గు)ను ఉపయోగించడం గమనించారు. బొగ్గు వేడి చేసిన అనంతరం బూడిదగా మారిపోవడం, డంపింగ్ యార్డ్‌లో పడవేయడం చూశారు. ఆ వ్యర్థాలను ఉపయోగించి వేడిని తట్టుకునే ఇంటి నిర్మాణానికి ఇటుకలను రూపొందించాలనుకున్నారు. బొగ్గు, బయోగ్యాస్ బూడిద, సిమెంట్, ఇసుక, నీటిని ఉపయోగించి కూల్ బ్రిక్స్ తయారీకి ఉపక్రమించారు డాక్టర్ శశిరాం. చల్లగా ఎందుకంటే.. ఇంటి నిర్మాణంలో ఉపయోగించే ఎరుపు రంగు మట్టి ఇటుకలను బట్టీల్లో వేడి కాలుస్తారు. సిమెంట్ ఇటుకలను హీటింగ్ చేస్తారు. దీంతో ఇటుకలు వేడిని స్వీకరించి వేడిని విడుదల చేస్తాయి. శశిరాం తయారు చేసిన కూల్ బ్రిక్స్ సాంచా(మోల్డింగ్)లో బొగ్గు, బయోగ్యాస్ బూడిద, ఇసుక, సిమెంట్‌ను ఒక మిశ్రమంగా ఏర్పాటు చేసి ఇటుక ఆకారాన్ని తీసుకొస్తారు. వారంపాటు నీటిని ఇటుకలపై చల్ల డం ద్వారా ఇటుకలు గట్టిపడ్తాయి. ఇటుకలను బట్టీల్లో కాల్చని కారణంగా ఇవి పూర్తి చల్లదనాన్ని స్తాయి. మట్టి, సిమెంట్ ఇటుకలు 1.5 మెట్రిక్ కెల్విన్వాట్ ఉష్ణోగ్రతను కలిగి ఉండగా.. కూల్ బ్రిక్స్ కేవలం 0.5 ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. కూల్బ్రిక్స్ 230 ఎంఎం పొడవు, 100 ఎంఎం వెడల్పు ఉంటాయి. 90 ఎంఎం ఎత్తుతో 3.3 కేజీల బరువుతో ఎరుపు మట్టి, సిమెంట్ ఇటుకకు దీటుగా ధృడంగా ఉంటాయి. నవంబర్‌లో పేటెంట్.. డాక్టర్ శశిరాం 2017లో పీహెచ్డీ పరిశోధనను ప్రారంభించి 2019లో పేటెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. భారత ప్రభుత్వం 2021 నవంబర్‌లో పేటెంట్‌ను అందజేసింది. కాగా.. త్వరలోనే ఈ ఇటుకలు అందుబాటులోకి రానున్నాయి. కూల్ ఓరుగల్లు కోసం.. భవిష్యత్‌లో ఓరుగల్లు ఉష్ణోగ్రతకు అనుగుణంగా బిల్డింగ్స్ డిజైన్స్, మోడల్స్ రూపొందిస్తున్నా. కూల్ ఓరుగల్లుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. – శశిరాం, అసిస్టెంట్ ప్రొఫెసర్, నిట్ కూల్ బ్రిక్స్ తయారు చేస్తున్న శశిరాం -
ఆ పోలీసుది 12 ఏళ్ల శ్రమ.. కల సాకారం చేసుకొని..!
సాక్షి, చెన్నై: బతుకుదెరువు కోసం పోలీసు ఉద్యోగంలో చేరినా, తన చిన్న నాటి కలనుసాకారం చేసుకునేందుకు 12 ఏళ్ల పాటు ఓ కానిస్టేబుల్ అవిశ్రాంతంగా శ్రమించారు. ప్రొఫెసర్ కావాలన్న తన కలను సాకారం చేసుకున్నాడు. వివరాలు.. తిరునల్వేలి నగరం మలయాల మేడుకు చెందిన అరవిందపెరుమాల్(34) పోలీసు రాత పరీక్ష, ఎంపిక ద్వారా 2011లో కానిస్టేబుల్ అయ్యాడు. ఆర్థికశాస్త్రం పట్టభద్రుడైన ఇతను స్థానిక స్టేషన్లో పనిచేస్తున్నాడు. చిన్నతనం నుంచి ప్రొఫెసర్ కావాలన్న తన కలను సాకరం చేసుకునేందుకు సహకరించాలని పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేసుకున్నాడు. అతడికి ఆ జిల్లా పోలీసు యంత్రాంగం సహకారం అందించింది. దీంతో 2014 నుంచి తిరునల్వేలి మనోన్మనియం సుందరనార్ వర్సిటీలో పీహెచ్డీ చేశాడు. అసంఘటితరంగంలోని కార్మికుల ఆర్థిక పరిస్థితులపై పీహెచ్డీ పూర్తి చేసి, ఈ ఏడాది పట్టా పుచ్చుకున్నాడు. ఆర్థిక శాస్త్రంపై అరవింద్‌కు ఉన్న పట్టుకు ప్రతిఫలం లభించింది. 12 సంవత్సరాల పాటు పోలీసుగా విధి నిర్వహణలో తనవంతుగా సేవల్ని అందిస్తూ వచ్చిన అరవింద్‌కు ప్రస్తుతం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం లభించింది. కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లోని హిందూ కళాశాలలో ఆయనకు ఈ పోస్టు లభించింది. దీంతో అరవింద్ఆనందానికి అవధులు లేవు. తన కల సాకారంలో పోలీసు అధికారుల సహకారం ఎంతో ఉందని పేర్కొంటూ, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. -
Divyani Rai: 4 అడుగులు.. పొట్టీ అంటూ వెక్కిరింపులు.. ఆత్మవిశ్వాసంతో అందనంత ఎత్తుకు!
కాస్త బొద్దుగా ఉంటే ఏయ్ లడ్డు అని! సన్నగా ఉంటే పీలగా అస్థిపంజరంలా ఉన్నావనీ! పొట్టిగా ఉంటే..! అసలు పేరు వదిలేసి ఏయ్ పొట్టి... అని పిలుస్తుంటారు. పుట్టుకతో వచ్చే వాటిని మార్చుకోలేమని తెలిసినా పొట్టివారు కనిపించిన ప్రతిసారి రకరకాల కామెంట్లు చేస్తూ అవహేళన చేస్తుంటారు. అవతలి వాళ్లు ఎంత బాధపడుతున్నారో కూడా చూడరు. వాళ్లని విమర్శించడం జన్మతః వచ్చిన హక్కులా ఫీల్ అవుతుంటారు. ఇలాంటి మాటలెన్నో పడిన దివ్యాణి.. మౌనంగా భరించిందే గానీ, ఎప్పుడూ తిరిగి ఒక్క మాట అనలేదు. తన పని తాను చేసుకుంటూ పోతూ తనని కామెంట్లు చేసిన వాళ్ల నోళ్లను తాను సాధించిన సక్సెస్‌తోనే మూయించి ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌కు చెందిన దివ్యాణి రాయ్ వయసు 29 ఏళ్లు. ఎత్తు మాత్రం నాలుగడుగుల లోపే. ఇంట్లో అందరికంటే చిన్నది కావడంతో అంతా ఎంతో ప్రేమగా చూసుకునేవారు. దివ్యాణి చిన్నప్పటి నుంచి ఇప్పటికీ ఎప్పుడు బయటకు వచ్చినా ఆమె ఎత్తు మీద జోక్‌లు, కామెడీ పంచ్‌లు బాగా వినిపించేవి. అప్పుడు దివ్యాణి కన్నీటిని దిగమింగుతూ ముందుకు వెళ్లిపోయేది. వాటిని మనసుకు తీసుకోకుండా తన చదువు మీద దృష్టిపెట్టి శ్రద్దగా చదువుకునేది. ఎత్తులేదనీ.. చిన్నప్పటి నుంచి బొమ్మలు బాగా వేసే అలవాటున్న దివ్యాణి..తన నైపుణ్యాన్ని పెంచుకుంటూ పోయింది. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తయ్యాక, పీజీ చేసి ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా చేరింది. అక్కడ ఉన్న విద్యార్థులు ఎత్తుగా ఉండడం, దివ్యాణి మరి పొట్టిగా ఉండడంతో వారికి పాఠాలు బోధించలేవు అని చెప్పి కాలేజీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. అప్పుడు దివ్యాణికి చెప్పలేనంత బాధ కలిగింది. ఏళ్లుగా ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్న ఆమెకు ఆ క్షణం సర్వ కోల్పోయినట్లు అనిపించింది. ఆ కొద్దిసేపు ఫీల్ అయినప్పటికీ తర్వాత తనకి తనే ధైర్యం చెప్పుకుంది. అంతకు మించి.. ఉద్యోగం పోయిన బాధ నుంచి కోలుకుని, తర్వాత బిఈడీ చేసింది. యూజీసీ నెట్ రాసి క్వాలిఫై అయ్యి, ప్రొఫెసర్ రాజేంద్ర సింగ్ (రాజు భయ్య) స్టేట్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగాన్ని సాధించింది. తనకొచ్చే జీతంతో పేదరికంలో మగ్గిపోతూ చదువుకునే స్థోమత లేని పిల్లల్ని చదివిస్తోంది. ‘షురువాత్ ఏక్ జ్యోతి శిక్షాకి’ సంస్థతో కలిసి పనిచేసి నిరుపేద విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడుతోంది. పిల్లలకు పెయింటింగ్‌ను ఉచితంగా నేర్పిస్తోంది. ఆమే ఆదర్శం.. ‘‘అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా సెలక్ట్ అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నేను పొట్టిగా ఉన్నప్పటికీ ఇంట్లో అమ్మా నాన్న, అన్నయ్య, తాతయ్య వాళ్లు నన్ను ప్రోత్సహించేవారు. వారి మద్దతుతోనే నేను ఈస్థాయికి వచ్చాను. నా ఎత్తు గురించి ఎప్పుడు బాధపడలేదు. కానీ నేను బయటకు వచ్చిన ప్రతిసారి ఎవరో ఒకరు కామెంట్లు చేసినప్పుడు మాత్రం మనస్సు చివుక్కుమనేది. ఆ సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ ఆర్తి డోగ్రాను ఆదర్శంగా తిసుకునేదాన్ని. ఆమె ఎత్తు కూడా నాలుగడుగులే. అయినా ఆమె యూపీఎస్సీ సర్వీస్ పోటీ పరీక్షను తొలి ప్రయత్నంలోనే ఛేదించి ఐఏఎస్‌గా అధికారి అయ్యారు. అందం, ఎత్తు వంటి వాటిని కాదు, మనలో ఉన్న నైపుణ్యాలు, ప్రతిభకే పట్టం కడతారని ఆర్తి నిరూపించారు. అందువల్ల ఆమెను ఆదర్శంగా తీసుకునే ఈ స్థాయికి వచ్చాను. భవిష్యత్‌లో వైస్‌ఛాన్సలర్ అయ్యి విద్యారంగంలో సరికొత్త మార్పులు తీసుకొస్తాను.’’అని ఎంతో గర్వంగా చెప్పింది దివ్యాణి. -
APSET 2021: అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యేలా..
ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్ పోస్టుల నియామకాలకు అర్హత పరీక్షగా పేర్కొనే.. ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ సెట్)’కు నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఇటీవల ఏపీసెట్–2021 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, పరీక్ష విధానం, సిలబస్ విశ్లేషణతోపాటు ప్రిపరేషన్ టిప్స్... యూనివర్సిటీలు, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా, లెక్చరర్లుగా చేరాలనుకునే అభ్యర్థు లకు తగిన అకడమిక్ అర్హతలతోపాటు, ఆయా సబ్జెక్టుల్లో లోతైన పరిజ్ఞానం ఉండాలి. అలాంటి అభ్యర్థుల ప్రతిభను, సబ్జెక్టు నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించిందే ఏపీ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ సెట్). ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 30 సబ్జెక్టుల్లో నిర్వహిస్తున్నారు. ఇందులో సాధించిన స్కోర్ ఆధారంగా లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకంలో ప్రాధాన్యం ఇస్తారు. అర్హతలు ► యూజీసీ గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం/కాలేజీ నుంచి కనీసం 55శాతం మార్కు లతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ► ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ(నాన్ క్రిమీలేయర్)/పీడబ్ల్యూ డీ/ట్రాన్స్ జెండర్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పీజీ పూర్తిచేయాలి. పోస్టు గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం విద్యార్థులు/ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► 1991 సెప్టెంబరు 19 నాటికి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన పీహెచ్డీ అభ్యర్థులు(అన్ని కేటగిరీల అభ్యర్థులు) పీజీలో కనీసం 50శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ► అభ్యర్థులు తాము చదివిన పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్టు సెట్ జాబితాలో లేకుంటే.. ఏదైనా ఇతర సంబంధిత సబ్జెక్టును ఎంచుకోవచ్చు. పరీక్ష విధానం ► ఏపీసెట్ పరీక్ష ఆఫ్‌లైన్(పెన్ పేపర్) విధానంలో జరుగుతుంది. ఇందులో రెండు పేపర్లు పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి. ► పేపర్–1లో.. టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూ డ్‌ను అన్ని విభాగాల అభ్యర్థులు రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్ తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో(బైలింగ్వల్) ఉంటుంది. ► పేపర్–2 పరీక్ష అభ్యర్థి ఏ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారో దానిపై ఉంటుంది. ► పేపర్–1: టీచింగ్/రీసెర్చ్ అప్టిట్యూడ్ : ► ఈ పేపర్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్టిట్యూడ్‌పై ఉంటుంది. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా మల్టిఫుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇది అందరూ రాయాల్సిన కామన్ పేపర్. మొత్తం 50 ప్రశ్నలు–100 మార్కులకు పేపర్1 పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయించారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. తెలుగు/ఇంగ్లిష్‌లో ప్రశ్న పత్రం ఉంటుంది. ఈ పేపర్‌కు కేటాయించిన సమయం ఒక గంట మాత్రమే. ► పేపర్1లో.. టీచింగ్ అప్టిట్యూడ్, రీసెర్చ్ అప్టి ట్యూడ్, కాంప్రెహెన్షన్, కమ్యూనికేషన్, మ్యాథ మెటికల్ రీజనింగ్ అండ్ అప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్‌ప్రెటేషన్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ), పీపుల్, డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హయ్యర్ ఎడ్యుయేషన్ సిస్టమ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ► పేపర్–2 ఎలక్టివ్ సబ్జెక్ట్: ఇది అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు(ఎలక్టివ్)కు సంబంధించిన పేపర్. ఇందులో ఆబ్జెక్టివ్ తరహా మల్టిఫుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 100 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి సరైన సమాధానానికి రెండు మార్కుల చొప్పున కేటాయించారు. ఈ పేపర్లో ఎలాంటి నెగెటివ్ మార్కుల విధానం లేదు. ► ఏపీ సెట్లో మొత్తం 30 సబ్జెక్టులు పేర్కొన్నారు. వీటిల్లో కామర్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులు రెండు భాషల్లో (తెలుగు/ఇంగ్లిష్) ఉంటాయి. మిగతా సబ్జెక్టులు ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటాయి. ► ఏపీ సెట్ సబ్జెక్టులు: ఆంత్రోపాలజీ, చరిత్ర, కెమికల్ సైన్సెస్, కామర్స్,కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ అట్మాస్పియరిక్, ఓషన్ అండ్ ప్లానటరీ సైన్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జాగ్రఫీ, హిందీ, జర్న లిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లా, లైఫ్ సైన్సె స్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, మేనేజ్ మెంట్, మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సంస్కృతం, సోషియాలజీ, సోషల్ వర్క్, తెలుగు, ఉర్దూ, విజువల్ ఆర్ట్స్. ఇలా చదవడం మేలు ► ఏపీసెట్ పరీక్షకు ఇంకా రెండున్నర నెలల సమ యం అందుబాటులో ఉంది. కాబట్టి ఈ విలువైన సమయాన్ని అభ్యర్థులు సమర్థంగా వినియోగించు కోవాలి. ► మొదట రెండు పేపర్ల సిలబస్‌పై సమగ్ర అవగాహన పెంచుకోవాలి. ► ముఖ్యంగా అందరికీ కామన్‌గా ఉండే పేపర్–1 ఎంతో కీలకమైంది. ఈ పేపర్ సిలబస్ కొంత భిన్నంగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తొలుత పేపర్1పై దృష్టిపెట్టి ప్రిపరేషన్ సాగించాలి. ఈ పేపర్ సిలబస్‌లో మొత్తం 10 యూనిట్లు ఉన్నాయి. వీటి నుంచి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో గత ప్రశ్న పత్రాల ద్వారా అంచనాకు రావాలి. ముఖ్యమైన టాపిక్స్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. ► పేపర్– 2లో.. అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇది అభ్యర్థి పీజీ స్థాయిలో చదివిన సబ్జెక్టు. కాబట్టి ఓ మాదిరి ప్రిపరేషన్ సాగించినా మంచి మార్కులు స్కోరు చేయవచ్చు. అందుకోసం యూజీసీ గతంలో నిర్వహించిన నెట్ ప్రశ్న పత్రాలు, సెట్ గత పేపర్లను పరిశీలించి.. ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యమైన తేదీలు ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 13.09.2021 ► ఏపీసెట్ పరీక్ష తేది: 31.10. 2021 ► పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కడప, కర్నూలు ► పూర్తి వివరాలకు వెబ్సైట్: https://apset.net.in/home.aspx -
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పీహెచ్డీ ఉండాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హతగా పీహెచ్‌డీని తప్పనిసరి చేశారు. గతంలో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) లేదా స్టేట్ లెవల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (స్లెట్) ఉంటే సరిపోయేది. కానీ ఈసారి ఆ రెండూ ఉన్నా పీహెచ్డీ తప్పనిసరి చేసినట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఈ కొత్త నిబంధనను యూజీసీ అమల్లోకి తెచ్చిందని అధికారులు చెబుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్డీ ఉండాలి. ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు వెళ్లాలంటే పీహెచ్‌డీతో పాటు, 8 ఏళ్ల టీచింగ్ అనుభవం, నిర్ణీత మేగజీన్లలో ఆర్టికల్స్ ముద్రితమై ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్ పోస్టుకు వెళ్లాలంటే 10 ఏళ్ల అనుభవం సహా మేగజీన్లలో ఆర్టికల్స్ ముద్రితమై మంచి స్కోర్ సాధించి ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్‌గా వెళ్లాలంటే మూడేళ్ల అనుభవంతో పాటు పైన పేర్కొన్న విధంగా అర్హతలు ఉండాలి. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో భర్తీ చేయబోయే 1,195 పోస్టులను యూజీసీ మార్గదర్శకాల ప్రకారమే భర్తీ చేస్తామని ఉన్నత విద్యామండలి చెబుతోంది. అసిస్టెంట్ పోస్టుల భర్తీలో నెట్, స్లెట్ ఉన్నవారికి 10 మార్కులు వెయిటేజీ ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 6 వేల మంది ఎదురుచూపులు రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో భర్తీ చేయబోయే అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ సహా ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను ఉన్నత విద్యా మండలి ప్రారంభించింది. ఏకీకృత రాత పరీక్ష, ఇంటర్వూ్య ప్రకారం పోస్టులను భర్తీ చేయా లని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. అయితే ఈ నిర్ణయం యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడమే అవుతుందని కొన్ని విద్యార్థి, ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. అన్ని యూనివర్సిటీల హక్కులను కాలరాసి కేంద్రీకృత పద్ధతిలో నియామకాలు చేపడితే అక్రమాలు జరగవన్న గ్యారంటీ ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, రాష్ట్రంలో పీహెచ్డీ చేసి పోస్టుల కోసం ఎదురుచూసేవారు దాదాపు 6 వేల మంది ఉంటారని ఉన్నత విద్యామండలి అంచనా వేసింది. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే వారు దాదాపు 1,300 మంది ఉంటారని తెలుస్తోంది. మొత్తం పోస్టుల్లో దాదాపు సగం మేర ఆ కాంట్రాక్టు ఉద్యోగులే దక్కించుకునే అవకాశముంది. ఎందుకంటే వీరికి వెయిటేజీ ఉంటుంది. ఏకీకృత పరీక్ష పేరుతో కాలయాపన చేయకుండా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం కాల రాస్తోందని మండిపడ్డారు. -
జాబ్ నుంచి సాయిబాబా తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ: మావోలతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని రాంలాల్ ఆనంద్ కళాశాల తొలగించింది. మార్చి 31 నుంచి సాయిబాబా సేవలను రద్దు చేస్తున్నట్లు, ప్రతిగా 3నెలల జీతాన్ని సాయిబాబా బ్యాంక్ ఖాతాలో జమచేసినట్లు సాయిబాబా భార్యకు ఇచ్చిన మెమొరాండంలో కాలేజీ ప్రిన్సిపల్ రాకేశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. ఇంగ్లిష్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన సాయిబాబాను 2014లో పుప్పాల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతితో సహా చట్టవిరుద్ధమైన సీపీఐ(మావోయిస్ట్) అగ్ర నాయకులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాలేజీ యాజమాన్యం సాయిబాబాను వెంటనే సస్పెండ్ చేసింది. 2017 మార్చిలో వామపక్ష ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, చట్టవిరుద్ధ కార్యకలాపా లు (నివారణ) చట్టం ప్రకారం దేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేలా ప్రోత్సహించి నందుకు గడ్చిరోలి సెషన్స్ కోర్టు సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని దోషులుగా తేల్చింది. వారందరికీ జీవిత ఖైదు విధించింది. సాయిబాబాను 1967 చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) చట్టం, భారతీయ శిక్షాస్మృతిలోని 120బీ(క్రిమినల్ కుట్ర)లోని 13, 18, 20, 38, 39 సెక్షన్ల ప్రకారం దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. గిలానీ సేవలను ఇలా రద్దుచేయలేదు అయితే సాయిబాబా అరెస్ట్ అయినప్పటి నుంచి సాయిబాబా కుటుంబం సగం జీతాన్ని పొందుతోంది. ఉద్యోగం నుంచి తొలగిస్తూ కాలేజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సాయిబాబా భార్య ఖండించారు. ఇది పూర్తిగా ఉద్యోగుల హక్కుల ఉల్లంఘన అని ఆరోపించారు. ఈ విషయాన్ని కోర్టు ముందుకు తీసుకెళ్తానని సాయిబాబా భార్య వసంత తెలిపారు. సాయిబాబాకు వేసిన శిక్షకు వ్యతిరేకంగా తమ అప్పీల్ బొంబాయి హైకోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ సమయంలో తొలగిస్తూ నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్‌పై దాడి కేసులో దోషిగా నిర్ధారించబడిన గిలాని, తరువాత అన్ని ఆరోపణల నుండి నిర్దోషిగా బయటికొచ్చారన్నారు. అప్పుడు అతని సేవలను ఈ విధంగా రద్దు చేయలేదని, ఇప్పుడు సాయిబాబా సేవలను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నిస్తున్నారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ తప్పనిసరి
సాక్షి, న్యూఢిల్లీ: సాంకేతిక సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును సమర్థించింది. డివిజన్ బెంచ్ తీర్పును సవాల్‌చేస్తూ ప్రియదర్శిని తదితరులు దాఖలు చేసిన పలు స్పెషల్ లీవ్ పిటిషన్లను బుధవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ హృషీకేష్రాయ్ల ధర్మాసనం విచారించింది. ‘‘పే స్కేల్స్, సర్వీస్ కండీషన్స్, క్వాలిఫికేషన్ ఫర్ ద టీచర్స్, అదర్ అడకమిక్ స్టాఫ్ ఇన్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ డిగ్రీ రెగ్యులేషన్స్, 2010’’ని ఏఐసీటీఈ 2010 మార్చిలో జారీ చేసిందని కేరళ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వి.చిదంబరేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నిబంధనల ప్రకారం 2010 మార్చి 5 నుంచి సాంకేతిక సంస్థల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు పీహెచ్డీ చేసిన వారే అర్హులని కోర్టుకు తెలిపారు. చిదంబరేష్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ‘‘2003 ఫిబ్రవరి 18 నోటిఫికేషన్ ప్రకారం అసోసియేట్ ప్రొఫెసర్ (తదనంతరం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా మార్చారు) పోస్టు వచ్చిన ఏడేళ్లలో పీహెచ్డీ పొందాలి. అయితే ఇది 2010 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత నుంచి పీహెచ్డీ పొందిన తర్వాత తేదీ నుంచి పోస్టు పరిగణనకు అర్హులు’’ అని ఆదేశాలు జారీ చేసింది. స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టివేసింది. -
కేజీతండా వాసికి అరుదైన అవకాశం
జఫర్‌గఢ్: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం రేగడి తండా శివారు ఖాజనగండి (కేజీ తండా)కు చెందిన లకావత్ బాలాజీకి లండన్‌లోని మాన్చెస్టర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే అరుదైన అవకాశం లభించింది. మిట్యనాయక్, సత్తమ్మ దంపతుల నాలుగో కుమారుడు బాలాజి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో చిన్నతనం నుంచే చదువుపై ఆసక్తి పెంచుకున్నాడు. ప్రాథమిక విద్యను జఫర్‌గఢ్‌లో, అలాగే 8, 9, 10వ తరగతులను ఆలేరులోని ఎస్టీ హాస్టల్ ఉండి పూర్తి చేశాడు. పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ సాధించి హైదరాబాద్‌లోని అరబిందో జూనియర్ కళాశాలలో ఉచిత ప్రవేశం పొందాడు. ఇంటర్ అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఐదేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేశాడు. తర్వాత లండన్‌లోని కార్డి యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తయిన తర్వాత మాన్చెస్టర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించాడు. మారుమూల ప్రాంతానికి చెందిన బాలాజీ లండన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం సాధించడంపై కుటుంబ సభ్యులతో పాటు తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. -
అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచకపర్వం
సాక్షి, కుత్బుల్లాపూర్: నగర శివారులోని ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేస్తున్న ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచక పర్వానికి తెరలేపాడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన సదరు ప్రొఫెసర్ ఓ విద్యార్థినిని ల్యాబ్‌కు పిలిపించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాలు.. మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినిని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటయ్య ల్యాబ్‌కు పిలిపించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలు కరీంనగర్లో ఉన్న తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంకటయ్యను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
బోధనపై ఆంక్షలా?
వివేచనపైనా, వివేకంపైనా పిడివాదమే గెలిచింది. వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యా లయం(బీహెచ్‌యూ)లోని సంస్కృత విద్యా ధర్మ విజ్ఞాన్(ఎస్వీడీవీ) విభాగంలో సంస్కృత విద్యా బోధన కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితుడైన ఫిరోజ్‌ఖాన్ దాన్నుంచి తప్పుకుని మరో విభాగంలో చేరవలసి వచ్చింది. విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఆయన మరో 9మందితో పోటీపడి రెండు నెలలక్రితం ఆ పోస్టుకు ఎంపికయ్యాడు. ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన బోర్డులో ప్రముఖ సంస్కృత పండితుడు ప్రొఫెసర్ రాధావల్లభ్ త్రిపాఠీతోసహా హేమాహేమీలున్నారు. ఇతరులతో పోలిస్తే ఆ పోస్టుకు కావాల్సిన సకల అర్హతలూ ఆయనకు ఉన్నాయని, ఫిరోజ్‌ఖాన్ సంస్కృతంలో సాహిత్య సంబంధ అంశాలే బోధిస్తారు తప్ప మతపరమైన అంశాలతో ఆయనకు ప్రమేయం ఉండదని బీహెచ్‌యూ వైస్‌చాన్సలర్ రాకేష్ భట్నాగర్, సంస్కృత సాహిత్య విభాగం అధిపతి ప్రొఫెసర్ ఉమాకాంత్ చతుర్వేది, విశ్వవిద్యాలయ పాలకమండలి నచ్చ జెప్పినా విద్యార్థులు అంగీకరించలేదు. సంస్కృతాన్ని మతంతో లేదా కులంతో ముడిపెట్టడం, దాన్ని ఫలానా మతం వారు మాత్రమే నేర్చుకోవాలని, వారు మాత్రమే బోధించాలని ఆంక్షలు పెట్టడం రాజ్యాంగ విలువలకు అపచారం చేయడం మాత్రమే కాదు. ఆ భాషకు కూడా అన్యాయం చేసినట్టే. ప్రజల్లో విస్తృతంగా వాడుకలో ఉన్నప్పుడే ఏ భాషైనా అభివృద్ధి చెందుతుంటుంది. చిర కాలం వర్థిల్లుతుంది. కొందరికే పరిమితమైనప్పుడు కుంచించుకుపోతుంది. సంస్కృత వ్యాకరణం, సాహిత్యం, వేదాలు, ఉపనిషత్తులు ఔపోసనపట్టిన ఫిరోజ్‌ఖాన్‌ను విధ్వంసక శక్తిగా చూడటం, ఆయన బోధనాచార్యుడిగా వస్తే ఏదో అపచారం జరిగిపోతుందని బెంబేలెత్తడం ఆశ్చర్యం కలిగి స్తుంది. రాజస్తాన్‌కు చెందిన ఫిరోజ్ కుటుంబం మూడు తరాలనుంచి సంస్కృతంపైనా, హిందూ మత ఆచారాలపైనా ఆసక్తి, అనురక్తీ పెంచుకుంది. ఒకపక్క మసీదులో నమాజు చేస్తూనే గోవును పూజించడం, వారి స్వస్థలమైన బంగ్రూలో ఉన్న దేవాలయాల్లో భజన గీతాలు పాడటం ఫిరోజ్ తండ్రి రంజాన్ఖాన్కు దశాబ్దాలుగా అలవాటు. రంజాన్‌ఖాన్ సంస్కృతంలో పట్టభద్రుడు. తన కుటుంబం అనుసరిస్తున్న ఆచారాల విషయంలోగానీ, దేవాలయాల్లో భజనగీతాలు పాడటం విషయంలోగానీ ముస్లింలెవరూ అభ్యంతరం చెప్పలేదని ఆయనంటున్నాడు. సంస్కృతంపై తనకు వల్లమాలిన ప్రేమ ఉండబట్టే కుమారుణ్ణి ఆ భాషలో నిష్ణాతుడయ్యేలా ప్రోత్సహించానని చెబుతున్నాడు. ఫిరోజ్‌ఖాన్ సంస్కృత భాషపై చేసిన పరిశోధనైనా, ఆయన మాట్లాడే సంస్కృత భాషైనా అత్యున్నత ప్రమాణాలతో ఉన్నదని ఇంటర్వ్యూ బోర్డులోని సభ్యులు తెలిపారు. ఈ విషయమే ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తెలియజెప్పి వారిని ఒప్పించాలని చూశారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ ఆందోళన కొనసాగినంతకాలం ఫిరోజ్‌ఖాన్ అజ్ఞాతవాసం గడపవలసి వచ్చింది. చిత్రమేమంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో సంస్కృత విభాగ అధిపతిగా ఉన్న సల్మా మఫీజ్కు ఇలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. అందరూ అత్యంత సంక్లిష్టమైనదిగా భావించే పాణిని విరిచిత సంస్కృత వ్యాకరణం అష్టాధ్యాయిని ఆమె అలవోకగా బోధిస్తారు. సంస్కృత భాషలో పాండిత్యం గడించిన తొలి ముస్లిం మహిళగా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్న 15మంది విద్యార్థులకు ఆమె గైడ్. వారణాసికి చరిత్రలో విశిష్ట స్థానముంది. అక్కడ షా జహాన్ చక్రవర్తి పెద్ద కుమారుడు దారా షికో సంస్కృత భాషను అధ్యయనం చేయడమే కాదు... అందులో నిష్ణాతుడై భగవద్గీతను, 52 ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. సాగర సంగమం పేరుతో హిందూ, ఇస్లాం, ఇతర మతాల మధ్య ఉన్న వైవిధ్యతలనూ, ఏకత్వాన్ని సోదాహరణంగా వివరిస్తూ పర్షియన్ భాషలో గ్రంథం రచించాడు. ఆయనకన్నా ఏడువందల ఏళ్ల ముందు అల్–బిరూని అనే ముస్లిం విద్యాధికుడు ఇప్పటి ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్ల నుంచి భారత్ వచ్చి సంస్కృతంలో పాండిత్యం గడించి ఈ దేశంలోని సంస్కృతి, మతం, జీవనవిధానం, తాత్విక చింతనలను చాటిచెబుతూ ఉద్గ్రంథాన్ని రచించాడు. పర్షియన్ ప్రపంచానికి హిందూ మతాన్ని పరిచయం చేసే వంద గ్రంథాలు వెలువరించాడు. సూఫీ కవి, పండితుడు అమిర్ ఖుస్రో వేదాల్ని, పురాణాల్ని ఔపోసన పట్టి, సంస్కృతంలోనే అనేక రచనలు చేశాడంటారు. ఆయన వచనంలోనూ, కవిత్వంలోనూ అడుగడుగునా అనేక సంస్కృత పదాలుంటాయి. వీరు మాత్రమే కాదు... యూరప్ దేశాలకు చెందిన ఎందరో సంస్కృతాన్ని నేర్చుకున్నారు. 1785లో చార్లెస్ విల్కిన్స్తో మొదలుపెట్టి జర్మనీకి చెందిన మాక్స్ ముల్లర్ వరకూ అనేకులు సంస్కృత కావ్యాలను, గ్రంథాలను ఇంగ్లిష్, జర్మన్ తది తర భాషల్లోకి అనువదించారు. కొందరు పర్షియన్ భాషలోకి అనువాదమైన సంస్కృత కావ్యాలను తర్జుమా చేశారు. సంస్కృతభాషను నిశితంగా అధ్యయనం చేసి భిన్న శతాబ్దాల్లో వెలువడిన సంస్కృత కావ్యాల్లోని భాషా ప్రయోగాల్లో చోటుచేసుకున్న మార్పులపై పరిశోధనలు చేసిన కొలం బియా యూనివర్సిటీ ప్రొఫెసర్ షెల్డన్ పొలాక్ వర్తమాన ప్రపంచంలోని సంస్కృత భాషా పండి తుల్లో అగ్రగణ్యుడు. భాష నేర్చుకోవడానికి కులమో, మతమో అడ్డురావడం అంతిమంగా దానికి ప్రతిబంధక మవుతుంది తప్ప అది విస్తరించడానికి దోహదపడదు. మన దేశంలో ఉన్న కుల వ్యవస్థ ఇలాంటి ప్రతిబంధకాలు సృష్టించబట్టే ఆర్యభట, కణాదుడు, వరాహమిహిరుడు, చరకుడు, సుశ్రుతుడు, బ్రహ్మగుప్తుడు తదితరులు సంస్కృత భాషలో అభివృద్ధి చేసిన ఎన్నో విజ్ఞానశాస్త్రాలు అనంతర కాలంలో విస్తరించలేకపోయాయి. నిజానికి ఇలాంటివి మనకు గుణపాఠాలు కావాలి. మన దృష్టి కోణాన్ని విశాలం చేయాలి. మరింతమంది ఫిరోజ్‌ఖాన్‌లు రూపొందేందుకు దోహదపడాలి. కానీ జరుగుతున్నదంతా అందుకు విరుద్ధం. అది విచారకరం. -
‘ప్లీజ్ నన్ను కాపాడండి’
చెన్నై : సహోద్యోగులు, సీనియర్లు తన పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పుతున్నారని ఓ మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆరోపించారు. అసభ్య పదజాలంతో తనను దూషిస్తూ.. మానసిక వేదనకు గుర్తిచేస్తున్నారని పేర్కొన్నారు. అన్ని రకాలుగా తనను బెదిరిస్తున్నారని.. దాంతో తాను తీవ్రంగా కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. క్యాంపస్‌లో ఉన్న క్వార్టర్లో తనను బంధించి తిండి కూడా తిననీయకుండా వేధిస్తున్నారని వాపోయారు. ఈ మేరకు ఫేస్బుక్లో సెల్ఫీ వీడియో పోస్ట్ చేశారు. ‘గత 18 నెలలుగా తమిళనాడులోని ఠాగూర్ మెడికల్ కాలేజీ క్యాంపస్‌లోనే ఉంటున్నాను. సీనియర్లు, అడ్మినిస్ట్రేట్ సిబ్బంది నన్ను టార్చర్ చేస్తున్నారు. చెప్పలేని మాటలు అంటున్నారు. ఓ రోజు నేను క్లాస్‌లో అడుగుపెట్టగానే సీనియర్ ప్రొఫెసర్ నన్ను తోసివేశారు. దీంతో విద్యార్థుల ముందు జారిపడ్డాను. ఇది చాలా అమానుషం. గత కొన్ని రోజులుగా క్వార్టర్లో కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. గదిలో బంధించి తాళం వేశారు. రెండు వారాల పాటు తిండి కూడా పెట్టలేదు. ఇక నిన్నటి నుంచి నీళ్లు కూడా ఇవ్వడం మానేశారు. నేను బాగా నీరసించిపోయాను. కుంగిపోతున్నా. ఆత్మహత్య చేసుకునేలా నన్ను ప్రేరేపిస్తున్నారు. ప్లీజ్ నన్ను కాపాడండి. నాకు న్యాయం చేయండి’ అని బాధితురాలు వీడియోలో అర్థించారు. అయితే తనను ఎందుకు వేధింపులకు గురి చేస్తున్నారన్న విషయం గురించి మాత్రం ఆమె పేర్కొనలేదు. కాగా ఈ విషయంపై స్పందించిన ఠాగూర్ మెడికల్ కాలేజీ యాజమాన్యం ఘటనపై విచారణకై కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. బాధితురాలు ఏడాదిన్నరగా తమ కాలేజీ క్వార్టర్‌లోనే ఉంటోందని.. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని కాలేజీ డీన్ గుణశేఖరన్ మీడియాకు తెలిపారు. -
కూలీ టు ప్రొఫెసర్
సాక్షి, కరీంనగర్ : ఆర్థిక స్థోమత లేక చిన్నతనం నుంచి భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ సర్కారు విద్యనభ్యసించాడు. స్థానికంగా రెసిడెన్షియల్ కళాశాలలు లేవని డబ్బులు కట్టే స్థోమత లేక ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూల్ వెళ్లి డిగ్రీ చదివాడు. మొదట ఫెయిలయినా పట్టుపట్టి పాసయ్యాడు. ఇక జీవితంలో విఫలమవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. ఇక అతను సాధించిన విజయాలకు బ్రేక్ లేకుండా పోయింది.వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ప్రస్తుతం ఎస్సారార్ ప్రభుత్వ ఆర్ట్స్,సైన్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మొదట ఎన్ఎస్ఎస్ అధికారిగా పనిచేసి రాష్ట్రస్థాయిలో ప్రశంసలు పొందాడు సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన రాజు. ఆర్థిక ఇబ్బందుల మధ్యే చదువులు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన రాజు అమ్మనాన్నలు దేవయ్య, వెంకటమ్మ. నలుగురు అన్నదమ్ముల్లో రాజు చిన్నవాడు. చిన్నతనంలో చాలా ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. కొంచెం పెద్దయ్యాక తల్లిదండ్రులతో కలిసి భవననిర్మాన కూలీ పనికి వెళ్లేవాడు. పదోతరగతి పెంబట్లలోని రెసిడెన్షియల్ పాఠశాలలో 1996లో పూర్తిచేశాడు. ఇంటర్ మేడిపల్లిలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో 1998లో, కర్నూల్లోని సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ (బయోకెమిస్ట్రీ–జువాలజీ–కెమిస్ట్రీ)గ్రూపులో చేరాడు. మొదట ఫేయిలయ్యాడు. తర్వాత కష్టపడి చదివి 2001లో ఉత్తీర్ణుడయ్యాడు. 2003–04లో ఉస్మానియా యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేశాడు. 2005–07లో కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సీ పూర్తిచేశాడు. మూడు ప్రభుత్వ ఉద్యోగాలు డిగ్రీలో ఫెయిల్ అయిన రాజుకు చిన్నతనం నుంచి తను అనుభవిస్తున్న అర్థిక పరిస్థితులు పాఠాలు నేర్పాయి. జీవితంలో ఫెయిల్‌కావద్దని నిర్ణయించుకున్నాడు. వరుసగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. 2007లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా, 2009లో నెట్‌లోఅర్హత సాధించాడు. 2011లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో చేరాడు. ఆ తర్వాత 2012 జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం వచ్చింది కానీ వెళ్లలేదు. సేవల్లోనూ రా‘రాజు’ రాజు 2013లో ఎస్సారార్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారిగా «ఎంపికయ్యాడు. 2015లో మానవవిలువల పరిరక్షణ సమితి ద్వారా విశిష్టసేవా పురస్కారం సాధించాడు. విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్, రక్తదానాల కార్యాక్రమాలు నిర్వహించి 2016లో జిల్లా ఉత్తమ ఎన్ఎస్ఎస్ హైయ్యర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం అధికారి అవార్డును మంత్రి ఈటల రాజేందర్‌చేతుల మీదుగా అందుకున్నాడు. కళాశాల విద్యాశాఖ యువతరంగం ద్వారా 2017–18 సంవత్సరానికి ఉన్నత విద్య కమిషనర్ నవీన్‌మిట్టల్ చేతుల మీదుగా ‘బెస్ట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్’ అవార్డు పొందాడు. ప్రస్తుతం ఎస్సారార్ కళాశాలలో ఎన్సీసీ అధికారిగా సేవలందిస్తున్నాడు. కష్టపడితేనే విజయం జీవితంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నా. డబ్బులు లేక అమ్మనాన్నలతో కలిసి కూలీకి వెళ్లా. చిన్ననాటి నుంచి రెసిడెన్షియల్‌లోనే చవివా. డిగ్రీ ఫెయిల్ కావడంతో బాధపడ్డాను. అప్పటి నుండి ఇక ఎప్పుడూ ఫేయిల్ కాలేదు. మూడు ఉద్యోగాలు వచ్చాయి. డిగ్రీ లెక్చరర్‌గా ఎస్సారార్‌లో జాయిన్ అయ్యాను. విద్యార్థులు కోర్సుల్లో ఫెయిలై చాలా మంది ఆత్యహత్యలు చేసుకోకూడదు. ఓపికతో కష్టపడి ముందుకు సాగితే విజయం వరిస్తుంది. – పర్లపల్లి రాజు, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
చెదురుతున్న జ్ఞాపకాలు
బోస్టన్: ఫొటోల తరహాలోనే మన జ్ఞాపకాలు కూడా కాలక్రమేణా వాటి నాణ్యతను కోల్పోతాయని ఓ అధ్యయనంలో తేలింది. సాధారణంగా మనుషులు గతంలో చేసిన ఒక్కో ఘటనను ఒక్కో తరహాలో గుర్తుంచుకుంటారని ఈ పరిశోధనలో పాల్గొన్న బోస్టన్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ మౌరీన్ రిట్చీ తెలిపారు. గతంలో ఎదురైన పరిస్థితులను మరోసారి ఎదుర్కొన్నప్పుడు ఆ ఘటన తాలూకు ఎక్కువ విషయాలు మన మెదడులో నిక్షిప్తమవుతాయని వెల్లడించారు. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ఈ జ్ఞాపకాలు స్పష్టత లేకుండా, తక్కువ వివరాలతోనే గుర్తుంటాయని పేర్కొన్నారు. ‘భావోద్వేగ’ అంశాల్లో ఎక్కువ స్పష్టత.. రోజువారీ పనులతో పోల్చుకుంటే కారు ప్రమాదం వంటి ఘటనలు వ్యక్తుల మెదళ్లలో బలంగా నిక్షిప్తమవుతాయని గతంలో నిర్వహించిన పరిశోధనలో తేల్చినట్లు రిట్చీ చెప్పారు. ఇలా స్పష్టమైన జ్ఞాపకాలు ఏర్పడటానికి ఆయా వ్యక్తులు వాటిని ఎలా గుర్తుంచుకున్నారు? ఏరకంగా గుర్తుంచుకున్నారు? అనే విషయాలకు మధ్య సంబంధాన్ని తెలుసుకునే దిశగా తమ పరిశోధన సాగిందని వెల్లడించారు. ఇందులో భాగంగా తాము మూడు పరిశోధనలు నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు మానసికంగా కలత కలిగించే చిత్రాలు, సాధారణ చిత్రాలను అందించామన్నారు. ఇవి వేర్వేరు రంగులు, నాణ్యతతో ఉన్నాయన్నారు. అనంతరం వారికి ఏం జ్ఞాపకం ఉందో చెప్పమని కోరగా నిజమైన చిత్రాలను తక్కువ నాణ్యతతో గుర్తుంచుకున్నట్లు తేలిందన్నారు. అలాగే మానసికంగా కలత కలిగించే చిత్రాలను చూసినవారు వాటిని అత్యంత కచ్చితత్వంతో గుర్తుంచుకున్నారనీ, వారి జ్ఞాపకాల నాణ్యత ఏమాత్రం తగ్గలేదని రిట్చీ చెప్పారు. ఫేడింగ్ ఎఫెక్ట్.. సాధారణ ఘటనలను గుర్తుంచుకునే క్రమంలో వాటికి సంబంధించిన చిన్నచిన్న అంశాలను మర్చిపోతారని రిట్చీ తెలిపారు. ఉదాహరణకు సంగీత విభావరికి వెళ్లిన వ్యక్తులు తమ ఇష్టమైన గాయకులను, సంగీతాన్ని బాగా గుర్తుపెట్టుకుంటారన్నారు. అదే సమయంలో ఆ కార్యక్రమంలో వాతావరణం, లైట్లు, శబ్ద తీవ్రత చూచాయగా జ్ఞాపకం ఉంటాయన్నారు. ఇవి కాలక్రమేణా జ్ఞాపకాల నుంచి తొలగిపోతాయని వెల్లడించారు. దీన్ని ‘ఫేడింగ్ ఎఫెక్ట్’గా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. నిజ ఘటనలతో పోల్చుకుంటే ఏ జ్ఞాపకాలైనా తక్కువ కచ్చితత్వంతోనే మెదడులో నిక్షిప్తమవుతాయన్నారు. ఇలా జరిగినప్పటికీ భావోద్వేగాలకు సంబంధించిన జ్ఞాపకాలపై ఈ ఫేడింగ్ ఎఫెక్ట్ ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. -
విదేశీ పీహెచ్‌డీలకూ అసిస్టెంట్ ప్రొఫెసర్
న్యూఢిల్లీ: టాప్–500 విదేశీ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ పూర్తిచేసిన వారు కూడా భారత వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రత్యక్ష నియామకానికి అర్హులేనని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. క్వాకరెలి సైమండ్స్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ర్యాంకింగ్స్, షాంఘై జియావో టోంగ్ ర్యాంకింగ్స్‌లో చోటు దక్కించుకున్న వర్సిటీల్లో విద్యనభ్యసించిన అభ్యర్థులనే పరిగణనలోకి తీసుకుంటారు. ఆర్ట్స్, కామర్స్, హ్యుమానిటీస్, లా, సోషల్ సైన్సెస్, లాంగ్వెజేస్, లైబ్రరీ సైన్స్, జర్నలిజం–మాస్ కమ్యూనికేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో నియామకాలకు తాజా నిబంధనలు వర్తిస్తాయని యూజీసీ తెలిపింది. ప్రస్తుతం, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అర్హత సాధించాలంటే అభ్యర్థులు భారతీయ విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత కోర్సులో 55 శాతం మార్కులతో పీజీ పూర్తిచేసి ఉండాలి. నెట్, సెట్, స్లెట్ లాంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అర్హత సాధించడం ద్వారా రాత పరీక్ష నుంచి మినహాయింపు పొందినా, ఇంటర్వ్యూలో చూపే ప్రతిభ ఆధారంగానే నియామకాలు జరుగుతాయని యూజీసీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. -
ఔరా.. హీరా!
ఆయనో 35 ఏళ్ల యువకుడు. దీనికితోడు ప్రతిష్టాత్మక ఎయిమ్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం. ఆకర్శణీయమైన జీతం, ప్రశాంతమైన జీవితం. కానీ ఏదో వెలితి. తన వర్గానికి ఏమీ చేయలేకపోతున్నాననే ఆవేదన. వెరసి ఆరేళ్ల ప్రయత్నం తర్వాత రాజకీయ పార్టీ పుట్టింది. ఆదివాసీల్లో పట్టు సంపాదించి.. ఇప్పుడు ఏకంగా గిరిజనుడు ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో ఆ యువకుడు దూసుకెళ్తున్నాడు. ఇది ఏయిమ్స్ రుమటాలజీ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ హీరాలాల్ అలావా గురించిన ఇంట్రడక్షన్. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా ఓ మారుమూల గ్రామానికి చెందిన హీరాలాల్.. స్థానికంగా ఉండే ’భిల్’ అనే ఓ గిరిజన తెగకు చెందిన యువకుడు. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదిగినా.. తన ఊరికి, గిరిజనులకు సరైన న్యాయం జరగడం లేదనే కారణంతో కార్యాచరణ ప్రారంభించాడు. మొదటగా ఫేస్బుక్ పేజీని ప్రారంభించిన హీరాలాల్.. ఇప్పుడు జై ఆదివాసీ యువ శక్తి (జేస్)అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేసేందుకు రిజిస్ట్రేషన్ సంబంధింత సాంకేతిక అడ్డంకులు ఎదురవడంతో.. ప్రస్తుతానికి కాంగ్రెస్ సహకారంతో ఆయన ఒక్కరే పోటీ చేస్తున్నారు. అయితే.. చట్టసభల్లో గిరిజన ప్రతినిధుల సంఖ్య పెరగటం, గిరిజనుడిని మధ్యప్రదేశ్‌కు సీంను చేయడమే జేస్ లక్ష్యమని పేర్కొన్నారు. ఆరేళ్ల ‘ఫేస్బుక్’ పోరాటం కొడితే గట్టి దెబ్బే కొట్టాలనే సూత్రాన్ని డాక్టర్ హీరాలాల్ బాగా అర్థం చేసుకున్నారు. అందుకే తన సత్తా చాటేందుకు ఆరేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ‘యువ శక్తి’పేరుతో ఫేస్బుక్ పేజీ రూపొందించి.. గిరిజనుల చైతన్య పరిచే కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాల్లో విద్యుత్ లేకపోవడం, నిర్వాసితులవుతున్న గిరిజనులు, ఆదీవాసీల కోసం స్కూళ్లు లేకపోవడం, పౌష్టికాహారలోపం తదితర అంశాలను ఆ ఎఫ్బీ పేజీలో ప్రస్తావించేవారు. ‘ఈ పేజీకి ఆదీవాసీ యువతలో మంచి గుర్తింపు వచ్చింది. 2013, మే 16న బద్వానీ గ్రామంలో ఏర్పాటుచేసిన ఫేస్బుక్ పంచాయతీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి మా పేజీని ఫాలో అయ్యేవారు చాలా మంది హాజరయ్యారు. చాలా అంశాలపై ఆరోజు ఆసక్తికర చర్చ జరిగింది. అదే ఏడాది ఇండోర్‌లో అంతర్జాతీయ ఫేస్బుక్ పంచాయతీని నిర్వహించాం’ అని హీరాలాల్ పేర్కొన్నారు. -
కోరిక తీరిస్తేనే మంచి మార్కులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: తల్లి, తండ్రి తరువాత గౌరవప్రదమైన స్థానం పొందిన గురువే కామంతో విద్యార్థినిని కాటేసేందుకు పూనుకుంటే, అతని దుష్టచేష్టలకు మహిళా వార్డెన్లు వత్తాసు పలికారు. తమిళనాడులో మరో దుశ్శాసన ప్రొఫెసర్ ఉదంతం బయటపడింది. బాధిత విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్‌కు, తిరువణ్ణామలై జిల్లా న్యాయమూర్తికి ఇచ్చిన ఫిర్యాదు, వాంగ్మూలం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. చెన్నై పెరుంగుడికి చెందిన 22 ఏళ్ల యువతి తిరువణ్ణామలై జిల్లా తండరాంపట్టు సమీపం వాళవచ్చనూరు ప్రభుత్వ వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటోంది. ఇదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మదురైకి చెందిన తంగపాండియన్ (40) రాత్రివేళల్లో హాస్టల్‌కు వెళ్లి ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. వేధింపులు భరించలేక అదే హాస్టల్లోని ఇద్దరు మహిళా వార్డన్లకు బాధితురాలు తన గోడు చెప్పుకుంది. దీంతో వారు ఆమెకు అండగా నిలువకపోగా.. సదరు ప్రొఫెసర్ చెప్పినట్లు నడుచుకుంటే ఎంతో గొప్పదానివి అవుతావని.. అతడికి మద్దతుగా వార్డన్లు కూడా ఒత్తిడి చేయసాగారు. దీంతో ఓపిక నశించిన విద్యార్థిని చెన్నైలోని తల్లిదండ్రులకు చెప్పి విలపించింది. విద్యార్థిని తండ్రి వాళవచ్చనూరు గ్రామస్తులు, సీపీఐ నేతలతో కలిసి మంగళవారం కళాశాలను ముట్టడించారు. కళాశాల ప్రిన్సిపాల్ రాజేంద్రన్‌కు ఫిర్యాదు చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్, మహిళా వార్డన్లు సెల్‌ఫోన్ ద్వారా తనతో జరిపిన సంభాషణను బాధిత విద్యార్థిని రికార్డు చేసి తండ్రి ద్వారా ప్రిన్సిపాల్‌కు అప్పగించింది. తన కోర్కె తీరిస్తే ఎక్కువ మార్కులు వచ్చేందుకు సహకరిస్తానని ఆశపెట్టడం, మహిళా వార్డన్లు సైతం అసిస్టెంట్ ప్రొఫెసర్ చెప్పినట్లు నడుచుకో, మంచి మార్కులతో పాసై ఇదే కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరవచ్చు.. అతడికి రెండో భార్యగా ఉంటూ జీవితంలో సెటిల్ కావచ్చని విద్యార్థినితో అన్న మాటలు నమోదయ్యాయి. గ్రామస్తుల ఆందోళనతో అసిస్టెంట్ ప్రొఫెసర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోగా, ఇద్దరు మహిళా వార్డన్లపై ప్రిన్సిపాల్ విచారణ చేపట్టారు. వాంగ్మూలం ఇచ్చిన విద్యార్థిని తిరువణ్ణామలై డీఎస్పీ పళని కళాశాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి చర్య తీసుకుంటామన్నారు. జిల్లా కలెక్టర్ కందస్వామి కళాశాల ప్రిన్సిపాల్‌తో ఫోన్లో మాట్లాడారు. బాధిత విద్యార్థిని బుధవారం తిరువణ్ణామలై జిల్లా మొదటిశ్రేణి మెజిస్ట్రేటు కోర్టుకు హాజరై న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చింది. బాధిత విద్యార్థిని వేరే కళాశాలకు మార్చాల్సిందిగా ఆయన ఆదేశించారు.