
ఇరాక్ నుంచి చైనా వెళ్తున్న విమానంలో విషాదం చోటు చేసుకుంది. ఓ టీనేజీ ప్రయాణికురాలు అస్వస్థతకు గురై సీటులోనే కుప్పకూలిపోగా.. విమానాన్ని కోల్‌కతాలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అయితే.. ఆస్పత్రికి తరలించేలోపు ఆ బాలిక కన్నుమూసింది.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధి వెల్లడించిన వివరాల ప్రకారం.. మృతురాలు బాగ్దాద్ సర్ చినార్ ప్రాంతానికి చెందిన డెరన్ సమీర్ అహ్మద్(16). మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఏఐ 473 విమానంలో చైనా గువాంగ్జౌకు వెళ్తోంది. అయితే బుధవారం అర్ధరాత్రి దాటాక.. హఠాత్తుగా ఆమె అస్వస్థతకు గురైంది.
దీంతో విమానాన్ని దారి మళ్లించి అరగంటకు కోల్‌కతా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్ట్‌లో దించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఆమెను ఏఏఐ ఆంబులెన్స్‌లో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత గురువారం అర్ధరాత్రి మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి బయల్దేరింది. ఈ ఘటనపై అసహజ మరణంగా కోల్‌కతా బాగౌతి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం పూర్తి అయ్యాక.. మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment