- బాలికను లోబర్చుకుని..పలుమార్లు లైంగికదాడి
- వనస్థలిపురంలో వెలుగు చూసిన దారుణం
ఆటోనగర్, న్యూస్‌లైన్: విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ కీచకుడి అవతారం ఎత్తాడు. మాయమాటలు చెప్పి పది రోజులుగా బాలికపై లైంగికదాడికి పాల్పడుతున్నాడు. ఆదివారం ఈ విషయం వెలుగులోకి రావడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం... హస్తినాపురానికి చెందిన బాలిక (17) 8వ తరగతిలో చదువు మానేసి ఇంట్లోనే ఉంటోంది. ఈమె స్నేహితురాలు ఒకరు డిగ్రీ చదువుతోంది. కొత్తపేటకు చెందిన కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీనిథి ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితురాలి ద్వారా బాలికకు అతనితో పరిచయం ఏర్పడింది. నేను చెప్పినట్టు చేస్తే నీ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటానని నమ్మించి బాలికను ఇంటి నుంచి పారిపోయి వచ్చేలా చేశాడు. తర్వాత ఆమెను హస్తినాపురంలోని ఉమెన్స్ హాస్టల్‌లో చేర్పించాడు.
రోజూ హాస్టల్‌కు వెళ్లి ఆమెను బైక్‌పై తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడుతున్నాడు. విషయం ఎవరికైనా చెప్తే నీ పరువే పోతుందని భయపెట్టాడు. దీంతో తనకు జరుగుతున్న అన్యాయం గురించి బాధితురాలు ఎక్కడా నోరువిప్పలేదు. ఇదిలా ఉండగా, ఇంటి నుంచి వెళ్లిపోయిన కుమార్తె కోసం తల్లిదండ్రులు గాలిస్తుండగా ఆదివారం ఉమెన్స్ హాస్టల్ వద్ద కనిపించింది. తల్లిదండ్రులను చూడగానే కిరణ్ చేస్తున్న ఘాతుకం గురించి చెప్పి బోరుమంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.