![Teenage Girl Sells Mother Jewellery Worth rs1Crore for Just rs680 to Buy Lip Studs](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/Teenage-Girl-Sells.jpg.webp?itok=q-dBQvtg)
ఓ బాలికకు తన స్నేహితుల్లో ధరించిన పోగులు,ముక్క పుడకలు నచ్చాయి. వెంటనే వాటిని కొనుగోలు చేయాలని అనుకుంది. కానీ చేతిలో డబ్బులు లేవు. ఇంట్లో వాళ్లను అడిగితే కోప్పడతారు. అందుకే ఏదో ఒకటి చేసి గిల్ట్ నగల్ని కొనుగోలు చేయాలని అనుకుంది. ఇందుకోసం తన తల్లి ధరించే రూ.1.16 కోట్ల బంగారాన్ని కేవలం రూ.680కే అమ్మేసింది. ఆ తర్వాత ఏమైందంటే?
సౌత్ చౌనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం.. చైనాలోని షాంఘైకు చెందిన బాలిక లిప్ స్టడ్‌లు, చెవిపోగులు కొనుగోలు చేసేందుకు మిలియన్ యువాన్ (రూ.1.16 కోట్లు) విలువైన తన తల్లి ఆభరణాలను దొంగిలించింది. వాటిని కేవలం 60 యువాన్లకు (రూ.680) విక్రయించింది.
కుమార్తె చేసిన నిర్వాకం తెలియని తల్లి వాంగ్ వెంటనే పుటువో పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరోలోని వాన్లీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన ఇంట్లో దొంగతనం జరిగిందని, కోట్లు విలువ చేసే బంగారం నగలు మాయమైనట్లు ఆ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో వాంగ్ ధరించే జేడ్ బ్రాస్‌లెట్‌లు, నెక్లెస్‌లు, డైమండ్లు పొదిగిన ముక్కపుడకల్ని ఆమె కుమార్తె అమ్మినట్లు గుర్తించారు. వాస్తవానికి ఆ బాలిక సైతం తాను అమ్మింది గిల్ట్ నగలనే అనుకుంది.
ఇదే విషయంపై తల్లిని ఆరా తీయగా.. తన కుమార్తె లిప్ స్టడ్స్ కోసమే బంగారాన్ని అమ్మినట్లు చెప్పింది. ‘ఆ రోజు నా కుమార్తె నన్ను డబ్బులు అడిగింది. ఎంత అని అడగ్గా 60యువాన్లు అని చెప్పింది. ఎందుకు అని అడగ్గా..తన స్నేహితులు లిప్ స్టడ్స్ ధరించారని, అవి తనకు బాగా నచ్చాయని .. తాను కూడా ధరించాలని తన కోరికను చెప్పింది.లిప్ స్టడ్ ఖరీదు 30 యువాన్లు (రూ.340), మరియు ఆమె 30 యువాన్ల ధరతో మరో జత చెవిపోగులు కావాలని వివరించింది. వాటి మొత్తం ఖరీదు 60 యువాన్లు అని తెలిపింది. కానీ తాను ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పింది.
తల్లి,కుమార్తెల మధ్య జరిగిన సంభాషణ విన్న పోలీసులు.. తల్లి డబ్బులు ఇవ్వలేదు కాబట్టి.. ఇంట్లో ఉన్న బంగారాన్ని గిల్ట్ నగలు అనుకుని బంగారాన్ని అమ్మినట్లు ఓ నిర్ధారణకు వచ్చారు. అనంతరం, బాలిక బంగారాన్ని ఎక్కడ అమ్మింది? ఎవరికి అమ్మింది? ఎంతకు అమ్మింది? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. బాలిక తిరిగిన ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. చివరికి బాలిక బంగారం ఎవరికి విక్రయించిందో గుర్తించారు. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందించారు. దీంతో కథ సుఖాంతం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment